• facebook
  • whatsapp
  • telegram

మెడికల్‌ సీట్లలో  మన అవకాశాలెంత?

నీట్‌ ఫలితాల విశ్లేషణ 

వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్ర ర్యాంకులను కూడా విడుదల చేశారు. వెల్లడైన ఫలితాల సరళి ఏం సూచిస్తోంది? తెలుగు రాష్ట్రాల విద్యార్థుల అవకాశాలు ఎలా ఉంటాయి? కౌన్సెలింగ్‌ జరగనున్న సందర్భంగా వైద్యవిద్య ఆశావహులు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలతో కథనం.. ఇదిగో!

మనదేశంలోని మెడికల్, డెంటల్, ఆయుష్‌ కోర్సుల్లోని సీట్లను భర్తీ చేసే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)- యూజీకి పోటీ పడే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గత మూడేళ్లుగా ఇంజినీరింగ్‌ విభాగంలో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఈ మూడు సంవత్సరాల్లో నీట్‌కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య 9 లక్షల నుంచి 16.5 లక్షలకు పెరిగింది. విద్యార్థుల సంఖ్య పెరిగినప్పుడు పోటీ కూడా పెరుగుతుంది. అర్హత సాధించే విద్యార్థుల సంఖ్యా పెరుగుతోంది. సీటు సాధించడానికి కావలసిన కటాఫ్‌ మార్కు కూడా పెరగాలి. కానీ ఈ సంవత్సరం కొంత భిన్నంగా ఉంది.  కటాఫ్‌ మార్కులు 2021లో జనరల్‌ కేటగిరి 138/720, జనరల్‌ దివ్యాంగుల కేటగిరిలో 122/720, బీసీ, ఎస్సీ, ఎస్టీ (దివ్యాంగులతో కలిపి) 108/720గా ఇచ్చారు.  దీన్ని పర్సంటైల్‌ ఆధారంగా నిర్ణయిస్తారు. జనరల్‌ 50వ పర్సంటైల్, దివ్యాంగులు 45వ పర్సంటైల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ 40వ పర్సంటైల్‌ తీసుకుంటే పైమార్కులు కటాఫ్‌గా అవుతున్నాయి. దీని ప్రకారం తెలంగాణలో అర్హులైన విద్యార్థుల సంఖ్య 32,829, ఆంధ్రప్రదేశ్‌లో అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య 39,388. 

ఉత్తమ ర్యాంకుల వెనకడుగు 

నీట్‌-యూజీలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2020లో 700 మార్కులపైన సాధించిన విద్యార్థులు 111 మంది ఉంటే ఈ సంవత్సరం ఆ సంఖ్య ఏకంగా 203కు పెరిగింది. మొత్తం దేశంలో ఈ సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే దేశంలోని ఉత్తమ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థుల శాతం తగ్గింది. 

సీటు సాధించే కటాఫ్‌ మార్కులను పరిగణనలోకి తీసుకోవాలంటే- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2020లో లాగానే ఉండొచ్చు. లేదా స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. కానీ తెలంగాణలో మాత్రం కటాఫ్‌ మార్కు గణనీయంగా తగ్గుతుంది.

నీట్‌ మొత్తం స్కోరును విశ్లేషణ చేస్తే... రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీలు అత్యధిక ర్యాంకులను సొంతం చేసుకున్నాయి. గత సంవత్సరాలకు భిన్నంగా ఈ సంవత్సరం తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ 650 మార్కులపైన సాధించిన విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నాయి. 

గత సంవత్సరంతో పోలిస్తే అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్యలో వృద్ధి 0.01%గా ఉంది. అంటే చాలా స్వల్ప వృద్ధి. అయినా 700పై మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్యలో 83 శాతం వృద్ధి ఉంది. అయితే 650 నుంచి 699 మార్కుల పైన సాధించిన విద్యార్థుల సంఖ్య 0.1% తగ్గింది. 600 నుంచి 649 మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 0.4% తగ్గింది, 550-559 మార్కుల పరిధిÅలో 0.6% తగ్గింది. 

600 మార్కులు, ఆపైన సాధించిన విద్యార్థుల సంఖ్య గత సంవత్సరంలో 20,181 మంది ఉంటే ఈ ఏడాది (2021)లో ఈ సంఖ్య 19,135కి తగ్గింది. అంటే 1046 మంది విద్యార్థుల సంఖ్య తగ్గింది. 550 మార్కులపైన సాధించిన విద్యార్థుల సంఖ్య 2020లో 87,093 ఉంటే 2021లో 85,022కు తగ్గింది. 500పైన మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య కూడా 2,071కి తగ్గింది. 450 మార్కులపైన సాధించిన విద్యార్థుల సంఖ్య 1.5 శాతం పెరిగింది. 

ఈ 450 మార్కులపైన సాధించినవారిలో 64.3% అంటే మొత్తం 1,33,906 మంది విద్యార్థుల్లో 86,129 మంది విద్యార్థులతో కేవలం ఎనిమిది రాష్ట్రాల విద్యార్థులు పంచుకున్నారు. అవి రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, బిహార్, పశ్చిమ్‌ బెంగాల్, తమిళనాడు. 

సీట్ల అవకాశాల తగ్గుదల

ఈ విశ్లేషణను బట్టి అర్థమయ్యే అంశాలు ఏమిటంటే... ఆలిండియా కోటా (ఏఐక్యూ)లో తెలుగు విద్యార్థులు సీట్లు సాధించే అవకాశాలు బాగా తగ్గుతున్నాయి. 650 మార్కులపైన అధిక సంఖ్య ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, కర్ణాటక, తమిళనాడు. కాబట్టి ఆ రాష్ట్ర విద్యార్థులు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆలిండియా కోటా సీట్లు అత్యధిక శాతం సొంతం చేసుకునే అవకాశం ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ కొంతవరకు ఫరవాలేదు. కానీ తెలంగాణ విద్యార్థులు చాలావరకు ఏఐక్యూలో సీట్లు సాధించలేరు. తెలంగాణ రాష్ట్రంలోని 15 శాతం సీట్లలో అధిక శాతం సీట్లు ఇతర రాష్ట్ర విద్యార్థులు పొందే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే- ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు తెలంగాణ విశ్వవిద్యాలయాల్లోని 15 శాతం ఏఐక్యూలో అధిక సీట్లు పొందవచ్చు. 2024 వరకు 15 శాతం సీట్లకు ఆంధ్ర, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీల పరిధి విద్యార్థులు పోటీలో ఉండవచ్చు. కాబట్టి ఈ మొత్తం 30 శాతం సీట్లలో అధిక శాతం సీట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు పొందడానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.

విశ్లేషణలో...

ఏఐక్యూలో అధిక శాతం సీట్లు రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, పశ్చిమ్‌బెంగాల్, తమిళనాడు విద్యార్థులు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలుగు విద్యార్థులకు గత సంవత్సరాల్లో వచ్చినన్ని సీట్లు రావు. తెలంగాణ విద్యార్థుల కంటే ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు అవకాశాలు ఎక్కువ. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థుల్లో అధిక మార్కుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ముందు ఉన్నారు. ఏఐక్యూ, మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు కేటగిరి-ఎలలో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు ఏఐక్యూ ద్వారా 15 శాతం, ఉస్మానియా పరిధిలో ఉన్న 15 శాతం, శ్రీవేంకటేశ్వర, ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులకు అదనపు 15 శాతం రిజర్వేషన్‌ ఉంది. ఈ 30 శాతం తెలగాణలోని మెడికల్‌ కళాశాల్లో ఆంధ్ర విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగవచ్చు. డాక్టర్‌ ఎన్టీఆర్‌ యూనివర్సిటీ పరధిలో తెలంగాణ విద్యార్థుల సంఖ్య అక్కడ ఉన్న 30 శాతంలో కూడా బాగా తగ్గుతుంది. 

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో కేటగిరి-ఎ సీట్లలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కటాఫ్‌ మార్కు బాగా తగ్గుతుంది. ఈ విశ్లేషణ ప్రకారం 470 పైన మార్కులు సాధించిన విద్యార్థులు సీటు సాధించుకునే అవకాశం ఉంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో కేటగిరి-ఎ సీట్లకు అధిక మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. అందువల్ల కటాఫ్‌ మార్కు 520 నుంచి 530 వరకు ఉండే అవకాశం ఉంది. 

కేటగిరి-బి, కేటగిరి-సి సీట్లకు ఎలాంటి రిజర్వేషనూ లేదు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు, సరిహద్దు రాష్ట్ర జిల్లాల నుంచి విద్యార్థులు ఎక్కువ రావొచ్చు. రెండు రాష్ట్రాల్లో కటాఫ్‌ మార్కు పెరిగే అవకాశం ఉంది. దీన్ని 410-420గా పరిగణించవచ్చు. 

తెలుగు రాష్ట్ర విద్యార్థులు కేటగిరి-బి సీట్లకు ఇతర రాష్ట్రాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు కూడా తక్కువ ఉంటున్నందున కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు దరఖాస్తు చేసుకోవడం మేలవుతుంది. 

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 500 మార్కులపైన సాధించిన విద్యార్థుల సంఖ్య 2020తో పోలిస్తే తగ్గింది. అయితే తెలంగాణలోని తగ్గుదల ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే చాలా ఎక్కువ. రెండు రాష్ట్రాల్లోని మూడు విశ్వవిద్యాలయాల పరిధి తీసుకుంటే ఉస్మానియా, ఆంధ్రా, శ్రీవేంకటేశ్వరల్లో గతంలో పోటీ అత్యధికంగా ఉస్మానియాలో, అతి తక్కువగా శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఉండేది. ఈ సంవత్సరం ఉస్మానియా పరిధిలో విద్యార్థుల కటాఫ్‌ మార్కు తగ్గుతోంది. 

కౌన్సెలింగ్‌ .. అప్రమత్తత 

నీట్‌ రాసిన విద్యార్థి ఆన్‌లైన్‌లోనే కౌన్సెలింగ్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వారు దానిలోని పద్ధతులను సరిగా తెలుసుకోగలిగినప్పుడే సీటు పొందే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో వారు సరైన ర్యాంకు పొందినప్పటికీ సీటు కోల్పోవచ్చు. 

నీట్‌లో అర్హత సాధించిన ప్రతి విద్యార్థీ కింది వాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. తొలుత ఆలిండియా కోటా (ఏఐక్యూ)లో ప్రవేశం కల్పిస్తున్న సంస్థల్లోకి నమోదు చేసుకోవాలి. ఇందుకోసం మెడికల్‌ కౌన్సెలింగ్‌ వెబ్‌సైట్‌ సందర్శించాలి. వీటిలో ప్రవేశాలకు వార్తాపత్రికల్లో ప్రకటన వెలువడుతుంది. అనంతరం రూ.వెయ్యి ఫీజుతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఓసీ విద్యార్థులు రూ.పదివేలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.అయిదు వేలు రిఫండబుల్‌ ట్యూషన్‌ ఫీజు కింద చెల్లించాలి. సీటురాని పక్షంలో దీన్ని తిరిగి ఇచ్చేస్తారు. డీమ్డ్‌ యూనివర్సిటీకి దరఖాస్తు చేసినట్లయితే రిజిస్ట్రేషన్‌కు రూ.5000, రిఫండబుల్‌ ట్యూషన్‌ ఫీజు నిమిత్తం రూ.2 లక్షలు చెల్లించాలి. 

స్టేట్‌ కన్వీనర్‌ కోటా

కేటగిరీ ఎ: తెలంగాణలో కాళోజీ నారాయణరావు, ఏపీలో డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలు ఈ సీట్ల భర్తీకి ప్రకటనలు వెలువరిస్తాయి. వీటిలో ప్రవేశాలకు విడిగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీలకు రూ.3500, ఎస్సీ, ఎస్టీలకు రూ.2900 ఉంటాయి. జీఎస్‌టీ అదనం. వీటి ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో 85 శాతం సీట్లు, ప్రైవేటు మెడికల్, డెంటల్‌ కళాశాలల్లో కేటగిరీ-ఎలో 50 శాతం సీట్లు భర్తీ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కేటగిరీ-ఎలో ట్యూషన్‌ ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. తెలంగాణలోని నాలుగు ముస్లిం మైనారిటీ కళాశాలలు (డెక్కన్, షాదన్, డాక్టర్‌ వీఆర్‌కే ఉమెన్స్, అయాన్‌ ఇన్‌స్టిట్యూట్‌), ఏపీలో రెండు (నిమ్రా, ఫాతిమా)ల్లోని కేటగిరీ-ఎలో సీట్లన్నీ ముస్లిం మైనార్టీ విద్యార్థులతో భర్తీ చేస్తారు. 

రాష్ట్ర సంస్థల్లోని కేటగిరీ బీ, సీ‡ సీట్లు, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు కూడా కాళోజీ, ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలు ప్రకటన విడుదలచేసి భర్తీ చేస్తాయి. వీటికి విడిగా ప్రకటన వెలువడుతుంది. దరఖాస్తు ఫీజు రూ.6300+జీఎస్‌టీ చెల్లించాలి. ఈ సీట్లకు ఎలాంటి రిజర్వేషన్లూ ఉండవు. అంటే రాష్ట్ర కోటా, బీసీ, ఎస్టీ, ఎస్సీ ఇలా ఏమీ వర్తించవు. దేశంలోని విద్యార్థులంతా కేటగిరీ బీ, సీ సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నీట్‌ ఫలితాల సరళి: ఎన్ని మార్కులు? ఎందరు విద్యార్థులు?


 

Posted Date : 25-11-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌