• facebook
  • whatsapp
  • telegram

ఏయే అధ్యాయాల నుంచి ఎలాంటి ప్రశ్నలు?

సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్‌కు నిపుణుల సూచనలు

కరోనా వల్ల తలెత్తిన పరిస్థితులతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటర్మీడియట్ సిలబస్‌ను 30 శాతం తగ్గించాయి. కానీ నీట్ సిలబస్ యథాతథంగా ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు ప్రిపేర్ కావాలి. ముందుగా ఇంటర్ పరీక్షలకు, నీట్‌కు కామన్‌గా ఉన్న 70 శాతం సిలబస్‌ను అధ్యయనం చేయాలి. తర్వాత నీట్‌లో అదనంగా ఉన్న పాఠ్యాంశాలను చదవాలి. సబ్జెక్టుల వారీగా, ఒక క్రమ పద్ధతిలో ప్రిపరేషన్ సాగిస్తే ఎలాంటి సందిగ్ధత లేకుండా ఉంటుంది. మంచి ర్యాంకు సాధించుకోవచ్చు. 

మంచి ర్యాంకు సాధనలో కీలకం - భౌతిక‌శాస్త్రం‌

ఈ సబ్జెక్టును బైపీసీ విద్యార్థులు క‌ష్టంగా భావిస్తుంటారు. అందుకే ఇది ర్యాంక్‌ను ఎక్కువ‌గా ప్ర‌భావితం చేసే స‌బ్జెక్టుగా మారింది. కాబ‌ట్టి దీనిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. నీట్‌లో మొత్తం 180 ప్ర‌శ్న‌ల‌కు ఫిజిక్స్ నుంచి 45 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. ఒక్కో ప్ర‌శ్న‌కు 4 మార్కులు. త‌ప్పుగా గుర్తించిన స‌మాధానికి ఒక మార్కు కోత విధిస్తారు. ఫిజిక్స్ నుంచి వ‌చ్చే 45 ప్ర‌శ్న‌ల్లో మొద‌టి సంవ‌త్స‌రం నుంచి దాదాపు 23, రెండో సంవ‌త్స‌రం నుంచి సుమారు 22 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. నీట్ ప్ర‌శ్న‌ల స‌ర‌ళిని గ‌మ‌నించిన‌ట్ల‌యితే కొన్ని నేరుగా, సుల‌భంగా గుర్తించే ప్ర‌శ్న‌ల‌తో పాటు లోతుగా ఆలోచించి జ‌వాబును కనిపెట్టాల్సినవి, లెక్క‌లు ఉంటాయి. దీనికోసం జేఈఈ మెయిన్ స్థాయి కాకపోయినా ఫిజిక్స్ స‌బ్జెక్టులోని ప్రాథ‌మిక విష‌యాలు, సూత్రాల‌పై మంచి ప‌రిజ్ఞానం క‌లిగి ఉండాలి. మొద‌టి సంవ‌త్స‌రం ఫిజిక్స్‌లో మెకానిక్స్‌(యాంత్రిక‌శాస్త్రం) అత్యంత ముఖ్య‌మైన టాపిక్‌. దీనిలో నుంచి దాదాపు 15(33%) ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. భ్ర‌మ‌ణ‌చ‌ల‌నం, గ‌మ‌న నియ‌మాలు, ప‌ని-శ‌క్తి-సామ‌ర్థ్యం, డోల‌నాలు త‌దిత‌ర టాపిక్స్ అత్యంత కీల‌క‌మైన‌వి. ఉష్ణం, ఉష్ణ‌గ‌తిక శాస్త్రాల నుంచి 2-3 ప్ర‌శ్న‌లు ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇక ద్వితీయ సంవ‌త్స‌రానికి వ‌స్తే స్థిరవిద్యుత్‌శాస్త్రం నుంచి సుమారు 4 ప్ర‌శ్న‌లు, ప్ర‌వాహ విద్యుత్ నుంచి 3, అయ‌స్కాంత‌త్వం నుంచి 5 ప్ర‌శ్న‌లు రావ‌చ్చు. దీనిలో ద్వంద్వ స్వ‌భావం, ప‌ర‌మాణువులు, కేంద్ర‌కాలు, ఎల‌క్ట్రానిక్స్ త‌దిత‌ర చాప్ట‌ర్‌లు ఉంటాయి. ఇక దృశాశాస్త్రం నుంచి 4-5 ప్ర‌శ్న‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. నీట్‌లో మంచి ర్యాంక్ సాధించాల‌నుకునే విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా ఫిజిక్స్ స‌బ్జెక్టుపై మంచి ప‌ట్టు క‌లిగిఉండాలి. 

-కె.ఎస్‌.ఎస్‌.రాజ‌శేఖ‌ర్‌

భౌతిక‌శాస్త్ర నిపుణులు

కఠినం నుంచి సులువుకు - జీవ‌శాస్త్రం

బ‌యాల‌జీలో వృక్ష‌, జంతు శాస్త్రం విభాగాలు ఉంటాయి. ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రాలు క‌లిపి ఒక్కో విభాగం నుంచి 45 ప్ర‌శ్న‌ల చొప్పున మొత్తం 90 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. జంతురాజ్యం 3-4 ప్ర‌శ్న‌లు, జంతుదేహ నిర్మాణం (2-3), జీవాణువులు (3-4), జీర్ణ‌క్రియ‌శోష‌ణం (2-3), శ్వాసించ‌డం, వాయువుల వినిమ‌యం (2), శ‌రీర ద్ర‌వాలు-ప్ర‌స‌ర‌ణ (1-2), విస‌ర్జ‌క ప‌దార్థాలు, వాటి విస‌ర్జ‌న (2), గ‌మ‌నం-క‌ద‌లిక‌లు (1-2), నాడీ నియంత్ర‌ణ‌, స‌మ‌న్వ‌యం (2), ర‌సాయ‌నిక స‌మ‌న్వ‌యం, అనుసంధానం నుంచి 2 ప్ర‌శ్న‌ల చొప్పున వ‌స్తాయి. మాన‌వ ప్ర‌త్యుత్ప‌త్తి (3-4), ప్ర‌త్యుత్ప‌త్తి సంబంధ ఆరోగ్యం (2), అనువంశిక సూత్రాలు, వైవిధ్యం (5-7), క‌ణ అనువంశికత భావ‌న‌లు (4-6), జీవ‌ప‌రిణామం (3), మాన‌వ ఆరోగ్యం-వ్యాధి (4), జీవ‌సాంకేతిక శాస్త్ర అనువ‌ర్త‌నాలు (2), జీవులు-జ‌నాభా (2-3), జీవావ‌ర‌ణ వ్య‌వ‌స్థ (2), జీవ‌వైవిధ్యం-సంర‌క్ష‌ణ (2), ప‌ర్యావ‌ర‌ణ అంశాల నుంచి 4 ప్ర‌శ్న‌లు అడ‌గ‌వ‌చ్చు.

- డాక్ట‌ర్ జి.వెంక‌ట‌రెడ్డి

జంతుశాస్త్ర నిపుణులు

జీవ‌శాస్త్ర వ‌ర్గీక‌ర‌ణ (3-4), వృక్ష‌రాజ్యం (3), పుష్పించే మొక్క‌ల స్వ‌రూప‌శాస్త్రం (3), పుష్పంచే మొక్క‌ల క‌ణ‌జాల‌, అంత‌ర్నిర్మాణ శాస్త్రం (3), మొక్క‌ల‌లో ర‌వాణా (2), ఖ‌నిజ పోష‌ణ (2), కిర‌ణ‌జ‌న్య సంయోగ‌క్రియ (3), మొక్క‌ల‌లో శ్వాస‌క్రియ (4), మొక్క పెరుగుద‌ల, అభివృద్ధి (2), పుష్పంచే మొక్క‌ల‌లో లైంగిక ప్ర‌త్యుత్ప‌త్తి (3-4), ఆహారోత్ప‌త్తిలో వృద్ధి (1-4), జీవ‌సాంకేతిక శాస్త్రం-దాని అనువ‌ర్త‌నాల నుంచి 2 ప్ర‌శ్న‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. మొద‌ట కఠిన‌మైన అంశాల‌ను, త‌ర్వాత సులువైన విష‌యాల‌ను సాధ‌న చేయాలి. క‌చ్చితంగా స‌మ‌య పాల‌న పాటించాలి. ముందుగా ఎక్కువ ప్ర‌శ్న‌లు వ‌చ్చే చాప్ట‌ర్‌ల‌పై దృష్టిసారించాలి. ప్రిప‌రేష‌న్‌తో పాటు నోట్స్ కూడా రాసుకోవాలి. 

- డొంగేరి రాకేశ్‌

వృక్ష‌శాస్త్ర నిపుణులు

మూడు విభాగాల నుంచి సమ ప్రాధాన్యం - ర‌సాయ‌న శాస్త్రం

నీట్ సిల‌బ‌స్‌లో ర‌సాయ‌న శాస్త్రానికి సంబంధించి 29-30 చాప్ట‌ర్‌లు ఉన్నాయి. ఇందులో నుంచి 45 ప్ర‌శ్న‌లు అడుగుతారు. ప్ర‌తి చాప్ట‌ర్ నుంచి ఒక ప్ర‌శ్న అడిగే అవ‌కాశం ఉంది. ర‌సాయ‌న శాస్త్రంలో భౌతిక, క‌ర్బ‌న, క‌ర్బ‌నేత‌ర ర‌సాయ‌న శాస్త్ర విభాగాలు ఉన్నాయి. ఈ మూడు విభాగాల నుంచి స‌మాన ప్రాధాన్యంతో ప్ర‌శ్న‌లడుగుతారు. కొద్దిగా క‌ష్ట‌ప‌డితే ఎక్కువ మార్కులు సాధించ‌డానికి ఆస్కారం ఉంటుంది. మూడు విభాగాల్లో ప్ర‌శ్న‌ల వెయిటేజీపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.

భౌతిక‌ర‌సాయ‌న శాస్త్రం; బైపీసీ విద్యార్థులు సాధారణంగా ఈ విభాగాన్ని క‌ష్టంగా భావిస్తారు. దీని నుంచి 13-18 ప్ర‌శ్న‌లు రావ‌చ్చు. స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న తెచ్చుకొని ఈ లెక్క‌లు ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మార్కులు సాధించ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ముఖ్యంగా ప‌ర‌మాణు నిర్మాణం, హైడ్రోజ‌న్ ప‌ర‌మాణు వ‌ర్ణ‌ప‌టం, బోర్ మోడ‌ల్‌, డీబ్రోగ్లీ సిద్దాంతంపై లెక్క‌లు, ఉష్ణ‌గ‌తిశాస్త్రం, ర‌సాయ‌న గ‌తిశాస్త్రం, విద్యుత్ ర‌సాయ‌న శాస్త్రం, ద్రావ‌ణాలపై దృష్టిసారించాలి. 

క‌ర్బ‌న ర‌సాయ‌న శాస్త్రం;  ఈ విభాగం నుంచి 13-18 వ‌ర‌కు ప్ర‌శ్న‌లు అడిగే అవ‌కాశం ఉంది. క‌ర్బ‌న రసాయ‌న శాస్త్రంలో అనేక చ‌ర్య‌లు ఉంటాయి. వీటిని గుర్తు పెట్టుకోవ‌డానికి నిరంత‌రం సాధ‌న చేయాలి. క్ర‌మ ప‌ద్ధ‌తిలో చ‌ద‌వ‌డం వ‌ల్ల వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. ఐయూపీఏసీ నామ‌క‌ర‌ణ విధానం, సాదృశ్యం, హైడ్రోకార్బ‌న్‌లు, హాలోజ‌న్ స‌మ్మేళ‌నాలు, సాధార‌ణ క‌ర్బ‌న ర‌సాయ‌న శాస్త్రాల‌పై అవగాహన పెంచుకుంటే మిగిలిన క‌ర్బ‌న ర‌సాయ‌న శాస్త్రాల‌ను నేర్చుకోవ‌డం సులువ‌వుతుంది. ఈ విభాగం పేరుతో ఉన్న చ‌ర్య‌లు 50-60 ఉంటాయి. ఆ చ‌ర్య‌లు, ఆ చ‌ర్య జ‌రిగే విధానాల‌పై ప్ర‌శ్న‌లు అడ‌గ‌వ‌చ్చు. రోజూ 5 లేదా 6 క‌ర్బ‌న ర‌సాయ‌న చ‌ర్య‌ల‌ను సాధ‌న చేయ‌డం ద్వారా ఈ విభాగంపై ప‌ట్టు సాధించ‌వ‌చ్చు.

క‌ర్బ‌నేత‌ర ర‌సాయ‌న శాస్త్రం;  ఈ సెక్ష‌న్ నుంచి కాన్సెప్ట్ ఆధారిత ప్ర‌శ్న‌లు అడిగే అవ‌కాశం ఉంది. ఇందులో మూల‌కాల వ‌ర్గీక‌ర‌ణ‌, ర‌సాయ‌న‌బంధం, హైడ్రోజ‌న్ దాని స‌మ్మేళ‌నాలు, ఎస్‌, పీ బ్లాక్‌, డీ,ఎఫ్ మూల‌కాలు, సంశ్లిష్ట స‌మ్మేళ‌నాలు చాలా ముఖ్యం. వీటిలో ఏ ఒక్క టాపిక్‌ను వ‌ద‌ల‌కుండా ప్రిపేర్ కావాలి. పున‌శ్చ‌ర‌ణ స‌మ‌యంలో ముందుగా రాసుకున్న నోట్స్ చాలా ముఖ్యం. రోజూ ఈ విభాగానికి 15-20 నిమిషాలు స‌మ‌యం కేటాయించాలి. 

- డాక్ట‌ర్‌ పిల్లాడి త్రినాథ్‌రాజా

ర‌సాయ‌న‌శాస్త్ర నిపుణులు

Posted Date : 27-03-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.