• facebook
  • whatsapp
  • telegram

సాంకేతిక విద్యకు పునాది... పాలిటెక్నిక్‌ 

పాలీసెట్‌ ప్రిపరేషన్‌ ప్లాన్‌

పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు అనేక కోర్సులు అందుబాటులో ఉంటాయి. సాంకేతిక విద్యపై ఆసక్తి ఉండి వృత్తివిద్యా కోర్సులను ఎంచుకునే వారికి పాలిటెక్నిక్‌ ఒక చక్కటి అవకాశం. ఈ కోర్సు విద్యార్థుల భవితకు పునాది అవుతుంది. మంచి ఉపాధి అవకాశాలను కూడా పొందవచ్చు.    

పాలీసెట్‌ పరీక్షలో మూడు సెక్షన్‌లు ఉంటాయి. మొదటి సెక్షన్‌ గణితశాస్త్రం, రెండో సెక్షన్‌ భౌతికశాస్త్రం, మూడో సెక్షన్‌ రసాయనశాస్త్రం. వీటిలో గణితం నుంచి 60 ప్రశ్నలు, భౌతిక శాస్త్రం నుంచి 30 ప్రశ్నలు, రసాయన శాస్త్రం నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు చొప్పున మొత్తం 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పాలీసెట్‌ పరీక్ష రాయడానికి 2 గంటల సమయం కేటాయిస్తారు. దీనిలో రుణాత్మక మార్కులు ఉండవు. ఈ పరీక్షలో పదో తరగతి పాఠ్యాంశాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి.ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక (మల్టిపుల్‌ ఛాయిస్‌) రూపంలో ఉంటాయి. 

గణితం

ముఖ్యంగా గణితంలో వాస్తవ సంఖ్యలు అధ్యాయంలోని గ.సా.భా. క.సా.గు.లకు సంబంధించిన ప్రశ్నలను అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సమితులు చాప్టర్‌ నుంచి రోష్టర్‌ రూపం, లాక్షణిక రూపం ప్రశ్నలు అడుగుతారు. త్రికోణమితిలోని ఐడెంటిటీ ఫార్ములాకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. సాంఖ్యాక శాస్త్రం నుంచి సగటు, మధ్యగతం, బాహుళకం ప్రశ్నలు రావొచ్చు.

సంభావ్యత అధ్యాయం నుంచి పేకముక్కలు, నాణేలు, పాచికలు అనే అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. క్షేత్రమితిలోని గోళం, స్తూపం, సిలిండర్, అర్ధగోళంలో ఘనపరిమాణం, వైశాల్యాలు లాంటి వాటి నుంచి ప్రశ్నలు అడుగుతారు. శ్రేఢులు చాప్టర్‌ నుంచి -వ పదం, - పదాల మొత్తం, అంకశ్రేఢి, గుణశ్రేఢి ప్రశ్నలు వస్తాయి. నిరూపక రేఖాగణితం నుంచి మధ్యదూరం, మధ్య బిందువు, వాలు, కేంద్రభాసం, వైశాల్యం లాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది.

వర్గ సమీకరణాలు అధ్యాయం నుంచి విచక్షణి, సమాన మూలాలు,  మూలాల మొత్తం, మూలాల లబ్ధం లాంటి అంశాల పైన ప్రశ్నలు వస్తాయి. బహుపదులు, రేఖీయ సమీకరణాల నుంచి గ్రాఫ్‌లకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. సరూప త్రిభుజంలోని థేల్స్‌ సిద్ధాంతం, పైథాగరస్‌ సిద్ధాంతాలపై ప్రశ్నలు వస్తాయి. స్పర్శరేఖల వృత్తాలు, తిర్యక్‌రేఖ లాంటి ప్రశ్నలు కూడా పరీక్షలో అడగవచ్చు.  

రసాయన శాస్త్రం 

ఈ సబ్జెక్టు నుంచి రసాయన సమీకరణాలు పాఠం నుంచి ముఖ్యంగా రసాయన ప్రతిచర్యలకు కొన్ని రోజువారీ జీవిత ఉదాహరణలు, రసాయన సమీకరణాలు, అస్థిపంజర రసాయన సమీకరణాలు, భౌతికస్థితుల చిహ్నాలను రాయడం నేర్చుకోవాలి. ఆమ్లాలు - క్షారాలు - లవణాలు పాఠంలోని ఆమ్లాలు, క్షారాల రసాయన లక్షణాలు, యాసిడ్‌ ప్రతిచర్య, నీటితో బేస్, యాసిడ్‌ లేదా బేస్‌ బలం - పబీ స్కేలు, నిత్యజీవితంలో ్పబీ ప్రాముఖ్యత, లవణాల గురించి చదవాలి. పరమాణు నిర్మాణంలో స్పెక్ట్రమ్, విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్, బోర్‌ యొక్క హైడ్రోజన్‌ అణువు, దాని పరిమితులు, క్వాంటం సంఖ్యలు, ఎలక్ట్రాన్‌ విన్యాసం ముఖ్యమైనవి.

మూలకాల వర్గీకరణ - ఆవర్తన పట్టిక పాఠంలో వ్యవస్థీకృత పద్ధతిలో మూలకాల అమరిక అవసరం, డాబరీనర్‌ ట్రైయాడ్స్, ఆధునిక ఆవర్తన పట్టిక; మూలకం లక్షణాలు, సమూహాలు, కాలాల్లో వాటి పోకడలు తెలుసుకోవాలి. లోహసంగ్రహణశాస్త్రం పాఠం నుంచి ప్రకృతిలో లోహాలు ఏర్పడటం, ఖనిజాల నుంచి లోహాల సంగ్రహణ, కార్యాచరణ శ్రేణి, సంబంధిత లోహశాస్త్రం లాంటి అంశాలపై శ్రద్ధ వహించాలి. 

భౌతిక శాస్త్రం 

దీనిలో వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం పాఠంలోని గోళాకార అద్దాలు; కుంభాకార, పుటాకార అద్దాలు, పోల్, దృష్టి, వక్రతా కేంద్రం, ప్రధాన అక్షాలకు సంబంధించిన ప్రశ్నలు నేర్చుకోవాలి. కటకాల చిత్ర నిర్మాణం, రేఖాచిత్రం కోసం నియమాలు, లెన్స్‌ ద్వారా ఏర్పడే చిత్రాలు కూడా ముఖ్యమైనవి. మానవ కన్ను - రంగుల ప్రపంచం పాఠం నుంచి విభిన్న దృష్టి తక్కువ దూరం, మానవ కన్ను నిర్మాణం, మయోపియా, హైపర్‌మెట్రోపియా, ప్రెస్బియోపియా సంబంధిత ప్రశ్నలు వస్తాయి.

విద్యుత్‌ ప్రవాహం పాఠంలో విద్యుత్‌ ప్రవాహం, సంభావ్య వ్యత్యాసం, బ్యాటరీ లేదా సెల్‌ ఎలా పనిచేస్తుంది, ఓమ్‌ నియమం, నిరోధకత, ప్రతిఘటనను ప్రభావితం చేసే అంశాలు, కిర్కాఫ్‌ నియమాలు, విద్యుత్‌ శక్తి, భద్రతా ఫ్యూజ్‌లపై దృష్టి సారించాలి.

పైన చెప్పిన పాఠ్యాంశాలన్నింటినీ ఒక ప్రణాళిక ప్రకారం చదవాలి. ముఖ్యంగా ప్రీవియస్‌ పేపర్‌లు, మోడల్‌ పేపర్‌లలో ఉన్న ప్రశ్నలను సాధన చేయాలి. 

- రచయిత: కె.కుమార్‌ 
 

Posted Date : 02-07-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌