• facebook
  • whatsapp
  • telegram

కర్బన రసాయన శాస్త్రం

కర్బన రసాయన శాస్త్రం

ప్రాణవాదానికి ఆయువు చెల్లు
అగ్నిని కనుక్కున్న నాటి నుండి మనిషి పదార్థాలని  మండేవి, మండనివి అని రెండు వర్గాలుగా విభజిస్తూ వచ్చాడు. ఆ రోజుల్లో కలప, కొవ్వు, చమురు  - వీటినే ప్రధానంగా ఇంధనాలుగా వాడేవారు. కలప వృక్షప్రపంచం నుండి పుట్టిన ఉత్పత్తి అయితే, కొవ్వు, చమురు జీవప్రపంచం నుండి మాత్రమే కాక, వృక్షప్రపంచం నుండి కూడా వచ్చిన ఉత్పత్తులు. ఖనిజ ప్రపంచానికి చెందిన పదార్థాలలో అధికశాతం – నీరు, ఇసుక, రాళ్లు మొదలైనవి – మండేవి కావు. పైగా ఇవి నిప్పుని ఆర్పడానికి పనికొస్తాయి.
కనుక తొలి దశల్లో మండేవి, మండనివి అనే రెండు జాతుల పదార్థాలని జీవప్రపంచం నుండి వచ్చేవి, జీవప్రపంచం నుండి రానివి అనే రెండు వర్గాలుగా కూడా విభజించడం సహజంగా జరిగింది. (అయితే ఈ సూత్రానికి ఎన్నో మినహాయింపులు ఉన్నాయి. కార్బన్, సల్ఫర్ మూలకాలు జీవరహిత ప్రపంచం నుండి వచ్చే పాదార్థాలలాగా కనిపిస్తాయి గాని అవి మండుతాయి.)
పద్దెనిమిదవ శతాబ్దంలో పెరుగుతున్న పదార్థ విజ్ఞానాన్ని ఆలంబనగా చేసుకున్న రసాయన శాస్త్రవేత్తలు జ్వలనీయత (మండటం) అనే ఒక్క లక్షణం సహాయంతో జీవప్రపంచపు ఉత్పత్తులని, జీవరహిత ప్రపంచపు ఉత్పత్తుల నుండి వేరు చెయ్యటం సాధ్యం కాదని తెలుసుకున్నారు. జీవరహిత ప్రపంచం నుండి వచ్చిన పదార్థాలు ఎంతో కరుకైన సంస్కారాలని కూడా తట్టుకుని మనగలిగేవి. కాని జీవపదార్థం మాత్రం, లేదా ఒకప్పుడు జీవం వున్న పదార్థం మాత్రం, అలాంటి సంస్కారాలని తట్టుకోగలిగేది కాదు. నీటిని మరిగించి మళ్లీ స్వేదనంతో నీటిగా మార్చవచ్చు. ఇనుమును, ఉప్పుని కరిగించి, మళ్లీ మూల స్థితికి వచ్చేలా గడ్డ కట్టేట్టు చెయ్యొచ్చు. ఇందుకు భిన్నంగా ఆలివి నూనెని, లేదా చక్కెరని, వేడి చేస్తే (మంట రాకుండా జాగ్రత్తలు తీసుకున్నా కూడా), వాటి లోంచి పొగ పుట్టి మసిబారతాయి. ఆ చర్య తరువాత అడుగున మిగిలేది ఆలివ్ నూనె గాని, చక్కెర గాని కాదు. అంతే కాక ఆ మిగిలిన అవశేషాల నుండి ఆలివ్ నూనెని, చక్కెరని తిరిగి సాధించడానికి వీలుపడదు.
ఈ రకమైన భేదాలు చాలా మౌలికమైన భేదాల లాగా తోచాయి. 1807  లో బెర్జీలియస్ ఆలివ్ నూనె, చక్కెర మొదలైన పదార్థాలన్నీ జీవప్రపంచానికి చెందిన ఉత్పత్తులు కనుక వాటిని organic (కర్బన రసాయనాలు) అనాలని సూచించాడు. ఇక జీవరహిత ప్రపంచానికి చెందిన నీరు, ఉప్పు మొదలైన పదార్థాలన్నీ inorganic (అకర్బన రసాయనాలు) అన్నాడు.
అయితే రసాయన శాస్త్రవేత్తలు గమనించిన విషయం ఒకటి వుంది. వేడి చెయ్యడం మొదలైన కరుకైన సంస్కారాల వల్ల కర్బన రసాయనాలు అకర్బన రసాయనాలుగా మారిపోతాయి అన్న సంగతి వాళ్ళు గుర్తించారు. అయితే అకర్బన రసాయనాల నుండి కర్బన రసాయనాలుగా అంటే వ్యతిరేక దిశలో మార్పిడి మాత్రం పందొమ్మిదవ శతాబ్దపు తొలి దశల వరకు తెలిసి రాలేదు.
ఆ రోజుల్లో ఎంతో మంది రసాయన శాస్త్రవేత్తలు జీవం అనేది ఓ ప్రత్యేక లక్షణం అని, భౌతిక ప్రపంచపు నియమాలు దాన్ని పాలించవని, ఆ నియమాలన్నీ జీవరహిత ప్రపంచానికే పరిమితమని భావించేవారు. జీవం పట్ల ఈ రకమైన వైఖరిని ‘ప్రాణవాదం’ (vitalism) అంటారు.  ఒక శతాబ్ద కాలం క్రితం ఫ్లాగిస్టాన్ ని కనుక్కున్న స్టాల్ దాన్ని బోధించేవాడు. ఈ ప్రాణవాదం ప్రకారం, అకర్బన రసాయనాలని కర్బన రసాయనాలుగా మార్చడానికి ఏదో ‘ప్రాణ శక్తి’ (vital force) అవసరమని భావించేవారు. రసాయన శాస్త్రవేత్తలకి అప్పటికి తెలిసిన విధానాల సహాయంతో పరీక్షా నాళాలలో, ప్రయోగశాలలో ఈ ‘ప్రాణ శక్తి’ని ఎలా వినియోగించాలో, శాసించాలో అర్థం కాలేదు.

Posted Date : 24-02-2021

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌