• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్వ్యూలో ఇలా నెగ్గండి! 

డిగ్రీ, పాలిటెక్నిక్‌ అధ్యాపక అభ్యర్థులకు మెలకువలు

విషయం, దాని వ్యక్తీకరణ రెండూ అధ్యాపక వృత్తిలో ముఖ్యమైనవి. ఆ ప్రతిభను ప్రదర్శించి ఉద్యోగాన్ని సాధించే సందర్భమే.. మౌఖిక పరీక్షలు. ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ లెక్చరర్స్, పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ పోస్టుల రాత పరీక్షల ఫలితాలు విడుదలై ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి. త్వరలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ ఇంటర్వ్యూలను నిర్వహించబోతోంది. ఇక 2020 డిసెంబర్‌ లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి. వాటి రాత పరీక్షల మూల్యాంకనం పూర్తయ్యాక ఇంటర్వ్యూకి ఎంపికయ్యే అభ్యర్థుల జాబితా విడుదల అవుతుంది. అంటే.. రాబోయే రోజుల్లో మూడు ప్రధాన పరీక్షల మౌఖిక పరీక్షలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో వీటిలో గరిష్ఠ మార్కులు పొందేందుకు కావాల్సిన మెలకువలను పరిశీలిద్దాం!

డిగ్రీ, పాలిటెక్నిక్‌ అధ్యాపకుల పోస్టులకు 50 మార్కుల చొప్పున ఇంటర్వ్యూకి కేటాయించారు. గరిష్ఠ మార్కులు పొందాలంటే మొత్తం సన్నద్ధతను రెండు భాగాలుగా విభజించుకోవాలి. 

1) కంటెంట్‌ 

2) కమ్యూనికేషన్‌. 

కంటెంట్‌పై..  

కంటెంట్‌కు సంబంధించి ఏపీపీఎస్‌సీ ఆయా రాత పరీక్షలకు నిర్దేశించిన సిలబస్‌ అంశాలు, డిగ్రీ/ పాలిటెక్నిక్‌ స్థాయిలో ప్రస్తుతం ఉన్న సిలబస్‌ అంశాలు, సంబంధిత సబ్జెక్టుకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్‌... ఈ మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఏ విధంగానైనా అడగవచ్చు. అందువల్ల ముందుగా డిగ్రీ/ పాలిటెక్నిక్‌ లెక్చరర్ల రాత పరీక్షకు సంబంధించిన ఏపీపీఎస్‌సీ సిలబస్‌ అంశాలపై మరొకసారి రివిజన్‌ చేసుకోవాలి. ఎలాగూ పరీక్ష కోసం చదివారు కాబట్టి మరొకసారి స్థూలంగా పునశ్చరణ చేసుకుంటే ఎటువంటి ప్రశ్నలైనా ఎదుర్కోవచ్చు. గత ఇంటర్వ్యూల్లో ‘రాత పరీక్ష సిలబస్‌ అంశాలు వరసగా చెప్పండి’ అని అడిగిన సందర్భాలూ ఉన్నాయి. అందువల్ల సిలబస్‌ టాపిక్స్‌పై బాగా అవగాహన ఉండాలి.

కంటెంట్‌ ప్రిపరేషన్లో రెండో భాగంగా ప్రస్తుతం ఉన్న డిగ్రీ /పాలిటెక్నిక్‌ కోర్సు సిలబస్‌ని పరిశీలించాలి. ఆ కోర్సులోని వివిధ పాఠ్యాంశాలపై పట్టు పెంచుకోవాలి. అకడమిక్‌గా మీరు ఆ కోర్సులను చదివినప్పుడు ఇప్పుడు డిగ్రీ /పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ఉన్న సిలబస్‌ అంశాల్లో కొన్ని చదివి ఉండకపోవచ్చు. వీటిని ఎలా బోధిస్తారు? అని బోర్డు అడిగిన సన్నివేశాలు గతంలో ఉన్నాయి. అందువల్ల అభ్యర్థులు తాము చదివినప్పుడూ.. ఇప్పుడూ ఉన్న పాఠాల మధ్య పోలిక గమనించుకుని ఏ వ్యూహం ద్వారా వాటిని బోధిస్తారు అనేది బోర్డుకి చక్కగా వివరించగలగాలి. అప్పటి పాఠ్యాంశాలూ..ఇప్పటి ఆ పాఠ్యాంశాల్ని బేరీజు వేసుకుని ఇంటర్నెట్‌ ద్వారా అభ్యర్థులు తమ పరిజ్ఞాన స్థాయిని మెరుగుపర్చుకోవాలి.  కొంతమంది ఈ రాత పరీక్షలకు అవసరమైన అర్హతలకు మించి ఉన్నత కోర్సులు చదివి ఉండవచ్చు. పీహెచ్‌డీలు, ఇతరత్రా పరిశోధన అంశాల్లో అనుభవం ఉండి ఉండవచ్చు. ఇలాంటి అదనపు అర్హతలను బోర్డు ముందు ఉంచడం ద్వారా మంచి అభిప్రాయాన్నీ, దాంతోపాటు మార్కులూ పొందవచ్చు. అలా పొందేందుకు తప్పనిసరిగా ఆయా సబ్జెక్టులోని అంశాల్ని రివిజన్‌ చేసుకుని బోర్డు ముందుకు వెళ్లాలి.

కంటెంట్‌ ప్రిపరేషన్లో మూడో అంశంగా- వర్తమాన అనుసంధానాన్ని గుర్తించాలి. అభ్యర్థులు ఇప్పుడు ఏ సబ్జెక్టులో లెక్చరర్లు కావాలని అనుకుంటున్నారో ఆ సబ్జెక్టుకు సంబంధించి వర్తమాన అంశాలు ఎన్నో ఉంటాయి. అవి తాజా పరిశోధనలు కావచ్చు. కొత్త ఆవిష్కరణలు సంఘటనల రూపంలో ఉండవచ్చు. వాటన్నిటినీ సమీక్షించుకుని సిద్ధపడాలి. సంబంధిత సబ్జెక్టులో ఇటీవల కాలంలో గుర్తింపు పొందిన వ్యక్తులు, వారికి వచ్చిన అవార్డులూ మొదలైనవి ఇంటర్వ్యూ ప్రశ్నల రూపంలో రావచ్చు. ‘జ్వలించే దీపం మాత్రమే మరో దీపాన్ని వెలిగించగలదు’ అనే తాత్విక చింతనతో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ వర్తమాన ఆవిష్కరణ అంశాలపై పట్టు సాధించేందుకు గూగుల్‌పై ఆధారపడటం మెరుగైన నిర్ణయం. ప్రస్తుత విద్యావిధానంపై కూడా ప్రశ్నలు అడగవచ్చు. ఇటీవల కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నూతన జాతీయ విద్యావిధానంలోని అంశాలపైనా ప్రశ్నలు రావచ్చు. ముఖ్యంగా ఉన్నతవిద్య, సాంకేతిక విద్యలో ప్రస్తుతం ఉన్న లోపాలు, జాతీయ విద్యావిధానం వాటిని ఎలా ఉద్దేశించింది అనే కోణంలో తయారవ్వాలి. ఉన్నత విద్యావిధానంలోని కళాశాలలు, కరిక్యులమ్‌లో లోపభూయిష్ఠతపై కూడా అవగాహన ఉండాలి.

కమ్యూనికేషన్‌పై...

మౌఖిక పరీక్షల్లో మార్కుల పంట పండించే అతి ముఖ్యమైన అంశం కమ్యూనికేషన్‌. అందులోనూ లెక్చరర్ల ఉద్యోగానికి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు చాలా ముఖ్యమని బోర్డు భావిస్తోంది. ఆ క్రమంలో మీరు బోర్డు ముందు కూర్చున్నప్పటి నుంచి మాట్లాడుతున్న విధానం, భావవ్యక్తీకరణ, భాషా పటుత్వం మొదలైనవన్నీ పరిశీలిస్తారు.  బోధన సామర్థ్యాన్ని అర్థం చేసుకునేందుకు బ్లాక్‌ బోర్డ్‌ టీచింగ్‌ చెయ్యమని అడగవచ్చు. గతంలో ఇంటర్వ్యూ రూమ్‌లో ఒక బోర్డుని పెట్టి పాఠాన్ని చెప్పమన్న సందర్భాలున్నాయి. అందువల్ల అభ్యర్థులు తమ సబ్జెక్టు అంశంలో కనీసం ఒక నాలుగైదు పాఠాలకు సంబంధించి సరైన రీతిలో తయారై బోర్డు ముందు ప్రెజెంట్‌ చేయాలి. అందుకు నిర్దేశించిన బోధనా ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తే మంచి మార్కులు వస్తాయి. అందుకని ఈ ఇంటర్వ్యూలకు హాజరవుతున్న అభ్యర్థులు సరైన నిపుణుల దగ్గరికి వెళ్లి మీరు ఎలా చెబుతున్నారో నిష్పాక్షిక అభిప్రాయాన్ని పొందాల్సి ఉంటుంది అవసరమైతే సవరణలూ చేసుకోవాలి. బోర్డు మేనర్స్‌ను తప్పనిసరిగా పాటించాలి. అభ్యర్థులు వేసుకునే సరైన దుస్తులు, పాటించే బాడీ లాంగ్వేజ్‌ మెరుగుపరుచుకోవాలి. ఎందుకంటే అవి కూడా బోర్డుకూ, అభ్యర్థికీ మధ్య ఉండే కమ్యూనికేషన్‌ని మెరుగుపరుస్తాయి కనుక!

గ్రూప్‌-1 సంగతి?

గ్రూప్‌-1 ఉద్యోగాల ఎంపికలో 75 మార్కుల ఇంటర్వ్యూ కీలక పాత్ర పోషిస్తుంది. డిసెంబర్లో పరీక్ష జరిగినందువల్ల త్వరలోనే రాత పరీక్షల ఫలితాలు ఆశించవచ్చు. ఫలితాలు వచ్చాక ఇంటర్వ్యూకి తయారవడం కొద్దిగా క్లిష్టమే. అందువల్ల సగటు స్థాయిలో పేపర్‌ దిద్దినట్లు అయితే 60%- 65% వరకు స్కోరు చేసిన అభ్యర్థులకు మంచి అవకాశాలు ఉండవచ్చు. రిజర్వేషన్‌ సౌకర్యం ఉన్న అభ్యర్థులకు ఈ పర్సంటేజ్‌ మరింతగా తగ్గవచ్చు. ఇలాంటి అంచనాలను పెట్టుకుని అభ్యర్థులు తమ ప్రతిభను గుర్తు చేసుకుని ఇంటర్వ్యూకి ఇప్పటినుంచే సిద్ధమవడం సముచితం. 
సబ్జెక్టు అంశాలను పునశ్చరణ చేసుకుంటూనే ఆర్థిక, రాజకీయ, సామాజిక వర్తమాన అంశాలపై దృష్టి సారించడం మేలు. ప్రతిరోజూ ప్రామాణికదినపత్రికలను శ్రద్ధగా చదువుతూ ఉండాలి. 

స్టేజ్‌ ఫియర్‌ కానీ, ఇతరులతో సంభాషించేటప్పుడు వచ్చే భయంగానీ ఉన్న అభ్యర్థులు ఇప్పటి నుంచే తొలగించుకోవాలి. సమాజంలో వివిధ సన్నివేశాల్లో, వివిధ వ్యక్తులతో సంభాషించటం అనేది ప్రాక్టికల్‌గా నేర్చుకునే అంశం. ఈటీవీలో వచ్చే ప్రతిధ్వని లాంటి కార్యక్రమాలు చూడటం ద్వారా ఒక అంశానికి ఉండే మంచి- చెడు స్పష్టంగా అర్థమవుతుంది. తద్వారా బోర్డు ముందు సరైన భావాలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు! 

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌