• facebook
  • whatsapp
  • telegram

ఈడీ, జూనియర్‌ అసిస్టెంట్స్‌ పరీక్షలకు ఇదుగో వ్యూహం

ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్‌సీ ప్రకటించిన నియామక పరీక్షల తేదీలు దగ్గరపడుతున్నాయి. ఎండోమెంట్‌ ఆఫీసర్స్‌ పరీక్షను జులై 24న, జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్షను జులై 31న నిర్వహించనున్నారు. రెండింటికీ స్క్రీనింగ్‌ పరీక్షలు జరుగుతాయి. పరీక్షా సమయం సమీపిస్తుండటంతో పరీక్షల్లో మెరుగైన ప్రతిభ చూపేందుకు అభ్యర్థులు ఏ వ్యూహాన్ని పాటించాలో తెలుసుకుందాం! 

ఎండోమెంట్‌ ఆఫీసర్స్‌ పరీక్ష

హిందూ తాత్వికత- దేవాలయ వ్యవస్థకు స్క్రీనింగ్‌ పరీక్షలో 150 ప్రశ్నలకు గాను 100మార్కుల ప్రాధాన్యం ఉంది. ఇప్పుడున్న సమయంలో అత్యధిక వ్యవధిని ఈ విభాగానికి కేటాయించాలి. ఈ విభాగంలో సిలబస్‌ విస్తృతమైనప్పటికీ ప్రశ్నల స్థాయి ప్రాథమిక స్థాయిలో ఉండే అవకాశం ఉంది. గ్రూప్‌ 1, 2 పరీక్షల అనుభవమున్న సీనియర్‌ అభ్యర్థులకు కూడా ఈ విభాగం కొత్తదే. అభ్యర్థులందరి భవిష్యత్తునూ నిర్ణయించే విభాగంగా దీన్ని గుర్తించవచ్చు. అందువల్ల ఈ విభాగంపై వీలైనన్నిసార్లు పునశ్చరణ చేయటం మంచిది.    

హిందూ తాత్వికత- దేవాలయ వ్యవస్థకు సంబంధించిన సమాచారం చదువుతున్నప్పుడు తేలికగానే అర్థం అవుతూ ఉంటుంది. పైగా కొంతవరకు జనరల్‌ స్టడీస్‌ విభాగంలో అనుసంధానమై ఉన్నందున అవగాహన త్వరగానే ఏర్పడుతుంది. అయితే సంబంధిత సమాచారాన్ని బిట్ల రూపంలో మార్చుకుని చదవటం కొద్దిగా క్లిష్టమైన ప్రక్రియ. ఆబ్జెక్టివ్‌ తరహాలో వీలైనన్ని బిట్లను టెస్టుల రూపంలో సాధన చేయటం ద్వారా మాత్రమే ఈ సమస్యనుంచి గట్టెక్కవచ్చు. ఈ విషయాన్ని ప్రతి అభ్యర్థీ శ్రద్ధగా పట్టించుకోవాలి. 

10, 11, 12 చాప్టర్లలో పేర్కొన్న దేవాలయ ఆదాయ వ్యవస్థ, దేవాలయ భూముల నిర్వహణ, ఎండోమెంట్‌ ఆఫీసర్స్‌ ఉద్యోగ బాధ్యతలు, ఎండోమెంట్‌ చట్టం మొదలైన విషయాలన్నీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారిక సమాచారం ద్వారా రివిజన్‌ చేయాలి.

అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత అద్వైత, వీరశైవ మొదలైన తాత్విక అంశాలను ప్రాథమిక స్థాయిలో నేర్చుకుంటే సరిపోతుంది. తులనాత్మకంగా ఒకదానితో మరొకటి పోల్చుకోవడం ద్వారా ఈ స్థాయి పరీక్షలో వచ్చే ప్రశ్నలను ఎదుర్కోవచ్చు.

రామాయణ, మహాభారత, భాగవతాలూ, పురాణాలూ సిలబస్‌లో ఉన్నాయి. దీనిలో పేర్కొన్నదాని ప్రకారం ప్రాథమిక స్థాయి సమాచారానికి అధిక పాత్ర ఉంటుంది. వివిధ పాత్రల, ప్రదేశాల గురించి సిలబస్‌లో ఉన్నందున ఆ తరహా ప్రశ్నలను అంచనా వేయవచ్చు. జరిగిన సంఘటనలు, క్రియలు ఆధారం చేసుకుని అందులో కీలక పాత్రధారి ఎవరు, అది ఎక్కడ జరిగింది అనే రూపంలో ప్రశ్నలు వస్తాయని భావించవచ్చు. ఆయా రచనల నేపథ్యం, రచనా నిర్మాణ అంశాలు కూడా ప్రశ్నలుగా రావచ్చు.

భారతదేశంలోని వివిధ దేవాలయాలు, వాటి నిర్మాణం వెనుకున్న నేపథ్యాలు, నిర్మించిన ప్రదేశాలు, నిర్మాణ శైలులు ప్రశ్నలుగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల పునశ్చరణ సమయంలో... హిందూ తాత్విక చింతన- దేవాలయ నిర్మాణంపై స్థూల అవగాహనకు ప్రాధాన్యం ఇచ్చి సన్నద్ధమవడం మేలు. .

ఎండోమెంట్‌ ఆఫీసర్స్‌ స్క్రీనింగ్‌ పరీక్షలో జనరల్‌ స్టడీస్‌కు 50 మార్కులే ఉన్నాయి. ప్రస్తుత వ్యవధిలో కొత్త విషయాలపై దృష్టి పెట్టకుండా చదివిన విభాగాలనే రివిజన్‌ చేయడం మేలైన నిర్ణయం.

రెండు పరీక్షల్లోనూ వర్తమానాంశాలపై సులభంగా మార్కులు పొందే అవకాశం ఉంది. సాధారణంగా పరీక్ష తేదీకి ఆరు నెలల వెనక వరకు ప్రశ్నలడుగుతారు. గత మూడు నెలల వరకు జరిగిన సంఘటనలూ, అంశాలపై ఎక్కువ ప్రశ్నలు రావొచ్చు. అందుకని ఆరు నెలల నుంచి పరీక్ష తేదీ వరకు ఉన్న సమయాన్ని ప్రామాణికంగా తీసుకుని పునశ్చరణ  చేయాలి. 

జూనియర్‌ అసిస్టెంట్స్‌ పరీక్ష

జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ తెలుగు విభాగాలకు ప్రిలిమ్స్‌ పరీక్షలో 50 మార్కుల ప్రాధాన్యం ఉంది. జనరల్‌ స్టడీస్‌ 100 మార్కుల్లో సీనియర్‌ అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధిస్తుంటారు. అయితే జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ తెలుగులో అందరికీ సమమైన పోటీ అవకాశం ఉంటుంది. అందువల్ల ఇప్పుడు రివిజన్‌ సమయంలో భాషలపై పట్టు సాధించేందుకు మరో ప్రయత్నం చేయాలి. 

ఇంగ్లిష్‌ మీడియం అభ్యర్థులకు తెలుగుపై కనీస అవగాహన ఉండటం లేదు. వాళ్లు ఈ విభాగంలో నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. అందువల్ల తెలుగే కదా అని నిర్లక్ష్యం చేయకుండా మెరుగ్గా సిద్ధమవడం వారి బాధ్యత.

గ్రామీణ, తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లిష్‌ విభాగంలో సరైన పట్టు దొరకటం లేదు. అందువల్ల నిర్దిష్టమైన కృషితో ఈ విభాగంపై పట్టు పెంచుకునేందుకు ఇప్పుడున్న సమయంలో ప్రణాళికాయుతంగా వ్యవహరించాలి. పదో తరగతి స్థాయి అని స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి పాఠశాల స్థాయి పుస్తకాల్లోని గ్రామర్‌పైన ప్రధానంగా దృష్టి పెట్టాలి.

భాషలు ప్రిపేర్‌ అవుతున్నప్పుడు కీలక అంశాలు అర్థమవుతున్నట్టూ, పట్టు దొరికినట్టూ అనిపిస్తుంది. కానీ ఆబ్జెక్టివ్‌ బిట్లు సాధన చేసినప్పుడే వాస్తవికమైన అభ్యసన స్థాయి తెలుస్తుంది. అందువల్ల రివిజన్‌లో అంతర్భాగంగా వీలైనన్ని బిట్లు, సబ్జెక్టు చదువుతూ ప్రాక్టీస్‌ చేయడం మంచిది.

జనరల్‌ స్టడీస్‌లో కరెంట్‌ అఫైర్స్‌ తప్ప మిగతా కొత్త విభాగాలపై ఈ రివిజన్‌ సమయంలో దృష్టి పెట్టడం సరైన నిర్ణయం కాదు. గతంలో సిద్ధమైన విభాగాలనే పునశ్చరణ చేయాలి. అదేవిధంగా ఆబ్జెక్టివ్‌ తరహా పరీక్షలను రియల్‌ టైంలో చేయటం ద్వారా నేర్చుకున్న స్థాయిని అంచనా వేయటమే కాదు, చేస్తున్న లోపాలూ సవరించుకోవచ్చు. పరీక్షలకు అవసరమైన జ్ఞాపకశక్తి కూడా ఏర్పడుతుంది.        

*********************************************************************************

 

సెక్షన్-ఎ: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
 

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు

2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు

3. జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు

4. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర

5. భారత రాజకీయ వ్యవస్థ, పాలన: రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, ఆంధ్రప్రదేశ్ను ఆధారంగా చేసుకొని తీసుకున్న సంస్కరణలు, ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలు

6. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో ఆర్థికాభివృద్ధి

7. ఆంధ్రప్రదేశ్, భారత ఉపఖండం యొక్క భౌతిక భూగోళశాస్త్రం

8. విపత్తు నిర్వహణ: విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ సహాయంతో విపత్తు అంచనా

9. సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ

10. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ ప్రిటేషన్

11. డేటా అనాలిసిస్: ఎ) టాబ్యులేషన్ ఆఫ్ డేటా బి) విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా సి) బేసిక్ డేటా అనాలిసిస్ (అంకగణితం, మధ్యగణితం, బాహుళకం)

12. ఆంధ్రప్రదేశ్ విభజన, పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన సమస్యలు(విభజన సమస్యలు)


సెక్షన్-బి: జనరల్ ఇంగ్లిష్, తెలుగు

a) Comprehension

b) Usage and Idioms

c) Vocabulary and Punctuation

d) Logical re-arrangement of sentences

e) Grammar

ఎ) పర్యాయపదాలు, పదజాలం

బి) వ్యాకరణం

సి) తెలుగు పదాలకు ఇంగ్లిష్ అర్థాలు

డి) ఇంగ్లిష్ పదాలకు తెలుగు అర్థాలు

ఇ) పలుకుబడి/ వాడుక, నుడికారం/ జాతీయాలు


ఈ-బుక్స్


పాత ప్రశ్నప‌త్రాలు


నమూనా ప్రశ్నపత్రాలు

Posted Date : 27-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌