• facebook
  • whatsapp
  • telegram

గురిపెట్టారు.. గ్రూప్‌-1 కొలువు సాధించారు

* ప్రతిభ చాటిన యువ కిశోరాలు

* మొదటి ప్రయత్నంలోనే కొందరి విజయం
 

వారందరూ పేద, మధ్యతరగతికి చెందినవారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. గ్రూప్‌-1 కొలువుపై గురిపెట్టి అందుకనుగుణంగా ఎంతో కష్టపడ్డారు. కొందరికి తొలి ప్రయత్నంలో విజయం వరించగా,మరికొందరు రెండో ప్రయత్నంలో తాము అనుకున్నది సాధించారు. గురువారం విడుదలైన గ్రూప్‌-1 ఫలితాల్లో వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాలకు చెందిన పలువురు సర్కారు కొలువులు సాధించి తమ సత్తా చాటారు.

న్యూస్‌టుడే, మదనపల్లె విద్య, వేంపల్లె, రాజంపేట గ్రామీణ, నందలూరు సుండుపల్లి, బద్వేలు గ్రామీణ, అట్లూరు, బద్వేలు, చాపాడు, కొండాపురం, ప్రొద్దుటూరు పట్టణం, ప్రొద్దుటూరు విద్య కడప విద్యకలెక్టర్‌ కావాలన్నదే లక్ష్యం

 


మదనపల్లెకు చెందిన ఆయేషా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. స్థిరాస్తి వ్యాపారి షేక్‌ అహ్మద్‌బాషా, గౌసియాబేగంల ఒక్కగానొక్క కుమార్తె ఈమె. మదనపల్లెలో పదోతరగతి వరకు, తిరుపతిలో ఇంటర్మీడియట్‌ ఎంపీసీ,  తమిళనాడు రాష్ట్రం తంజావూరులో బీటెక్‌ పూర్తిచేశారు. 2019 నుంచి సివిల్స్‌కు సాధన చేస్తూనే గతేడాది గ్రూప్స్‌ ఇంటర్వ్యూ దశ వరకు వెళ్లి విఫలమయ్యారు. ఓటమికి కుంగిపోకుండా తల్లిదండ్రుల సహకారం, ఐఆర్‌ఎస్‌ యాదగిరి సలహాలతో కష్టపడి చదివి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. సివిల్స్‌ రాసి కలెక్టర్‌ కావాలన్నది తన లక్ష్యమని, డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తూనే సివిల్స్‌ సాధిస్తానని తెలిపారు. అనుకున్న లక్ష్యం సాధించాలంటే పట్టుదలతో పాటు ఓపిక ఉండాలని, అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే నా ఆకాంక్ష’ అని ఆమె వివరించారు.


డిప్యూటీ కలెక్టర్‌గా మెకానిక్‌ కుమార్తెప్రొద్దుటూరు పట్టణంలోని మేదరవీధికి చెందిన వంకం సాయిహర్షిత డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం సాధించారు. తండ్రి వెంకటసుబ్బయ్య ఫ్రిజ్‌ మెకానిక్‌గా పనిచేస్తుండగా, తల్లి శారద గృహిణి. సోదరుడు హర్షవర్ధన్‌ కడప కేఎస్‌ఆర్‌ఎం కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు. సాయిహర్షిత ఏడోతరగతి వరకు స్థానికంగా చదువుకున్నారు. పదో తరగతిలో 9.7 జీపీఏ సాధించారు. ఇంటర్మీడియట్‌ ఎంపీసీలో 924 మార్కులు సాధించగా, బీటెక్‌లో 85 శాతం మార్కులు సాధించారు. తండ్రి కష్టాన్ని చూసి కసితో చదివానని, ఇంట్లోనే సొంతంగా సన్నద్ధమయ్యానని సాయిహర్షిత తెలిపారు.


రైతు బిడ్డ గిరిజన సంక్షేమాధికారిణిగా వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లెకు చెందిన పప్పు తేజస్విని జిల్లా గిరిజన సంక్షేమాధికారిణిగా ఎంపికయ్యారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం నారాయణపల్లెకు చెందిన రైతు పప్పు రాజారెడ్డి,. శ్రీదేవి దంపతుల కుమార్తె అయిన ఈమె మదనపల్లె జ్ఞానోదయ పాఠశాలలో పదోతరగతి చదివి 545 మార్కులతో ప్రతిభ చాటారు. గుంటూరు ఆర్‌బీఆర్‌జేసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో 88 శాతం మార్కులతో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన అనంతరం ఉత్తరాఖండ్‌ రాష్ట్రం రూర్కీ ఐఐటీలో 80 శాతం మార్కులతో ఎంటెక్‌ పూర్తిచేశారు. ఐఏఏస్‌ సాధనే లక్ష్యంగా ఈమె యూపీఎస్‌ఈ పరీక్ష రాసి ఇంటర్య్వూ వరకు వెళ్లారు. ప్రస్తుతం ఈమె వేంపల్లెలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఈమె భర్త ఫణీంద్రదత్‌ కూడా ఇదే కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. ఈమె సోదరుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం చోడసముద్రం వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఆర్డీవో, డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు సాధించాలన్నదే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు.


తండ్రి కష్టం చూసి విజయం సాధించి

అట్లూరు మండలం గోపీనాథపురం గ్రామానికి చెందిన  మోటారు మెకానిక్‌ మెంట నాగమల్లయ్య కుమారుడు మల్లికార్జున ఏపీ వైద్య,ఆరోగ్యశాఖలో పరిపాలనాధికారిగా ఎంపికయ్యారు. మల్లికార్జున 2016లో ఝార్ఖండ్‌ రాష్ట్రంలో ఐఐటీ పూర్తి చేశారు. అనంతరం ఐఏఎస్‌ చేయాలన్న లక్ష్యంతో తొలుత గ్రూపు-1 పరీక్షల శిక్షణకు వెళ్లారు. తుది ఫలితాల్లో వైద్య, ఆరోగ్యశాఖలో పరిపాలనాధికారిగా కొలువు సాధించారు. తమ కుమారుడు సర్కారు కొలువు సాధించడంపై తల్లిదండ్రులతోపాటు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.


మొదటి ప్రయత్నంలోనే గెలుపుకొండాపురం గ్రామానికి చెందిన బొడెల ఈశ్వరరెడ్డి, సువర్ణ దంపతుల కుమార్తె బొడెల సుజిత అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్‌ అధికారిణిగా ఎంపిక అయ్యారు. ఈమె ప్రాథమిక, ఉన్నత పాఠశాల వరకు ముద్దనూరు మండలం మంగపట్నంలో చదివారు. కడపలో ఇంటర్మీడియట్‌, హైదరాబాద్‌లో డిగ్రీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. గ్రూప్స్‌నకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి పరీక్షలకు సిద్ధమైనట్లు ఆమె తెలిపారు. 2021 నుంచి సివిల్స్‌ పరీక్షలకు శిక్షణ పొందుతున్నానని, మొదటి ప్రయత్నంలోనే గ్రూప్‌-1 కొలువు సాధించినట్లు ఆమె వివరించారు.


డీటీ నుంచి పన్నులశాఖకు


సుండుపల్లి ఉప తహసీల్దారుగా పనిచేస్తున్న గజ్జల సురేంద్రరెడ్డి వాణిజ్య పన్నులశాఖ సహాయ కమిషనర్‌గా ఎంపికయ్యారు. వైయస్‌ఆర్‌ జిల్లా సిద్ధవటం మండలం, బొగ్గడివారిపల్లి గ్రామానికి చెందిన అమ్మనమ్మ, చిన్న వెంకటరెడ్డిల రెండో కుమారుడైన ఈయన ఎమ్మెస్సీ పూర్తి చేసి 2018లో గ్రూప్‌-2 విభాగంలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యారు. తాజాగా వాణిజ్యపన్నులశాఖ సహాయ కమిషనర్‌గా ఎంపిక కావడంపై తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.


ఎక్సైజ్‌ నుంచి సివిల్‌కుగోపవరం మండలం అడుసువారిపల్లెకు చెందిన పల్లెం చిన్న నరసింహులు, లక్షుమ్మ దంపతుల కుమారుడు శ్రీనివాసులు సివిల్‌ డీఎస్పీగా ఎంపికయ్యారు. బ్రాహ్మణపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు, బద్వేలులో ఇంటర్మీడియట్‌, నెల్లూరులో టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసి 2012లో మొదటి ప్రయత్నంలోనే జిల్లాలో మొదటి స్థానంలో నిలిచి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ప్రొద్దుటూరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ గ్రూపు-1పై ఆసక్తితో సొంతంగా సాధన చేసి మొదటి ప్రయత్నంలోనే ఎక్సైజ్ డీఎస్పీగా కొలువు సాధించారు. రెండో ప్రయత్నంలో సివిల్‌ డీఎస్పీ ఉద్యోగం సాధించారు. ఈ  సందర్భంగా ఆయనను కుటుంబసభ్యులు, గ్రామస్థులు అభినందించారు.


డీటీ అయ్యారు డీఎస్పీ

చాపాడు మండల డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తున్న తలుపుల భవానీ డీఎస్పీగా ఎంపికయ్యారు. ఈమె స్వగ్రామం అనంతపురం జిల్లా కదిరి పట్టణం. తల్లిదండ్రులు చెన్నకృష్ణ, తులసి. ప్రాథమిక విద్య నుంచి పదోతరగతి వరకు హిందూపురంలో చదువుకున్నారు. తిరుపతిలో బీటెక్‌ ఈఈఈ 84 శాతం మార్కులతో పూర్తిచేశారు. టీసీఎస్‌ కంపెనీ అహ్మదాబాద్‌లో కొన్నాళ్లపాటు ఇంజీనీరుగా పనిచేశారు. అనంతరం గుంటూరు వ్యవసాయశాఖ కమిషనరేట్‌లో జూనియర్‌ అసిస్టెంటుగా ఉద్యోగం సాధించి కొంత కాలం పనిచేశారు. 2018లో గూపు-2 సాధించి డిప్యూటీ తహసీల్దారుగా 2021, ఫిబ్రవరిలో చాపాడులో విధులు చేపట్టారు. ఆర్టీపీపీలో ఏఈగా పనిచేస్తున్న విశ్వనాథ్‌తో వివాహమైంది. గ్రూపు-1 పరీక్ష కోసం ఎలాంటి శిక్షణ తీసుకోకుండా మూడు నెలలపాటు సెలవుపై వెళ్లి చదివినట్లు చెప్పారు. అనుకున్న లక్ష్యం నెరవేరిందని, పోలీసు అధికారిణిగా పరిపూర్ణ సేవలందిస్తానని ఆమె వివరించారు.సాఫ్ట్‌వేర్‌ వీడి.. లాఠీ పట్టి

బద్వేలు పట్టణానికి చెందిన ప్రియారెడ్డి డీఎస్పీగా ఎంపికయ్యారు. 2016లో ఈమె రాజంపేట అన్నమాచార్య కళాశాలలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఏడాదిపాటు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేసి అనంతరం మానేసి గ్రూప్‌-1 పరీక్షలకు చదువుతూ కొలువు సాధించారు. తన భార్య డీఎస్పీ కావడం చాలా సంతోషంగా ఉందని భర్త మణికాంత్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈమె విజయం సాధించడంపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.


విజయంలో తనదైన ముద్ర

నందలూరు మండలం గొల్లపల్లికి చెందిన గొబ్బిళ్ళ శ్రీకృష్ణవాత్సవ్‌ జిల్లా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రార్‌గా ఎంపికయ్యారు. గొబిళ్ళ సుజాతమ్మ, శంకరయ్య దంపతుల రెండో సంతానమైన ఈయన నందలూరులోని గొబ్బిల్ల శంకరయ్య మెమోరియల్‌ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు. జేఎన్టీయూ అనంతపురంలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఆయన సోదరి గొబ్బిళ్ల విద్యాధరి 2021లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె నెల్లూరు జిల్లాలో శిక్షణ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.


డీఎస్పీగా న్యాయ విద్యార్థి


 కడప నగరంలోని సాయిపేటకు చెందిన అష్రఫ్‌ డీఎస్పీగా ఎంపికయ్యారు. ఈయన తండ్రి హైదర్‌వలీ విశ్రాంత ఉపాధ్యాయుడు కాగా, తల్లి కుర్సిద్‌బేగం చిన్నమాచుపల్లె జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. అష్రఫ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ శిక్షణ సంస్థలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ, మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య చివరి సంవత్సరం చదువుతున్నారు. అంతకుముందు డిగ్రీ పూర్తయ్యాక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా కొంతకాలం పనిచేశారు. అనంతరం ఐడీబీఐలో సహాయ మేనేజరుగా పనిచేసి  2017లో మానేశారు. అప్పటి నుంచి గ్రూప్‌-1 లో ర్యాంకు సాధించడమే లక్ష్యంగా పరీక్షలకు సిద్ధమయ్యారు. ప్రణాళికతో చదివి డీఎస్పీ పోస్టు సాధించానని అష్రఫ్‌ ఆనందం వ్యక్తం చేశారు.

Posted Date : 18-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌