• facebook
  • whatsapp
  • telegram

రెండు పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి?

ఏకకాలంలో గ్రూప్‌ 1, గ్రూప్‌ 2 ప్రిపరేషన్‌ సూచనలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 110 గ్రూప్‌-1, 182 గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి అనుమతించింది. ఫలితంగా ఏపీపీఎస్సీ తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పోస్టుల సంఖ్య తక్కువగానే ఉన్నందువల్ల మరింత పోటీతత్వాన్ని అభ్యర్థులు అలవర్చుకుంటేనే ఆశించిన లక్ష్యాన్ని పొందే పరిస్థితి ఏర్పడింది. 

ఈ రెండు పరీక్షలకు సంబంధించిన వాస్తవ క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అర్థం చేసుకుని అందుకు తగిన స్థాయిలో అభ్యర్థులు సిద్ధపడాల్సి ఉంటుంది. ఆ పరిస్థితులు ఏమిటో పరిశీలిద్దాం.

ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థుల పరిస్థితి?

జూనియర్‌ అసిస్టెంట్స్, ఎండోమెంట్‌ ఆఫీసర్స్, అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్స్‌ మొదలైన పోటీపరీక్షలకు గత మూడు నెలలుగా సిద్ధమవుతున్న అభ్యర్థుల సంఖ్య భారీగానే ఉంది. అయితే ఆయా ఉద్యోగాల కంటే గ్రూప్‌-1, 2 లలో జీతం మాత్రమే కాదు కెరియర్‌ కూడా కచ్చితంగా మెరుగైనదిగా ఉంది. అందువల్ల గ్రూప్‌- 1, 2లను రాయాలని పెద్ద సంఖ్యలో ఆలోచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయం కాదు. ఇప్పటికే వచ్చిన నోటిఫికేషన్ల పరీక్షలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత సమయం ఉంటే మాత్రమే ఇప్పుడు రాబోయే రెండు నోటిఫికేషన్లపై దృష్టి సారించాలి.

రెండేళ్ల క్రితం జరిగిన ఒక ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. గ్రామ సచివాలయ ఉద్యోగాలను చాలామంది చిన్నచూపుతో నిర్లక్ష్యం చేశారు. క్యాలెండర్‌ వచ్చేస్తుంది, గ్రూప్‌ 1, 2లలో ఏదో ఒకదాన్ని కొట్టేద్దాం అనే దృఢ నిశ్చయంతో ఆ పరీక్షలు వదిలేశారు. అప్పుడు చాలామంది అభ్యర్థులు ఆ నిర్ణయం వల్ల బాగా నష్టపోయారు. కారణం- దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తక్కువ సంఖ్యతో ఆ నోటిఫికేషన్లు వెలువడనుండటమే.

అదే పరిస్థితిని అన్వయించుకోండి. ముఖ్యంగా నిరుద్యోగులు ఏదో ఒక ఉద్యోగం పొందిన తర్వాత పెద్ద ఉద్యోగాల కోసం ప్రయత్నించటం తెలివైన నిర్ణయం. కాబట్టి ఇప్పటికే తయారవుతున్న ఉద్యోగ పరీక్షలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా వాటిని పూర్తి చేయండి. లభించే సమయాన్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవచ్చు.

పోటీ తీవ్రత చాలా ఎక్కువ

గ్రూప్స్‌లో పోస్టుల సంఖ్య చాలా పరిమితం అని చెప్పవచ్చు. రోస్టర్‌ వివరాలు పూర్తిగా తెలిస్తేనే గ్రూప్‌ 1లో ఏ కేటగిరికి ఎన్ని ఉద్యోగాలు వస్తాయో అర్థమవుతుంది. దానిని బట్టి విజయావకాశాలు ఎలా ఉంటాయో కూడా అర్థమవుతుంది. వెరసి రెండు నోటిఫికేషన్లకు సిద్ధమయ్యే అభ్యర్థుల్లో పోటీ తీవ్రంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. గ్రూప్‌ 1, 2 ల కోసమే గత నాలుగైదు సంవత్సరాలుగా ఎదురుచూస్తూ ప్రిపేరవుతున్న అభ్యర్థుల సంఖ్య వేలల్లోనే ఉంది. టీచర్, ఎస్‌ఐ ఉద్యోగాల నోటిఫికేషన్‌పై స్పష్టత రాలేదు కాబట్టి  ఆయా పరీక్షలకు తయారవ్వాలనుకునే అభ్యర్థులూ ఒక ప్రయత్నం చేద్దాంలే అని ఈ నోటిఫికేషన్లకు పోటీ పడే అవకాశం ఉంది. పోటీ తీవ్రంగానే ఉండబోతోంది.

రెండింటికీ సిద్ధపడటం మంచిదేనా?

చాలామంది అభ్యర్థులు గ్రూప్‌ 1, 2 రెండు పరీక్షలూ రాయాలనుకుంటారు. ఎంపికయ్యే అవకాశాలను పెంచుకోవాలనుకుంటారు. అది సరైన ఆలోచన కూడా. అయితే ప్రస్తుతం ప్రకటించిన పోస్టుల సంఖ్యను బట్టి జోడు గుర్రాల స్వారీ అంత సమర్థనీయం కాకపోవచ్చు. ప్రధానంగా గ్రూప్‌-2 ఆబ్జెక్టివ్‌ పరీక్ష, గ్రూప్‌-1 డిస్క్రిప్టివ్‌ పరీక్ష. ఈ రెండు పరీక్షలకూ అవసరమయ్యే నైపుణ్యాలను ఒకేసారి వినియోగించాలనుకోవటం రెండు చేతులతో ఒకేసారి బాణాలు వేయాలనేంత సాహసంతో కూడినది. అందువల్ల పరీక్షల తేదీల స్పష్టత వచ్చేంతవరకూ ఏదో ఒక పరీక్షను నిర్దిష్టంగా ఎంపిక చేసుకుని కృషి చేయటం హేతుబద్ధం.

టీచర్, ఎస్‌ఐ నోటిఫికేషన్లు వస్తాయా? రావా?

పోటీ పరీక్షల కోసం సీరియస్‌గా ఎదురుచూస్తున్న మొత్తం నిరుద్యోగుల్లో దాదాపు 50% మంది ఈ రెండు పరీక్షల కోసం ఎదురు చూస్తారనటంలో సందేహం లేదు. ప్రభుత్వం నుంచి సమాచారం సరిగా అందకపోవడంతో ఆ రెండు నోటిఫికేషన్లు వస్తాయా లేవా అనే గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. అటువంటి స్థితిలో ప్రస్తుత పరీక్షలకు ఎంతవరకు స్పందించవచ్చు అనే సందిగ్ధత ఈ అభ్యర్థుల్లో పెద్దఎత్తున ఉంది.

రెండు నోటిఫికేషన్లలోనూ ఉద్యోగాల సంఖ్య పరిమితంగా ఉన్నందువల్ల సందిగ్ధతను వదిలి ఆయా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ బలంగా ప్రిపేరవటమే సరైన నిర్ణయం అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం ‘ప్రస్తుత సంవత్సరంలో ఇవ్వలేం’ అని స్పష్టంగా తెలియజేస్తే ఈ పరీక్షలపై దృష్టి పెట్టవచ్చు.

గ్రాడ్యుయేషన్‌ ఫైనల్‌ సెమిస్టర్‌లో ఉన్నవారు ఈ పరీక్షలకు అర్హులు కారు. నోటిఫికేషన్లో పేర్కొనే తేదీ నాటికి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైనవారు మాత్రమే అర్హులు అవుతారు. ఆఖరి సంవత్సరం చివరి సెమ్‌ చదువుతున్న చాలామంది అభ్యర్థులు ఈ పరీక్షలపై పెద్ద ఆశలు పెట్టుకోకుండా గ్రాడ్యుయేషన్‌ సంబంధిత అంశాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. 

గ్రాడ్యుయేషన్‌లో కంపార్ట్‌మెంట్‌లో పాసైనా సరిపోతారు. ఫస్ట్‌ క్లాస్‌ వంటి నిబంధనలు ఏమీ లేవు. గ్రాడ్యుయేషన్‌ మార్కులకూ ఈ పరీక్ష అంతిమ ఎంపికకూ ఎటువంటి సంబంధం లేదు. గ్రాడ్యుయేషన్‌లో ఏ మాధ్యమంలో చదివినా ఈ పరీక్షలను ఇష్టమైన భాషలో రాసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్‌ ఇతర రాష్ట్రాల్లో పొందినా, డిస్టెన్స్, ఓపెన్‌ యూనివర్సిటీ, కరస్పాండెన్స్‌ ద్వారా గ్రాడ్యుయేషన్‌ పొందినా కూడా అర్హులే. ఏ గ్రాడ్యుయేషన్‌తో అయినా అర్హులే.

ఎంత సమయాన్ని కేటాయించగలిగితే తాజా అభ్యర్థులు పోటీ పడవచ్చు?

గ్రూప్‌-1, 2 పరీక్షల్లో ఉమ్మడిగా ఉండే జనరల్‌ స్టడీస్‌ విభాగాలపై ఆబ్జెక్టివ్‌ ధోరణిలో పట్టు సాధించేందుకు ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు చదివితే మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది.

గ్రూప్‌-2లో మిగతా రెండు పేపర్లపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు రోజుకు మరో ఎనిమిది గంటలు చదివితే కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది. అంటే గ్రూప్‌-2 అభ్యర్థి రోజుకి పదహారు గంటల చొప్పున పూర్తి శక్తియుక్తుల్ని ఉపయోగించుకుని చదివితే నాలుగు నెలల్లో పరీక్షలు ఎదుర్కోగలమనే ఆత్మవిశ్వాసాన్ని గట్టిగా పొందవచ్చు. అభ్యర్థులకు ఉండే గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మొదలైన అంశాలవల్ల ఈ కాల వ్యవధి తగ్గవచ్చు పెరగవచ్చు.

ఇక గ్రూప్‌-1 పరీక్షలో ప్రధాన పరీక్షలోని ఐదు పేపర్‌లపైనా, భాషా పేపర్లపైనా పట్టు సాధించటం అవసరం. కొన్ని మెలకువలు ఉపయోగిస్తే ఇందుకు ఆరు నెలల సమయం సరిపోతుంది. మొత్తం సిలబస్‌ చదవకుండా ప్రతి చాప్టర్లో కొన్ని అంశాలను ఎంపిక చేసుకుని చదవటం, ఎంపిక చేసుకున్నవి ప్రశ్నల రూపంలో చదవటం మొదలైన మెలకువలు తక్కువ సమయంలో పట్టు సాధించేందుకు ఉపయోగపడుతాయి. నోటిఫికేషన్లు విడుదల అయ్యాక వివిధ దశల పరీక్షల తేదీలను స్పష్టం చేశాక ఇచ్చే సమయాన్ని బట్టి ప్రిపరేషన్‌ విధానాన్ని మార్చుకుంటూ అభ్యర్థులు వెళ్లాలి.
 

*********************************************************************************

 

సెక్షన్-ఎ: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
 

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు

2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు

3. జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు

4. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర

5. భారత రాజకీయ వ్యవస్థ, పాలన: రాజ్యాంగ అంశాలు, ప్రభుత్వ విధానాలు, ఆంధ్రప్రదేశ్ను ఆధారంగా చేసుకొని తీసుకున్న సంస్కరణలు, ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలు

6. ఆంధ్రప్రదేశ్ దృష్ట్యా స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో ఆర్థికాభివృద్ధి

7. ఆంధ్రప్రదేశ్, భారత ఉపఖండం యొక్క భౌతిక భూగోళశాస్త్రం

8. విపత్తు నిర్వహణ: విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ సహాయంతో విపత్తు అంచనా

9. సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ

10. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ ప్రిటేషన్

11. డేటా అనాలిసిస్: ఎ) టాబ్యులేషన్ ఆఫ్ డేటా బి) విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా సి) బేసిక్ డేటా అనాలిసిస్ (అంకగణితం, మధ్యగణితం, బాహుళకం)

12. ఆంధ్రప్రదేశ్ విభజన, పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన సమస్యలు(విభజన సమస్యలు)


సెక్షన్-బి: జనరల్ ఇంగ్లిష్, తెలుగు

a) Comprehension

b) Usage and Idioms

c) Vocabulary and Punctuation

d) Logical re-arrangement of sentences

e) Grammar

ఎ) పర్యాయపదాలు, పదజాలం

బి) వ్యాకరణం

సి) తెలుగు పదాలకు ఇంగ్లిష్ అర్థాలు

డి) ఇంగ్లిష్ పదాలకు తెలుగు అర్థాలు

ఇ) పలుకుబడి/ వాడుక, నుడికారం/ జాతీయాలు


ఈ-బుక్స్


పాత ప్రశ్నప‌త్రాలు


నమూనా ప్రశ్నపత్రాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌