• facebook
  • whatsapp
  • telegram

విజయానికి వర్తమానం

కరెంట్‌ అఫైర్స్‌ మెలకువలు

గ్రూప్స్‌, సివిల్స్‌, ఇతర పోటీ పరీక్షల్లో వర్తమాన అంశాలకు ప్రాముఖ్యం ఏటా పెరుగుతోంది. ఇటీవల వీటి సరళి మారింది. సంపూర్ణమైన అవగాహన ఉంటేనే జవాబు గుర్తించగలిగేేలా ప్రశ్నలను లోతుగా అడుగుతున్నారు.‘ కరెంట్‌ అఫైర్సే కదా, పరీక్షలకు కొద్దిరోజుల ముందు చూసుకుంటే చాలు’ అని తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుంది. ఉద్యోగార్థులు ఈ విషయం గుర్తుంచుకుని, చదివే పద్ధతిలో మార్పు చేసుకోవాలి. అప్పుడే పోటీలో ముందు నిలిచి, విజయానికి పునాది వేసుకోగలుగుతారు!

పోటీ పరీక్షల్లో దేనికి హాజరవుతున్నా తప్పనిసరిగా కనిపించే అంశం- వర్తమాన వ్యవహారాలు. సబ్జెక్టు విస్తృతమైనప్పటికీ జనరల్‌ స్టడీస్‌లోని ఇతర సబ్జెక్టులతో కూడా ముడిపడి ఉన్న నేపథ్యంలో ఉత్సాహంతో అనుసంధాన పద్ధతిలో సన్నద్ధత కొనసాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దాదాపు అన్ని పరీక్షల సిలబస్‌లోనూ మొదట పేర్కొనే అంశం కరెంట్‌ అఫైర్సే. ‘జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న సంఘటనలు; వర్తమాన అంశాలు- జాతీయం, అంతర్జాతీయం, ప్రాంతీయం’ అంటూ సిలబస్‌లో కరెంట్‌ అఫైర్స్‌ని పేర్కొన్నారు. దీన్ని రెండు భాగాలుగా పేర్కొనడం ద్వారా ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లు చెప్పకనే చెప్పారు.

మనకు తెలిసి, మన కళ్ల ముందు జరుగుతున్న పరిణామాల కలయికే వర్తమాన వ్యవహారాలు. కాకపోతే జాతీయ, అంతర్జాతీయ, ప్రాధాన్యం ఉన్న సంఘటనలు కొంచెం లోతుగా ఉంటాయి. ఈ విభాగంపై అవగాహన పెంచుకోవాలంటే గతంలో జరిగిన పరిణామాలపై కూడా పట్టు అవసరం. సాధన చేస్తే ఈ స్థాయికి తేలిగ్గానే చేరుకోవచ్చు. ఈ విభాగంలో ఇటీవల జరిగిన ప్రముఖ సదస్సులు - సమావేశాలు, ప్రముఖుల విదేశీ పర్యటనలు, దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు - సహాయ సహకారాలు, అంతర్జాతీయ సంస్థలు, శాస్త్ర సాంకేతికరంగ విజయాలను భారత కేంద్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

ఇక వర్తమాన అంశాలు- జాతీయం, అంతర్జాతీయం, ప్రాంతీయం అనే విభాగం.. దీని గురించి అభ్యర్థులు పెద్దగా భయపడాల్సిందేమీ లేదు. సాధారణంగా ప్రతిరోజూ వార్తలను అనుసరించేవారికి ఈ విభాగంలో పట్టు ఉంటుందనే చెప్పాలి. వార్తల్లో వ్యక్తులు, ప్రదేశాలు, దేశ విదేశాల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రముఖ సంఘటనలు, క్రీడలు, అవార్డులు, ఇటీవల జరిగిన ఎన్నికలు, ఆర్థికంగా, రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, పథకాలు, మంత్రి వర్గాలు ఇలా అన్నింటిపై అవగాహన పెంచుకుంటే ఈ విభాగంలో మార్కుల సాధన నల్లేరుపై బండి నడకే.

సొంత నోట్సు ఉత్తమం
కరెంట్‌ అఫైర్స్‌ ప్రిపరేషన్‌లో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సొంతంగా నోట్స్‌ తయారుచేసుకోవడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. సమయం ఎక్కడ ఉంటుందనుకుంటున్నారా? అది మన చేతుల్లో పనే. రోజూ గంట సమయాన్ని దినపత్రికలు చదువుతూ ముఖ్యమైన విషయాలను నోట్స్‌ రూపంలో రాసుకోవడం అత్యుత్తమ ఫలితాలనిస్తుంది. దీనివల్ల గణాంకాలు, సమాచారాన్ని తప్పుగా రాసుకోవడం, అనవసరపు విషయాలను చదవడం లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. సబ్జెక్ట్‌పై ఆసక్తి పెరుగుతుంది. పునశ్చరణ త్వరగా పూర్తవుతుంది. దీంతోపాటు ప్రశ్నల సరళిపై కూడా అవగాహన రావచ్చు. గ్రూప్‌ 1 మెయిన్స్‌ పేపర్‌ 1 జనరల్‌ ఎస్సే విభాగానికి కూడా ఈ ప్రాక్టీస్‌ ఉపయుక్తంగా ఉంటుంది. సొంత నోట్సుతో పాటు యోజన, ఆంధ్రప్రదేశ్‌ లాంటి ప్రభుత్వ మ్యాగజీన్లను చదవాల్సి ఉంటుంది.

సిలబస్‌లోని కొన్ని విభాగాలతో కరెంట్‌ అఫైర్స్‌ ముడిపడి ఉండటం కూడా అభ్యర్థులకు అనుకూలిస్తుంది. శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆర్థిక రంగం, భారత రాజకీయ వ్యవస్థ, విపత్తు నిర్వహణ, పర్యావరణ అంశాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన అనే విభాగాలు వర్తమాన వ్యవహారాలతో సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి ఒక్క కరెంట్‌ అఫైర్స్‌ ప్రిపరేషన్‌తో జనరల్‌ స్టడీస్‌లోని కీలక విభాగాలపై కూడా కొంత పట్టు సాధించవచ్చు. కరెంట్‌ అఫైర్స్‌ను ఇది మన సబ్జెక్ట్‌ అని సొంతం చేసుకుని తయారైతే అన్ని విభాగాల్లో ప్లస్‌ అవుతుంది. స్థూలంగా అంతర్జాతీయం, జాతీయం, ప్రాంతీయం అంటూ చెప్పుకొనే కరెంట్‌ అఫైర్స్‌ను సూక్ష్మంగా చూస్తే రాష్ట్రీయం, ఆర్థిక రంగం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అవార్డులు, క్రీడలు, వార్తల్లో వ్యక్తులు, మరణాలు, నియామకాలు, కమిటీలు - కమిషన్లు, గ్రంథాలు - రచయితలు, సదస్సులు - సమావేశాలు, పర్యటనలు, నివేదికలు - సర్వేలు, దినోత్సవాలు, వార్తల్లో ప్రదేశాలు అనే ఉపవిభాగాలుగా అంతర్జాతీయం, జాతీయం, ప్రాంతీయం అనే అంశాలకు అన్వయించుకోవచ్చు.

ప్రశ్నల తీరు మారింది
ఇటీవల జరిగిన పరీక్షలను గమనిస్తే కరెంట్‌ అఫైర్స్‌ ప్రశ్నల సరళిలోనూ మార్పు వచ్చినట్లు స్పష్టమవుతోంది. గతంలో ప్రశ్నలను ఒక అంశానికి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం లేదా ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని కేంద్రంగా చేసుకుని అడిగేవారు. కానీ ఇటీవలి కాలంలో ఆ అంశానికి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం అభ్యర్థికి తెలిసి ఉంటేనే జవాబు గుర్తించగలిగేలా ప్రశ్నలను లోతుగా అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు ఒక అంశానికి సంబంధించి చదివేటప్పుడు ఆసాంతం దానిపై అవగాహన ఏర్పరచుకోవడం ఉత్తమం. ఒక అంశం వార్తల్లో వచ్చినప్పుడు అది పరీక్షలో ప్రశ్నగా మారే అవకాశం ఎంతవరకుందనేది గుర్తించగలగాలి. ఆ స్థాయికి చేరుకుంటే సమయం ఆదా అవుతుంది. దీనికి పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు. ఒక అంశాన్ని చదివేటప్పుడు ఆ అంశం ప్రభావం, దాని పరిధి, కాలమాన పరిస్థితుల్లో దాని నేపథ్యం లాంటివి ఒక్కసారి కూలంకషంగా పరిశీలిస్తే సరిపోతుంది.

పరీక్షకు వెళ్ళేవరకూ...
ప్రశ్నల కాలావధిపై కూడా అభ్యర్థులు ఓ కన్నేయాలి. గతంలో పరీక్షకు ముందు ఒక నెల వదిలిపెట్టి ప్రశ్నలు అడిగేవారు. పోటీ పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షకు ఒక వారం, పదిరోజుల ముందు జరిగిన సంఘటనలపై కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే కరెంట్‌ అఫైర్స్‌ సన్నద్ధత అనేది పరీక్షకు వెళ్లేవరకూ కొనసాగాలి. పరీక్షకు ముందు 6 నెలల నుంచి 8 నెలల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రశ్నల రూపంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఒక నాలుగైదు ప్రశ్నలు కాలావధితో సంబంధం లేకుండా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సంఘటనల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు చోటు చేసుకుంటాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ముఖ్యమైన చట్టాలు, దేశవిదేశాల్లో సంచలనం సృష్టించిన ఘటనలు, ఉగ్రవాద దాడులు, ముఖ్యమైన క్రీడా విశేషాలు, శాస్త్ర సాంకేతిక విజయాలు ఈ కోవకు చెందినవే. ఇలాంటివి అభ్యర్థి ఉద్యోగిగా మారే వరకూ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌