• facebook
  • whatsapp
  • telegram

ఉద్యోగ విధులకు తగ్గట్లు సిలబస్!

120 మార్కులకు తెలుగు ప్రశ్నపత్రం
డేటా అనాలసిస్ ప్రశ్నలు ప్రిలిమ్స్‌లో!
ఒకే విభాగానికి చెందిన ప్రశ్నలు ఒకేచోట!
గ్రూపు-2 ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఒకే సిలబస్
ఒకే అర్హతకు ఒకే సిలబస్‌తో ఉమ్మడి పరీక్ష
ఏపీపీఎస్సీ కసరత్తు!
 

ఉద్యోగ విధులకు తగినట్లు సిలబస్‌ను రూపొందించడంపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దృష్టిపెట్టింది. ముఖ్యంగా గ్రూపు-1 ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్) కింద రెండు రాత పరీక్షలను నిర్వహించబోతోంది. ప్రధాన పరీక్షలో ఆంగ్లంతోపాటు తెలుగు పరీక్షలోనూ అర్హత సాధిస్తేనే మిగిలిన జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అభ్యర్థులకు మరింత సులువుగా ఉండేందుకు గ్రూపు-1 ప్రధాన పరీక్షల సిలబస్‌లో ఎటువంటి మార్పులు చేయకుండానే ఒకే అంశానికి సంబంధించిన ప్రశ్నలను ఒకచోట మాత్రమే ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఒకే ఉద్యోగానికి రకరకాల అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వేర్వేరుగా కాకుండా ఒకే సిలబస్‌తో ఉమ్మడి పరీక్షను నిర్వహించాలని భావిస్తోంది. ఉదాహరణకు అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ కోర్సు పూర్తిచేసిన వారు అర్హులు. వీరికి వేర్వేరుగా కాకుండా ఉద్యోగానికి తగినట్లు ఒకే ఉమ్మడి పరీక్షను జరపబోతున్నారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇతర ఉద్యోగాల విషయంలోనూ ఇదేవిధానాన్ని అనుసరించనున్నారు.

గ్రూప్-1 ప్రాథమిక పరీక్షలో...
ఇప్పటిదాకా గ్రూపు-1కు ప్రాథమిక పరీక్ష కింద ఒక పేపరు ద్వారా 150 మార్కులకు నిర్వహిస్తున్నారు. ఇకపై 120 మార్కులకు జనరల్ స్టడీస్, 120 మార్కులకు జనరల్ ఆప్టిట్యూడ్‌లో పరీక్షను నిర్వహించనున్నారు. రెండు గంటల వ్యవధిలో ఈ పరీక్షలు విడివిడిగా జరుగుతాయి.
కొత్తగా నిర్వహించబోయే జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, సైకలాజికల్ ఎబిలిటీ, అంతర్జాతీయ సంబంధాలు, సామాజిక న్యాయం, రాజనీతిశాస్త్రం, జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ప్రణాళిక అమలు, జాగ్రఫి ప్రశ్నలు ఉండబోతున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కూడా ప్రశ్నలు ఇవ్వనున్నారు.
ఇప్పటివరకు ప్రాథమిక పరీక్ష ద్వారా ప్రధాన పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తుండగా ఇకపై 1:12 నుంచి 1:15 నిష్పత్తిలో సామాజిక వర్గాల వారీగా సమతుల్యతను అనుసరిస్తూ ఎంపికచేయనున్నారు. దీనికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో..
ప్రస్తుతం గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో ఐదు పరీక్షలను వ్యాస రూపంలో నిర్వహిస్తున్నారు. ఆంగ్లంలో 150 మార్కులకు మూడు గంటల వ్యవధిలో పరీక్ష ఉంటోంది. ఇకపై తెలుగులోనూ, ఆంగ్లంలోనూ మూడేసి గంటల వ్యవధిలో 120 మార్కుల చొప్పున పరీక్ష ఉంటుంది. ఈ రెండు పరీక్షల్లో అభ్యర్థులు అర్హత సాధించడం తప్పనిసరి. తెలుగు పరీక్షలో... తెలుగును ఆంగ్లంలోకి అనువదించడం, వర్తమాన అంశాలపై రాయడం, ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ గురించి రాయడం తదితర అంశాలపై ప్రశ్నలు ఇవ్వనున్నారు. ఈరెండు పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోరు. అర్హత పరీక్షలగానే వీటిని పరిగణిస్తారు.
గ్రూపు-1 ప్రధాన పరీక్షల్లో గణితం నేపథ్యం ఉన్న వారు మిగిలిన వారి కంటే ముఖ్యంగా ఐదో పేపరు (డేటా అనాలసిస్)లో ముందంజలో ఉంటున్నారన్న ఓ అభిప్రాయం అభ్యర్థుల్లో ఉంది. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన ప్రశ్నలను కనీస స్థాయిలో ప్రిలిమ్స్‌లో ఇచ్చే విధంగా ప్రతిపాదించారు. అలాగే రాజనీతిశాస్త్రం, రాజ్యాంగం, పరిపాలన, న్యాయరంగం, విలువలు వంటి రంగాలకు చెందిన అంశాలు సిలబస్‌లోనే వేర్వేరుచోట్ల ఉన్నాయి. వీటిని ఒకే పేపరు కింద నిర్వహించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. అలాగే... హిస్టరీ, జాగ్రఫీ విషయంలోనూ ఇటువంటి ప్రతిపాదనలే ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద జనరల్ సైన్స్, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్, బయోటెక్నాలజీ, మానవ రోగాల వంటి అంశాలన్నీ ఒకేచోట ఉంటాయని కమిషన్ సభ్యులు జి.రంగజనార్థన వెల్లడించారు. దీనిపై ఇంకా అధికారిక నిర్ణయం జరగాల్సి ఉందని పేర్కొన్నారు.

సూచనల కోసం వెబ్‌సైట్‌లో పాఠ్య ప్రణాళిక!
గ్రూపు-2 కింద ఇప్పటివరకు ప్రాథమిక పరీక్షకు ఒక సిలబస్, ప్రధాన పరీక్షకు మరో సిలబస్ అమల్లో ఉంది. ఇకపై ఈ రెండు పరీక్షలకు ఒకే సిలబస్ విధానాన్ని తీసుకువచ్చేందుకు ఎపీపీఎస్సీలో సమాలోచనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రీయ, ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన నిష్ణాతులైన ఆచార్యులతో ప్రాథమికంగా తయారుచేయించిన పాఠ్య ప్రణాళికను వెబ్‌సైట్‌లో పెట్టి అన్ని వర్గాల వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్ధమవుతోంది. ఉద్యోగ శైలికి అనుగుణంగా సిలబస్ ఉంచేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఉదయ్‌భాస్కర్ తెలిపారు.

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌