• facebook
  • whatsapp
  • telegram

శిక్ష‌ణ లేదు సొంత నోట్స్‌తో సాధించా!

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 టాప‌ర్ ప్రిప‌రేష‌న్ వ్యూహం

గ్రూప్‌-1 టాపర్‌ రాణి సుస్మిత బీఎస్‌సీ బయో టెక్నాలజీ, ఆపై హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ, పీహెచ్‌డీ చేసిన రాణి సుస్మిత ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ఫలితాల్లో టాప్‌ ర్యాంకు సాధించారు. ఈమె స్వస్థలం కాకినాడ జిల్లా పిఠాపురం. తాను సివిల్స్‌ కోసం చేసిన సన్నద్ధత, ఎన్‌సీఈఆర్‌టీ, రాష్ట్ర పాఠ్య పుస్తకాలు, స్వయంగా తయారుచేసుకున్న నోట్సు విజయానికి దోహదం చేశాయని ఆమె అంటున్నారు.  


ప్రిపరేషన్‌ ఎలా సాగిందో తన మాటల్లోనే..... 


2018 డిసెంబరులో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచీ క్రమం తప్పకుండా ‘వర్కింగ్‌ డేస్‌’లో రోజుకు 4 గంటలూ, ‘వీక్‌ డేస్‌’లో 8- 10 గంటల వరకు సన్నద్ధమయ్యా. మౌఖిక పరీక్షకు ముందు డాఫ్‌ (డిటైల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌)లో నమోదుచేసిన పూర్తి వివరాలకు అనుగుణంగా బోర్డులోని సభ్యులు ప్రశ్నలు అడిగారు. వాటికి స్పష్టంగా సమాధానం చెప్పా. అందువల్లనేమో...డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు ఎంపికైనవారిలో తొలిస్థానాన్ని దక్కించుకున్నా! 


నేనెక్కడా ప్రత్యేకంగా శిక్షణ పొందలేదు. తొలి ప్రయత్నంలోనే ఈ విజయం వరించింది. 


పిఠాపురంలో పదో తరగతి వరకు చదివా. బీఎస్సీ (బయో టెక్నాలజీ), ఎంబీఏ (హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) పూర్తిచేశా. హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌లోనే పీహెచ్‌డీ కూడా చేశాను. బెంగుళూరులో బిజినెస్‌ స్కూలుకు ప్రిన్సిపల్‌గా వ్యవహరించా. ఇటీవల హైదరాబాదులోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరా. హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌పై రాసిన సుమారు 15 పరిశోధన పత్రాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. ‘సర్వీస్‌ క్వాలిటీ ఇన్‌ ఇండియన్‌ హాస్పిటల్స్‌ పర్‌స్పెక్టివ్‌ ఫ్రమ్‌ యాన్‌ ఎమర్జెంగ్‌ మార్కెట్‌’ పేరుతో రాసిన పుస్తకం యూకే పబ్లికేషన్‌లో ప్రచురితమైంది. 


2018 ముందు సివిల్స్‌ మూడుసార్లు రాశా. తొలి ప్రయత్నంలో మెయిన్స్‌ వరకు వెళ్లలేదు. మిగిలిన రెండుసార్లూ మెయిన్స్‌ వరకు వచ్చాను. ఇంటర్వ్యూ వరకు ఎందుకు వెళ్లలేకపోయానంటే... కుటుంబ బాధ్యతలు పెరిగాయి. ఉద్యోగం చేస్తూ గృహిణిగా ఉంటుండడంవల్ల పూర్తిస్థాయిలో సన్నద్ధతకు తగిన సమయాన్ని కేటాయించలేదు. అదీకాకుండా రోడ్డు ప్రమాదంలో కాళ్లు బాగా దెబ్బతినడం, నెలలపాటు మంచానికి పరిమితం కావడం లాంటి కారణాలు సివిల్స్‌ సన్నద్ధతకు అవరోధంగా మారాయి. 


‘ఈనాడు’ ఎడిటోరియల్స్‌ 


సివిల్స్‌లో రాణించేందుకు చేసిన సన్నద్ధత గ్రూపు-1కు బాగా ఉపయోగపడింది. దరఖాస్తు చేసినప్పటి నుంచి గ్రూప్‌-1 ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టా. ఎన్‌సీఈఆర్‌టీ, రాష్ట్ర పాఠ్యపుస్తకాల (6 నుంచి 12 తరగతులు) ద్వారా జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇతర అంశాలపై పట్టుసాధించా. వర్తమాన అంశాలపై అవగాహనకు ‘ఈనాడు’ ఎడిటోరియల్స్‌ బాగా ఉపయోగపడ్డాయి. అలాగే ‘ప్రతిభ’ పేజీలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై ఇచ్చిన బిట్లకు జవాబులు గుర్తించడం.. నా సామర్థ్యం ఏమిటో గ్రహించేందుకు ఉపయోగపడింది. ప్రత్యేక శిక్షణ లేనందున అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నా. జనరల్‌ ఎస్సే, హిస్టరీ, జాగ్రఫీ‡, ఎథిక్స్‌ సబ్జెక్టుల కోసం తెలుగు అకాడమీ రూపొందించిన డిగ్రీ స్థాయి పుస్తకాలపై ఆధారపడ్డా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సర్వేలపై పట్టు సాధించా. ఇండియన్‌ జాగ్రఫీ కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు బాగా ఉపయోగపడ్డాయి. నేను పరిశోధన రంగంలో ఉన్నందున క్లుప్తంగా రాసుకున్న నోట్సు వివరణాత్మకంగా జవాబులు రాసేందుకు ఉపయోగపడింది. 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్లు  


వర్తమాన అంశాల సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్లు బాగా ఉపయోగపడ్డాయి. వైద్యం, విద్య, ఇతర శాఖల వెబ్‌సైట్లలో ఉండే అధికారిక సమాచారం, పుస్తకాల్లో ఉండే సమాచారం.. వివిధ అంశాలపై పూర్తి స్థాయి పరిజ్ఞానం వచ్చేందుకు ఉపయోగపడ్డాయి. మనం ఏ కొత్త విషయాన్ని తెలుసుకున్నా...దాన్ని పుస్తకాల్లో కేటగిరిల వారీగా రాసుకుంటే....ఫాలోఅప్‌ చేసేందుకూ, వరుస క్రమంలో జరిగే పరిణామాలు సమగ్రంగా గ్రహించేందుకు బాగా ఉపయోగపడుతుంది. 

‘డాఫ్‌’పై ప్రశ్నల పరంపర

గ్రూపు-1 మౌఖిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ‘మాక్‌్’ ఇంటర్వ్యూలకు మాత్రం హాజరయ్యాను. ఇదే సమయంలో గ్రూపు-1 టాపర్‌ సలహాలు, సూచనలు తీసుకున్నా. 


మౌఖిక పరీక్షల (ఇంటర్వ్యూ) నిర్వహణకు కొద్దిరోజుల ముందు డీటెయిల్డ్‌  అప్లికేషన్‌ ఫామ్‌ (డాఫ్‌) ద్వారా వ్యక్తిగత, అర్హత, అభిరుచుల వివరాలను  ఏపీపీఎస్సీ అడిగింది. మూడు పేజీల్లో అడిగిన వివరాలకు స్వయంగా రాసిచ్చిన సమాధానాలపైనే ప్రశ్నలు వచ్చాయి. సెంట్రల్‌ యూనివర్శిటీ, రాష్ట్ర యూనివర్శిటీల మధ్య ఉన్న వ్యత్యాసం, సుకన్య సమృద్ధి యోజన, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాధాన్యం.. వీటితో పాటు ‘పీహెచ్‌డీ చేసి, ఇటువైపు ఎందుకొచ్చారు?’ అన్న ప్రశ్నలు నాకు ఎదురయ్యాయి. 


సామాజిక రంగంలో నేను చేసిన కృషి గురించి ‘డాఫ్‌’లో నమోదుచేస్తే దానిపైనా ప్రశ్నలు వచ్చాయి. దరఖాస్తులోని ప్రశ్నలే చాలా ట్రికీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక ఉదాహరణ వివరించమంటే నేను రెండు, మూడింటి గురించి రాశా. ఇంటర్వ్యూలో వ్యక్తిగత అంశాలు, నాయకత్వ లక్షణాలే కాకుండా చురుకుదనం లాంటి అంశాల్లో సామర్థ్యాన్ని గమనించారు. 

ప్రత్యేక శిక్షణ లేనందున అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నా. జనరల్‌ ఎస్సే, హిస్టరీ, జాగ్రఫీ, ఎథిక్స్‌ సబ్జెక్టుల కోసం తెలుగు అకాడమీ రూపొందించిన డిగ్రీ స్థాయి పుస్తకాలపై ఆధారపడ్డా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సర్వేలపై పట్టు సాధించా. 

    - ఇట్టా సాంబశివరావు, ఈనాడు, అమరావతి 

Posted Date : 15-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌