• facebook
  • whatsapp
  • telegram

తాత్వికత.. విశిష్టత.. ఆలయ వ్యవస్థ ప్రత్యేకత 

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దేవాదాయ శాఖ విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-3 పోస్టుల (60) భర్తీకి ఇటీవల ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు సంబంధిత నియామక పరీక్షకు ఎలా సిద్ధం కావాలి? ఏయే మెలకువలు పాటించాలి? తెలుసుకుందాం!  

అభ్యర్థులు హైందవ తాత్వికత - ఆలయ వ్యవస్థ (హిందూ ఫిలాసఫీ - టెంపుల్‌ సిస్టమ్‌) అనే పేపర్‌ను క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేయాలి. దీంట్లోని సిలబస్‌ను పన్నెండు అధ్యాయాలుగా విభజించారు. ఈ అధ్యాయాల్లో అభ్యర్థులకు భారతీయ సంస్కృతి మీద ఉన్న అవగాహనను పరీక్షించే అంశాలున్నాయి.  భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. విభిన్న భాషలు, మతాలు, ప్రాంతాలు ఉన్నప్పటికీ ఈ అన్నింటినీ అంతస్సూత్రంగా కలిపే గొప్ప గుణం భారతీయ సంస్కృతికి ఉంది.

వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, సర్వోపనిషత్‌ సారభూతమైన భగవద్గీత.. ఇవన్నీ భారతీయ సాంస్కృతిక ఔన్నత్యానికి ప్రతీకలు. ఈ అద్భుత గ్రంథాలు భారతీయ సనాతన సంప్రదాయాలనూ, సంస్కృతినీ నిరంతరం పరిరక్షించుకుంటూ, మానవ జీవన వికాసానికి ఆలంబనగా ఉపయోగపడుతున్నాయి. హైందవ తత్వశాస్త్రం ఈ జ్ఞానాన్నంతా తనలో నిక్షిప్తం చేసుకుంది. ఇలా నిక్షిప్తమైన హైందవ తాత్వికతా పరిరక్షణ ఆలయ వ్యవస్థ రూపంలో జరుగుతోంది. ఈ ఆలయాలు భారతీయుల అసలుసిసలైన సాంస్కృతిక నిలయాలుగా పరిఢవిల్లుతున్నాయి. 

సిలబస్‌ను అధ్యాయాల వారీగా పరిశీలిద్దాం...

మొదటి అధ్యాయం: రామాయణానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం ఉంటుంది. ఈ కావ్యంలోని వివిధ పాత్రల వ్యక్తిత్వ ఔన్నత్యాల పరిశీలన ఇక్కడ ప్రధాన విషయం. రామాయణ రచనా కాలంలోని వివిధ ప్రాంతాల పరిశీలన కూడా చాలా అవసరం. రామాయణంలో ప్రస్తావనకు వచ్చిన వివిధ రాజవంశాల మీద అభ్యర్థులు స్థూల అవగాహనతో ఉండాలి.

రెండో అధ్యాయం: మహాభారతానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం. ఈ ఇతిహాసంలోని వివిధ పాత్రల పరిశీలన చాలా ముఖ్యం. ఈ గ్రంథంలో కౌరవ, పాండవ రాజ వంశాలతోపాటు, వివిధ రాజవంశీయుల ప్రస్తావన ఉంటుంది. భారత రచనాకాలం నాటి సమకాలీన రాజవంశాల మీద కూడా అభ్యర్థులు సమగ్ర అవగాహనతో ఉండాలి. అంతేకాదు, మహాభారతంలో ప్రస్తావనకు వచ్చిన స్థలాలపై అవగాహన పెంచుకోవాలి. 

మూడో అధ్యాయం: భాగవతానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం దీనిలో ఉంటుంది. ఈ గ్రంథంలోని వివిధ భగవద్భక్తుల కథలను పరిశీలించడం అవసరం. అంతేకాదు, భాగవతంలో ప్రస్తావనకు వచ్చే వివిధ ప్రాంతాలపై అవగాహనతో ఉండాలి. 

నాలుగో అధ్యాయం: హైందవ పురాణాల మీద అవగాహనను పెంపొందించే గ్రంథాలను పరిశీలించాల్సి ఉంటుంది. హైందవ పురాణాల్లో ప్రస్తావనకు వచ్చే ప్రముఖ స్థలాల పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. 

అయిదో అధ్యాయం: హైందవ ధర్మశాస్త్రంలోని వివిధ ఆగమ శాస్త్రాల మీద అవగాహన పెంచుకోవాలి. వైష్ణవ మతంలోని వైఖానస, పాంచరాత్ర, శైవమతంలోని స్మార్తం, ఆదిశైవం, వీరశైవం లాంటివి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. మాతృదేవతకు సంబంధించిన శాక్తేయం గురించి లోతుగా తెలుసుకోవాలి. 

ఆరో అధ్యాయం: హైందవ పండుగలు, వాటి ప్రాముఖ్యం మీద అధ్యయనం చేయాలి. భారతదేశంలోని వివిధ కళారూపాలు, వాటి పుట్టుక మీద అవగాహన పెంపొందించుకోవాలి. 

ఏడో అధ్యాయం: హైందవ మతంలోని వివిధ సిద్ధాంతాల వైవిధ్యాన్ని గురించి అధ్యయనం చేయాలి. అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతాద్వైతం, వీరశైవం లాంటివి లోతుగా పరిశీలించాలి. ఆయా సిద్ధాంతాలను ప్రతిపాదించిన మతాచార్యుల మీద అవగాహన అవసరం. 

ఎనిమిదో అధ్యాయం: వైదిక సంస్కృతి మీద లోతైౖన అవగాహన పెంపొందించుకోవాలి.  

తొమ్మిదో అధ్యాయం: హైందవ కుటుంబ వ్యవస్థ మీద అవగాహన పెంచుకోవాలి. 

పదో అధ్యాయం: దేవాలయాలకు సంబంధించిన ఆదాయాలపై, ధార్మిక సంస్థలపై పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. 

పదకొండో అధ్యాయం: దేవాదాయ శాఖ కార్యనిర్వాహక అధికారుల బాధ్యతల మీద అవగాహనతో ఉండాలి.  

పన్నెండో అధ్యాయం: దేవాదాయ శాఖకు చెందిన భూములు, రికార్డులు, వాటి న్యాయపరమైన హక్కుల మీద అవగాహన అవసరం. 

వివిధ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఆయా గ్రంథాలను చదివి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు విషయ సేకరణ కోసం అవసరమైతే సంబంధిత నిపుణుల సలహాలను తీసుకోవటం మేలు. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు.. సమయపాలన, క్రమశిక్షణ, సిలబస్‌ మీద పరిపూర్ణ అవగాహన పెంపొందించుకోవడం, నిపుణులను సంప్రదించడం, అందుబాటులో ఉన్న మెటీరియల్‌ను సంపాదించుకోవడం, మోడల్‌ పేపర్‌కు అనుకూలమైన రీతిలో పరీక్షలకు సిద్ధంకావడం.. లాంటివి విస్మరించకూడదు. అభ్యర్థులు విజయపథంలో దూసుకెళ్లడానికి ఇవన్నీ ఎంతో తోడ్పడతాయి!
 

Posted Date : 06-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌