• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక భారతదేశ చరిత్ర - ఆంగ్లేయుల పాలన

ఐరోపా దేశాల వారు సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చారు. అనంతరం యుద్ధాలు, ఒప్పందాలు, దుష్పరిపాలన నెపంతో వలసవాదం, వాణిజ్య వాదం, సామ్రాజ్య వాదం; బిరుదులు, భరణాల రద్దు లాంటి పద్ధతుల ద్వారా దేశాన్ని ఆక్రమించారు. మూడు కర్ణాటక యుద్ధాల ద్వారా ఫ్రెంచివారి ప్రాబల్యాన్ని అంతం చేయడమే కాకుండా కర్ణాటక, హైదరాబాద్‌ రాజ్యాలపై ఆధిపత్యాన్ని సాధించారు. అనంతరం బెంగాల్‌ ఆక్రమణపై దృష్టి సారించారు.

ప్లాసీ యుద్ధం (1757)
ఆంగ్లేయుల రాజకీయ అధికారానికి, రాజ్యస్థాపనకు ప్లాసీ యుద్ధం పునాది వేసింది. దీనికి కారణం 1756 నాటి కలకత్తా చీకటి గది ఉదంతం. ఈ సంఘటన ద్వారా ఆంగ్లేయుల మరణానికి కారణమైన నాటి బెంగాల్‌ నవాబు సిరాజ్‌ ఉద్దౌలాతో 1757లో రాబర్ట్‌ క్లైవ్‌ ప్లాసీ యుద్ధం చేశాడు. సిరాజ్‌ ఉద్దౌలా సేనాని మీర్జాఫర్‌తో రాబర్ట్‌ క్లైవ్‌ రహస్య ఒప్పందాన్ని చేసుకున్నాడు. 1757 జూన్‌ 23న భాగీరథి నదీ తీరంలో జరిగిన ప్లాసీ యుద్ధంలో సిరాజ్‌ ఉద్దౌలాను చంపి, మీర్జాఫర్‌ను బెంగాల్‌ నవాబుగా నియమించాడు. ఫలితంగా మీర్జాఫర్‌ బెంగాల్‌లోని 24 పరగణాలను ఆంగ్లేయులకు ఇచ్చాడు.

బక్సార్‌ యుద్ధం (1764)
ప్లాసీ యుద్ధానంతరం 1760లో ఆంగ్లేయులు మీర్జాఫర్‌ను తొలగించి అతడి అల్లుడు మీర్‌ఖాసీంను బెంగాల్‌ నవాబుగా నియమించారు. మీర్‌ఖాసీం భారతీయ వర్తకులపై ఉన్న అధిక పన్నులను (కస్టమ్స్‌ పన్నులు) తగ్గించాడు. ఆంగ్ల వ్యాపారుల ఉచిత వ్యాపార లైసెన్సులు (దస్తక్‌లు) రద్దు చేశాడు. ఫలితంగా ఆంగ్లేయులు మీర్‌ఖాసీంను తొలగించి మళ్లీ మీర్జాఫర్‌ను నవాబుగా చేశారు. దాంతో మీర్‌ఖాసీం నాటి అయోధ్య నవాబు షుజా ఉద్దౌలా, మొఘల్‌ చక్రవర్తి రెండో షాఆలంతో త్రైపాక్షిక కూటమిని ఏర్పాటుచేసి 1764లో ఆంగ్లేయులతో బక్సార్‌ యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో ఓడిపోయిన భారతీయ పాలకులు 1765లో ఆంగ్లేయులతో అలహాబాద్‌ సంధి చేసుకున్నారు. ఈ సంధి ద్వారా బీహార్‌, బెంగాల్‌, ఒరిస్సాల్లో భూమిశిస్తు వసూలు చేసుకునే దివానీ అధికారాన్ని మొఘల్‌ చక్రవర్తి ఆంగ్లేయులకు ఇచ్చాడు. బక్సార్‌ యుద్ధం భారతదేశంలో ఆంగ్లేయుల ఆర్థిక అధికారానికి పునాది వేసింది. రాబర్ట్‌ క్లైవ్‌ బెంగాల్‌లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టాడు. దీని ద్వారా ఆంగ్లేయులు దివానీ అధికారాన్ని, బెంగాల్‌ నవాబు పరిపాలనా అధికారాన్ని (నిజామత్‌) పొందారు. కానీ ద్వంద్వ పాలన విఫలమవడంతో వారన్‌ హేస్టింగ్స్‌ దాన్ని రద్దు చేశాడు.

మైసూరు యుద్ధాలు
మైసూరు పాలకుడు హైదర్‌ అలీ, అతడి కుమారుడు టిప్పు సుల్తాన్‌ను ఆంగ్లేయులు మైసూరు యుద్ధాల్లో ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించారు. 1767 - 69 మధ్య జరిగిన మొదటి మైసూరు యుద్ధంలో ఆంగ్లేయులు ఓడిపోయి హైదర్‌ అలీతో మద్రాస్‌ సంధి (1769) చేసుకున్నారు. 1780-84 మధ్య జరిగిన రెండో మైసూరు యుద్ధంలో మొదటి హైదర్‌ అలీ యుద్ధం చేస్తూ 1782లో క్యాన్సర్‌ వ్యాధితో మరణించాడు. దీంతో టిప్పు సుల్తాన్‌ యుద్ధాన్ని కొనసాగించి 1784లో ఆంగ్లేయులను ఓడించి మంగుళూరు సంధి (1784) చేసుకున్నాడు. ఆ సమయంలో బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ వారన్‌ హేస్టింగ్స్‌. 1790 - 92 మధ్య మూడో మైసూరు యుద్ధం జరిగింది. నాటి బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ కారన్‌ వాలీస్‌ హైదరాబాద్‌ నిజాం, మహారాష్ట్రులతో కూటమిని ఏర్పాటుచేసి టిప్పు సుల్తాన్‌ను ఓడించి 1792లో శ్రీరంగపట్నం సంధి చేసుకున్నాడు. మైసూరు పులిగా పేరొందిన టిప్పు సుల్తాన్‌ తన రాజధాని శ్రీరంగపట్నంలో ఫ్రెంచి విప్లవానికి సూచికగా ట్రీ ఆఫ్‌ లిబర్టీ (స్వేచ్ఛా వృక్షం)ని నాటాడు. 1799లో నాలుగో మైసూరు యుద్ధం జరిగింది. నాటి బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వెల్లస్లీ టిప్పు సుల్తాన్‌ను వధించి మైసూరు రాజ్యాన్ని ఆక్రమించాడు. చిన్న స్వతంత్ర మైసూరు రాజ్యాన్ని ఏర్పాటుచేసి కృష్ణరాజ వడయార్‌ అనే బాలుడిని పాలకుడిగా నియమించి అతడితో వెల్లస్లీ సైన్య సహకార సంధిపై సంతకం చేయించాడు. సైన్య సహకార పద్ధతిలో చేరిన తొలి హిందూ పాలకుడు కృష్ణరాజ వడయార్‌.

మరాఠా యుద్ధాలు
ఛత్రపతి శివాజీ స్థాపించిన స్వరాజ్యం అతడి కుమారుడు శంభూజీ, మనుమడు షాహుల పాలనాకాలంలో బలహీనపడి పీష్వా (ప్రధానమంత్రి)ల ఆధిపత్యం ఏర్పడింది. మహారాష్ట్రుల మధ్య ఉన్న విభేదాలను ఆసరాగా చేసుకుని ఆంగ్లేయులు మూడు యుద్ధాలు చేసి రాజ్యాన్ని ఆక్రమించారు. 1775 - 82 మధ్య మొదటి ఆంగ్ల - మరాఠా యుద్ధం జరిగింది. మహారాష్ట్రులు నానా ఫడ్నవీస్‌ నాయకత్వంలో ఉన్న బారాభాయి కూటమిని ఓడించి 1782లో సాల్బేసంధి చేసుకుని సాల్‌సెట్టి, బేస్పిన్‌ ప్రాంతాలను పొందాడు. ఆ సమయంలో బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ వారన్‌ హేస్టింగ్స్‌. 1803 - 05 మధ్య రెండో ఆంగ్ల మరాఠా యుద్ధం జరిగింది. ఈ యుద్ధానికి కారణం పీష్వా రెండో బాజీరావు 1802లో సైన్య సహకార పద్ధతిలో చేరడం. ఆంగ్లేయులు యుద్ధంలో ఓడిపోయిన సింధియాతో సిర్జి అంజన్‌గావ్‌ సంధి, భాన్ల్సేతో దేవగాన్‌ సంధి చేసుకొని నాగపూర్‌లో మాన్‌స్టువర్ట్‌ ఎల్ఫిన్‌స్టన్‌ను, గ్వాలియర్‌లో జాన్‌మాల్కంను ఆంగ్ల రెసిడెంట్‌లుగా నియమించారు. ఆ సమయంలో బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వెల్లస్లీ. 1817-18 మధ్య మూడో ఆంగ్ల మరాఠా యుద్ధం జరిగింది. నాటి బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ మార్క్వస్‌ ఆఫ్‌ హెమ్మింగ్‌ హేస్టింగ్స్‌ మహారాష్ట్రులను పూర్తిగా ఓడించి వారి రాజ్యాన్ని ఆక్రమించడమే కాకుండా పీష్వా పదవిని రద్దు చేశాడు.

ఆంగ్లేయుల పాలన - ప్రభావాలు
భారతదేశాన్ని ఆక్రమించిన ఆంగ్లేయులు పాలనా సౌలభ్యం కోసం దేశాన్ని ప్రెసిడెన్సీలు, జిల్లాలు, తాలూకాలుగా విభజించారు. ప్రెసిడెన్సీలకు గవర్నర్‌లు, జిల్లాలకు కలెక్టర్లు, తాలూకాలకు తహసీ ల్దార్లను అధిపతులుగా నియమించారు. 1773 నాటి రెగ్యులేటింగ్‌ చట్టం ద్వారా బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ పదవిని ఏర్పాటుచేసి వారన్‌ హేస్టింగ్స్‌ను మొదటి బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా నియమించారు. 1774లో కలకత్తా కేంద్రంగా ఫెడరల్‌ కోర్టు (సుప్రీంకోర్టు) ఏర్పడింది. 1833 నాటి చార్టర్‌ చట్టం ద్వారా భారతదేశ గవర్నర్‌ జనరల్‌ పదవిని ఏర్పాటుచేసి విలియం బెంటింగ్‌ను తొలి భారతదేశ గవర్నర్‌ జనరల్‌గా నియమించారు. 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం ద్వారా వైస్రాయ్‌/రాజప్రతినిధి, భారత రాజ్య కార్యదర్శి పదవులను ఏర్పాటుచేశారు. లార్డ్‌ కానింగ్‌ను తొలి వైస్రాయ్‌గా, చార్లెస్‌ ఉడ్స్‌ను భారత రాజ్య కార్యదర్శిగా నియమించారు. (వాస్తవంగా లార్డ్‌ స్టాన్లీని తొలి భారతరాజ్య కార్యదర్శిగా నియమించారు.)

సిక్కు యుద్ధాలు రంజిత్‌ సింగ్‌
సిక్కు మతాన్ని గురునానక్‌ స్థాపించగా, స్వతంత్ర సిక్కు రాజ్యాన్ని రంజిత్‌ సింగ్‌ స్థాపించాడు. రంజిత్‌ సింగ్‌ అనంతరం అతడి కుమారుడు దిలీప్‌ సింగ్‌ కాలంలో ఆంగ్లేయులు రెండు సిక్కు యుద్ధాలు చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించారు. 1845 - 46 మధ్య జరిగిన మొదటి సిక్కు యుద్ధంలో ఆంగ్లేయులు సిక్కులను ఓడించి మొదట లాహోరు సంధి (1846), తర్వాత భైరోవల్‌ సంధిని చేసుకున్నారు. 1848 - 49 మధ్య జరిగిన రెండో సిక్కు యుద్ధంలో డల్హౌసీ సిక్కులను ఓడించి వారి రాజ్యాన్ని పూర్తిగా ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనం చేశాడు.


ఆంగ్లేయుల పాలనలో ఆంధ్రదేశం
ఆంధ్రదేశంలో ఉత్తర సర్కారులు, దత్త మండలాలు, నెల్లూరు - చిత్తూరు జిల్లాలు అనే మూడు విభాగాలు ఉండేవి. రెండో కర్ణాటక యుద్ధ సమయంలో హైదరాబాద్‌ నిజాం సలాబత్‌ జంగ్‌ ఉత్తర సర్కారులను 1754లో ఫ్రెంచి వారికి ఇచ్చాడు. ఫ్రెంచి అధికారి బుస్సీ ఉత్తర సర్కారుల పాలనా పర్యవేక్షణ సమయంలో విజయనగర, బొబ్బిలి జమీందారుల మధ్య 1757లో (జనవరి 24) బొబ్బిలి యుద్ధం జరిగింది. మూడో కర్ణాటక యుద్ధానంతరం సలాబత్‌ జంగ్‌ 1759లో ఉత్తర సర్కారులను ఆంగ్లేయుల పరం చేశాడు. ఫలితంగా ఆంధ్రదేశంలో ఆంగ్లపాలన ప్రారంభమైంది. ఉత్తర సర్కారులపై ఆంగ్లేయులు పూర్తి అధికారాన్ని పొందడానికి సహకరించిన ఆంధ్రుడు కాండ్రేగుల జోగిపంతులు. ఉత్తర సర్కారుల్లోని గుంటూరును మాత్రం ఆంగ్లేయులు 1788లో బసాలత్‌ జంగ్‌ మరణం తర్వాత పొందారు. 1788లో వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతిలో చేరిన హైదరాబాద్‌ నిజాం అలీ 1800 సంవత్సరంలో కడప, కర్నూలు, బళ్లారి, అనంతపురంలను ఆంగ్లేయులకు ఇచ్చాడు. కాబట్టి వాటిని దత్త మండలాలు అంటారు. నెల్లూరు - చిత్తూరు జిల్లాలను ఆంగ్లేయులు 1802లో ఆక్రమించారు. దీంతో మొత్తం ఆంధ్ర దేశం ఆంగ్ల పాలనలోకి వెళ్లింది. కంపెనీ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్రాలో జమీందార్లు, రాయలసీమలో పాలెగార్లు తిరుగుబాటు చేశారు. విజయనగర జమీందార్‌ చిన విజయరామరాజుతో ఆంగ్లేయులు 1794లో పద్మనాభ యుద్ధం చేశారు. రాయలసీమలో పాలెగార్ల తిరుగుబాటులను సర్‌ థామస్‌ మన్రో అణిచివేశాడు. కర్నూలు పాలెగార్‌ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు చేసినందుకు అతడిని 1846లో కోయిలకుంట్ల వద్ద ఉరితీశారు. థామస్‌ మన్రో రాయలసీమ/దత్త మండలాల్లో 1800 సంవత్సరంలో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. థామస్‌ మన్రో 1827 జులై 6న కర్నూలు జిల్లాలోని పత్తికొండ వద్ద కలరా వ్యాధితో మరణించాడు. అతడు మాండవ రుషిగా పేరొందాడు. కంపెనీ ఉత్తర సర్కారులను విశాఖపట్నం, మచిలీపట్నం కేంద్రాలుగా విభజించింది. 1786లో మద్రాస్‌లో బోర్డ్‌ ఆఫ్‌ రెవెన్యూ ఏర్పడి 1794లో రద్దయ్యింది. 1794లో కలెక్టర్ల వ్యవస్థ మొదలైంది. 1808లో కడప జిల్లా, 1858లో కర్నూలు జిల్లా, 1882లో అనంతపురం జిల్లా, 1911లో చిత్తూరు జిల్లాలు ఏర్పడ్డాయి. ఆంగ్లేయులు దత్త మండలాలన్నింటినీ మొదట అనంతపురం కేంద్రంగా ఒకే జిల్లాగా చేసి పరిపాలించారు. ఉత్తర సర్కారుల్లో జమీందారీ పద్ధతి/శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి; దత్త మండలాల్లో రైత్వారీ పద్ధతి; నెల్లూరు - చిత్తూరు జిల్లాల్లో మహల్వారీ/గ్రామవారీ శిస్తు పద్ధతి అమల్లో ఉండేవి. 1833లో గుంటూరులో డొక్కల కరవు వచ్చింది. 1847 - 50 మధ్య సర్‌ ఆర్థర్‌ కాటన్‌ కృషి వల్ల ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్టను నిర్మించారు.1852 - 55 మధ్య విజయవాడ వద్ద కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీని నిర్మించారు. ఆంగ్లపాలనలో మచిలీపట్నం కలంకారీ, అద్దకం పరిశ్రమకు; ఏలూరు తివాచీలకు, నెల్లూరు రుమాళ్లకు, కర్నూలు దుప్పట్లు, కంబళ్లకు ప్రసిద్ధి చెందాయి. ఆంగ్లపాలనలో మగ్గాలపై మోతుర్భా అనే పన్ను విధించేవారు. కల్నల్‌ మెకంజీ కావలి సోదరుల సహాయంతో గ్రామ కైఫీయత్‌లు సేకరించాడు. సి.పి.బ్రౌన్‌ 1817లో వేమన పద్యాలను సేకరించి 1829లో ప్రచురించాడు. ఈయన తెలుగు - ఇంగ్లిష్‌ నిఘంటువు (డిక్షన్రీ)ను కూడా రూపొందించాడు.

Posted Date : 17-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌