• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ 2019-20 

బడ్జెట్‌ అధ్యయనం ద్వారా రాష్ట్ర పాలనకు సంబంధించి స్థూలమైన అవగాహన ఏర్పడుతుంది. ప్రభుత్వ ప్రాధాన్యాలు, సంక్షేమ పథకాల అమలు, వివిధ విభాగాలకు కేటాయించిన నిధుల వివరాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. ఒక్కోసారి కేటాయింపుల శాతాలపై ప్రశ్నలు వస్తున్నాయి. వాటిపైనా దృష్టి పెట్టాలి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను 2019 జులై 12న తాత్కాలిక శాసనసభలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. 2019-20 ఏడాదికి మొత్తం బడ్జెట్‌ వ్యయం రూ.2,27,974.99 కోట్లుగా అంచనా వేశారు. ఇది 2018-19 నాటి రూ.1,91,063.61 కోట్ల కంటే 19.32 శాతం అధికం. 2019-20 మొత్తం బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94 కోట్లు, మూలధన వ్యయం రూ.32,293.39 కోట్లు, ప్రజారుణం తిరిగి చెల్లింపు రూ.13,417 కోట్లు, లోన్లు, అడ్వాన్స్‌లు రూ.1,788.67 కోట్లుగా అంచనా వేశారు. గత బడ్జెట్‌ (2018-19)తో పోలిస్తే 2019-20 బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయంలో సుమారు 20.10 శాతం, మూలధన వ్యయంలో 12.60 శాతం పెరుగుదలను అంచనా వేశారు. 2019-20 బడ్జెట్‌లో రెవెన్యూ లోటు సుమారు రూ.1,778.52 కోట్లుగా అంచనా వేశారు. ఇది రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ్బబిళీదీశ్శిలో 0.17%గా ఉంది. వ్యయలోటు (విత్తలోటు)ను సుమారు రూ.35,260.58 కోట్లుగా అంచనా వేశారు. ఇది జీఎస్‌డీపీ లో 3.30% శాతంగా ఉంది. 2019-20 రాష్ట్ర బడ్జెట్‌ రాబడుల్లో రెవెన్యూ రాబడులు రూ.1,78,697.42 కోట్లు, మూలధన రాబడి రూ.49,277.58 కోట్లు, ప్రజారుణం రూ.46,921 కోట్లు, లోన్ల రికవరీ రూ.600 కోట్లు, నికర ప్రజాఖాతా రూ.1,756.58 కోట్లుగా అంచనా వేశారు.

2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో రెవెన్యూ, మూలధన ఖాతాల నుంచి ఆర్థిక సేవలకు రూ.86,185.63 కోట్లు (మొత్తం బడ్జెట్‌లో 37.80%), సాంఘిక సేవలకు రూ.75,465.04 కోట్లు (33.10%), సాధారణ సేవలపై రూ.66,324.35 కోట్లు (29.09%) వ్యయం చేయనున్నారు.

ప్రజారుణం: 2019-20 రాష్ట్ర బడ్జెట్‌ల అంచనాల ప్రకారం మొత్తం ప్రజారుణం రూ.2,91,345 కోట్లు. ఇది మొత్తం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ్బబిళీదీశ్శిలో 26.96%గా ఉంది. 2018-19 సవరించిన అంచనాల ప్రకారం రూ.2,58,928.17 కోట్లుగా ఉంది. ఇది జీఎస్‌డీపీలో 28.18%. రాష్ట్ర ప్రభుత్వ ప్రజారుణంలో బహిరంగ మార్కెట్‌ లోన్‌లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు, ఇతర సంస్థల నుంచి రుణాలు, చిన్న మొత్తాల పొదుపు, ప్రావిడెంట్‌ఫండ్, డిపాజిట్లు, నిల్వ నిధులు కలిసి ఉంటాయి.

కేటాయింపులు
నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న ‘నవరత్నాలు’లో భాగంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గృహరంగం, సంక్షేమ రంగాలకు సంబంధించిన 9 క్రాస్‌ కటింగ్‌ థీమ్స్‌తో కూడిన సమగ్ర సంక్షేమ విధానం కింద అనేక నూతన పథకాలను బడ్జెట్‌లో భాగంగా ప్రకటించింది.

మధ్యాహ్న భోజన పథకం: దేశంలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకానికి 2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1077 కోట్లు కేటాయించారు. ఈ పథకానికి అయ్యే వ్యయ భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 : 40 నిష్పత్తిలో భరిస్తాయి. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు సంబంధించి 100% వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.

జగనన్న విద్యాదీవెన పథకం: మెట్రిక్‌ అనంతర కోర్సుల్లో తల్లితండ్రులపై భారాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని అమలు చేస్తుంది. దీనికి బడ్జెట్‌లో రూ.4,923.3 కోట్లు కేటాయించారు. ఏటా ఒక్కో విద్యార్థికి రూ.20,000 చొప్పున అందించనున్నారు.

108 సేవలు: అదనంగా 432 అంబులెన్స్‌లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. బడ్జెట్‌లో రూ.143.38 కోట్లు కేటాయించారు.

104 సేవలు: దీనికి బడ్జెట్‌లో రూ.179.76 కోట్లు కేటాయించారు. అదనంగా 676 వాహనాలను సేకరించి సేవలందిస్తారు.

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా: ఈ పథకం కింద ప్రతి రైతుకు పంట కాలం ప్రారంభానికి ముందే ఏటా మే నెలలో రూ.12,500 పెట్టుబడి మద్దతును అందించనున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వ పథకం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రూ.6000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6500 కలిపి ఇవ్వనుంది. ఈ పథకం కింద 64.06 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.8,750 కోట్లను కేటాయించారు.

వైఎస్‌ఆర్‌ వడ్డీలేని రుణాలు: రైతులకు పరపతి వ్యయాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. దీనికోసం రూ.100 కోట్లు కేటాయించారు.

మత్స్యకారుల సంక్షేమం: చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చే సహాయాన్ని రూ.4000 నుంచి రూ.10000కు పెంచుతున్నట్లు పేర్కొంది. పెంచిన మొత్తాన్ని 2020 జనవరిలో పంపిణీ చేయనున్నారు. వీరి సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.200 కోట్లను కేటాయించారు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమం: ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చింది. షెడ్యూల్డ్‌ కులాల్లోని ఉపవర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గిరిజనులు పోషకాహారాన్ని పెంపొందించుకోవడానికి ఆహారబుట్ట పథకాన్ని అమలు చేస్తుంది. ఉచిత విద్యుత్‌ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు విద్యుత్‌ పరిమితిని 100 నుంచి 200 యూనిట్లకు పెంచాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కోసం రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ కుటుంబాలకు రూ.348.15 కోట్లు, ఎస్టీ కుటుంబాలకు రూ.81.70 కోట్లు కేటాయించారు. రాష్ట్రప్రభుత్వం 2019-20 సంవత్సరానికి ఎస్సీ ఉప ప్రణాళిక కింద రూ.15,000.86 కోట్లు; ఎస్టీ ఉపప్రణాళిక కింద రూ.4,988.53 కోట్లు కేటాయించింది.

వెనుకబడిన తరగతుల సంక్షేమం: వెనుకబడిన తరగతుల్లోని 139 కులాల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి 139 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వెనుకబడిన తరగతుల్లో (బీసీ) 29 కులాలకు 29 ప్రత్యేక కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్‌ల ద్వారా వచ్చే ఏడాది నుంచి వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 7.82 లక్షల మంది బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2,218.14 కోట్లు కేటాయించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.7271.45 కోట్లు; వెనుకబడిన తరగతుల ఉపప్రణాళిక కింద రూ.15,061 కోట్లు కేటాయించారు.

మైనారిటీల సంక్షేమం: వక్ఫ్‌ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా వాటి పరిరక్షణ కోసం రూ.20 కోట్లు, వక్ఫ్‌ ఆస్తుల సర్వే కోసం రూ.20 కోట్లను 2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించారు. వైఎస్‌ఆర్‌ షాదీ కా తోఫా కింద మైనారిటీ యువతుల వివాహాలకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.50,000 నుంచి రూ. 1,00,000కు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇమామ్‌ల గౌరవవేతనాన్ని నెలకు రూ.10,000కు, మౌజిమ్‌లకు నెలకు రూ.5,000కు పెంచాలని నిర్ణయించారు. పాస్టర్లకు నెలకు రూ.5,000 గౌరవ వేతనాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మైనారిటీల సంక్షేమం కోసం వివిధ సంక్షేమ పథకాల కింద 2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.2,106 కోట్లను కేటాయించారు.

కాపు సంక్షేమం: 2019-20 సంవత్సరానికి కాపు సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.2000 కోట్లు కేటాయించారు.

బ్రాహ్మణ సంక్షేమం: ధూప, దీప, నైవేద్యం కార్యక్రమం కోసం 2019-20 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.234 కోట్లు;. బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు కేటాయించారు.

వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక: రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్‌ మొత్తాన్ని నెలకు రూ.2000 నుంచి రూ.2250కు పెంచింది. దీన్ని నాలుగేళ్లలో రూ.250 చొప్పున రూ.3000కు పెంచనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. డయాలసిస్‌ రోగులకు రూ.10,000 పెన్షన్‌ను అందించనున్నారు. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద లబ్ధిదారుల వయసు పరిమితిని 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. ఈ పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.15,746.58 కోట్లను కేటాయించారు.

జగనన్న అమ్మఒడి పథకం: దీని కింద లబ్ధిదారులందరికీ 2020 జనవరి 26న రూ.15,000 చొప్పున అందిస్తారు.2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.6,455.80 కోట్లు కేటాయించారు.

వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ: పేదవాళ్లకు నాణ్యమైన వైద్యసేవలు అందించే ఈ పథకానికి రూ.1740 కోట్లను కేటాయించారు. దీన్ని మరింత విస్తరించి వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్న అన్ని కుటుంబాలకు, వైద్య ఖర్చులు రూ.1000కు మించిన అన్ని కేసులకు వర్తింపజేస్తారు.

మహిళా సంక్షేమం: 2019-20లో ఈ పథకం కోసం రాష్ట్రంలోని 6,32,254 గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు రూ.1148 కోట్లు; 1,66,727 పట్టణ స్వయం సహాయక సంఘాలకు రూ.648 కోట్లను కేటాయించారు.

వైఎస్‌ఆర్‌ గృహ నిర్మాణ పథకం: అయిదేళ్లలో 25 లక్షల గృహాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం బడ్జెట్‌లో రూ.8,615 కోట్లు కేటాయించింది.
 

Posted Date : 15-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌