• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్ర‌ప్ర‌దేశ్ భౌగోళికాంశాలు

భారతదేశం 8o4'  నుంచి 37o6' ఉత్తర అక్షాంశాల మధ్య, 68o7' నుంచి 97o25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌ 12°41' నుంచి 22° ఉత్తర అక్షాంశాల మధ్య, 77o నుంచి 84o40' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
విస్తీర్ణం: భారతదేశం 3.28 మి.చ.కి.మీ. విస్తీర్ణంతో ప్రపంచ ఖండాల భూభాగ వైశాల్యంలో 2.42%, ఆంధ్రప్రదేశ్‌ 1,62,760 చ.కి.మీ. విస్తీర్ణంతో మొత్తం దేశ భూభాగంలో 4.96% భూభాగాన్ని ఆక్రమించింది.

సరిహద్దులు
* ఒడిశా - శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి
* చత్తీస్‌గఢ్‌ - తూర్పు గోదావరి
* తెలంగాణ - తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ప్రకాశం
* కర్ణాటక - కర్నూలు, అనంతపురం, చిత్తూరు
* తమిళనాడు - చిత్తూరు, నెల్లూరు.
కడప జిల్లా మినహా ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాలకు ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి.

 

నైసర్గిక స్వరూపం : భారతదేశాన్ని హిమాలయ పర్వతాలు, గంగా - సింధు మైదానం, ద్వీపకల్ప పీఠభూమి, తీరమైదానాలు, ఎడారిప్రాంతంగా విభజించవచ్చు.

గంగా - సింధు మైదానం
ఉత్తరాన హిమాలయాలకు, దక్షిణాన ద్వీపకల్ప పీఠభూమికి మధ్య సుమారు 7 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో గంగా - సింధు మైదానం ఏర్పడింది. ఈ మైదానంలో ప్రధానంగా నాలుగు ఉపరితల వ్యత్యాసాలు ఉన్నాయి.
* బాబర్‌: శివాలిక్‌ కొండల పాదాల వెంబడి ఉన్న గులకరాళ్లతో కూడిన సచ్ఛిద్ర మండలం
* టెరాయి: బాబర్‌కు దక్షిణంగా ఉన్న చిత్తడి ప్రాంతం
* భంగర్‌: టెరాయికి దక్షిణంగా ప్రాచీనకాలంలో ఏర్పడిన ఒండలి మైదానం
* ఖాదర్‌: నవీనకాలంలో ఏర్పడిన ఒండలి మైదానం

ద్వీపకల్ప పీఠభూమి
ఇది భారతదేశంలో అత్యంత ప్రాచీన శిలలతో ఏర్పడిన ప్రాంతం. దీని విస్తీర్ణం సుమారు 16 లక్షల చ.కి.మీ. ద్వీపకల్ప పీఠభూమిని మాల్వా పీఠభూమి, దక్కన్‌ పీఠభూమిగా విభజించవచ్చు. మాల్వా పీఠభూమి నర్మదా నదికి ఉత్తరాన ఉంది. దక్కన్‌ పీఠభూమిలో భాగమైన ఛోటానాగపుర్‌ పీఠభూమి దామోదర నదీ పరివాహక ప్రాంతంలో ఉండి అనేక ఖనిజాలు, బొగ్గు నిల్వలకు ప్రసిద్ధి చెందింది. అందుకే ఛోటానాగపుర్‌ పీఠభూమిని రూర్‌ ఆఫ్‌ ఇండియా అంటారు. లావా పటలాలు నిక్షేపితమవడం వల్ల దక్కన్‌ పీఠభూమి ఏర్పడింది. ఇది క్రమరహిత త్రిభుజాకారంలో ఉంటుంది.

తీరమైదానాలు
భారతదేశం సుమారు 15,200 కి.మీ. పొడవైన తీరరేఖను కలిగి ఉంది. భారత తీర మైదానాన్ని పశ్చిమ తీరమైదానం, తూర్పు తీరమైదానంగా విభజించవచ్చు. పశ్చిమ తీరమైదానంలో గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ; తూర్పుతీర మైదానంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్‌ బంగ రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడుకు మూడు సముద్రాల కలయిక గల తీరరేఖ ఉంది. అత్యంత పొడవైన తీరరేఖ గల రాష్ట్రం గుజరాత్‌. వీటిని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తున్నారు.
* గుజరాత్‌ - కథియావాడ్‌ తీరం
* మహారాష్ట్ర, గోవా - కొంకణ్‌ తీరం
* కర్ణాటక - కెనరా తీరం
* కేరళ - మలబార్‌ తీరం
* తమిళనాడు - కోరమండల్‌ తీరం
* ఆంధ్రప్రదేశ్‌ - సర్కార్‌ తీరం
* ఒడిశా - ఉత్కళ్‌ తీరం
* పశ్చిమ్‌ బంగ - వంగ తీరం

దీవులు
భారతదేశంలో మొత్తం 247 దీవులు ఉన్నాయి. వీటిలో 204 బంగాళాఖాతంలో; 43 అరేబియా సముద్రంలో, మన్నార్‌ సింధు శాఖ ప్రాంతంలో ఉన్నాయి. అండమాన్‌ నికోబార్‌ దీవులు బంగాళాఖాతంలో ఉన్నాయి. ఈ దీవుల్లోని అగ్ని పర్వతాలు నార్కొండం, బారెన్‌. అండమాన్, నికోబార్‌ దీవులను 10° ఛానల్‌ వేరుచేస్తుంది. లక్ష దీవులు అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఇవి ప్రవాళభిత్తికలతో ఏర్పడిన పగడపు దీవులు. భారత్‌లోని ఏకైక నదీ ఆధార దీవి మజులీ దీవి. ఇది బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది.

ఎడారి
భారతదేశంలో పెద్ద ఎడారి థార్‌. ఇది సుమారు 2 లక్షల చ.కి.మీ. ప్రాంతంలో విస్తరించి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ నైసర్గిక స్వరూపం
ఆంధ్రప్రదేశ్‌ నైసర్గిక స్వరూపాన్ని ప్రధానంగా తీరమైదానం, తూర్పు కనుమలు, పశ్చిమ పీఠభూమిగా విభజించారు.
తీరమైదానం: ఆంధ్రప్రదేశ్‌ తీరమైదానం ఉత్తరాన శ్రీకాకుళంలోని వంశధార నది నుంచి దక్షిణాన నెల్లూరులోని పులికాట్‌ సరస్సు వరకు సుమారు 974 కి.మీ. పొడవున విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పొడవైన తీరరేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళం (200 కి.మీ.), అతి తక్కువ తీరరేఖ కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి (20 కి.మీ.). రాష్ట్రంలో ఉన్న మంచినీటి సరస్సు కొల్లేరు. ఇది 250 చ.కి.మీ. విస్తీర్ణాన్ని కలిగి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మధ్య విస్తరించి ఉంది. నెల్లూరు, తమిళనాడు రాష్ట్రం మధ్య పులికాట్‌ సరస్సు ఉంది. ఇది ఉప్పునీటి సరస్సు, దీని విస్తీర్ణం 460 చ.కి.మీ.

తూర్పు కనుమలు
ఇవి తీరమైదానానికి, పడమటి పీఠభూమికి మధ్య విస్తరించి ఉన్నాయి. చార్న్‌క్వైట్, ఖొండలైట్‌ శిలలతో ఏర్పడ్డాయి. కృష్ణా, గోదావరి నదులతో ఖండించబడి ఉన్నాయి. ఉత్తరాన ఉన్న తూర్పు కనుమలను తూర్పు శ్రేణులు అంటారు. వీటి సగటు ఎత్తు 1200 మీటర్లు. దక్షిణాన ఉన్న తూర్పు కనుమలను కడప శ్రేణులు అంటారు. ఈ కనుమలను వివిధ జిల్లాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఇవి అవిచ్ఛిన్నం కావు. తూర్పు కనుమల్లో ఎత్తయిన శిఖరం జిందగడ (1690 మీ.).

పశ్చిమ పీఠభూమి
ఇది దక్కన్‌ పీఠభూమిలో భాగం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా అనంతపురం, కర్నూలు జిల్లాలు పశ్చిమ పీఠభూమి ప్రాంతంలో ఉన్నాయి. చిత్తూరు, అనంతపురం జిల్లాలోని కొంత భూభాగం మైసూరు పీఠభూమిలో ఉంది. పశ్చిమ పీఠభూమి ప్రధానంగా ధార్వర్, కడప శిలలు, కర్నూలు శిలలు, రాజమండ్రి శిలలతో ఏర్పడింది. ధార్వర్‌ శిలలు ఖనిజాలకు ప్రసిద్ధి చెందినవి. ఈ ప్రాంతంలో బంగారం (చిత్తూరు), అభ్రకం (నెల్లూరు) లభిస్తాయి. ఈ శిలల అవక్షేపాలే కడప శిలలు. ఈ శిలల్లో పలకరాయి, ఆస్‌బెస్టాస్‌ (రాతినార), మైకా, సున్నపురాయి లాంటివి లభిస్తాయి. కర్నూలు శిలల్లో లోహ ఖనిజాలు లభించవు. ఎక్కువగా సున్నపురాయి లభిస్తుంది. సముద్రం ఉప్పొంగి ఇసుక, సున్నపురాయి, మట్టి అవక్షేపంగా మారడంతో రాజమండ్రి శిలలు ఏర్పడ్డాయి. ఈ శిలల్లో పెట్రోలియం, సహజవాయువు లభిస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పర్వతాలు
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు తీరమైదానానికి, పడమటి పీఠభూమికి మధ్య తూర్పు కనుమలు ఉన్నాయి. వీటిని స్థానికంగా అనేక పేర్లతో పిలుస్తారు.
* శ్రీకాకుళం - మహేంద్రగిరులు
* విశాఖపట్నం - యారాడ కొండలు, అనంతగిరి కొండలు, డాల్ఫిన్‌నోస్‌ కొండలు, బాలకొండలు, సింహాచలం కొండలు
* ఉభయ గోదావరి జిల్లాలు - పాపికొండలు, ధూమకొండలు
* కృష్ణా జిల్లా - మొగల్రాజపురం కొండలు, కొండపల్లి కొండలు
* గుంటూరు - బెల్లంపల్లి కొండలు, నాగార్జున కొండలు, వినుకొండ, కోటప్పకొండ, కొండవీడు కొండలు
* ప్రకాశం - మార్కాపురం, చీమకుర్తి కొండలు
* నెల్లూరు - వెలికొండలు, పాలకొండలు, ఎర్రమల కొండలు
* కర్నూలు - నల్లమల కొండలు
* కడప - పాలకొండలు, వెలికొండలు
* చిత్తూరు - శేషాచలం కొండలు, హార్స్‌లీ హిల్స్‌
* అనంతపురం - పెనుగొండ, మడకశిర కొండలు

శీతోష్ణస్థితి
భారతదేశ శీతోష్ణస్థితిని ప్రధానంగా ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితిగా పేర్కొంటారు. దక్షిణాన గల తీరప్రాంతాల్లో తేమతో కూడిన మితమైన శీతోష్ణస్థితి లక్షణాలు ఉండటం వల్ల ఉష్ణమండల సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి అంటారు. ఉత్తరానికి వెళ్లేకొద్దీ దేశ అంతర్భాగంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఆ ప్రాంత శీతోష్ణస్థితిని ఖండాంతర్గత శీతోష్ణస్థితి అంటారు. థార్న్‌త్వైట్‌ అనే శాస్త్రవేత్త జల సంతులన భావన ఆధారంగా భారతదేశాన్ని 6 శీతోష్ణ మండలాలుగా విభజించారు.
అతి ఆర్ద్ర శీతోష్ణస్థితి: అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, మిజోరం, దక్షిణ గోవా ప్రాంతాలు, పశ్చిమ కనుమల ప్రాంతం
ఆర్ద్ర శీతోష్ణస్థితి: సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, తూర్పుతీర ప్రాంతాలు
తేమ ఉపఆర్ద్ర శీతోష్ణస్థితి: పశ్చిమ్‌ బంగ, ఒడిశా, పశ్చిమ బిహార్, పశ్చిమ కనుమల తూర్పు ప్రాంతం
పొడి ఉపఆర్ద్ర శీతోష్ణస్థితి: గంగా మైదానం, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఈశాన్య ఆంధ్రప్రదేశ్, ఉత్తర పంజాబ్, హరియాణా, తమిళనాడు ఈశాన్య ప్రాంతం, హిమాచల్‌ప్రదేశ్‌
ఉపశుష్క శీతోష్ణస్థితి: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తూర్పు కర్ణాటక, తూర్పు మహారాష్ట్ర, ఈశాన్య గుజరాత్, ఈశాన్య రాజస్థాన్, పంజాబ్, హరియాణాలోని అనేక ప్రాంతాలు.

 

ఆంధ్రప్రదేశ్‌ శీతోష్ణస్థితి
అక్షాంశాల పరంగా ఆయనరేఖ మండలంలో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్‌ శీతోష్ణస్థితిని కూడా ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితిగా పేర్కొంటారు.

 

వేసవికాలం : మార్చి నుంచి జూన్‌ రెండో వారం వరకు వేసవికాలం ఉంటుంది. వేసవిలో రాష్ట్రంలో అత్యధిక సగటు ఉష్ణోగ్రత 31.5ాది. ఈ కాలంలో అత్యధిక సగటు ఉష్ణోగ్రత గుంటూరు జిల్లాలోని రెంటచింతల (46ాది)లో నమోదైంది. వేసవిలో మైసూర్‌కు ఆనుకుని ఉన్న చిత్తూరు, అనంతపురం జిల్లాలు ఇతర ప్రాంతాల కంటే చల్లగా ఉంటాయి. ప్రముఖ వేసవి విడిది కేంద్రం చిత్తూరు జిల్లాలోని హార్స్‌లీ హిల్స్‌.
 

శీతాకాలం : రాష్ట్రంలో డిసెంబరు నుంచి జనవరి వరకు శీతాకాలం ఉంటుంది. అనంతపురం, చిత్తూరులో మిగతా జిల్లాల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఈ కాలంలో విశాఖ జిల్లా లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆంధ్రా ఊటీ అని పిలుస్తారు.
 

నైరుతి రుతుపవనకాలం : జూన్‌ మధ్య నుంచి సెప్టెంబరు వరకు దేశంలో నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలు కురుస్తాయి. ఈ రుతుపవనాల కాలంలో అత్యధిక వార్షిక సగటు వర్షపాతం పొందే జిల్లాలు తూర్పు గోదావరి, విశాఖపట్నం. వీటి వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఉత్తర ప్రాంతంలో 80 సెం.మీ., దక్షిణ ప్రాంతంలో 40 సెం.మీ. వర్షపాతం కురుస్తుంది. మొత్తంగా కోస్తా ప్రాంతంలో సగటున 66 సెం.మీ., రాయలసీమలో 46.5 సెం.మీ. వర్షపాతం కురుస్తుంది.
 

ఈశాన్య రుతుపవనకాలం : అక్టోబరు నుంచి నవంబరు మధ్య ఈశాన్య రుతుపవనాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో వర్షం కురుస్తుంది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండాలు లేదా తుపాన్‌లు ఏర్పడతాయి. వీటి కారణంగా ఆంధ్రప్రదేశ్‌ తీరప్రాంతం తీవ్ర నష్టాలకు గురవుతుంది. ఈ రుతుపవనాల వల్ల అధిక వర్షపాతం పొందే జిల్లా నెల్లూరు.
 

శుష్క శీతోష్ణస్థితి: పశ్చిమ గుజరాత్, పశ్చిమ రాజస్థాన్, దక్షిణ పంజాబ్‌
భారత వాతావరణ శాఖ దేశంలో సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా విభజించింది.
* శీతాకాలం - డిసెంబరు నుంచి ఫిబ్రవరి
* వేసవికాలం - మార్చి నుంచి జూన్‌
* నైరుతి రుతుపవన కాలం - జూన్‌ మధ్య నుంచి సెప్టెంబరు
* ఈశాన్య రుతుపవన కాలం - అక్టోబరు నుంచి నవంబరు

శీతాకాలం
భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత జనవరిలో నమోదవుతుంది. ఈ సమయంలో దేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లోని ద్రాస్‌ (-40ాది). ఈ కాలంలోనే మధ్యదరా సముద్ర ప్రాంతం నుంచి వీచే పశ్చిమ పవనాలు ఉత్తర భారతదేశంలో రబీకాలంలో గోధుమ పంటకు అనుకూలం.

వేసవికాలం
మే నెలలో దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వేసవిలో దక్షిణం నుంచి ఉత్తర భారతదేశం వైపు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతూ ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా సంవహన వర్షపాతం లేదా రుతుపవన ఆరంభ జల్లులు కురుస్తాయి. వీటిని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు.
* తెలంగాణ - తొలకరి జల్లులు
* ఆంధ్రప్రదేశ్‌ - ఏరువాక జల్లులు
* కర్ణాటక - చెర్రీ బ్లోసమ్స్‌
* పశ్చిమ బంగా - కాలబైశాఖి
* ఉత్తర్‌ప్రదేశ్‌ - అంధీలు

 

* నైరుతి రుతుపవనాలు : ఇవి జూన్‌ మధ్య నుంచి సెప్టెంబరు వరకు వీస్తాయి. దేశంలో కురిసే మొత్తం వర్షంలో సుమారు 90 శాతం నైరుతి రుతుపవనాల వల్లే కురుస్తుంది. వీటి వల్ల అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం మేఘాలయలోని మాసిన్‌రామ్‌.
ఈశాన్య రుతుపవనాలు : వీటిని తిరోగమన రుతుపవనాలు అని కూడా పిలుస్తారు. ఇవి అక్టోబరు నుంచి నవంబరు మధ్య వీస్తాయి. ఈ రుతుపవనాల వల్ల బంగాళాఖాతంలో తీవ్రమైన ఉష్ణమండల చక్రవాతాలు లేదా తుపాన్‌లు ఏర్పడతాయి. ఈశాన్య రుతుపవనాల వల్ల అధికంగా తమిళనాడులోని కోస్తా ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదవుతుంది.

పర్వతాలు
పశ్చిమ కనుమలు: ఇవి మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు పశ్చిమ తీరానికి సమాంతరంగా సుమారు 1600 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో ఎత్తయిన శిఖరం అనైముడి (2695 మీ.). ఇది ద్వీపకల్ప పీఠభూమిలోనే ఎత్తయినది. భారతదేశంలో ఎత్తయిన జోగ్‌/జొర్సొప్పా జలపాతం (275 మీ.) పశ్చిమ కనుమల్లోని శరావతి నదిపై ఉంది.
తూర్పు కనుమలు: ఇవి బంగాళాఖాతానికి సమాంతరంగా ఉత్తరాన ఒడిశా నుంచి దక్షిణాన తమిళనాడు వరకు విస్తరించి ఉన్నాయి. ఈ కనుమల్లో ఎత్తయిన శిఖరం జిందగడ (1690 మీ.). తూర్పు, పశ్చిమ కనుమలు దక్షిణాన నీలగిరి పర్వతాల్లో కలుస్తాయి. ఈ పర్వతాల్లో ఎత్తయిన శిఖరం దొడబెట్ట (2637 మీ.), ప్రముఖ వేసవి విడిది కేంద్రం ఊటీ. ఆరావళి పర్వతాలు ద్వీపకల్ప పీఠభూమికి వాయవ్య సరిహద్దుగా ఉన్నాయి. ఇవి అతి పురాతన ముడత పర్వతాలు. ఈ పర్వతాల్లో ఎత్తయిన శిఖరం మౌంట్‌ అబూ. ఇక్కడ జైనులకు సంబంధించిన దిల్వారా దేవాలయం ఉంది. సాత్పురా పర్వతాలు భారతదేశాన్ని ఉత్తర - దక్షిణాలుగా విభజిస్తున్నాయి. మాల్వా పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా వింధ్య పర్వతాలు ఉన్నాయి.

హిమాలయాలు
ఇవి 2400 కి.మీ. పొడవున వాయవ్యం నుంచి ఆగ్నేయం దిశగా విస్తరించి ఉన్నాయి. సుమారు 5 లక్షల చ.కి.మీ. మేర ఉన్నాయి. హిమాలయాల్లో రెండో ఎత్తయిన శిఖరం కాంచనగంగ. ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఈ పర్వతాల సగటు ఎత్తు 4500 మీటర్లు.

హిమాలయాల వర్గీకరణ :
1) హిమాద్రి లేదా అత్యున్నత హిమాయాలు
2) హిమాచల్‌ లేదా మధ్య హిమాలయాలు
3) శివాలిక్‌/బాహ్య హిమాలయాలు. హిమాద్రి సగటు ఎత్తు 6,100 మీటర్లు. హిమాచల్‌ పర్వతాల్లో పొడవైన పిర్‌పంజల్‌ పర్వత శ్రేణి ఉంది. హిమాద్రి, పిర్‌పంజల్‌ పర్వత శ్రేణికి మధ్య కశ్మీర్‌ లోయ ఉంది. శివాలిక్‌ కొండల సగటు ఎత్తు 600 నుంచి 1500 మీటర్లు. ఈ కొండలను వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. జమ్మూలో జమ్మూ కొండలు, ఉత్తరాఖండ్‌లో దుద్వా కొండలు, సిక్కింలో చురియా కొండలు, అరుణాచల్‌ప్రదేశ్‌లో మిష్మి కొండలని అంటారు. హిమాచల్, శివాలిక్‌ కొండల మధ్య ఉన్న దైర్ఘ్య కొండలను డూన్‌లు అంటారు.

Posted Date : 16-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌