• facebook
  • whatsapp
  • telegram

73వ రాజ్యాంగ సవరణ చట్టం

ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రజల్లో రాజకీయ చైతన్యం రావాలి. స్థానిక సమస్యలను గుర్తించి అందుకు తగిన పరిష్కార మార్గాలను అన్వేషించాలి. పరిపాలనలో స్థానిక ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో
పి.వి.నరసింహారావు ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ భద్రతను కల్పించింది.

రాజ్యాంగంలో మార్పులు
73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 ద్వారా రాజ్యాంగంలో రెండు ప్రధాన మార్పులు చేశారు.
* రాజ్యాంగానికి 9వ భాగాన్ని చేర్చి దానిలో ఆర్టికల్‌ 243, 243 (A) నుంచి 243 (O) వరకు మొత్తం 16 అధికరణల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ విధివిధానాలను పొందుపరిచారు.
* రాజ్యాంగానికి 11వ షెడ్యూల్‌ను చేర్చి దానిలో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను పేర్కొన్నారు.
ఈ చట్టం 1993, ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వచ్చింది. ఏప్రిల్‌ 24న ‘జాతీయ పంచాయతీరాజ్‌’ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

 

వివరణ
 

ఆర్టికల్‌ 243: ఈ ఆర్టికల్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు సంబంధించిన నిర్వచనాలు ఉంటాయి. వీటిని గవర్నర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా వెలువరిస్తారు.
 

ఆర్టికల్‌ 243 (A) - గ్రామసభ అధికారాలు, విధులు
గ్రామ పంచాయతీ పరిధిలో 18 ఏళ్లు నిండి ఓటరుగా నమోదైన వారందరూ గ్రామసభలో సభ్యులుగా ఉంటారు. గ్రామసభ గ్రామ పంచాయతీకి శాసనసభలా వ్యవహరిస్తుంది. సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయంలోపు ఎప్పుడైనా గ్రామసభ సమావేశాలను నిర్వహించవచ్చు. ఈ సమావేశాలు సర్పంచ్‌ అధ్యక్షతన జరుగుతాయి. సర్పంచ్‌ లేనప్పుడు ఉపసర్పంచ్‌ అధ్యక్షత వహిస్తారు. సంవత్సరానికి రెండుసార్లు (ఏప్రిల్‌ 14, అక్టోబరు 3న) తప్పనిసరిగా సమావేశాలను నిర్వహించాలి. ఈ విధంగా నిర్వహించనట్లయితే సర్పంచ్‌ పదవిని కోల్పోతాడు. ఇలా పదవి కోల్పోయిన సర్పంచ్‌ ఏడాదిపాటు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హుడు.
* గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్షిక నివేదికలను పరిశీలిస్తుంది. వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది.
* ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి గ్రామసభను ప్రాతిపదికగా పరిగణిస్తారు. దీనికి గ్రామ పంచాయతీ సమష్టి బాధ్యత వహించాలి.
* గ్రామసభ సభ్యుల్లో కనీసం 50 లేదా 10% మంది సభ్యులు లిఖితపూర్వకంగా కోరితే సర్పంచ్‌ గ్రామసభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి.
* భారత ప్రభుత్వం 2009-10 సంవత్సరాన్ని ‘గ్రామ సభల సంవత్సరంగా’ ప్రకటించింది.
* మన గ్రామసభను పోలిన వ్యవస్థ స్విట్జర్లాండ్‌లో ‘ల్యాండ్స్‌గెమెండ్‌’ పేరుతో అమల్లో ఉంది.
* గ్రామసభ సమావేశాలను మహారాష్ట్ర, తెలంగాణలో సంవత్సరానికి 6 సార్లు, ఆంధ్రప్రదేశ్‌లో 4 సార్లు, తమిళనాడులో 3 సార్లు నిర్వహిస్తున్నారు.
ఆర్టికల్‌ 243(B)(1) - పంచాయతీరాజ్‌ వ్యవస్థాపన: ఈ ఆర్టికల్‌ ప్రకారం పంచాయతీరాజ్‌ వ్యవస్థను మూడు స్థాయుల్లో నెలకొల్పాలి.
1) దిగువ స్థాయి - గ్రామ పంచాయతీ
2) మధ్య స్థాయి - పంచాయతీ సమితి
3) ఉన్నత స్థాయి - జిల్లా పరిషత్‌

 

ఆర్టికల్‌ 243(B)(2): దీని ప్రకారం 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో మాధ్యమిక స్థాయిలో పంచాయతీ సమితుల ఏర్పాటు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆర్టికల్‌ 243(C) - సభ్యులు, అధ్యక్షుల ఎన్నిక విధానం: గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్‌ సభ్యుల ఎన్నిక ప్రత్యక్ష విధానంలో ఉండాలి. పంచాయతీ సమితి, జిల్లా పరిషత్‌ అధ్యక్షుల ఎన్నిక పరోక్షంగా నిర్వహించాలి. గ్రామ పంచాయతీ సర్పంచ్‌/అధ్యక్షుడిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకోవచ్చు. ఎన్నిక ఏవిధంగా ఉండాలనేది సంబంధిత రాష్ట్ర శాసనసభ చట్టం తెలుపుతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు మాధ్యమిక వ్యవస్థలో సభ్యులుగా కొనసాగుతారు. పంచాయతీ సమితి లేని రాష్ట్రాల్లో వీరు జిల్లా పరిషత్‌ సభ్యులుగా ఉంటారు. మాధ్యమిక వ్యవస్థ ఉన్న రాష్ట్రాల్లో దీని అధ్యక్షులు జిల్లా పరిషత్‌లో సభ్యులుగా కొనసాగుతారు. జిల్లాకు చెందిన లోక్‌సభ, విధానసభ సభ్యులు వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గ పరిధిలోని మాధ్యమిక వ్యవస్థ, జిల్లా పరిషత్‌లలో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా కొనసాగవచ్చు. జిల్లాలో ఓటరుగా నమోదైన రాజ్యసభ, శాసనమండలి సభ్యులు వారు ఓటరుగా నమోదైన జిల్లా పరిషత్‌, మాధ్యమిక వ్యవస్థల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉంటారు.
ఆర్టికల్‌ 243(D) - రిజర్వేషన్లు: పంచాయతీ రాజ్‌ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి. వారికి కేటాయించిన రిజర్వేషన్లలో ఆయా వర్గాల మహిళలకు 1/3 వ వంతు స్థానాలను రిజర్వు చేయాలి. పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లలో మహిళలకు 1/3వ వంతు స్థానాలను రిజర్వ్‌ చేయాలి. 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు నిర్దేశించకుండా సంబంధిత రాష్ట్ర శాసనసభల విచక్షణకు వదిలిపెట్టారు. పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం బిహార్‌. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా దేశంలోని 14 రాష్ట్రాలు పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో మహిళలకు 50% స్థానాలను రిజర్వ్‌ చేశాయి. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 110వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఇప్పటివరకు ఆమోదించలేదు.

 

సుప్రీంకోర్టు తీర్పు
అజీజ్‌ అసాద్‌ వర్సెస్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 1/3వ వంతు స్థానాలను రిజర్వ్‌ చేయడమనేది రిజర్వేషన్లు 50% మించకూడదు అనే నియమాలకు వ్యతిరేకం కాదని పేర్కొంది.

 

ఆర్టికల్‌ 243(E) - పదవీకాలం: పంచాయతీరాజ్‌ సంస్థల పదవీకాలం అవి ఏర్పడిన తేదీ నుంచి 5 సంవత్సరాలు. పదవీకాలం కంటే ముందే పంచాయతీరాజ్‌ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు. ఈవిధంగా రద్దు చేసిన పంచాయతీ వ్యవస్థలకు 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. పంచాయతీరాజ్‌ సంస్థల సభ్యుల పదవులకు ఖాళీ ఏర్పడినప్పుడు, వాటి భర్తీ కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్నికైన సభ్యులు మిగిలిన పదవీకాలం వరకు మాత్రమే కొనసాగుతారు. సంస్థ మొత్తానికి ఎన్నికలు ఆలస్యంగా జరిగితే పూర్తి పదవీకాలం అధికారంలో కొనసాగుతారు.
 

ఆర్టికల్‌ 243(F) - అర్హతలు, అనర్హతలు: పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి.. సంబంధిత స్థానిక సంస్థ ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండాలి. 21 సంవత్సరాలు నిండి ఉండాలి. 1995 మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న దంపతులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.
 

సుప్రీంకోర్టు తీర్పు
మ‌హ్మ‌ద్ ష‌రీఫ్ స్టేట్ ఆఫ్ హ‌రియాణా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ... 1995 మే 30 త‌ర్వాత ఇద్ద‌రికంటే ఎక్కువ సంతానం క‌లిగిన దంప‌తులు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌రాదు అనే నిబంధ‌న స‌మ‌ర్థ‌నీయ‌మేన‌నీ, దేశ ప్ర‌యోజ‌నాల రీత్యా ఇది స‌మంజస‌మేన‌ని పేర్కొంది.

 

ఆర్టికల్‌ 243(G) - అధికారాలు, విధులు: పంచాయతీరాజ్‌ సంస్థలు సమర్థంగా పోటీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు బదిలీ చేయాల్సిన అధికారాలు, విధుల గురించి పేర్కొన్నారు. 11వ షెడ్యూలులో 29 అంశాలను నిర్దేశించారు.
1. భూమి అభివృద్ధి, భూసంస్కరణల అమలు
2. వ్యవసాయం, వ్యవసాయ విస్తరణ
3. స్వల్ప నీటిపారుదల, నీటి నిర్వహణ, వాటర్‌షెడ్‌ల అభివృద్ధి
4. గ్రామీణ గృహవసతి
5. మత్స్య పరిశ్రమ
6. పశుసంవర్ధకం, డెయిరీ, పౌల్ట్రీ
7. చిన్నతరహా అటవీ ఉత్పత్తులు
8. చిన్నతరహా పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్‌ పరిశ్రమ
9. ఖాదీ గ్రామీణ, కుటీర పరిశ్రమలు
10. తాగునీరు
11. సామాజిక అడవులు, వ్యవసాయక్షేత్ర అడవుల అభివృద్ధి
12. ప్రాథమిక, మాధ్యమిక విద్య
13. సంప్రదాయేతర ఇంధన వనరులు
14. ఇంధనం, పశుగ్రాసం
15. గ్రామీణ విద్యుదీకరణ, విద్యుత్‌ పంపిణీ
16. రహదారులు, చిన్న వంతెనలు, జల మార్గాలు
17. వయోజన విద్య, అనియత విద్య
18. గ్రంథాలయాలు
19. పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు
20. సాంస్కృతిక కార్యక్రమాలు
21. సంత, మార్కెట్‌లు
22. సాంకేతిక శిక్షణ, వృత్తి విద్య
23. కుటుంబ సంక్షేమం
24. మహిళా, శిశు అభివృద్ధి
25. వికలాంగులు, మానసిక వికలాంగుల సంక్షేమం, సామాజిక సంక్షేమం
26. బలహీన వర్గాల సంక్షేమం
27. ప్రజాపంపిణీ వ్యవస్థ
28. సామూహిక ఆస్తుల నిర్వహణ, పరిరక్షణ
29. ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పారిశుద్ధ్యం నిర్వహణ
* కర్ణాటక, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, సిక్కిం, పశ్చిమ్‌ బంగా రాష్ట్రాలు; డామన్‌డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతం పంచాయతీరాజ్‌ వ్యవస్థకు వాటి అధికారాలు, విధులను బదిలీచేశాయి.

 

ఆర్టికల్‌ 243 (H) - ఆదాయ వనరులు: పంచాయతీరాజ్‌ సంస్థలకు కింది ఆదాయ వనరులు కీలకమైనవి.
* కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చే నిధులు.
* సంతలు, మార్కెట్ల నుంచి లభించే ఆదాయం; జరిమానాలు, విరాళాలు.
* ఇంటిపన్ను, నీటిపన్ను, ప్రకటనలపై పన్ను.
* స్థిరాస్తుల అద్దెలు, అమ్మకాల ద్వారా లభించే ఆదాయం.

 

ఆర్టికల్‌ 243 (I) - రాష్ట్ర ఆర్థికసంఘం విధులు: పంచాయతీరాజ్‌ వ్యవస్థలు సమర్థంగా పనిచేయడానికి, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి అవసరమైన సూచనలు, సలహాలను అందించడానికి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేయాలి. దీన్ని గవర్నర్‌ అయిదేళ్లకు ఒకసారి ఏర్పాటుచేస్తారు.
* రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు మంజూరు చేయాల్సిన నిధుల గురించి సిఫార్సు చేస్తుంది.
* కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కేంద్ర ఆర్థిక సంఘానికి గవర్నర్‌ ద్వారా నివేదికలు పంపడం.
* పంచాయతీ వ్యవస్థలు వసూలు చేసుకోవడానికి అవకాశమున్న పన్నులు, డ్యూటీలు, ఇతర సుంకాలను నిర్ధారించి సిఫార్సు చేయడం.
* రాష్ట్ర ఆర్థికసంఘం తన వార్షిక నివేదికను గవర్నర్‌కు సమర్పిస్తుంది. ఈ నివేదికను గవర్నర్‌ శాసనసభకు అందజేస్తారు.
* రాష్ట్ర ఆర్థికసంఘం నిర్మాణం, సభ్యుల నియామకం, వారి అర్హతలకు సంబంధించిన నియమ నిబంధనలను రాష్ట్ర శాసనసభ చట్టం నిర్ణయిస్తుంది.

 

ఆర్టికల్‌ 243 (J) - అకౌంటింగ్‌ - ఆడిటింగ్‌: పంచాయతీరాజ్‌ సంస్థలకు వివిధ మార్గాల ద్వారా లభించిన నిధులు, వాటి ఖర్చుకు సంబంధించిన ఖాతాలను ఆడిట్‌ చేయడం ద్వారా లోపాలు తెలుస్తాయి. ఈ ఆడిటింగ్‌ విధానం ఎలా ఉండాలనేది సంబంధిత రాష్ట్ర శాసనసభలు చట్టం ద్యారా నిర్దేశిస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రకాల ఆడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు.
1) లోకల్‌ ఫండ్‌ ఆడిట్‌
2) డిపార్ట్‌మెంటల్‌ ఆడిట్‌
3) జనరల్‌ ఫండ్‌ ఆడిట్‌
రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్‌ సంస్థల ఖర్చులు, ఖాతాల తనిఖీలో రాష్ట్ర ఆడిటర్‌ జనరల్‌ కీలకపాత్ర పోషిస్తారు.

 

ఆర్టికల్ 243 (K) - రాష్ట్ర ఎన్నికల సంఘం: పంచాయతీరాజ్‌ సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణ అధికారాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటాయి. గవర్నర్‌ ఈ సంఘాన్ని ఏర్పాటుచేసి, ఎన్నికల కమిషనర్‌ను నియమిస్తారు. హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను రాష్ట్రపతి తొలగిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి (మండల పరిషత్‌), జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహిస్తుంది.
 

సుప్రీంకోర్టు తీర్పు: ఆర్టికల్‌ 243 (K) ప్రకారం ఏర్పడిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఆర్టికల్‌ 324 ప్రకారం ఏర్పడిన కేంద్ర ఎన్నికల సంఘం మాదిరి రాజ్యాంగ ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. కాబట్టి స్థానిక సంస్థల పదవీకాలం ముగియడానికి ముందే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించవచ్చు. స్వయం ప్రతిపత్తితో పనిచేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది అని కిషన్‌సింగ్‌ థోమర్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
 

ఆర్టికల్‌ 243 (L) - కేంద్రపాలిత ప్రాంతాలకు అన్వయింపు: 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992లోని అంశాలను కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయాలా లేదా అనే విషయాన్ని రాష్ట్రపతి గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా ప్రకటిస్తారు. దిల్లీ, పుదుచ్చేరిల శాసనసభలు స్థానిక సంస్థలకు సంబంధించిన చట్టాలను రూపొందించినప్పటికీ అవి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలకు లోబడి ఉండాలి.
 

ఆర్టికల్‌ 243 (M) - మినహాయింపు ప్రాంతాలు: ఆర్టికల్‌ 244(1)లో పేర్కొన్న షెడ్యూల్డు జాతుల ప్రాంతాలు, ఆర్టికల్‌ 244(2)లో పేర్కొన్న ఆటవిక జాతుల ప్రాంతాలను 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 నుంచి మినహాయించారు.
* నాగాలాండ్, మిజోరం, మేఘాలయ రాష్ట్రాల్లోని ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌; మణిపూర్‌లోని కొండప్రాంతాలు, పశ్చిమ్‌ బంగలోని డార్జిలింగ్‌ ప్రాంతం గల గూర్ఖాహిల్‌ కౌన్సిల్‌లో ఈ చట్టాన్ని మినహాయించారు.
* షెడ్యూల్డు ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేసే అంశంపై భారత పార్లమెంటు చట్టాలను రూపొందించవచ్చు.

 

ఆర్టికల్‌ 243 (N) - పూర్వశాసనాల కొనసాగింపు: 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ అప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు వివిధ రాష్ట్రాల్లో ఇదివరకే అమల్లో ఉన్న శాసనాలు కొనసాగుతాయి. ఈ చట్టంలోని మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత శాసనాలను రూపొందించుకోవచ్చు.
 

ఆర్టికల్‌ 243 (O) - ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్ల ఏర్పాటు: 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారాలకు సంబంధించి నియోజక వర్గాల ఏర్పాటు, నియోజక వర్గాల్లో రిజర్వేషన్లు, వాటికి సంబంధించిన వివాదాలను న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఎన్నికలను సవాల్‌ చేస్తూ న్యాయస్థానాల్లో కేసులు వేయరాదు. పంచాయతీ ఎన్నికల వివాదాలను విచారించడానికి అన్ని రాష్ట్రాలు ప్రత్యేక న్యాయ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల వివాదాలను ప్రత్యేక న్యాయ ట్రైబ్యునల్‌ హోదాలో జిల్లా మున్సిఫ్‌ కోర్టులు విచారిస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం పంచాయతీరాజ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించిన మొదటి రాష్ట్రం కర్ణాటక. ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ చట్టం 1993, మే 10 నుంచి అమల్లోకి వచ్చింది.


వేగంగా.. ఒకసారి
* 73వ రాజ్యాంగ సవరణ చట్టం... 1993 ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వచ్చింది.
* పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి 21 ఏళ్లు నిండి ఉండాలి.
* ఏటా ఏప్రిల్‌ 14, అక్టోబరు 3 తేదీల్లో గ్రామసభను తప్పనిసరిగా నిర్వహించాలి.
* పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం బిహార్‌.
* రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్‌ సంస్థలకు బదిలీ చేయాల్సిన అధికారాలు, విధులు 29
* జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం ఏప్రిల్‌ 24
* పంచాయతీరాజ్‌ వ్యవస్థ విధివిధానాలను రాజ్యాంగంలోని తొమ్మిదో భాగంలో ఆర్టికల్‌ 243 నుంచి ఆర్టికల్‌ 243 (O) వరకు ప్రస్తావించారు.
* భారత ప్రభుత్వం 2009-10ను ‘గ్రామసభల సంవత్సరం’గా ప్రకటించింది.

Posted Date : 16-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌