• facebook
  • whatsapp
  • telegram

జీవ ఎరువులు (బయోఫర్టిలైజర్స్‌)

 

 నేల సారాన్ని పెంచే లేదా మొక్కలకు ప్రత్యక్షంగా/పరోక్షంగా పోషకాలను అందించే సూక్ష్మజీవులను జీవ ఎరువులు (సూక్ష్మజీవ ఎరువులు) అంటారు. ఎరువులుగా వాడే సూక్ష్మజీవులను బొగ్గు పొడి, చార్‌కోల్, వరి ఊక లాంటి వాహకాలతో కలిపి పొలాల్లో చల్లుతారు లేదా విత్తనాలకు పట్టిస్తారు.

‣ సాధారణంగా మూడు రకాల సూక్ష్మజీవులను జీవ ఎరువులుగా ఉపయోగిస్తున్నారు. 
      1) బ్యాక్టీరియా 
      2) నీలి ఆకుపచ్చ శైవలాలు 
      3) శిలీంద్రాలు

 

బ్యాక్టీరియా జీవ ఎరువులు
      వీటిని మూడు రకాలుగా విభజించారు.

 

1) సహజీవనం చేస్తూ నత్రజనిని అందించే బ్యాక్టీరియా
ఉదా: రైజోబియమ్‌ బ్యాక్టీరియా. ఇవి చిక్కుడు జాతి మొక్కల వేరు బుడిపెల్లో ఉంటూ వాతావరణంలో నత్రజనిని స్థాపించి మొక్కకు అందజేస్తాయి.

 

2) స్వేచ్ఛగా నివసిస్తూ నత్రజనిని స్థాపించే బ్యాక్టీరియా
ఉదా: అజటో బాక్టర్, క్లాస్ట్రీడియం జాతులు, అజటోకోకస్, రోడో సూడో మోనాస్‌. ఇవి నేలలో స్వేచ్ఛగా ఉంటూ వాతావరణంలోని నత్రజనిని తమ దేహంలో స్థాపించుకుంటాయి.

 

3) ఫాస్ఫరస్‌ను కరిగించే బ్యాక్టీరియా
ఉదా: బాసిల్లస్‌ మెగా థీరియం, బాసిల్లస్‌ సబ్‌టిలిస్‌. ఇవి నేలలో కరగని స్థితిలో ఉన్న ఫాస్ఫరస్‌ను కరిగిస్తాయి. ఈ విధంగా కరిగిన ఫాస్ఫరస్‌ను మొక్కలు తేలికగా గ్రహిస్తాయి.

 

నీలి ఆకుపచ్చ శైవలాలు
      వీటినే సయనో బ్యాక్టీరియా అని కూడా అంటారు. ఇవి రెండు రకాలు.

 

1) స్వేచ్ఛగా నివసించేవి
ఉదా: నాస్టాక్, అనబీనా, ఆలోసిరా, ఆసిల్లటోరియా. ఇవి నేలలో తేమ ఉన్న ప్రదేశాల్లో స్వేచ్ఛగా నివసిస్తూ వాతావరణంలోని నత్రజనిని తమ దేహంలో స్థాపించుకుంటాయి. ఇవి చనిపోయిన తర్వాత నత్రజని భూమిలోకి వెళ్లి మొక్కలకు అందుతుంది.

 

2) సహజీవనం చేసేవి
ఉదా: అనబీనా. ఈ శైవలం అజొల్లా అనే ఫెర్న్‌ మొక్క పత్రాల్లో సహజీవనం చేస్తూ నత్రజనిని స్థాపించి మొక్కకు అందజేస్తుంది. అందుకే అజొల్లాను వరి పొలాల్లో జీవ ఎరువుగా వాడుతున్నారు.

 

జీవ ఎరువులుగా శిలీంద్రాలు
 

 కొన్ని శిలీంద్రాలు మొక్కల వేర్లతో కలిసి సహజీవనం చేస్తూ మొక్కకు ఉపయోగపడతాయి.
‣ మొక్కల వేర్ల ఉపరితల వైశాల్యాన్ని పెంచి నీటిని ఎక్కువగా శోషించుకోవడానికి ఉపయోగపడతాయి.
 మొక్కలు నత్రజని, ఫాస్ఫరస్‌ లాంటి వాటిని ఎక్కువగా శోషించుకోవడానికి సహాయపడతాయి.
‣ మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకోవడానికి; నేలలో ఉండే అధిక ఉష్ణోగ్రత, ఆమ్లత్వాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి.
‣ నేలలో ఉన్న హానికర సూక్ష్మజీవులు మొక్కల వేర్లకు వ్యాధులు సోకకుండా కాపాడతాయి.
ఉదా: వెసిక్యులర్‌ ఆర్బస్కులార్‌ మైకోరైజా (vam fungi)

 

ఉపయోగాలు 
 

 జీవ ఎరువులు రసాయనిక ఎరువుల మాదిరి ఎలాంటి కాలుష్యాన్ని కలిగించవు.
‣ రసాయనిక ఎరువులు నీటిలో కరిగి కొట్టుకుపోతాయి. జీవ ఎరువులు నేలను అంటిపెట్టుకుని మొక్కలకు పోషకాలను అందిస్తాయి. 
 రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల నేల నిస్సారమవుతుంది. జీవ ఎరువులు నేలను సారవంతం చేసి నీటిని అందించే శక్తిని పెంచుతాయి.
 జీవ ఎరువులు వాడటానికి ఎలాంటి పరిజ్ఞానం అవసరం లేదు. ఖర్చు కూడా చాలా తక్కువ.
 రసాయనిక ఎరువులు ఒక పంటకు లేదా కొంత కాలం వరకు మాత్రమే మొక్కకు పోషణను అందిస్తే జీవ ఎరువులు ఎక్కువ కాలం అందిస్తాయి. ఈ ఎరువులు తర్వాతి పంటకు కూడా ఉపయోగపడతాయి. 
‣ సేంద్రీయ వ్యవసాయంలో జీవ ఎరువులను వాడుతున్నారు.
‣ జీవ ఎరువులు వాడటం వల్ల సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుంది. అధిక దిగుబడి వస్తుంది. 
 అజొల్లాను వరిపొలాల్లో ఉపయోగించడం వల్ల కలుపు మొక్కల వ్యాప్తిని తగ్గించవచ్చు.

 

పరిమితులు
 

‣ జీవ ఎరువులను అన్ని రకాల పంటలకు విరివిగా వాడలేం. 
 ఇవి మొక్కకు నెమ్మదిగా అందుతాయి. కావాల్సిన పరిమాణంలో ఎరువులను అందించలేవు.

 

జీవ ఎరువుల అభివృద్ధికి చర్యలు
 

      కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, కార్యక్రమాలు, సంస్థల ద్వారా జీవ ఎరువుల అభివృద్ధి, ఉపయోగాన్ని ప్రోత్సహిస్తోంది. జీవ ఎరువుల వినియోగానికి నగదు ప్రోత్సాహకాలను, సబ్సిడీలను అందిస్తోంది.  
 నేషనల్‌ మిషన్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అగ్రికల్చర్‌ (ఎన్‌ఎంఎస్‌ఏ)
 పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన (పీకేవీవై)
 రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్‌కేవీవై)
 నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఆయిల్‌ సీడ్‌ అండ్‌ ఆయిల్‌పామ్‌ (ఎన్‌ఎంఓఓపీ) 
 నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ మిషన్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం)
ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ (ఐకార్‌) సంస్థ సాయిల్‌ బయోడైవర్సిటీ - బయో ఫర్టిలైజర్స్‌ ప్రాజెక్టులో భాగంగా జీవ ఎరువులుగా ఉపయోగపడే వివిధ సూక్ష్మజీవులను అభివృద్ధి చేసింది. ఇవి వివిధ రకాల పంటలు, నేలలకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఎక్కువ రోజులు మనుగడ సాగించే ద్రవరూప జీవ ఎరువుల సాంకేతికతను అభివృద్ధి చేశారు. జీవ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఈ సంస్థ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జీవ ఎరువుల, సేంద్రీయ ఎరువుల నాణ్యతను పరీక్షించే ప్రయోగశాలను ఏర్పాటు చేసింది.

 

మొక్కల్లో నత్రజని స్థాపన

రైజోబియమ్‌ బ్యాక్టీరియాలో ఉండే నిఫ్‌ జన్యువుల వల్ల నత్రజని స్థాపన జరుగుతుంది. వీటిని ఉన్నత స్థాయి మొక్కల్లోకి మార్పిడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది విజయవంతమైతే రైజోబియమ్‌ బ్యాక్టీరియా సహజీవనం లేకుండానే మొక్క నత్రజని స్థాపన జరుపుతుంది. 
*  కొన్ని శిలీంద్రాలు ఉన్నత స్థాయి మొక్కల వేర్లపై సహజీవనం చేస్తాయి. దీన్నే మైకోరైజా అంటారు.
                                                                                                                                                         

Posted Date : 25-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌