• facebook
  • whatsapp
  • telegram

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు

నామినేటెడ్‌ పదవుల్లో... 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతులు (బీసీ), షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీ), మైనారిటీ వర్గాలను రాజకీయంగా, సామాజికంగా బలోపేతం చేయడం కోసం వారికి మరింత మెరుగైన అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిపాలన శాఖలన్నింటిలోని కార్పొరేషన్లు/ ఏజెన్సీలు/ బాడీలు/ బోర్డులు/ సొసైటీలు/ కమిటీల్లోని అన్ని రకాల నామినేటెడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్‌ను కల్పించాలని నిర్ణయించింది. దీంతో ఆయా వర్గాలు రాజకీయంగా పురోగతిని, సామాజికంగా అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందని భావించింది. దీన్ని సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్‌ (అన్ని నామినేటెడ్‌ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్‌) చట్టం - 2019’ను తీసుకువస్తుంది. దీనికి సంబంధించిన బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. అధికారిక గెజిట్‌ విడుదల కావాల్సి ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే అన్ని కార్పొరేషన్లు/ ఏజెన్సీలు/ బాడీలు/ బోర్డులు/ సొసైటీలు/ కమిటీల్లో ఛైర్‌పర్సన్‌ పదవులు, డైరెక్టర్లు, సభ్యుల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తారు. ఈ వర్గాలకు కేటాయించిన పదవుల్లో ఆయా వర్గాల మహిళలకు కనీసం 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలి. అయితే ఈ చట్టంలోని రిజర్వేషన్లు ‘ఆంధ్రప్రదేశ్‌ ధార్మిక, హిందూ మత సంస్థలు, ఎండోమెంట్ల చట్టం - 1987’, ‘వక్ఫ్‌ చట్టం - 1995’ కింద ఏర్పాటుచేసే బాడీలు (నియామకాలు), బోర్డులకు వర్తించవు.

నామినేటెడ్‌ పనులు, సేవల కాంట్రాక్టుల్లో...
రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడం కోసం వారికి మరింత మెరుగైన అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రభుత్వ నామినేటెడ్‌ ప్రాతిపదికన కాంట్రాక్టు పనులు, సర్వీసు కాంట్రాక్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని నిర్ణయించింది. దీన్ని సాధించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘ఆంధ్రప్రదేశ్‌ (నామినేషన్‌పై ఇచ్చిన పనులు, సర్వీసు కాంట్రాక్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్‌) చట్టం - 2019’ని తీసుకొస్తుంది. దీనికి సంబంధించిన బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. అధికారిక గెజిట్‌ విడుదల కావాల్సి ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కింద పనిచేస్తున్న అన్ని ఇంజినీరింగ్, పరిపాలక శాఖల ద్వారా నామినేషన్‌ ప్రాతిపదికన ఇచ్చే అన్ని పనులు, సర్వీసు కాంట్రాక్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తారు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి కేటాయించిన ఆయా కేటగిరీల్లో రిజర్వేషన్‌కు అనుగుణంగా మహిళలకు కనీసం 50 శాతం రిజర్వేషన్‌ తప్పనిసరిగా కల్పించాలి). ఈ చట్టం ప్రకారం నామినేషన్‌ ప్రాతిపదికన ఇచ్చే అన్ని పనుల కాంట్రాక్టుల్లో రిజర్వేషన్‌ను అమలు చేయడానికి ENC (PR); సర్వీసు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్‌ను అమలు చేయడానికి సాధారణ పరిపాలనా శాఖ (GAD) రాష్ట్రస్థాయి నోడల్‌ ఏజెన్సీలుగా ఉంటాయి.

* నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ ప్రాతిపదికన ఇచ్చే పనులు/ సర్వీసు కాంట్రాక్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్‌ను కింది విధంగా అమలు చేయాలి.

వర్గం

రిజర్వేషన్‌ శాతం

బీసీ, మైనారిటీలు

29%

షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ)

15%

షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్టీ)

6%

మొత్తం

50%

పరిశ్రమలు, కర్మాగారాల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు
రాష్ట్రంలోని పరిశ్రమలు, ఫ్యాక్టరీ (కర్మాగారాలు)ల్లో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ‘ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు/ కర్మాగారాల్లో స్థానికులకు ఉపాధి కల్పన చట్టం - 2019’ని తీసుకువస్తుంది. దీనికి సంబంధించిన బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. అధికారిక గెజిట్‌ రావాల్సి ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రతి పరిశ్రమ, ఫ్యాక్టరీలో (PPP విధానంలోని జాయింట్‌ వెంచర్‌ ప్రాజెక్టులతో సహా) 75 శాతానికి తక్కువ కాకుండా స్థానికులకు ఉపాధి కల్పించాలి. దీని ప్రకారం అర్హత ఉన్న అభ్యర్థులు స్థానికంగా లభ్యం కానప్పుడు అర్హత ఉన్న స్థానిక అభ్యర్థులకు తగిన శిక్షణ ఇస్తారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటికే ఉన్న పరిశ్రమలు/ ఫ్యాక్టరీల్లో మూడేళ్లలోపు 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలి.

Posted Date : 17-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌