• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ ఉనికి - క్షేత్రీయ అమరిక

* పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ఫలితంగా 1953 అక్టోబరు 1న ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాలు, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి కర్నూలు రాజధానిగా ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. 

*‘రాష్ట్రాల పునర్‌విభజన చట్టం - 1956’ను అనుసరించి నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో కలవడంతో 1956 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ నాటికి రాష్ట్రంలో 20 జిల్లాలు ఉండగా 2014 రాష్ట్రవిభజన నాటికి జిల్లాల సంఖ్య 23.
* 2014 జూన్‌ 2న ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడంతో ప్రస్తుతం కోస్తా ఆంధ్రాలో 9, రాయలసీమలో 4 మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ 13 జిల్లాలతో ఉంది.

 

విస్తీర్ణం - జనాభా
* ఆంధ్రప్రదేశ్‌ భారతదేశానికి దక్షిణాన ఉంది. ఇది అక్షాంశాల పరంగా 12º 41' నుంచి 22º ఉత్తర అక్షాంశాల మధ్య, రేఖాంశాల పరంగా 77º నుంచి 84º 40 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.

* ఇది బంగాళాఖాతాన్ని ఆనుకొని ‘తాళం చెవి’ ఆకారంలో 1,60,205 చ.కి.మీ. మేర విస్తీర్ణాన్ని కలిగి ఉంది. కానీ పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుకు గురయ్యే ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా), కూనవరం, చింతూరు, వర రామచంద్రాపురం మండలాలతో పాటు బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడంతో ప్రస్తుతం రాష్ట్ర విస్తీర్ణం 1,62,760 చ.కి.మీ.కు పెరిగింది. భారతదేశ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ 4.96% శాతాన్ని ఆక్రమించింది.
* దేశంలో విస్తీర్ణంపరంగా ఆంధ్రప్రదేశ్‌ 8వ స్థానంలో ఉండగా; రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు మొదటి ఏడు స్థానాల్లో నిలిచాయి.
* 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ జనాభా 4,95,77,103. దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్‌ 4.10 శాతంతో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో 10వ స్థానంలో ఉంది.

 

ఆంధ్రప్రదేశ్‌ - సరిహద్దులు
ఉత్తరాన - తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా
దక్షిణాన - తమిళనాడు
తూర్పున - బంగాళాఖాతం
పడమరన - కర్ణాటక

ఆంధ్రప్రదేశ్‌ జిల్లాలు - సరిహద్దు రాష్ట్రాలు
శ్రీకాకుళం - ఒడిశా
విజయనగరం - ఒడిశా
విశాఖపట్నం - ఒడిశా
తూర్పుగోదావరి - తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌
పశ్చిమగోదావరి - తెలంగాణ
కృష్ణ - తెలంగాణ
గుంటూరు - తెలంగాణ
ప్రకాశం - తెలంగాణ
నెల్లూరు - తమిళనాడు
కర్నూలు - తెలంగాణ, కర్ణాటక
అనంతపురం - కర్ణాటక
చిత్తూరు - కర్ణాటక, తమిళనాడు
* ఆంధ్రప్రదేశ్‌లో ఏ రాష్ట్రంతోనూ సరిహద్దు పంచుకోని (భూపరివేష్టిత) ఏకైక జిల్లా కడప.
* ఆంధ్రప్రదేశ్‌ను భౌగోళికంగా కోస్తా ఆంధ్రా, రాయలసీమ అనే రెండు ప్రాంతాలుగా విభజించవచ్చు.


కోస్తా ఆంధ్రా
* కోస్తా ఆంధ్రా మొత్తం విస్తీర్ణం సుమారు 95,470 చ.కి.మీ. ఈ ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్ద జిల్లా ప్రకాశం (ముఖ్యపట్టణం ఒంగోలు), అతి చిన్న జిల్లా శ్రీకాకుళం.
* కోస్తాలో అత్యధిక, అత్యల్ప మండలాలున్న జిల్లాలు వరుసగా తూర్పుగోదావరి (63), విజయనగరం (34). ఇక్కడ కృష్ణా, గోదావరి, పెన్నా నదులు ఏర్పరిచిన సారవంతమైన డెల్టాలు ఉన్నాయి.
* కోస్తా జిల్లాలన్నీ సముద్రతీరాన్ని ఆనుకొని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తీరరేఖ పొడవు 974 కి.మీ. శ్రీకాకుళం అత్యధిక తీరరేఖను, పశ్చిమగోదావరి అత్యల్ప తీరరేఖను కలిగి ఉన్నాయి.
* 2011 జనాభా లెక్కల ప్రకారం కోస్తా ఆంధ్రాలో అత్యధిక, అత్యల్ప జనాభా ఉన్న జిల్లాలు వరుసగా తూర్పు గోదావరి, విజయనగరం.

 

రాయలసీమ
* ఒకప్పుడు దత్తమండలంగా పిలిచిన రాయలసీమలో చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలు ఉన్నాయి.
* రాయలసీమ ప్రాంత వైశాల్యం 67,290 చ.కి.మీ. ఇక్కడ విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లా అనంతపురం, చిన్న జిల్లా చిత్తూరు. అత్యధిక, అత్యల్ప మండలాలున్న జిల్లాలు వరుసగా చిత్తూరు (66), కడప (51).

* 2011 జనాభా లెక్కల ప్రకారం రాయలసీమలో అత్యధిక, అత్యల్ప జనాభా ఉన్న జిల్లాలు వరుసగా చిత్తూరు, కడప.
 

* మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లా అనంతపురం, చిన్న జిల్లా శ్రీకాకుళం; అత్యధిక జనాభా గల జిల్లా తూర్పుగోదావరి, అత్యల్ప జనాభా గల జిల్లా విజయనగరం.
* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనాభా 4.95 కోట్లు కాగా వీరిలో పురుషులు 2.48 కోట్లు, స్త్రీలు 2.47 కోట్లు ఉన్నారు.
* 2001 - 2011 దశాబ్దాల మధ్య రాష్ట్ర జనాభా పెరుగుదల రేటు 9.21%. భారతదేశ జనసాంద్రత చ.కి.మీ.కు 368 మంది. ఆంధ్రప్రదేశ్‌ జనసాంద్రత చ.కి.మీ.కు 304 మంది.
* రాష్ట్రంలో స్త్రీ, పురుష నిష్పత్తి 997 : 1000గా నమోదైంది.
* 2011 నాటికి రాష్ట్రంలో అక్షరాస్యత 67.35 శాతం నమోదైంది. ఇది జాతీయ సగటు (72.98%) కంటే తక్కువ.
* రాష్ట్ర రాజధానిగా అమరావతి పేరును 2015 ఏప్రిల్‌ 23న ప్రకటించారు. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెం వద్ద 2015 అక్టోబరు 22న రాజధానికి శంకుస్థాపన చేశారు. అమరావతి నిర్మాణం, పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం ‘రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (Capital Region Development Authority - CRDA)' ను ఏర్పరిచి 8,352.69 చ.కి.మీ. విస్తీర్ణం గల ప్రాంతాన్ని దీని పరిధిలోకి తీసుకువచ్చారు. ఇందులో సీడ్‌ క్యాపిటల్‌ ఏరియా లేదా రాజధాని నగర విస్తీర్ణం 375 చ.కి.మీ.

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భాష తెలుగు. గిడుగు వెంకటరామమూర్తి తెలుగు భాషకు చేసిన సేవలకు గుర్తుగా ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 
* రాష్ట్ర గేయం శంకరంబాడి సుందరాచారి రచించిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’, రాష్ట్ర నృత్యం కూచిపూడి.

 

2018 జూన్‌ 6 నుంచి రాష్ట్ర పక్షి, జంతువు, పువ్వులను మారుస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం....
* రాష్ట్ర పక్షి - రామచిలుక
* రాష్ట్ర జంతువు - కృష్ణజింక
* రాష్ట్ర పుష్పం - మల్లెపువ్వు
* నూతన ఆంధ్రప్రదేశ్‌కు అధికారిక చిహ్నాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ అనీల్‌ చంద్ర పునేఠ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నూతన అధికారిక చిహ్నాన్ని నీలం, నలుపు, తెలుపు రంగులతో రూపొందించారు. చిహ్నం పైభాగంలో తెలుగులో, ఎడమవైపు చివర ఇంగ్లిషులో, కుడివైపు చివర హిందీలో ఆంధ్రప్రదేశ్‌ అని రాసి ఉంటుంది. దీనిలో త్రిరత్నాలు, మధ్యలో అందంగా ఉన్న ఆకులు, రత్నాలతో అలంకరించిన ధర్మచక్రం ఉంటాయి.
* చిహ్నం మధ్యలో క్రీ.శ.1వ శతాబ్దంలో ధాన్యకటక మహాచైత్యానికి ‘విధికుడు’ అనే చర్మకారుడు బహూకరించిన ‘పూర్ణ ఘటం’ ఉంటుంది. ఈ ఘటం చుట్టూ మూడు వృత్తాలు పైనుంచి వరుసగా 148, 118, 148 ముత్యాలతో అలంకరించి ఉంటాయి. దీని కింద జాతీయ చిహ్నమైన అశోక స్తంభంపై నాలుగు సింహాల బొమ్మ ఉంటుంది. పూర్తి చిహ్నం కింద ‘సత్యమేవ జయతే’ అని తెలుగులో రాసి ఉంటుంది.

* ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త శివనాగిరెడ్డి, ప్రముఖులతో కూడిన కమిటీ సిఫారసుల మేరకు ఈ చిహ్నాన్ని రూపొందించారు.
 

చిహ్నాన్ని ఉపయోగించడానికి అర్హులు
1) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంతి, మంత్రులు
2) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
3) రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు
4) అడ్వకేట్‌ జనరల్‌
5) అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు
6) జిల్లా కలెక్టర్లు
7) సచివాలయ మధ్యస్థాయి అధికారులు, సమానహోదా కలిగినవారు.


 

Posted Date : 17-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌