• facebook
  • whatsapp
  • telegram

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం

రాష్ట్రంలో 7,458 ఉప కేంద్రాలు, 1,148 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 198 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 28 ప్రాంతీయ ఆసుపత్రులు (ఏరియా హాస్పిటల్స్‌), 14 జిల్లా ఆసుపత్రులు, 3 మాతాశిశు ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వం వీటి ద్వారా ప్రసూతి, పిల్లల ఆరోగ్య సంరక్షణ, కుటుంబ సంక్షేమ సేవలను అందిస్తోంది. 2019 మేలో విడుదల చేసిన ‘శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌’ ్బళీళిళ్శీ బులెటిన్‌ ప్రకారం 2017 సంవత్సరానికి రాష్ట్రంలో క్రూడ్‌ జననాల రేటు 16.2%గా ఉండగా అఖిల భారత స్థాయిలో 20.2%గా ఉంది. క్రూడ్‌ మరణాల రేటు రాష్ట్రంలో 7.2% ఉండగా అఖిల భారత స్థాయిలో 6.3% గా ఉంది. శిశు మరణాల రేటు రాష్ట్రంలో ప్రతి 1000 జననాలకు 32గా ఉండగా అఖిల భారత స్థాయిలో 33గా ఉంది.

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ
పేదలకు అధునాతన శస్త్ర చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి, ఆరోగ్య సేవలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆరోగ్య, వైద్య సంరక్షణ సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. గుర్తింపు పొందిన ఆరోగ్య సంరక్షణ ప్రొవైడర్ల నెట్‌వర్క్‌ ద్వారా హాస్పిటలైజేషన్, సర్జరీలు, థెరపీల ప్రమేయం ఉన్న గుర్తించిన వ్యాధుల చికిత్సలో భాగంగా బాధితులకు గుణాత్మక వైద్య సంరక్షణను అందిస్తారు. దీన్ని మొదట 2007 ఏప్రిల్‌ 1 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ‘రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకం’ పేరుతో అమలు చేశారు. తర్వాత 5 దశల్లో ఉమ్మడి రాష్ట్రమంతటా ప్రారంభించారు. దీని అమలుకు నోడల్‌ ఏజెన్సీగా 2007 ఫిబ్రవరిలో ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని 938 వ్యాధులకు వర్తింపజేశారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకం పేరును ‘డాక్టర్‌ నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవ’గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2014 సెప్టెంబరు 27న ఉత్తర్వులు జారీ చేసింది. 938 వ్యాధులతో పాటు మరో 100 వ్యాధులను కలిపి మొత్తం 1038 వ్యాధులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 డిసెంబరు 17న డాక్టర్‌ నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవ పథకాన్ని ‘డాక్టర్‌ నందమూరి తారక రామారావు వైద్య సేవ’గా మార్చింది. 2015 ఆగస్టు 5న డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్య సేవను ట్రస్ట్‌గా గుర్తించారు. నూతన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పేరును ‘డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ’గా మారుస్తూ 2019 జూన్‌ 13న ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్‌ నందమూరి తారక రామారావు వైద్య సేవ ట్రస్ట్‌ను డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌గా మార్చింది. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ద్వారా అమలుచేస్తుంది. ఈ పథకానికి సంబంధించిన మొత్తం ప్రీమియాన్ని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.2.50 లక్షల వరకు లబ్ధి కల్పిస్తుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులు. ట్రస్టు కింద గుర్తించిన 1459 నెట్‌వర్క్‌ ఆసుపత్రుల ద్వారా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సేవలను అందిస్తారు. ఈ పథకం కింద 2018 19లో 13.97 లక్షల మంది రోగులకు లబ్ధి చేకూర్చే 22.35 లక్షల చికిత్సలకు ముందస్తు గుర్తింపు లభించింది. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మరిన్ని ఆరోగ్య సేవలను అందించడానికి ప్రస్తుతం ఉన్న 942 వ్యాధులకు 117 నూతన వ్యాధులను చేర్చారు. ఈ పథకం కింద మొత్తం 1059 వ్యాధులను గుర్తించారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకానికి 2019 20 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1740 కోట్లను కేటాయించారు. ఈ పథకాన్ని మరింతగా విస్తరించి కింది విధంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
* వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్న అన్ని కుటుంబాలకు వర్తింపు.
* వైద్య ఖర్చులు రూ.1000 మించిన అన్ని సేవలకు వర్తింపు.
* చికిత్స వ్యయంపై పరిమితి లేకుండా అన్నిరకాల వ్యాధులకు చికిత్స అందించడం.
* రాష్ట్రంలోనే కాకుండా సమీప రాష్ట్రాల్లోని సరిహద్దు జిల్లాల ప్రజల ప్రయోజనం కోసం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల్లోని పెద్ద ఆసుపత్రులను ప్రభుత్వ గుర్తింపు ఆసుపత్రుల జాబితాలో చేర్చడం.
* అన్నిరకాల వ్యాధులు, శస్త్ర చికిత్సలను డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద వర్తింపజేయడం.

ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ (APVVP)
ఏపీ వైద్య విధాన పరిషత్‌ కింద ప్రస్తుతం 1620 మంది వైద్యులు (నిపుణులతో కలిపి), 2689 మంది నర్సులు, 1213 మంది పారామెడికల్‌ సిబ్బంది, 496 మంది పరిపాలనా సిబ్బందితో 242 ఆసుపత్రులు ఆరోగ్య సంరక్షణ ఆసుపత్రుల కోసం పని చేస్తున్నాయి. వీటిలో 26 రక్త నిధి కేంద్రాలు, 93 రక్తాన్ని భద్రపరిచే కేంద్రాలు ఉన్నాయి.

108 సేవలు
రోగులు, ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించి సమీప ఆసుపత్రుల్లో చేర్చడానికి 108 సేవలను 2005 ఆగస్టు 15న ప్రారంభించారు. ఈ సేవలు 365 రోజుల్లో 24/7 ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ సేవల ద్వారా 2018-19లో 5.93 లక్షల మంది రోగులు ఆసుపత్రుల్లో చేరారు. 2019-20లో 8.50 లక్షల మందికి ఈ సేవలను విస్తరించాలని నిర్ణయించారు. కష్టతరమైన ప్రాంతాల నుంచి గర్భిణులను 108 అంబులెన్స్‌ సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు ఫీడర్‌ అంబులెన్స్‌ల ద్వారా చేరవేస్తారు. ముఖ్యంగా వీటిని గిరిజన ప్రాంతాల్లో (ఐటీడీఏ పరిధుల్లో) వినియోగిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం శిక్షణ పొందిన సాంకేతిక సిబ్బందితో మొత్తం 433 అంబులెన్స్‌లు సేవలను అందిస్తున్నాయి. నూతన ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఈ సేవలను వర్తింపజేయడానికి ప్రతి మండలంలో ఒక 108 వాహనాన్ని అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ప్రతి అంబులెన్స్‌ 20 నిమిషాల్లో రోగి వద్దకు చేరుకునే విధంగా 432 అదనపు అంబులెన్స్‌లను నూతనంగా తీసుకురావాలని నిర్ణయించింది. 108 సేవల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.143.38 కోట్లు కేటాయించింది.

104 సేవలు (మొబైల్‌ మెడికల్‌ యూనిట్లు)
గ్రామ స్థాయిలో వైద్యుల ద్వారా నాణ్యమైన ప్రాథమిక ఆరోగ్య రక్షణ సేవలను అందించే ఉద్దేశంతో 104 సేవలను ప్రారంభించారు. 2016 ఏప్రిల్‌ నుంచి 104 స్థిర రోజు ఆరోగ్య సేవలు (104 fixed day health services)ను అప్‌గ్రేడ్‌ చేశారు. ప్రతి మొబైల్‌ మెడికల్‌ యూనిట్లలో మెడికల్‌ ఆఫీసర్, స్టాఫ్‌నర్స్, ఫార్మాసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్‌ల బృందంతో సంచార చికిత్సలు అందించేందుకు మొత్తం 292 మొబైల్‌ మెడికల్‌ యూనిట్లు ఉన్నాయి. 13,523 గ్రామాల్లోని 2.37 కోట్ల మంది ప్రజలకు ఈ సేవలను అందించారు. ప్రతి లబ్ధిదారుడి ఎలక్ట్రానిక్‌ మెడికల్‌ రికార్డులను రియల్‌టైమ్‌ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ప్రతి మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌లో 50 రకాల మందులు, ప్రయోగశాల వినియోగ వస్తువులు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల మాతాశిశు మరణాల రేటు, ఆరోగ్యంపై అధిక వ్యయ భారం తగ్గుతుంది. వీటి ద్వారా 2018-19లో 12.45 లక్షల మంది రోగులు చికిత్స పొందగా, 2019-20లో 51.84 లక్షల మందికి చికిత్స చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 676 అదనపు వాహనాలను సేకరించి ఈ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తృతం చేయాలని నూతన రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 104 సేవల కార్యక్రమం కోసం 2019-20 సంవత్సరానికి ప్రభుత్వం రూ.179.76 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.

నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలు
గిరిజనులకు ప్రభుత్వ ఆసుపత్రులే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుగా ఉంటాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది (2019-20) రూ.66 కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో పాడేరు/అరకు ప్రాంతాల్లో గిరిజన వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విజయనగరంలో, గుంటూరులోని గురజాలలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

కార్పొరేట్‌ స్థాయికి ప్రభుత్వ ఆసుపత్రులు
రెండేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్‌ స్థాయిలో మౌలిక వసతులను కల్పించేందుకు 2019-20లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్లను ఖర్చు చేయనుంది.

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 48,770 ప్రధాన అంగాన్‌వాడీ కేంద్రాలు, 6837 మినీ అంగన్‌వాడీ కేంద్రాలతో 257 ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీస్‌ (ICDS) ప్రాజెక్టులను అమలు చేస్తోంది. మొత్తం 257 ప్రాజెక్టుల్లో 200 గ్రామీణ ప్రాంతాల్లో, 33 పట్టణ ప్రాంతాల్లో, 24 గిరిజన ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు. ఐసీడీఎస్‌ కింద అందించే ప్రధాన సేవల్లో సప్లిమెంటరీ న్యూట్రిషన్‌ ప్రోగ్రామ్‌ (పౌష్టికాహారాన్ని అందించడం) ఒకటి. దీన్ని 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేస్తున్నారు. 
             నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు 1,622 పంచాయతీలు న్యూట్రీ గార్డెన్‌ సాగును ప్రారంభించాయి. గిరిజన ప్రాంతాల్లో 23,225 మంది లబ్ధిదారులకు పోషకాహారాన్ని అందించేందుకు 8 నెలల నుంచి 2,168 విస్తరణ కేంద్రాలు పని చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మాతాశిశు సంక్షేమం, ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రసూతి మరణాల రేటు (MMR) 74ను 2019 20 చివరి నాటికి 55కు తగ్గించాలని; శిశు మరణాల రేటు (IMR)ను 32 నుంచి 2019-20 చివరి నాటికి 22కు తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. 2019-20 చివరి నాటికి నూటికి నూరు శాతం ప్రసవాలు సంస్థాగతపరంగా (ఇన్‌స్టిట్యూషనల్‌) జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇతర ఆరోగ్య సంబంధ చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం కిడ్నీ బాధితులకు నెలకు రూ.10,000 పింఛన్‌ను అందిస్తోంది. దీన్ని తలసేమియా, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వర్తింపజేయాలని భావిస్తోంది. మూత్రపిండ వ్యాధుల నివారణకు శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రత్యేక పరిశోధనా కేంద్రం, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య శాఖకు రాష్ట్ర ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌లో రూ.11,399.23 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కంటే 34.69 శాతం అధికం.

Posted Date : 17-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌