• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ - వ్యవసాయం

 పచ్చదనాల ధాన్యాగారం!
 

దేశంలో వ్యవసాయానికి అన్నిరకాల అనువైన పరిస్థితులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. విస్తార నీటివనరులు, నీటిపారుదల వసతులతో స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ఈ ప్రాంతం సాగు రంగంలో ముందంజలో ఉంది. స్వాతంత్య్రానంతరం ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకొని అమలు చేసింది.  దేశానికి తిండిగింజలతో పాటు వాణిజ్య పంటల ఉత్పత్తులను సమకూర్చే ప్రధాన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగంపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. ప్రధాన పంటలు, పంట కాలాలు, అవలంబిస్తున్న పద్ధతులు, సాగు విధానాల్లో వచ్చిన ప్రధాన మార్పులు, హరితవిప్లవం ప్రభావం, ఎక్కడెక్కడ ఏయే పరిశోధనా కేంద్రాలు ఉన్నాయనే వివరాలను తెలుసుకోవాలి.


భారతదేశంతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు జీవనాడి వ్యవసాయం. ప్రజలకు ఆహారం, ఉపాధి; పరిశ్రమలకు ముడి పదార్థాలు  తదితరాలకు సంబంధించి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఉంది. సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు, సమర్థ నీటిపారుదల, సారవంతమైన నేలలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనేక రకాల పంటలకు అనుకూలం. అందుకే ఏపీని దక్షిణ భారతదేశ ధాన్యాగారం/ పచ్చదనాల రాష్ట్రం/ భారతదేశ అన్నపూర్ణగా అభివర్ణిస్తారు.

పంటలు-రకాలు: రాష్ట్రంలో పండే పంటలను పలు రకాలుగా విభజించవచ్చు.

ఆహారపంటలు: వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు

పప్పుధాన్యాలు: కంది, పెసర, మినుము, శెనగలు, ఉలవలు

నూనెగింజలు: వేరుశెనగ, నువ్వులు, పామాయిల్, అవిసె, ఆవాలు, ఆముదం

నగదు పంటలు: పత్తి, పొగాకు, జనుము

తోట పంటలు: అరటి, తేయాకు, కాఫీ, జీడిమామిడి, చెరకు

ఉద్యానవన పంటలు: కూరగాయలు, పండ్లు, పూలు

పంట కాలాలు: రాష్ట్రంలో పంట కాలాలు మూడు రకాలు. 

1) ఖరీప్‌ 

2) రబీ

 3) జయాద్‌

1) ఖరీఫ్‌: దీన్ని నైరుతి రుతుపవన కాలం/ వానాకాలంగా వ్యవహరిస్తారు. ఇది దేశంలో, రాష్ట్రంలో మొదటి పంట కాలం. కోస్తాంధ్రలో దీనిని సాల్వ అనే పేరుతో పిలుస్తారు. పంట కాలం జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రధాన పంట వరి, ఇతర పంటలు జొన్న, మొక్కజొన్న, నూనెగింజలు.

2) రబీ: దీనిని శీతాకాల పంటగా చెబుతారు. ఈ కాలంలో ఈశాన్య రుతుపవనాలు ఆధారంగా ఉన్నాయి. పంట కాలం అక్టోబరు- మార్చి మధ్య కొనసాగుతుంది. కోస్తాంధ్రలో దీనిని దాల్వ పేరుతో పిలుస్తారు. సాగు చేసే పంటలు వరి, పొగాకు, వేరుశెనగ, పప్పుధాన్యాలు.

3) జయాద్‌: ఇది పరిమిత పంటకాలం. దీనిని వేసవి పంటకాలంగా పేర్కొంటారు. ఇది ఖరీఫ్‌- రబీ మధ్య ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో ఉంటుంది. కూరగాయలు, పుచ్చకాయలు, కర్బూజా కాయలు సాగు చేస్తారు. ఈ పంటలకు తొలకరి జల్లులు/మామిడి జల్లులు ఆధారమవుతాయి.


ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ పద్ధతులు: రాష్ట్రంలో రైతులు వివిధ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. భౌగోళిక పరిస్థితులు, నీటిపారుదల వసతులు, వాతావరణం, ఉత్పత్తులు గిరాకీ, కార్మికుల లభ్యత, సాంకేతిక స్థాయి అంశాల ఆధారంగా వివిధ వ్యవసాయ పద్ధతులు అమలులో ఉన్నాయి.

సాంద్ర వ్యవసాయం: రాష్ట్రంలో అధికంగా వాడుకలో ఉన్న వ్యవసాయ విధానం ఇది. ఈ పద్ధతిలో భాగంగా రైతు తన కుటుంబ అవసరాలను తీర్చుకోడానికి వ్యవసాయం చేస్తాడు. తక్కువస్థాయి సాంకేతికత, తక్కువగా యంత్రాల వినియోగం, చిన్న కమతాలు, అధికంగా శ్రామికుల వినియోగం, ఎరువుల వినియోగం ఈ పద్ధతి ప్రధాన లక్షణాలు. రుతుపవన పవనాలున్న ప్రాంతాలు, అధిక జనసాంద్రత ఉండే ప్రాంతాల్లో అమలులో ఉంది. ఇందులో కుటుంబ సభ్యులు మాత్రమే పనిచేస్తారు. భూకమతంలో ప్రతి సంవత్సరం ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించేందుకు అనుకూలంగా ఉంటుంది.

తోటల వ్యవసాయం: తోటలు ఒక రకమైన వ్యవసాయ పద్ధతి. ఇందులో పండించే పంటలు కాఫీ, తేయాకు, అరటి, జీడిమామిడి, చెరకు వంటివి. వీటికి పెట్టుబడి, శ్రమ, భూవిస్తీర్ణం ఎక్కువ అవసరం. ఉత్పత్తిని పొలంలో గానీ, లేదా సమీప కర్మాగారాలలో గానీ వినియోగిస్తారు. ఈ సాగు ఉన్న ప్రాంతాలు రవాణా సౌకర్యమున్న ప్రాంతాలతో తప్పనిసరిగా అనుసంధానమై ఉండాలి.

ఉదా: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ప్రాంతంలో కాఫీ, తేయాకు తోటల సాగు

వాణిజ్య వ్యవసాయం: ఇందులో వాణిజ్య ప్రయోజనాల కోసమే పంటలు పండిస్తారు. పంటల సాగు, జంతువుల పోషణకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. సాగు చేసే భూవిస్తీర్ణం, పెట్టుబడి పెద్ద మొత్తంలో ఉంటుంది. చాలావరకు యంత్రాల ద్వారానే పనులు జరుగుతాయి. ఈ ప్రాంతాల్లో తక్కువ జనాభా ఉండి, వందల హెక్టార్లలో భూములు విస్తరించి ఉంటాయి. రాష్ట్రంలో ఈ రకమైన పద్ధతి తక్కువ. తోటల వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం ఇందులో భాగం.

మిశ్రమ వ్యవసాయం: ఈ పద్ధతిలో భాగంగా వ్యవసాయ భూమిని ఆహారధాన్యాల ఉత్పత్తికి, పశువుల మేత పండించేందుకు, పశువుల పెంపకానికి ఉపయోగిస్తారు. ఈ రకమైన పద్ధతిలో నాణ్యమైన పశుగ్రాసం, పశురకాలు, పశువుల నిర్వహణకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ పద్ధతి కూడా రాష్ట్రంలో పరిమిత ప్రాంతాల్లో అమలులో ఉంది.

విస్తాపన వ్యవసాయం: ఈ పద్ధతిని కొండ/పర్వత, అటవీ ప్రాంతాల్లో గిరిజనులు అమలు చేస్తున్నారు. ఈ పద్ధతిని పోడు వ్యవసాయం/నరకు - కాల్చు పద్ధతి అని కూడా పిలుస్తారు. ఇందులో భాగంగా చెట్లను నరికి వాటిని తగులబెట్టి భూమిని చదును చేస్తారు. బూడిదను మట్టితో కలిపి సాగు చేస్తారు. నేలసారాన్ని కోల్పోతే, ఆ భూమిని వదిలి, మరో ప్రాంతానికి మారి ఇదే రకమైన పద్ధతి కొనసాగిస్తారు. ఈ పద్ధతిని ఈశాన్య రాష్ట్రాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో అనుసరిస్తున్నారు.

విప్లవాత్మక మార్పులు:  దేశవిభజన, కరవులు, నీటిపారుదల లేమి, భూమి కొద్దిమంది చేతిలో కేంద్రీకృతమై ఉండటం వంటివి దేశ వ్యవసాయ రంగంపై ప్రభావాన్ని చూపాయి. దీంతో దేశ వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు రాష్ట్రంలోనూ అమలయ్యాయి. 1960లో భారత ప్రభుత్వం 7 రాష్ట్రాల్లోని 7 జిల్లాల్లో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని(IADP  - Intensive Agriculture Districts Programme) ఫోర్డ్‌ ఫౌండేషన్‌ సహకారంతో ప్రారంభించింది. దీని ఉద్దేశం పంటల ఉత్పత్తి పెంచడం. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఈ పథకానికి ఎంపికైంది. 1965లో దేశవ్యాప్తంగా 114 జిల్లాల్లో అమలైన సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకంలో (IAAP - Intensive Agriculture Area Programme) ఆంధ్రప్రదేశ్‌ నుంచి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలున్నాయి.


ఏపీలో వివిధ పంటల పరిశోధనా కేంద్రాలు

 పంట-పరిశోధనా కేంద్రం ప్రాంతం
* వరి మార్టేరు, నెల్లూరు
* చెరకు అనకాపల్లి
* పండ్ల అనంతరాజుపేట (కడప)
* పసుపు పెద్దపాళెం (గుంటూరు)
* అరటి కొవ్వూరు
* కొబ్బరి                   అంబాజీపేట, రాజోలు
* ఉల్లి ఎర్రగుంట్ల (కడప)
* పత్తి నంద్యాల
* మిర్చి లాం (గుంటూరు), గన్నవరం
* ఆయిల్‌ఫామ్‌ పెదవేగి (ఏలూరు)
* వ్యవసాయ సామర్లకోట (తూర్పుగోదావరి)
* జీడిమామిడి బాపట్ల, పలాస
* నిమ్మ పెట్లూరు (నెల్లూరు)
* మామిడి నూజివీడు
* మొక్కజొన్న             విజయరాయి
* గోగు ఆముదాలవలస (శ్రీకాకుళం)
* చిరుధాన్యాల పొదలకూరు
* విత్తనాభివృద్ధి పెద్దపేట (శ్రీకాకుళం)
* మోడల్‌ ఆగ్రో  ప్రాసెసింగ్‌ సెంటర్‌ బాపట్ల
* పొగాకు రాజమహేంద్రవరం


రచయిత: దంపూరి శ్రీవివాసులు

Posted Date : 22-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌