• facebook
  • whatsapp
  • telegram

స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధి ప్రణాళికలు - ప్రణాళికా కాలంలో భారతదేశ ఆర్థికాభివృద్ధి

ప్రణాళికలు - పరిణామ క్రమం
లభ్యమవుతున్న వనరులను ఎంత సామర్థ్యంతో వీలైతే అంత సామర్థ్యంతో ఉపయోగించుకుని స్పష్టమైన లక్ష్యాలను సాధించాలని ఉద్దేశ పూర్వకంగా, జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ప్రభుత్వం తీసుకునే చొరవే ప్రణాళిక అని ప్రణాళికా సంఘం నిర్వచించింది.
* ఆడంస్మిత్ లాంటి సంప్రదాయవాదులు ఆర్థిక వ్యవస్థను అదృశ్య హస్తం నడిపిస్తుందని అంటారు. అదృశ్య హస్తం అంటే డిమాండు, సప్లయి లాంటి మార్కెటు శక్తులు. వీటినే ధరల యంత్రాంగం అని కూడా అంటారు.
* జె.బి. సే ప్రకారం సప్లయి తనకు తాను డిమాండ్‌ను సృష్టించుకుంటుంది. అంటే ఉత్పత్తి జరుగుతున్న క్రమంలో ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలను చెల్లించడం జరుగుతుంది. ఉత్పత్తి కారకాలు తాము పొందిన ప్రతిఫలంతో ఉత్పత్తి అయిన వస్తువులను డిమాండు చేస్తాయి. ఆ విధంగా సప్లయి, డిమాండులు సమానం అవుతాయి. కాబట్టి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదు. అని సంప్రదాయ ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు.

* 1929 - 33 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన ఆర్థిక మాంద్యం కాలంలో సంప్రదాయవాదుల సిద్ధాంతం పని చేయలేదు.
* ఆర్థికమాంద్యం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ప్రభుత్వ జోక్యం తప్పనిసరి అనేది జె.ఎం. కీన్స్ అభిప్రాయం.
* 1929 - 33 మధ్యకాలంలో ఆర్థిక మాంద్యం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఏర్పడింది. ఫలితంగా మాంద్యం ప్రభావం అన్ని దేశాలపై పడింది. అయితే ఈ ఆర్థిక మాంద్యం ప్రణాళికలను అమలు చేస్తూ ప్రణాళికా బద్ధమైన ప్రగతిని సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న రష్యా (సోవియట్ యూనియన్)ను ప్రభావితం చేయలేదు. కొన్ని వందల సంవత్సరాల్లో అమెరికా సాధించిన వృద్ధిని రష్యా కేవలం కొన్నేళ్లలోనే సాధించింది. ఫలితంగా ప్రణాళికా భావన ప్రపంచ దేశాలను, ఆర్థిక వేత్తలను ప్రభావితం చేసింది. భారత్ కూడా రష్యాను స్ఫూర్తిగా తీసుకుని ప్రణాళికలను ప్రారంభించింది.

 

స్వాతంత్య్రానికి ముందు
* స్వాతంత్య్రానికి ముందు మనదేశానికి ఒక ప్రణాళిక అవసరమని చెప్పిన నాయకుడు సుభాష్ చంద్రబోస్.
* 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లాన్‌డ్ ఎకానమీ ఫర్ ఇండియా (Planned Economy for India) అనే గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథంలో భారతదేశానికి 10 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించారు.

* భారత జాతీయ కాంగ్రెస్ (INC) 1938లో జాతీయ ప్రణాళికా కమిటీని జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన వేసింది.
* 1943లో బాంబేకి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు A Plan of economic development for India అనే పేరుతో 15 సంవత్సరాల కాలానికి ఒక ప్రణాళికను రూపొందించారు. దీన్ని బాంబే ప్లాన్ అంటారు. వీరు ఇనుము, ఉక్కు, సిమెంట్, రసాయనాలు లాంటి భారీ పరిశ్రమల అభివృద్ధిని కాంక్షించారు.
* 1944లో ఎం.ఎన్. రాయ్ ప్రజాప్రణాళికలను (People's plan) రూపొందించారు. ఈయన వ్యవసాయ రంగానికి, వినియోగ వస్తువులకు ప్రాధాన్యం ఇచ్చారు.
* బాంబే ప్రణాళికను పారిశ్రామికవేత్తలు రూపొందించడం వల్ల అది పెట్టుబడిదారీ స్వభావాన్ని కలిగి ఉండగా, ప్రజాప్రణాళిక సామ్యవాద భావాలను కలిగి ఉంది.
* బాంబే ప్లాన్ భారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వగా, పీపుల్స్ ప్లాన్ చిన్న పరిశ్రమలకు, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చింది.
* 1944లో శ్రీమన్నారాయణ అగర్వాల్ గాంధీ ప్రణాళికను రూపొందించి, వికేంద్రీకృత ప్రణాళికను సూచించారు. గాంధీ ప్రణాళికను క్రోడికరించి ఆర్థిక ప్రణాళికను రూపొందించారు. కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారు.
* శ్రీమన్నారాయణ అగర్వాల్ గాంధీ ప్రణాళికను రూ.3,500 కోట్ల వ్యయ అంచనాలతో రూపొందించారు.

* 1946లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం ప్రణాళికల అభివృద్ధి సమస్యలను పరిష్కరించడానికి High level advisory planning board ను ఏర్పాటు చేసింది. ఇది భారతదేశంలో స్థిరప్రాతిపదికన ఒక ప్రణాళికా సంఘం ఉండాలని సలహా ఇచ్చింది.
 

స్వాతంత్య్రానంతరం:
* రెండో ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్య్రం పొందిన వెనుకబడిన దేశాలు రష్యా దేశాన్ని మార్గదర్శకంగా తీసుకుని ఆర్థిక ప్రణాళికలను అమలు చేశాయి. ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను అమలు చేయడం, నిర్ణీత కాలవ్యవధిలో, నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నియంత్రించడాన్ని ఆర్థిక ప్రణాళికా విధానం అంటారు.
* కొరతగా ఉండి ప్రత్యామ్నాయ ఉపయోగిత ఉన్న సహజ వనరులను సమర్థంగా వినియోగించి నిర్ణీత కాలంలో గరిష్ఠ వృద్ధిరేటు సాధించడానికి ఆర్థిక ప్రణాళికలు తోడ్పడతాయి.
* 1950లో జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ ప్రణాళికను రూపొందించారు.
* భారతదేశానికి ఒక ప్రణాళికా సంఘం అవసరమని అప్పటి ఆర్థికశాఖ మంత్రి షణ్ముగం శెట్టి పేర్కొంటూ ప్రణాళికా సంఘం స్వరూప, స్వభావాలను వివరించారు. దీనికి అనుగుణంగా 1950, మార్చి 15న కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు ప్రణాళికా సంఘం ఏర్పడింది.

ప్రణాళికా సంఘం:
* కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు 1950, మార్చి 15న ఇది ఏర్పడింది.
* ఇది రాజ్యాంగేతర సంస్థ, చట్టబద్ధం కాని సంస్థ.
* ఇది కేవలం కేంద్ర మంత్రిమండలి తీర్మానం మేరకు ఏర్పడిన సలహాసంఘం మాత్రమే.
* ఈ ప్రణాళికా సంఘానికి అధ్యక్షుడిగా లేదా ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా దేశ ప్రధానమంత్రి వ్యవహరిస్తారు.
* ఈ ప్రణాళికా సంఘానికి క్రియాశీలకంగా పనిచేసే వాస్తవ కార్య నిర్వాహకుడు ఒకరు ఉంటారు. అతడే ఉపాధ్యక్షుడు అయితే అతడి పదవీకాలం, నియామకం, తొలగింపు లాంటి అన్ని అంశాలు ప్రభుత్వం విచక్షణ మేరకు జరుగుతాయి.
* ఆదేశిక సూత్రాల్లోని 39వ అధికరణ ప్రకారం స్త్రీ, పురుషులు సమాన జీవన ప్రమాణాలను పొందాలని, దేశంలోని సహజ వనరులు సమానంగా పంపిణీ కావాలనీ, ఆర్థికశక్తి కొద్దిమంది వద్దే కేంద్రీకృతం కాకుండా చూడాలనీ తెలుపుతుంది.
* భారత రాజ్యాంగంలోని 39వ అధికరణను అనుసరించి ప్రణాళికా సంఘం ఏర్పాటైంది.
* ఆర్థిక ప్రణాళికలు ఉమ్మడి జాబితాకు సంబంధించినవి. అందువల్ల ప్రణాళికలకు సంబంధించి కేంద్రం, రాష్ట్రం రెండూ కూడా ప్రణాళికలను రూపొందించుకుంటాయి.
ప్రణాళిక సంఘం మొదటి అధ్యకుడు: జవహర్‌లాల్ నెహ్రూ.
ప్రణాళికా సంఘం మొదటి ఉపాధ్యక్షుడు: గుల్జారీలాల్ నందా.
ప్రణాళికా సంఘం చివరి అధ్యక్షుడు: నరేంద్రమోదీ.
ప్రణాళికా సంఘం చివరి ఉపాధ్యక్షుడు: మాంటెక్ సింగ్ అహ్లూవాలియా.

జాతీయ అభివృద్ధి మండలి (National Development Council - NDC)
* ఇది 1952, ఆగస్టు 6న ఏర్పడింది.
* ఇది రాజ్యాంగేతర సంస్థ, చట్టబద్ధం కాని సంస్థ.
* ఇది కూడా ప్రణాళికా సంఘం మాదిరి కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు ఏర్పడింది.
* ప్రణాళికా సంఘంలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేదు. అందువల్ల ప్రణాళికల అమలులో రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో ఈ జాతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేశారు.
* ఇది రాష్ట్రాలకు, ప్రణాళికా సంఘానికి మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది. ప్రణాళికల నిర్మాణంలో రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తుంది.
* మనదేశంలో ప్రణాళికలను తయారు చేసేది ప్రణాళిక సంఘం. వాటిని ఆమోదించేది జాతీయ అభివృద్ధి మండలి. ఇది ఆమోదించిన తర్వాతే ప్రణాళికలు అమల్లోకి వస్తాయి.
* జాతీయ అభివృద్ధి మండలికి ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* ప్రణాళికా సంఘం కార్యదర్శి జాతీయ అభివృద్ధి మండలి (NDC)కి కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
* NDC సభ్యుల్లో ప్రతి ఒక్కరూ ఎక్స్ అఫీషియో సభ్యులే. NDCలో పనిచేయడానికి పూర్తికాల సభ్యులు ఒక్కరూ కూడా లేరు.

* 1967లో పరిపాలనా సంఘం చేసిన సూచనల మేరకు జాతీయ అభివృద్ధి మండలి సభ్యత్వాన్ని విస్తరించారు. దీనిలోని సభ్యులు
    1) రాష్ట్ర ముఖ్యమంత్రులు.
    2) కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్‌లు.
    3) ప్రణాళికా సంఘం సభ్యులు.
    4) కేంద్ర కేబినెట్ మంత్రులు.
* ప్రణాళిక సంఘం రూపొంచిందించిన ప్రణాళికలను చివరగా జాతీయ అభివృద్ధి మండలి ఆమోదిస్తేనే అవి అమల్లోకి వస్తాయి.
* అదేవిధంగా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రణాళికా బోర్డు (State Planning Board) ఉంటుంది. ముఖ్యమంత్రి దీనికి అధ్యక్షుడిగా ఉంటారు.
* జిల్లాల్లో కూడా జిల్లా ప్లానింగ్ బోర్డు (District Planning Board) ఉంటుంది. జిల్లా కలెక్టరు దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అదేవిధంగా జిల్లా ప్లానింగ్ కమిటీ (District Planning Committee) కి ఛైర్మన్‌గా జిల్లాపరిషత్ ఛైర్మన్ వ్యవహరిస్తారు.

ప్రణాళికలు - వ్యూహాలు: ప్రణాళికా వ్యూహానికి మూడు అంశాలు ఆధారం.
     1) ఆర్థిక వ్యవస్థలో కనుక్కున్న వనరుల సమగ్ర అంచనా.
     2) దేశ సమస్యల తీవ్రత ఆధారంగా నిర్ణీతకాలంలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్ణయించడం.
     3) నిర్ణయించిన లక్ష్యాల సాధనకు పటిష్ట వ్యూహరచన.

 

ప్రణాళికలు - రకాలు:
ప్రభుత్వ పాత్రను బట్టి ప్రణాళికలు రెండు రకాలు.
    1) ఆదేశాత్మక ప్రణాళిక
    2) సూచనాత్మక ప్రణాళిక.

 

1) ఆదేశాత్మక ప్రణాళిక/ నిర్దేశాత్మక ప్రణాళిక
* ఇందులో ప్రణాళిక రచన, అమలు లాంటి వ్యవహారాలను సర్వాధికారాలున్న ఒక కేంద్ర సంస్థ నిర్వహిస్తుంది. దీనిలో ప్రజలకు, రాష్ట్రాలకు, వినియోగదారులకూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండవు.
* ఆర్థిక వ్యవస్థలోని వనరులు, ఆర్థిక కార్యకలాపాలన్నీ కేంద్ర సంస్థ దిశానిర్దేశం మేరకు జరుగుతాయి.
* సాధారణంగా ఇలాంటి ప్రణాళికలు రష్యా లాంటి సామ్యవాద దేశాల్లో అమలవుతాయి.

 

2) సూచనాత్మక ప్రణాళిక:
* దీనిలో ప్రభుత్వ స్థూల అంశాలను నిర్దేశించి, వాటిని సాధించడం కోసం ప్రైవేట్ రంగానికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుంది. కానీ దిశానిర్దేశం చేయదు.

* ఇలాంటి ప్రణాళికలను మొదటిసారిగా 1947 - 50లో ఫ్రాన్స్ ప్రభుత్వం అమలు చేసింది.
* ఈ ప్రణాళికను మార్కెట్ ప్రణాళిక అని కూడా పిలుస్తారు.
* ఇది మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుంది.
* మనదేశంలో ఈ ప్రణాళికను 8వ పంచవర్ష ప్రణాళిక నుంచి అమలు చేస్తున్నారు.

 

ప్రజల భాగస్వామ్యం ఆధారంగా .......
    1) కేంద్రీకృత ప్రణాళిక
    2) వికేంద్రీకృత ప్రణాళిక

 

1) కేంద్రీకృత ప్రణాళిక:
* ప్రణాళిక రచన, అమలుకు సంబంధించిన వ్యవహారాలను సర్వాధికారాలు ఉన్న ఒక కేంద్ర సంస్థ చూస్తుంది.

 

2) వికేంద్రీకృత ప్రణాళిక:
* కిందిస్థాయి నుంచి (గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో) ప్రణాళికలను తయారుచేసి, వాటి ఆధారంగా కేంద్ర ప్రణాళికలను తయారు చేయడాన్ని వికేంద్రీకృత ప్రణాళిక అంటారు.

 

వనరుల కేటాయింపుల ఆధారంగా.........
    1) భౌతిక ప్రణాళిక
    2) విత్త ప్రణాళిక

1) భౌతిక ప్రణాళిక:
* సహజ వనరులు, మానవ వనరులు, ముడిపదార్థాలు లాంటి వాస్తవిక అంశాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించే ప్రణాళికను భౌతిక ప్రణాళిక అంటారు.

 

2) విత్త ప్రణాళిక:
* నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ద్రవ్యం రూపంలో వనరులను అంచనావేస్తే దాన్ని విత్త ప్రణాళిక అంటారు.

 

కాలం ఆధారంగా ప్రణాళికలు..........
    1) స్వల్పకాలిక ప్రణాళిక
    2) మధ్యకాలిక ప్రణాళిక
    3) దీర్ఘకాలిక ప్రణాళిక

 

1. స్వల్పకాలిక ప్రణాళిక:
* ఒక సంవత్సర కాలానికి రూపొందించే ప్రణాళికలను స్వల్పకాలిక ప్రణాళికలు అంటారు.

 

2. మధ్యకాలిక ప్రణాళిక:
* 4, 5, 6 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలను తయారుచేస్తే వాటిని మధ్యకాలిక ప్రణాళికలు అంటారు.

3. దీర్ఘకాలిక ప్రణాళిక:
* 15 నుంచి 20 సంవత్సరాల కాలానికి తయారుచేసే ప్రణాళికలను దీర్ఘకాలిక ప్రణాళికలు అంటారు.

 

సరళత్వం ఆధారంగా...........
      1) నిర్దిష్ట/స్థిర ప్రణాళిక
      2) నిరంతర ప్రణాళిక

 

1. నిర్దిష్ట/స్థిర ప్రణాళిక:
* కొన్ని సంవత్సరాల కాలాన్ని స్థిరంగా నిర్ణయించి ప్రణాళికను రూపొందిస్తే దాన్ని స్థిర/నిర్దిష్ట ప్రణాళిక అంటారు.

 

2. నిరంతర ప్రణాళిక:
* కొత్తగా, అనూహ్యంగా ఎదురయ్యే సమస్యలను బట్టి ప్రణాళిక లక్ష్యాలను కూడా నిరంతరం మార్చుకోవడానికి అవకాశం ఉండే ప్రణాళికను నిరంతర ప్రణాళిక అంటారు.
* ఈ నిరంతర ప్రణాళికను ప్రపంచంలో మొదటిసారిగా తయారుచేసింది గున్నార్ మిర్డాల్. ఈయన స్వీడన్ దేశస్థుడు.
* ఈ ప్రణాళికను మొదటిసారిగా నెదర్లాండ్స్‌లో అమలు చేశారు.
* ఇండియాలో ఈ నిరంతర ప్రణాళికా నమూనాను డాక్టర్ లక్‌డావాలా తయారుచేశారు.

 

వ్యవస్థ స్వరూపం ఆధారంగా ..........
     1) నిర్మాణాత్మక ప్రణాళికలు
     2) కార్యాత్మక ప్రణాళికలు

ప్రాంతాన్ని బట్టి..........
     1) ప్రాంతీయ ప్రణాళిక
     2) జాతీయ ప్రణాళిక
     3) అంతర్జాతీయ ప్రణాళిక
* ప్రణాళికలను పాక్షిక ప్రణాళిక, సాధారణ ప్రణాళిక, వార్షిక ప్రణాళికలుగా కూడా వర్గీకరించవచ్చు.
వార్షిక ప్రణాళికలు: ఒక సంవత్సర కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తయారుచేసే ప్రణాళికను వార్షిక ప్రణాళిక అని పిలుస్తారు. దీన్ని పిగ్మీ ప్రణాళిక అంటారు.
భారత్‌లో వార్షిక ప్రణాళికల కాలం: 1966 - 69 (3 సంవత్సరాలు), 1990 - 92 (2 సంవత్సరాలు)
* ప్రణాళికలను వేరొక విధంగా కూడా పేర్కొనవచ్చు. అవి:

 

1. నియంతృత్వ ప్రణాళిక:
* ఒక నియంతృత్వ వ్యక్తి లేదా ప్రభుత్వం చేతిలో ప్రణాళిక నియంత్రణ ఉంటే అది నియంతృత్వ ప్రణాళిక.

 

2. ప్రజాస్వామ్య ప్రణాళిక:
* ఈ ప్రణాళికలో లక్ష్యాలు, వనరుల కేటాయింపులను ప్రజాప్రతినిధులు నిర్ణయిస్తారు.
* ఈ ప్రణాళికలో ఉత్పత్తి, ఆర్థిక కార్యకలాపాలను ప్రభుత్వం నిర్ణయించదు.
* ప్రణాళికా సంఘం తయారు చేసిన ప్రణాళికలను మార్చే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.

3. శాశ్వత ప్రణాళిక:
* ఒకసారి ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలను రూపొందిస్తే అవి దీర్ఘకాలంలో కూడా అమలు అవుతాయి. వాటిని మధ్యలో ఆపివేయడం లాంటిది జరగదు.

 

4. అత్యవసర ప్రణాళిక:
* ఆర్థిక వ్యవస్థలో అసమతౌల్యాలు ఏర్పడినప్పుడు, వాటిని తొలగించడానికి తాత్కాలికంగా ప్రవేశపెట్టేదే అత్యవసర ప్రణాళిక. అత్యవసర పరిస్థితులు తొలిగిపోయిన తర్వాత ఈ ప్రణాళికను రద్దు చేస్తారు.

 

5. సాధారణ ప్రణాళిక:
* ఇందులో స్థూల సమస్యలనే ప్రస్తావిస్తారు. స్థూల మార్గదర్శకాలు మాత్రమే ఉంటాయి.

 

6. వివరణాత్మక ప్రణాళిక:
* స్థూల మార్గదర్శకాలే కాకుండా వాటిని సాధించడానికి పూర్తి వివరాలు కూడా ఉంటాయి.

 

7. కరెక్టివ్ ప్లాన్: (Corrective plan)
* బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో తరచూ వ్యాపార చక్రాలు సంభవిస్తూ ఉంటాయి. ఆ వ్యాపార చక్రాల నియంత్రణకు తయారు చేసే ప్రణాళికను Anticyclical planning లేదా Corrective plan అని అంటారు.

8. డెవలప్‌మెంట్ ప్లాన్:
* ఆర్థికాభివృద్ధి సాధన కోసం వెనుకబడిన దేశాల్లో అవలంబించే ప్రణాళిక. ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగితను పెంచడమే దీని లక్ష్యం. ఇది కరెక్టివ్ ప్లాన్ కంటే కూడా విస్తృతమైంది.

 

9. మిశ్రమ ఆర్థిక ప్రణాళిక:
* ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు కలిసి ఉండే ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. అందుకు తగిన ప్రణాళికే mixed economy planning.
* మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రయివేటు రంగానికి స్వేచ్ఛ ఉంటుంది. కానీ పెట్టుబడిదారీ వ్యవస్థకు ఉన్నంత స్వేచ్ఛ ఉండదు.

 

ప్రణాళికా విరామం (plan holiday):
* ఒక planకి మరొక planకి మధ్య వచ్చిన విరామాన్నే ప్రణాళికా విరామం (plan holiday) అంటారు.
* భారత్‌లో 1966 - 69 మధ్య 3 సంవత్సరాలు, 1990 - 92 మధ్య 2 సంవత్సరాలు ప్రణాళికా విరామం వచ్చింది.

 

భారత పంచవర్ష ప్రణాళికల దీర్ఘకాలిక లక్ష్యాలు:
   1. జాతీయ, తలసరి ఆదాయం పెంచడానికి గరిష్ఠ ఉత్పత్తి సాధించడం.
   2. వ్యవసాయ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి.
   3. పారిశ్రామిక ప్రగతి.

   4. సంపూర్ణ ఉద్యోగిత సాధించడం.
   5. ఆదాయ సంపదల అసమానతలు తగ్గించడం.
   6. సాంఘిక న్యాయం చేకూర్చడం.
   7. ప్రాంతీయ అసమానతలను తగ్గించడం.
   8. జననాణ్యత మెరుగుపరచడానికి సాంఘిక రంగ అభివృద్ధి.

 

భారత ప్రణాళికల లక్షణాలు:
* ఇవి సూచనాత్మక ప్రణాళికలు
* సమగ్ర ప్రణాళికలు
* భౌతిక, విత్తప్రణాళికలు
* ప్రజాస్వామ్య వికేంద్రీకృత ప్రణాళికలు
* దీర్ఘకాలిక స్వభావాన్ని కూడా కలిగి ఉన్నాయి.

Posted Date : 13-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌