• facebook
  • whatsapp
  • telegram

సమాజాభివృద్ధి - సంక్షేమ చర్యలు


సమాజంలోని వివిధ బలహీన వర్గాలకు రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలు, ఫ్రీ-పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు, పోటీ పరీక్షల అధ్యయన కేంద్రాల ఏర్పాటు; విదేశీ విద్య, జీవనోపాధి అభివృద్ధికి, సాంఘిక కార్యక్రమాలు, మహిళా సాధికారతకు ఆర్థిక సహాయం, మెరుగైన ఆరోగ్యానికి వైద్య సహాయం, సాదర జీవిత బీమా/ప్రమాద బీమా, సామాజిక భద్రతా పెన్షన్లు లాంటి కార్యక్రమాలు అమలు చేసి ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ముఖ్య ఉద్దేశం.
2014, జూన్‌ 2న నూతన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గత రాష్ట్ర ప్రభుత్వం (2014-19) సమాజంలోని వివిధ వర్గాలకు అనేక సామాజిక, ఆర్థిక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఇటీవల నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పేర్కొన్న ‘నవరత్నాలు’లో భాగంగా సమాజంలోని వివిధ వర్గాల కోసం అనేక నూతన పథకాలను ప్రకటించింది.

వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక
* నూతన రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్లు పథకం పేరును ‘వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక’గా మార్చింది. ఈమేరకు 2019 మే 30న ఉత్తర్వులు జారీ చేసింది (గతంలో దీని పేరు ఎన్‌టీఆర్‌ భరోసా). ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పథకాన్ని 2019 జూన్‌ నుంచి అమలై, 2019 జులై 1 నుంచి పెన్షన్‌ చెల్లింపులు జరిగేలా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఈ పథకం కింద లబ్ధిదారులను గుర్తించడానికి వయఃపరిమితిని 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించింది.
* ఈ పథకం కింద మొత్తం 12 రకాల సామాజిక భద్రతా పెన్షన్‌లను అందిస్తున్నారు. దీనిలో భాగంగా వృద్ధులు, వితంతువులు; చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, సంప్రదాయ చర్మకారులు, ఎయిడ్స్‌ రోగులకు పెన్షన్‌ను నెలకు రూ.2000 నుంచి రూ.2250కు పెంచారు. దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, డప్పు కళాకారులకు నెలకు రూ.3000కు పెంచారు; గతంలో డయాలసిస్‌ రోగులకు ఇచ్చే రూ.3500 పింఛన్‌ను రూ.10,000కు పెంచారు.
* ఆంధ్రప్రదేశ్‌ సామాజిక ఆర్థిక సర్వే 2018-19 ప్రకారం 2019 ఏప్రిల్‌లో మొత్తం 54,28,247 మంది లబ్ధిదారులకు పెన్షన్లను అందించారు. వీరిలో అత్యధికంగా వృద్ధులు (23,43,474), వితంతువులు (20,02,626) లబ్ధి పొందుతున్నారు.
* రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్‌ వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించడంతో పాటు తలసేమియా, పక్షవాతం, కుష్ఠు వ్యాధిగ్రస్తులకు కూడా పింఛన్‌లు మంజూరు చేస్తే ఈ పథకం లబ్ధిదారులు 65 లక్షల వరకు ఉంటారని అంచనా. ప్రస్తుతం ఇస్తున్న రూ.2250ను నాలుగేళ్లలో రూ.3000కు పెంచుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి బడ్జెట్‌లో 2019-20 సంవత్సరానికి రూ.15,746.58 కోట్లను కేటాయించింది.

సామాజిక భద్రత పెన్షన్‌లకు అనర్హులు
* కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు
* ప్రభుత్వ ఉద్యోగ పింఛన్లు పొందేవారు
* ఆదాయపన్ను చెల్లించేవారు
* 2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట లేదా ఈ రెండూ కలిపి 5 ఎకరాల కంటే ఎక్కువ కలిగిన భూయజమానులు (ఐటీడీఏ పరిధిలోని షెడ్యూల్డ్‌ ప్రాంతాల ఎస్టీలు మినహా). అనంతపురంలో అయితే 5 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమి కంటే ఎక్కువ గల భూయజమానులు. నీ పొరుగు సేవల (ఔట్‌సోర్స్‌) ఉద్యోగులు నీ ప్రైవేటు ఉద్యోగులు (నెలవారీ జీతాలు పొందేవారు)
* కారు యజమాని నీ స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్‌ పొందేవారు. 
* జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలో జిల్లా స్థాయిలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పథకం మొత్తం అమలును జిల్లా గ్రామీణాభివృద్ధి అథారిటీ (డీఆర్‌డీఏ), ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పర్యవేక్షిస్తారు.
* ఈ పథకం మొత్తం లబ్ధిదారుల్లో 44.38% వృద్ధాప్య పెన్షన్లు, 37.56% వితంతు పెన్షన్లు, 11.81% దివ్యాంగుల పెన్షన్లు ఉండగా తర్వాతి స్థానాల్లో ఒంటరి మహిళలు; చేనేత, కళ్లుగీత కార్మికులు; హెచ్‌ఐవీ, కిడ్నీ బాధితుల పెన్షన్‌లు ఉన్నాయి. ట్రాన్స్‌జెండర్‌ పెన్షన్‌ దారులు అత్యల్పంగా 0.03% ఉన్నారు.

వైఎస్‌ఆర్‌ బీమా (పీఎంజేజేబీవై - వైఎస్‌ఆర్‌ బీమా)
రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో అసంఘటిత రంగంలో పనిచేసే పేద కార్మికుల కుటుంబాల్లోని కార్మికులు అనారోగ్యం లేదా ప్రమాదవశాత్తు అకాలమరణానికి గురైనప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబరు 2 నుంచి ప్రమాద బీమా పథకాన్ని అమలుచేస్తోంది. దీన్ని గత ప్రభుత్వం పీఎంజేజేబీవై చంద్రన్న బీమా పేరుతో అమలుచేసింది. నూతన ప్రభుత్వం దీన్ని పీఎంజేజేబీవై (ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన) - వైఎస్‌ఆర్‌ బీమా పథకంగా మారుస్తూ 2019 జులై 22న ఉత్తర్వులు జారీ చేసింది.
* గతంలో 51-60 ఏళ్ల మధ్య వయసు వారు సహజంగా మరణిస్తే రూ.30,000 ఇచ్చేవారు. నూతన ప్రభుత్వం దాన్ని రూ.1,00,000కు పెంచనున్నట్లు ప్రకటించింది.
* వైఎస్‌ఆర్‌ బీమా పథకానికి 2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో రూ.404.02 కోట్లు కేటాయించారు.

వైఎస్‌ఆర్‌ బీమా పథకానికి అర్హతలు
* అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు
* 18 - 70 ఏళ్ల వయసు గలవారు
* నెలసరి ఆదాయం రూ.15,000 కంటే తక్కువ ఉన్నవారు
* మాగాణి భూమి 2.5 ఎకరాలు లేదా మెట్ట భూమి 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నవారు
* ఈ పథకంలో భాగంగా ప్రమాద బీమాకు సంబంధించి మొత్తం నాలుగు రకాల బీమా ప్రీమియంలు ఉన్నాయి.
1) ఆమ్‌ ఆద్మీ బీమా యోజన (AABY)
2) ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన (PMJJBY)
3) ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY)
4) రాష్ట్ర ప్రభుత్వ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ

ప్రయోజనాలు
అంశం ప్రయోజనం (రూ.)
ప్రమాద మరణం 5,00,000
పూర్తి అంగవైకల్యం 5,00,000
పాక్షిక అంగవైకల్యం 2,50,000
సహజ మరణం
1) 18-50 మధ్య వయసు వారికి 2,00,000
2) 51-60 మధ్య వయసు వారికి 30,000
బాధితుల పిల్లలకు ఉపకార వేతనం 9, 10, ఇంటర్, ఐటీఐ చదువుతున్నవారికి ఏడాదికి రూ.1200 చొప్పున ఇద్దరు పిల్లల వరకు


వైఎస్‌ఆర్‌ కళ్యాణ కానుక
* రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహం భారం కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
* పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సహాయం చేయడమే కాకుండా బాల్య వివాహాలను నిర్మూలించడం, వివాహ రిజిస్ట్రేషన్‌ ద్వారా వదువుకు రక్షణ కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
* చంద్రన్న పెళ్లికానుక పేరును నూతన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ కళ్యాణ కానుకగా మార్చాలని నిర్ణయించింది.
* ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలకు చెందిన యువతులకు ఇచ్చే రూ.35,000ల వివాహ కానుకను రూ.50,000కు పెంచాలని; ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల వివాహ కానుకను రూ.50,000 నుంచి రూ.1,00,000కు పెంచాలని నిర్ణయించింది. గతంలో మైనారిటీలకు వివాహకానుకను అందించే దుల్హన్‌ పథకాన్ని వైఎస్‌ఆర్‌ షాదీకా తోఫాగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* ఈ పథకం కింద 2018-19లో రూ.157.14 కోట్ల వ్యయంతో 51,422 మంది బీసీ యువతులు; రూ.101.67 కోట్ల వ్యయంతో 24,599 మంది ఎస్సీ యువతులు లబ్ధి పొందారు.
* 2018-19లో పెళ్లికానుక కింద అర్హులైన యువతులకు వివాహ ప్రోత్సాహకానికి సంబంధించి రూ.248.02 కోట్లతో 58,607 మందికి 100%; రూ.63.74 కోట్లతో 18,767 మందికి 80 శాతం; రూ.21.03 కోట్లతో 24,902 మందికి 20 శాతం ప్రోత్సాహకాన్ని అందించారు.
* వైఎస్‌ఆర్‌ కళ్యాణ కానుక కింద 2019-20 ఆర్థిక సంవత్సరంలో 75000 మంది బీసీ, 28568 మంది ఎస్సీ, 4290 ఎస్టీ , 20000 మంది మైనారిటీ వధువులు లబ్ధి పొందనున్నారని నూతన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
* వివాహ ప్రోత్సాహక పథకం 2018 ఏప్రిల్‌ 20 నుంచి అమల్లోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ‘సెర్ప్‌’ (Society for
Elimination of Rural Poverty), పట్టణ ప్రాంతాల్లో ‘మెప్మా’ (Mission forElimination of Poverty in MunicipalAreas) లు ఈ పథకం అమలుకు ఏజెన్సీలుగా ఉన్నాయి.

Posted Date : 29-07-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌