• facebook
  • whatsapp
  • telegram

జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌

       షెడ్యూల్డు తెగల సంక్షేమాన్ని పెంపొందించేందుకు, రాజ్యాంగంలో వారికి కల్పించిన రక్షణలు, సౌకర్యాలను పరిరక్షించే లక్ష్యంతో జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌ను ఏర్పాటుచేశారు. దీన్ని ఆర్టికల్‌ 338(A) ప్రకారం 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2004 ద్వారా ఏర్పరిచారు. ప్రధాన కార్యాలయం న్యూదిల్లీలో ఉంది. దీనికి భోపాల్, భువనేశ్వర్, షిల్లాంగ్, జైపూర్, రాయ్‌పూర్, రాంచీల్లో ఆరు ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. భారత ప్రభుత్వం జాతీయ ట్రైబల్‌ పాలసీని 2010లో ప్రకటించింది.
 

ఎస్టీ కమిషన్‌ అధికారాలు - విధులు
* షెడ్యూల్డు తెగల సామాజిక, ఆర్థికాభివృద్ధి ప్రణాళికా ప్రక్రియలో పాల్గొనడం. దీనికి సంబంధించిన విధాన ప్రక్రియలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు, సలహాలు ఇవ్వడం.
* గిరిజనులు అనుసరిస్తున్న పోడు వ్యవసాయ పద్ధతిలో మార్పులు తీసుకురావడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషిచేయడం.
* PESA Act (Panchayats Extension to the Scheduled Areas)ను షెడ్యూల్డు ప్రాంతాలకు వర్తింపజేయడానికి కృషిచేయడం.

* షెడ్యూల్డు తెగల హక్కులు, రక్షణలను ఆటంకపరిస్తే వాటికి సంబంధించిన ఫిర్యాదులను విచారించడం.
* షెడ్యూల్డు తెగల రాజ్యాంగ పరిరక్షణల పనితీరుకు సంబంధించిన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తారు. దీన్ని రాష్ట్రపతి పార్లమెంటుకు అందజేస్తారు.
* జాతీయ ఎస్టీ కమిషన్‌ నివేదికలోని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఉంటే ఆ కాపీని సంబంధిత రాష్ట్ర గవర్నర్‌కు అందజేయాలి. గవర్నర్‌ దాన్ని శాసనసభలో ప్రవేశపెడతారు.
* అభివృద్ధి కార్యక్రమాల మూలంగా నిర్వాసితులైన గిరిజనులకు పునరావాసం కల్పించేందుకు కృషిచేయడం.
* షెడ్యూల్డు తెగలపై ప్రభావం చూపే అన్ని ముఖ్యమైన, విధానపరమైన అంశాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఈ కమిషన్‌ను సంప్రదించాలి.
* గిరిజనులకు చెందిన భూములను అన్యాక్రాంతం కాకుండా నివారించడం, వారికి జీవనోపాధి అవకాశాలను పెంపొందించడం.
* చట్టరీత్యా ఆదివాసీలకు ఖనిజ, జలవనరులపై హక్కులను కల్పించడం.
* ఏదైనా న్యాయస్థానం లేదా ప్రభుత్వ కార్యాలయం నుంచి పబ్లిక్‌ రికార్డును లేదా దాని కాపీని పొందవచ్చు.

* షెడ్యూల్డు తెగలకు చెందిన వివిధ రకాల అఫిడవిట్లపై సాక్ష్యాలను సేకరించడం, అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించమని సంబంధిత వ్యక్తులు లేదా సంస్థలకు ఉత్తర్వులు జారీచేయడం.
* షెడ్యూల్డు తెగల హక్కుల ఉల్లంఘనలపై ఫిర్యాదుల ఆధారంగా లేదా సుమోటోగా విచారణ జరపడం.

 

ముఖ్యమైన కమిటీలు 
     భారత ప్రభుత్వం షెడ్యూల్డు తెగల సంక్షేమంపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయడానికి కొన్ని కీలక కమిటీలను నియమించింది.

 

ఎం.ఎస్‌. చౌదరి కమిటీ (1961)
వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నియమించిన ఈ కమిటీ కింది సిఫార్సులు చేసింది. 
* గిరిజనులకు లభిస్తున్న హక్కులు, రాయితీలను పునఃసమీక్షించి అటవీ ప్రాంతానికి 8 కి.మీ. పరిధిలో ఉన్న గిరిజన, ఇతర వర్గాల వారికి మాత్రమే హక్కులు, రాయితీలు కల్పించాలి.
* అటవీ పరిమాణాన్ని అనుసరించి అందులో పశువులు మేపుకోవడానికి అనుమతి ఇవ్వాలి.
* చిన్నతరహా అటవీ ఉత్పత్తుల సేకరణను రాష్ట్ర ప్రభుత్వాలే స్వయంగా చేపట్టి, శాఖాపరమైన డిపోల ద్వారా గిరిజనులకు పంపిణీ చేయాలి.

రాయ్‌ బర్మన్‌ కమిటీ (1971)
గిరిజన వర్గాల సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన ఈ కమిటీ కింది సిఫార్సులు చేసింది. 
* గిరిజన జీవన విధానంలో అడవుల ప్రాధాన్యతను గుర్తించాలి.
* ఉచిత వంటచెరకు, పశుగ్రాసం, గృహనిర్మాణం కోసం కలప మాత్రమే కాకుండా గిరిజనులకు చిన్న తరహా అటవీ ఉత్పత్తుల నుంచి వచ్చే ఆదాయంలో మూడో వంతు కేటాయించాలి.
* త్రికోణ అటవీ విధానంలో గిరిజన వ్యక్తి, గిరిజన సముదాయం, జాతీయ ప్రయోజనాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి.

 

వర్జీనియస్‌ జాక్సా కమిటీ (2013) 
ఈ కమిటీ గిరిజన వర్గాల సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేసి కింది సిఫార్సులు చేసింది.
* గిరిజనులకు సమగ్రమైన పునరావాస విధానాలను రూపొందించాలి.
* PESA చట్టాన్ని సమర్థంగా అమలుచేయాలి. 
* గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 
* గిరిజన వర్గాలకు ఆరోగ్య ఉప ప్రణాళికలను రూపొందించి, అమలు చేయాలి.
* గిరిజనులు వివిధ కేసుల రీత్యా జైళ్లలో ఉన్నప్పుడు వారికి సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక న్యాయ కమిషన్లను ఏర్పాటు చేయాలి.

ఛైర్మన్, సభ్యుల సదుపాయాలు, జీతభత్యాలు
      జాతీయ ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కేంద్ర కేబినెట్‌ మంత్రి హోదాతో సమానమైన హోదా కలిగి ఉంటారు. డిప్యూటీ ఛైర్మన్‌ కేంద్ర సహాయమంత్రితో సమానమైన, సభ్యులు భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాతో సమానమైన సదుపాయాలు, జీతభత్యాలను పొందుతారు.

 

రాజ్యాంగ వివరణ
 

ఆర్టికల్‌ 338(A)(1): షెడ్యూల్డు తెగల సంక్షేమం కోసం జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌ను ఏర్పాటుచేయాలి.

ఆర్టికల్‌ 338(A)(2): జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌లో ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. ఈ కమిషన్‌లో కచ్చితంగా ఒక మహిళ ఉండాలి. పదవీకాలం మూడేళ్లు.
ఆర్టికల్‌ 338(A)(3): జాతీయ ఎస్టీ కమిషన్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సభ్యులను రాష్ట్రపతి స్వయంగా సంతకం చేసిన అధికార పత్రం ద్వారా నియమిస్తారు.
ఆర్టికల్‌ 338(A)(4): జాతీయ ఎస్టీ కమిషన్‌ స్వతంత్ర సంస్థగా పనిచేస్తూ తన పని విధానాన్ని నియంత్రించుకుంటుంది.
ఆర్టికల్‌ 338(A)(5): కమిషన్‌ అధికార విధులను తెలియజేస్తుంది.

 

ఇతర మౌలికాంశాలు
* 1988 నాటి జాతీయ అటవీ విధానం మొదటిసారిగా అడవుల్లో నివసించే గిరిజన వర్గాల అవసరాలను గుర్తించింది. 1996 వరకు 16 రాష్ట్రాలు సంయుక్త అటవీ నిర్వహణ చర్యలు చేపట్టాయి.
* 1974లో ఎస్టీ సబ్‌ప్లాన్‌ను ఇందిరా గాంధీ హయాంలో ప్రారంభించారు.
* 1987లో న్యూదిల్లీ కేంద్రంగా గిరిజన సహకార మార్కెటింగ్‌ అభివృద్ధి సమాఖ్యను (TRIFED) ప్రారంభించారు.
* 1999లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను, 2001లో జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థను ఏర్పాటుచేశారు.
* షెడ్యూల్డు తెగల, ఇతర సంప్రదాయక అటవీ నివాసుల చట్టాన్ని 2006, డిసెంబరు 15న పార్లమెంటు ఆమోదించింది.
* ఆదివాసులు ప్రతి ఏడాది డిసెంబరు 15న అటవీ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

Posted Date : 16-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌