• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో వ్యవసాయ రంగం పాత్ర

   భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. ఎందుకంటే నేటికీ సుమారు 53 శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నేటికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. అయితే స్వాతంత్య్రానంతరం వివిధ పారిశ్రామిక తీర్మానాలు, విధానాలు, నూతన ఆర్థిక సంస్కరణల ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థలో, జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా క్షీణిస్తూ వస్తోంది. దీంతోపాటు వ్యవసాయ రంగంపై ఆధారపడే జనాభా కూడా తగ్గుతోంది.
 

     వ్యవసాయ రంగ ఆధునిక అభివృద్ధి పారిశ్రామిక, సేవారంగాల అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది. వ్యవసాయాధార పరిశ్రమలకు ముడి పదార్థాలను, ఉత్పాదకాలను అందిస్తోంది. వ్యవసాయ రంగంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత ప్రభావం వల్ల ఈ రంగానికి చెందినవారు పారిశ్రామిక రంగానికి తరలిపోతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులకు ప్రాధాన్యం లభిస్తోంది. ఆధునిక వ్యవసాయ పరికరాల వాడకం పెరగడంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. అయినా ఇప్పటికీ వ్యవసాయ రంగ ప్రాధాన్యతను విస్మరించలేం.
* వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధిలో ఉత్పత్తి, సహకారం ప్రధానమైనవి. అలాగే వీటి మధ్య శ్రమ, మూలధనం బదిలీతో కారక సహకారం జరుగుతుంది. దేశీయ, విదేశీయ మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలో మార్కెట్ సహకారం కూడా జరుగుతుంది. బ్రిటిషర్ల కాలంలో ప్రజలకు వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా ఉన్నా, 1966 నుంచి హరిత విప్లవ ప్రభావంతో వ్యవసాయ రంగంలో వాణిజ్య పంటల ప్రాధాన్యం పెరిగింది.
 

వ్యవసాయ రంగ పాత్ర ప్రాధాన్యతను తెలిపే అంశాలు
ఎ) జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా:
* 1950 - 51 లో జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా 56.5% ఉంది. కాగా ఇది 2015 - 16 లో 17.4% మాత్రమే.
* ఆర్థికాభివృద్ధికి జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటాను ఒక సూచికగా పేర్కొనవచ్చు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో జాతీయాదాయంలో వ్యవసాయరంగం వాటా అత్యల్పంగా ఉంది.
* భారత్ లాంటి దేశాల్లో ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ రంగం వాటా ఒకప్పుడు చాలా అధికంగా ఉండేది. పారిశ్రామిక, సేవారంగాల అభివృద్ధి వల్ల అది క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 2014 - 15 లో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధి రేటు - 0.2% గా ఉంది. 2013 - 14 లో ఇది 4.2%.
 

బి) ఉద్యోగితలో వ్యవసాయ రంగం వాటా
* 1951 లో మొత్తం శ్రామిక జనాభాలో 69.5 శాతం మందికి వ్యవసాయ రంగమే ఉద్యోగిత కల్పించగా, 2015 - 16 నాటికి అది 53%కి తగ్గింది.
* మొత్తం జనాభాలో 29.7% వ్యవసాయదారులుండగా, 25% వ్యవసాయ శ్రామికులున్నారు. వ్యవసాయ రంగం 53% శ్రామిక జనాభాకు ఉపాధి కల్పిస్తూ, ప్రైవేట్ రంగంలో అతిపెద్ద ఉపాధి కల్పన రంగంగా అభివృద్ధి చెందుతోంది.
 

సి) అంతర్జాతీయ వ్యాపారంలో ప్రాధాన్యం
* వ్యవసాయ ఉత్పత్తులైన టీ, పంచదార, నూనెగింజలు, పొగాకు, సుగంధ ద్రవ్యాలు లాంటివి మన ఎగుమతుల్లో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.
* 1990 - 91 నాటికి మొత్తం ఎగుమతుల్లో వ్యవసాయోత్పత్తుల వాటా 18.5% గా ఉండగా, ఇది 2011 - 12 నాటికి 12.3%గా ఉంది.
 

డి) ఆర్థిక ప్రణాళికల్లో వ్యవసాయ రంగం పాత్ర
* భారతదేశ రవాణా వ్యవస్థలో వ్యవసాయోత్పత్తుల రవాణా ప్రధాన పాత్ర పోషిస్తోంది.
* వ్యవసాయదారుల ఆదాయం పెరిగినప్పుడు, వ్యవసాయోత్పత్తులతోపాటు పారిశ్రామికోత్పత్తులకు డిమాండ్ పెరగడం మనం గమనించవచ్చు.
* వ్యవసాయ రుణాలు, పరపతి లాంటి అంశాల్లో బ్యాంకింగ్ రంగానికి వ్యవసాయం మద్దతునిస్తోంది. బ్యాంకు రుణాల్లో 40% వరకు వ్యవసాయ రంగానికి కేటాయించేలా వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యతా రంగంగా గుర్తించారు.
ఇ) పెరుగుతున్న జనాభాకు తగిన ఆహార భద్రత కల్పించి, పేదరికాన్ని తగ్గించడంలో వ్యవసాయ రంగ పాత్ర ప్రధానమైంది.
ఎఫ్) మూలధన సమీకరణకు, మూలధన సంచయనం జరగడానికి వ్యవసాయ రంగాభివృద్ధి తోడ్పడుతుంది.
జి) పరిశ్రమలకు ముడిపదార్థాలు అందించడానికి వ్యవసాయ రంగం సహకరిస్తుంది.
హెచ్) పారిశ్రామికోత్పత్తులకు తగిన మార్కెట్‌ను వ్యవసాయ రంగం కల్పిస్తుంది.
* జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతున్నప్పటికీ నేటికీ మన దేశంలో గ్రామీణులకు అధిక ఉపాధి కల్పిస్తున్న రంగంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
* వ్యవసాయేతర రంగాల్లో వృద్ధితో పోల్చినప్పుడు, జాతీయాదాయంలో 1% పెరుగుదల సంభవించినప్పుడు 2 లేదా 3 శాతం వరకు పేదరికాన్ని నిర్మూలించవచ్చని BRICS (బ్రిక్స్) దేశాల అనుభవం చెబుతోంది.
* వ్యవసాయోత్పత్తుల అధిక దిగుబడులు, ఉత్పాదకత మన ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా ద్రవ్యోల్బణ ధోరణులను తగ్గించడానికి దోహదం చేస్తాయి.
 

ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవ ప్రభావం..
 హరిత విప్లవ ప్రభావం వల్ల వరి ఉత్పత్తి 3 రెట్లు, గోధుమల ఉత్పత్తి 2.5 రెట్లు, మొక్కజొన్న 3.5 రెట్లు, జొన్న 5 రెట్లు, సజ్జలు 5.5 రెట్లు పెరిగాయి.
* అయితే ఆహారేతర పంటలను నిర్లక్ష్యం చేశారు. హరిత విప్లవం ప్రధానంగా గోధుమ, వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటి అయిదు ఆహార పంటలకు మాత్రమే పరిమితమైంది. ముఖ్యంగా హరిత విప్లవ కాలంలో గోధుమ పంట ఉత్పత్తి ప్రసిద్ధి పొందింది.
* అల్ప ఫలన కాలపు పంటలను ప్రవేశపెట్టడం ప్రారంభమైంది.
* నూతన వ్యవసాయక వ్యూహంలో భాగంగా ఆధునిక సాంకేతిక పద్ధతులైన పంటల మార్పిడి, బహుళ పంటలు, నీటిపారుదల, రసాయనిక ఎరువులు, యంత్రాలు, పనిముట్లు, పంటల రక్షణ లాంటి చర్యలు చేపట్టడం పెరిగింది.
* వ్యవసాయ పరపతిని పెంచారు.
* మద్దతు ధరలు ప్రకటించారు.
 

వ్యవసాయదారుల కోసం..
* 1963 లో జాతీయ విత్తన సంస్థ, జాతీయ సహకార అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు.
* 1965 లో రాష్ట్రాల్లో వ్యవసాయాధార పారిశ్రామిక సంస్థలను నెలకొల్పారు.
* 1965 లో భారత ఆహార సంస్థ (FCI) ను ఏర్పాటు చేశారు.
* 1963 లో ఏర్పాటు చేసిన వ్యవసాయ రీఫైనాన్స్, అభివృద్ధి సంస్థ తర్వాతి కాలంలో నాబార్డ్ (NABARD) గా మారింది.
 

ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల
* ఆహార ధాన్యాల ఉత్పత్తి 1960 - 61 నాటికి 69 మిలియన్ టన్నులు ఉండగా, 2014 - 15 నాటికి 252.7 మిలియన్ టన్నులకు పెరిగింది.
* 1960 - 61 నుంచి 1973 - 74 వరకు వాణిజ్య పంటల మీద హరిత విప్లవ ప్రభావం పెద్దగా లేదు. 1973 - 74 తర్వాత వాణిజ్య పంటల్లో కొంత పెరుగుదల ఏర్పడింది.
* ఆహార ధాన్యాల ఉత్పాదకత (కి.గ్రా./ హె) 1960 - 61 లో 710 ఉండగా 2011 - 12 లో 2059 గా ఉంది.
* పంటల తీరులో మార్పు జరిగింది. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తృణధాన్యాల ప్రాధాన్యం పెరిగి, పప్పు ధాన్యాల ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. 1950 - 51 లో మొత్తం ఉత్పత్తిలో వరి 48%, గోధుమ 15%, ముతక ధాన్యాలు 37% ఉండగా, 2010 - 11 లో వరి 43%, గోధుమ 38%, ముతక ధాన్యాలు 19% గా నమోదయ్యాయి.
* నూతన వ్యవసాయ, సాంకేతిక పద్ధతుల వల్ల వాటి ఆధారిత పరిశ్రమలు వృద్ధి చెంది, ఉద్యోగిత పెరిగింది.
* వ్యవసాయ రంగ ఉత్పాదకత పెరగడం వల్ల వ్యవసాయదారుల ఆదాయాలు పెరిగాయి.
* ఆహార ధాన్యాల మిగులు నిల్వల వల్ల ప్రజాపంపిణీ వ్యవస్థ (Fair Price Shops) ద్వారా సరకుల పంపిణీ జరిగి పేదరికం తగ్గి, ఆహార భద్రత ఏర్పడింది.
* అయితే హరిత విప్లవం వల్ల పెట్టుబడిదారీ వ్యవసాయం, ఆదాయ వ్యత్యాసాల పెరుగుదల, ప్రాంతీయ వ్యత్యాసాలు లాంటి ప్రతికూల ప్రభావాలు తలెత్తాయి.
 

భారతదేశంలో హరిత విప్లవం..
 అమెరికాకు చెందిన డాక్టర్ విలియం గాండ్ (Dr.William Gande) అనే శాస్త్రవేత్త 1960 దశకం మధ్యలో ప్రప్రథమంగా 'హరిత విప్లవం' (Green Revolution) అనే పదాన్ని ప్రవేశపెట్టారు.
* 1960 దశకం ప్రారంభంలో బ్రిటిష్ రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ ద్వారా మెక్సికోలో వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ (Norman Borlaug) అధికోత్పత్తి వంగడాల (High Yielding Variety - HYV) అభివృద్ధి చేపట్టారు. ఫలితంగా ప్రపంచ హరిత విప్లవానికి (Green Revolution) మెక్సికోలో బీజం పడింది.
* భారతదేశంలో డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ భారత హరిత విప్లవ పితామహుడిగా కీర్తి పొందారు.
* భారతదేశంలో 'ఫోర్డ్ ఫౌండేషన్' రెండో పంచవర్ష ప్రణాళిక మధ్య కాలంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి నిపుణుల బృందాన్ని ఆహ్వానించింది. తత్ఫలితంగా ఆ బృందం 'భారతదేశ ఆహార సంక్షోభం, దాని నివారణకు చేపట్టదగిన చర్యలు' పేరుతో 1959 ఏప్రిల్‌లో ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదికలోని సూచనలకు అనుగుణంగా భారత ప్రభుత్వం హరిత విప్లవానికి నాంది పలికింది. భారతదేశంతోపాటు తృతీయ ప్రపంచ దేశాల్లో కూడా హరిత విప్లవ ప్రభావాలు కనిపిస్తాయి.
 

హరిత విప్లవం అంటే..
* అధిక దిగుబడినిచ్చే వంగడాలతో తగిన నీటిపారుదల వసతులు, రసాయనిక ఎరువుల సమ్మేళనంతో సేద్యం చేసి, అధిక దిగుబడులను సాధించడమే హరిత విప్లవం.
* హరిత విప్లవాన్ని వ్యవసాయాభివృద్ధికి అవలంబించే ఒక నూతన వ్యూహంగా అభివర్ణించవచ్చు. దీని ప్రధాన ఉద్దేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం.
* మూడో పంచవర్ష ప్రణాళికా కాలంలో భారతదేశ వ్యవసాయ రంగంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆహార కొరత ఏర్పడి, విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
* ఫోర్డ్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటైన నిపుణుల బృందం చేసిన సూచనలతో భారత ప్రభుత్వం 1960 లో ఏడు రాష్ట్రాల్లో, ఏడు జిల్లాల్లో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం (IADP) ని ప్రారంభించింది. దీనిలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, బిహార్‌లోని షాహాబాద్, మధ్యప్రదేశ్‌లోని రాయ్‌పూర్ (ఇప్పుడు చత్తీస్‌గఢ్‌లో), తమిళనాడులోని తంజావూరు జిల్లాలను వరి ఉత్పత్తికి, పంజాబ్‌లోని లుథియానా, ఉత్తర్ ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలను గోధుమ ఉత్పత్తికి, రాజస్థాన్‌లోని పాలిజిల్లాను చిరుధాన్యాల ఉత్పత్తికి ఎంపిక చేశారు.
* ఈ పథకాన్ని 1965 అక్టోబరులో 114 జిల్లాల్లో సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకం (IAAP) పేరుతో మిగతా రాష్ట్రాలకు విస్తరించారు.
* తర్వాత 1966 ఖరీఫ్ పంట కాలంలో నూతన వ్యవసాయక వ్యూహం పేరుతో అధిక దిగుబడి వంగడాల (HYVP) కార్యక్రమం అనే ప్యాకేజీని ప్రవేశపెట్టారు.
* అధిక దిగుబడినిచ్చే వంగడాల (HYV) ప్యాకేజీలో సరైన నీటిపారుదల వసతులు, తగిన మోతాదులో ఎరువులు, పురుగు మందుల (చీడ, పీడ నివారణులు, కీటక సంహారిణులు)ను చేర్చారు. ఈ ప్యాకేజీని 1.89 మిలియన్ హెక్టార్లలో అమలు చేసి, నాలుగో పంచవర్ష ప్రణాళిక నాటికి 9.2 మిలియన్ హెక్టార్లకు విస్తరించారు.
* 1998 - 99 నాటికి అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం (HYVP) 78.4 మిలియన్ హెక్టార్లకు విస్తరించింది. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 62.6% ప్రాంతం ఈ ప్యాకేజీ పరిధిలోకి వచ్చింది.
*  మెక్సికోలో ప్రొఫెసర్ నార్మన్ బోర్లాగ్, ఆయన అనుచరులు అభివృద్ధి చేసిన గోధుమ వంగడాలైన Lerma Rojo, Sonara-64, P.V.-18, కల్యాణ్‌ను భారత్‌లో 1965 లో ప్రవేశపెట్టారు. వరి పంటలో IR-8 సత్ఫలితాలు ఇచ్చింది.

Posted Date : 04-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌