• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగ పరిషత్ - రాజ్యాంగం

     భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని 1946 డిసెంబరు 9 నుంచి 1949 నవంబరు 26 వరకు (2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు) జరిగిన 11 సమావేశాల ఆధారంగా రూపొందించింది. ఇది 165 రోజులపాటు సమావేశమై, 60 రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇందుకు రూ.64 లక్షలు ఖర్చు అయ్యాయి. భారత రాజ్యాంగ చిహ్నం 'ఏనుగు'.
 

రాజ్యాంగ ఆమోదం

      రాజ్యాంగ అంతిమ ముసాయిదాను డా. బి.ఆర్. అంబేడ్కర్ 1948 నవంబరు 4 న ప్రవేశపెట్టారు. దీన్నే ప్రథమ పఠనం అంటారు. ద్వితీయ పఠనం 1948 నవంబరు 15 నుంచి 1949 అక్టోబరు 17 వరకు జరిగింది. తృతీయ పఠనం 1949 నవంబరు 14 న ప్రారంభమైంది. 1949 నవంబరు 26 న మొత్తం 299 మందిలో 284 మంది సంతకం చేశారు. దీంతో భారత రాజ్యాంగం ఆమోదం పొందినట్లైది. రాజ్యాంగంతోపాటు ప్రవేశికను ప్రత్యేకంగా రాజ్యాంగ సభ ఆమోదించింది. రాజ్యాంగంలో 395 నిబంధనలు, 8 షెడ్యూల్స్, 22 భాగాలు ఉన్నాయి.
 

రాజ్యాంగ అవసరం గుర్తింపు

    1927 లో అప్పటి భారత రాజ్య కార్యదర్శి 'లార్డ్ బిర్కెన్ హెడ్' సవాలును భారత జాతీయ కాంగ్రెస్ స్వీకరించింది. 1927 మే 19 న 8 మంది (మోతీలాల్ నెహ్రూ, అలీ ఇమామ్, తేజ్ బహదూర్ సప్రూ, ఎం.ఎస్. అనే, మంగళ్‌సింగ్, షోయబ్ ఖురేషి, సుభాష్ చంద్రబోస్, జి.ఆర్. ప్రధాన్) సభ్యులతో కమిటీ వేసింది. దీనికి మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడు, జవహర్‌లాల్ నెహ్రూ కార్యదర్శి. ఈ కమిటీ 1928 ఆగస్టు 10 న నివేదికను సమర్పించింది. దీన్ని భారతీయులు భారత రాజ్యాంగ రచనకు చేసిన మొదటి ప్రయత్నంగా చెప్పవచ్చు. దీన్నే 'నెహ్రూ నివేదిక' అంటారు.
* మానవతావాదిగా పేరొందిన భారత రాజనీతి తత్వవేత్త ఎం.ఎన్. రాయ్ మొదటిసారిగా 1934 లో భారత రాజ్యాంగ పరిషత్ అనే భావాన్ని ప్రకటించారు. భారత జాతీయ కాంగ్రెస్ 1935 లో పార్టీపరంగా రాజ్యాంగ పరిషత్‌ను డిమాండ్ చేసింది.
* 1940 లో అప్పటి బ్రిటిష్ - ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ లిన్ లిత్‌గో ప్రకటించిన ఆగస్టు ప్రతిపాదనల్లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు బ్రిటిష్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.
* 1942 లో క్రిప్స్ ప్రతిపాదనల్లో భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు భారతీయుల హక్కుగా మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. 1946 లో కాబినెట్ మిషన్ లేదా మంత్రిత్రయ రాయబారం (ఫెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఎ.వి. అలెగ్జాండర్) ఫెథిక్ లారెన్స్ అధ్యక్షతన తమ ప్రణాళికను ప్రభుత్వానికి వెల్లడించింది. ఇందులో రాజ్యాంగాన్ని రూపొందించడానికి ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు అవుతుందని ప్రకటించింది.

రాజ్యాంగ పరిషత్ నిర్మాణం

      అవిభాజ్య భారత రాజ్యాంగ పరిషత్ (సభ) మొత్తం సభ్యుల సంఖ్య 389. ఇందులో బ్రిటిష్ - ఇండియాలోని 11 గవర్నర్ పాలిత రాష్ట్రాల నుంచి 292 మంది ఎన్నికయ్యారు. చీఫ్ కమిషనర్ పాలిత ప్రాంతాల (ఢిల్లీ, అజ్మీర్ - మేవార్, కూర్గ్, బ్రిటిష్ బెలూచిస్థాన్) నుంచి నలుగురు సభ్యులు నియమితులయ్యారు.
స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది నియమితులయ్యారు. ఎన్నికైన సభ్యుల్లో 208 మంది (70%) భారత జాతీయ కాంగ్రెస్ నుంచి, 73 మంది (25%) ముస్లిం లీగ్ నుంచి, ఇతర పార్టీల నుంచి, స్వతంత్రులు 15 మంది ఎన్నికయ్యారు.
 

స్వాతంత్య్రం తర్వాత భారత రాజ్యాంగ సభలో వచ్చిన మార్పులు 
భారత రాజ్యాంగ సభ సార్వభౌమాధికార సంస్థగా అవతరించింది. అప్పటి వరకు బ్రిటిష్ - ఇండియా పాలన కోసం బ్రిటిష్ పార్లమెంట్ చేసిన ఏ చట్టాన్నైనా రద్దు చేయడానికి, సవరించడానికి సభకు అధికారం లభించింది.
* భారత రాజ్యాంగ సభ, భారత పార్లమెంట్‌గా కూడా అవతరించింది. భారత రాజ్యాంగ సభ ద్విపాత్రాభినయం చేయాల్సి వచ్చింది. అవి:
      1) రాజ్యాంగాన్ని రూపొందించడం.
      2) దేశ పరిపాలనకు అవసరమైన సాధారణ చట్టాలను రూపొందించడం.
* రాజ్యాంగ సభగా సమావేశమైనప్పుడు డా. బాబూ రాజేంద్ర ప్రసాద్, భారత పార్లమెంట్‌గా సమావేశమైనప్పుడు జి.వి. మౌలంకర్ అధ్యక్షత వహించారు.
* రాజ్యాంగ సభ సభ్యుల సంఖ్య 389 నుంచి 299కి తగ్గింది. ఇందులో బ్రిటిష్ ఇండియా పాలిత ప్రాంతాలకు 229, స్వదేశీ సంస్థానాలకు 70 మంది ప్రాతినిధ్యం వహించారు. 

భారత రాజ్యాంగ సభ - కార్యకలాపాల నిర్వహణ

       భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం 1946 డిసెంబరు 9 న జరిగింది. ఈ సమావేశానికి 211 మంది ప్రతినిధులు (ప్రారంభంలో స్వదేశీ సంస్థానాలు ప్రతినిధులను నియమించక పోవడమే దీనికి కారణం) హాజరయ్యారు. ఈ సమావేశంలో ఫ్రెంచ్ సంప్రదాయాన్ని అనుసరించి రాజ్యాంగ సభలో అత్యంత సీనియర్ అయిన డా. సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా, ఫ్రాంక్ ఆంథోనిని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 1946 డిసెంబరు 11 న డా. బాబూ రాజేంద్ర ప్రసాద్‌ను శాశ్వత అధ్యక్షుడిగా, హెచ్.సి. ముఖర్జీని శాశ్వత ఉపాధ్యక్షుడిగా (డిసెంబరు 13) ఎన్నుకున్నారు. బెనగల్ నరసింహారావు (బి.ఎన్. రావు)ను రాజ్యాంగ సలహాదారుగా నియమించారు. (బి.ఎన్. రావు తర్వాతి కాలంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు).
* రాజ్యాంగ సభ 11 సమావేశాల్లో 7 వ సమావేశం సుదీర్ఘంగా 1948 నవంబరు 4 నుంచి 1949 జనవరి 8 వరకు సాగింది.
* 1946 డిసెంబరు 13 న 'లక్ష్యాల తీర్మానాన్ని' పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. దీనిపై సుధీర్ఘంగా చర్చించిన తర్వాత 1947 జనవరి 22 న ఆమోదించింది. ఇదే ఆధునిక భారత రాజ్యాంగంలో ప్రవేశికగా గుర్తింపు పొందింది.
* రాజ్యాంగ సభ తన కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించడానికి వివిధ కమిటీలను నియమించింది. అందులో ముఖ్యమైన కమిటీలు - వాటి అధ్యక్షులు
    1) కేంద్ర ప్రభుత్వ అధికారాల కమిటీ - జవహర్‌లాల్‌నెహ్రూ
    2) కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    3) రాజ్యాంగ ముసాయిదా రచనా కమిటీ - డా. బి.ఆర్. అంబేడ్కర్
    4) ప్రావిన్షియల్ రాజ్యాంగ కమిటీ - సర్దార్ వల్లభాయ్ పటేల్
    5) సలహా సంఘం - సర్దార్ వల్లభాయ్ పటేల్
    6) నియమావళి కమిటీ (రూల్స్ కమిటీ) - డా. బాబూ రాజేంద్రప్రసాద్
    7) సారథ్య సంఘం (స్టీరింగ్ కమిటీ) - డా. బాబూ రాజేంద్ర ప్రసాద్
    8) ఆర్థిక, స్టాఫ్ కమిటీ - డా. బాబూ రాజేంద్ర ప్రసాద్
* ఈ కమిటీలన్నింటిలో సలహా సంఘం అతిపెద్దది. ఇందులో అధ్యక్షుడు, 54 మంది సభ్యులు ఉన్నారు. అతి ముఖ్యమైంది డ్రాఫ్టింగ్ కమిటీ. దీన్నే రాజ్యాంగ ముసాయిదా రచనా కమిటీ అని కూడా అంటారు.

డ్రాఫ్టింగ్ కమిటీ: దీనికి డా. బి.ఆర్. అంబేడ్కర్ అధ్యక్షత వహించారు. ఇందులో ఆరుగురు (సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాల స్వామి అయ్యంగార్, కె.ఎం మున్షీ, సయ్యద్ మహ్మద్ సాదుల్లా, ఎన్. మాధవరావు (బి.ఎల్. మిట్టల్ స్థానంలో), టి.టి. కృష్ణమాచార్యులు (1948 లో డి.పి. ఖైతాన్ మరణించడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేశారు) సభ్యులున్నారు.
* డ్రాఫ్టింగ్ కమిటీ మొదటి ముసాయిదాను ఫిబ్రవరి 1948 లో, రెండో ముసాయిదాను అక్టోబరు 1948 లో ప్రతిపాదించింది. ఈ కమిటీ సమావేశాలు 141 రోజులు మాత్రమే జరిగాయి.

రాజ్యాంగ పరిషత్ సభ్యుల ఎన్నిక    

భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణం రెండు పద్ధతుల్లో జరిగింది. అవి: 1) ఎన్నిక 2) నియామకం. ఎన్నిక 'పరోక్ష పద్ధతి'లో (ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో) ఒక ఓటు బదిలీ విధానం ద్వారా జరిగింది. ప్రతి పది లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికలను 1946 జులై, ఆగస్టు నెలల్లో నిర్వహించారు.
* పంజాబ్ మినహా మిగిలిన బ్రిటిష్ - ఇండియా భూభాగంలో నియోజక వర్గాలను రెండు రకాలుగా విభజించారు. అవి:
    1) జనరల్ (మహ్మదీయులు, సిక్కులు మినహా మిగిలిన వర్గాలు).
    2) మహ్మదీయ నియోజక వర్గాలు (మహ్మదీయులు)
* పంజాబ్‌లో పై రెండు రకాలతో పాటు సిక్కులకు కూడా జనాభా దామాషాలో సీట్లను కేటాయించారు. అంటే 3 రకాల నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు.

రాజ్యాంగం అమలు

రాజ్యాంగంలోని కొన్ని అంశాలు రాజ్యాంగం ఆమోదం పొందినప్పటి నుంచే (1949 నవంబరు 26) అమల్లోకి వచ్చాయి. ఉదాహరణకు 5 - 9 నిబంధనలు (పౌరసత్వం), 324 (ఎన్నికల సంఘం), 367, 392, 393 మొదలైనవి. అయితే భారత రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చిన రోజు 1950 జనవరి 26. దీన్నే రిపబ్లిక్‌డే లేదా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
* రాజ్యాంగ రచన 1949 నవంబరు 26 న పూర్తై, ఆమోదం పొందినా, 1950 జనవరి 26 నుంచే రాజ్యాంగం అమలైంది. కారణం - 1930 జనవరి 26 నాటికి సంపూర్ణ స్వరాజ్‌ను సాధించాలని పెట్టుకున్న ఆశయానికి గుర్తుగా జనవరి 26 నుంచి అమలు చేశారు.
* రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారత ప్రజలు రూపొందించుకున్న చట్టం ప్రకారం పరిపాలన ప్రారంభమైంది. అప్పటి వరకు అమల్లో ఉన్న చట్టాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉంటే, చెల్లకుండా పోయాయి. మూల రాజ్యాంగాన్ని ఆంగ్లంలో రచించారు. తర్వాత దాన్ని హిందీలోకి తర్జుమా చేశారు.  రాజ్యాంగ నిర్మాణానికి చేసిన కృషి వల్ల అంబేడ్కర్ భారత రాజ్యాంగ పితామహుడిగా, నవ భారత రాజ్యాంగ నిర్మాతగా, ఆధునిక మనువుగా కీర్తి పొందారు.

Posted Date : 03-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌