• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ ఆర్థికాభివృద్ధి

   ఒక దేశ ఆర్థికాభివృద్ధి అనేది సంక్లిష్ట పునర్నిర్మాణ ప్రక్రియ. ఇది దీర్ఘకాలంలో ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా, సంస్థాగతంగా సంభవించే మార్పులను తెలియజేస్తుంది. ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, విభిన్న సామాజిక సాంస్కృతిక విలువలు కలిగి, అభివృద్ధి చెందుతున్న భారత్‌ లాంటి దేశాల్లో ఆర్థికాభివృద్ధి.. అనేక సవాళ్లు, ఒడుదొడుకులతో నిత్యం అనిశ్చితిగా ఉంటుంది. అందుకే అభివృద్ధిని ఏ మేరకు సాధించామో తెలుసుకోవడానికి ఒక కొలమానం అవసరం. దానికి శాస్త్రీయమైన హేతుబద్ధత ఉండి లెక్కించడానికి వీలుగా ఉండాలి. 

అభివృద్ధి కొలమానాలు 
    అభివృద్ధితో పాటు దాని సమగ్ర కొలమానాలపై కూడా ఆర్థికవేత్తలు చర్చించారు. భారతదేశ ఆర్థిక పరిస్థితిపై పశ్చిమ దేశాలైన ఇంగ్లండ్, అమెరికా అభిప్రాయాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆర్థికాభివృద్ధిని కొలవడానికి ఉపయోగించే ముఖ్యమైన కొలమానాలు..

స్థూల జాతీయోత్పత్తి 
    సంవత్సర కాలంలో ఒక దేశ ప్రజల ద్వారా ఉత్పత్తయిన అంతిమ వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తమే స్థూల జాతీయోత్పత్తి. ఇది ఆర్థిక విలువలను తెలియజేస్తుంది. దీనిలో నాలుగు అంశాలు ఉంటాయి. అవి:
    1. ప్రజల వినియోగ వ్యయం (C) 
    2. సంస్థల పెట్టుబడి వ్యయం (I)
    3. ప్రభుత్వ వ్యయం (G) 
    4. విదేశాల నుంచి వచ్చే ఆదాయం(Net foreign income)
   GNP = C + I + G + Net foreign income
    ప్రపంచంలో మొదటిసారిగా జాతీయాదాయాన్ని సైమన్‌ కుజ్నెట్‌ అనే అమెరికా ఆర్థికవేత్త శాస్త్రీయంగా అంచనా వేశారు. ఈయన స్థూల ఉత్పత్తిలో పెరుగుదల వల్ల ఆర్థిక నిర్మాణం, జీవనంలో మార్పులు సంభవిస్తాయని తెలిపాడు. ‘ఇది భవిష్యత్‌ పురోగతికి అవసరం. కానీ జాతీయాదాయ లెక్కల నుంచి ప్రజా సంక్షేమాన్ని గ్రహించలేం’ అని స్పష్టం చేశారు.
* వాస్తవ జాతీయాదాయ అంచనాలు ధరల్లో మార్పులను తెలియజేయవు. ఆదాయ అసమానతలు, జనాభాలో వచ్చే మార్పులు, వాతావరణ కాలుష్యం వల్ల కలిగే నష్టాల గురించి పేర్కొనదు. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అసంఘటిత రంగం, నిరక్షరాస్యత, బ్లాక్‌ మార్కెటింగ్‌ ఎక్కువ. కాబట్టి ఏ రంగానికి సంబంధించైనా కచ్చితమైన లెక్కలు లభించవు. 
* జాతీయాదాయ పరంగా భారతదేశం 2.7 ట్రిలియన్‌ డాలర్ల మొత్తంతో ప్రపంచంలో ఆరో స్థానాన్ని పొందింది. సామాజిక, సాంకేతిక, మానవ మూలధనం లాంటి అంశాల్లో ఇప్పటికీ వెనుకబడి ఉంది. కాబట్టి ఇది సమగ్రమైన అభివృద్ధి కొలమానం అని చెప్పలేం.

వాస్తవ తలసరి ఆదాయం 
    ఒక దేశంలో జాతీయాదాయ పెరుగుదలపై జనాభా ప్రభావాన్ని పరిశీలిస్తూ అభివృద్ధిని గణించడానికి వాస్తవ తలసరి ఆదాయం ఉపకరిస్తుంది. మొత్తం జాతీయాదాయాన్ని జనసంఖ్యకు పంచినప్పుడు సగటున వచ్చే మొత్తాన్ని తలసరి ఆదాయం అంటారు. 


      సాధారణంగా తలసరి ఆదాయం పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. తలసరి ఆదాయం పెరగకుండా జాతీయాదాయం మాత్రమే పెరగడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇది ఆర్థికాభివృద్ధిలో ప్రజల పాత్ర, వారి ఆదాయ స్థాయుల్లో మార్పులను తెలుపుతుంది. ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు కూడా తలసరి ఆదాయం ఆధారంగా దేశాలను అభివృద్ధిచెందిన, చెందుతున్న దేశాలుగా వర్గీకరించి అధ్యయనం చేస్తున్నాయి. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న దేశాలన్నీ అభివృద్ధి చెందిన దేశాలే. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నివేదిక ప్రకారం 2018 నాటికి ప్రపంచంలోని అయిదు అత్యధిక ధనవంత దేశాలు వరుసగా లక్సెంబర్గ్, మకావు, స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌లాండ్‌. ఈ దేశాలు 75000 డాలర్లకు పైగా తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి. జాతీయాదాయ పరంగా అగ్ర దేశమైన అమెరికా 65000 డాలర్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే తలసరి ఆదాయం కూడా సరైన కొలమానం కాదని కొంతమంది ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు.

విమర్శలు
* ఇది అసమగ్రమైన జాతీయాదాయ లెక్కలపై ఆధారపడి ఉందని, జనసంఖ్య పెరిగి తలసరి ఆదాయంలో మార్పు లేకపోయినా లేదా తగ్గినా అభివృద్ధి జరగలేదని చెప్పలేం. 
* ఇది ప్రజల సగటు ఆదాయం మాత్రమే. అందరి ఆదాయం కాదు. ఆదాయ అసమానతలు, పంపిణీ గురించి తెలపదు. 
* అనేక దశాబ్దాలుగా చేసిన ప్రయత్నాల వల్ల భారతదేశం జాతీయాదాయపరంగా ఆరో పెద్ద దేశంగా ఉన్నప్పటికీ తలసరి ఆదాయంలో 119వ స్థానంలో ఉంది. దీని ఆధారంగా మనదేశం అభివృద్ధిని సాధించలేదని చెప్పలేం. తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉన్న దేశాలతో పోల్చలేం. ఎందుకంటే అవి పరిమాణం, జనాభా పరంగా చిన్న దేశాలు. పరిశ్రమలు, వ్యాపారాలు, పర్యాటకం, బ్యాంకింగ్‌ లాంటి సేవల రంగాల నుంచి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అయితే మనదేశం ఇప్పటికీ 60% మేర రుతుపవనాలపై ఆధారపడుతున్న వ్యవసాయాధారిత దేశం.
* 1951తో పోల్చినప్పుడు మనదేశ తలసరి ఆదాయం పెరిగింది కానీ ఆదాయ అసమానతలు తీవ్రతరం అయ్యాయని ప్రభుత్వ నివేెదికలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పెరిగిన తలసరి ఆదాయం తెలపదు.
* జాతీయాదాయం, తలసరి ఆదాయాలు అభివృద్ధిని కొలవడంలో సంతృప్తికరంగా లేకపోవడంతో కొలిన్‌ క్లార్క్, కిండెల్‌ బర్గర్, డి. బ్రైట్‌ సింగ్‌ లాంటి ఆర్థికవేత్తలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు.

ఆర్థిక సంక్షేమం: ప్రజల మధ్య ఆదాయ పంపిణీలో సమానత్వం, కొనుగోలు శక్తి పెరిగేలా ధరల స్థిర త్వాన్ని సాధించినప్పుడు ఆర్థిక సంక్షేమం ఉంటుందని వీరు అభిప్రాయపడ్డారు. అధిక ఆర్థిక సంక్షేమాన్ని అధిక అభివృద్ధికి చిహ్నంగా భావించారు. అయితే ఆర్థిక సంక్షేమం అనేది మానసికమైంది. దాన్ని కొలవలేం. ఇద్దరు వ్యక్తుల మధ్య సంక్షేమ భావన ఒకేవిధంగా ఉండదు. జాతీయాదాయ మార్పుల స్వభావాన్ని, ఉత్పత్తి సామాజిక వ్యయాన్ని అంచనా వేయడం చాలా కష్టం. ఆర్థిక సంక్షేమం అభివృద్ధికి కొలమానంగా ఆచరణలో సాధ్యం కాదని విమర్శలను ఎదుర్కొంది.

భౌతిక జీవన ప్రమాణ సూచిక 
* మోరీస్‌ డి మోరీస్‌ అనే శాస్త్రవేత్త ప్రజల ప్రాథమిక అవసరాల దృష్ట్యా ఈ కొలమానాన్ని రూపొందించారు. శిశు మరణాల రేటు, ఆయుఃప్రమాణం, అక్షరాస్యత లాంటి మూడు అంశాల సమాన భారాల సగటు ఆధారంగా ఈ సూచికను లెక్కిస్తారు.

విమర్శలు
*  ఇది ప్రాథమిక అవసరాలను మాత్రమే లెక్కించే పరిమిత కొలమానం.
* దీనిలో చేర్చే అంశాల సంఖ్య పట్ల ఆర్థికవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు.
* ఈ సూచిక ఆర్థికాభివృద్ధిని విస్మరించింది. ఇది లేకుండా జీవన ప్రమాణాలు మెరుగుపడవు. 
* భద్రత, న్యాయం, మానవ హక్కుల లాంటి సామాజిక, మానసిక అంశాల గురించి ఈ సూచిక పేర్కొనలేదు.

మానవాభివృద్ధే అంతిమ లక్ష్యం 
    1990లో యూఎన్‌డీపీ (United nations development programme) వెలువరించిన మొదటి మానవాభివృద్ధి నివేదిక అభివృద్ధి ఆర్థికశాస్త్రం విధానాలు, కొలమానాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. దీంతో పాలకులు, పరిశోధకులు,  ప్రజల అభివృద్ధి ధోరణి మారిపోయింది. అప్పటివరకు అభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధి అని ప్రజల వస్తుసేవల పెరుగుదలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఉన్నత మానవ శ్రేయస్సు వైపు పురోగమించడమే మానవాభివృద్ధి అని, అదే నిజమైన అభివృద్ధి అని ఐక్యరాజ్యసమితి నివేదికలో నిర్వచించారు. అర్థశాస్త్ర చారిత్రక మేధోమథనం నుంచి అభివృద్ధి కొలమానాలకు ప్రత్యామ్నాయాల అన్వేషణ ఎప్పటి నుంచో జరుగుతోంది. 
* క్రీ.పూ.350లోనే అరిస్టాటిల్ '' well being as something generated by our actions and our belongings'' అని అభిప్రాయపడ్డారు.
* 18వ శతాబ్దంలో జెర్మి బెంథామ్‌ ప్రయోజనవాదం వ్యక్తుల ప్రయోజనాల కలయికే సామాజిక ప్రయోజనంగా గుర్తించి the greatest happiness for the greateast numberను సూచించింది.
* 19వ శతాబ్దంలో మార్షల్‌ లాంటి నూతన సంప్రదాయ ఆర్థికవేత్తలు ‘నెరవేర్చుకునే కోరికలు’ అనే భావనను ప్రవేశపెట్టారు. ‘‘అపరిమితమైన కోరికలను నెరవేర్చే పరిమిత వనరులను అదనంగా సమకూర్చుకునే కొద్దీ వాటి నుంచి పొందే అదనపు ప్రయోజనం (Marginal Utility) క్షీణిస్తుంది’’ అని నిరూపించారు. కాబట్టి మిగులు వనరులు ధనికుల నుంచి పేదలకు చేరితే సాంఘిక ప్రయోజనం పెరుగుతుందని తీర్మానించారు. వీరు ఎక్కువగా వ్యక్తిగత ప్రయోజనం పైనే దృష్టి సారించారు.
* 20వ శతాబ్దంలో జాన్‌ రాల్స్‌ అనే తత్వవేత్త ‘ఎ థియరీ ఆఫ్‌ జస్టిస్‌’ (1971) అనే పుస్తకం ద్వారా ప్రజల మధ్య సమానత్వం, న్యాయం గురించి చర్చించడంతో అభివృద్ధిలో మానవత్వ కోణాన్ని జోడించినట్లయింది. ఇతడి సిద్ధాంతం ఆధారంగా అమర్త్యసేన్, మార్థానస్‌బామ్ (Martha nussbaum)‌ మానవ శ్రేయస్సుకు మానవ సామర్థ్యాలు అవసరమని నిర్ధారించారు. మానవాభివృద్ధి అనేది మనిషి ఏమి కలిగి ఉన్నాడు అనేదానిపై కాకుండా ఏమి చేయగలడు అనే విషయంపై ఆధారపడి ఉంటుందని, సామర్థ్యాలు మాత్రమే మనిషి సంపాదన, దాని వినియోగాన్ని నిర్ణయించి అతడి సాధికారతకు దారి తీస్తాయని వివరించారు. ఆదాయాభివృద్ధి కాదు మానవాభివృద్ధే అంతిమ లక్ష్యమని చెప్పారు.
    జాతి, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా సర్వకాల సార్వజనీన విలువల ఆలంబనగా మహబూబ్‌-ఉల్‌-హక్‌ అనే పాకిస్థాన్‌ ఆర్థికవేత్త చొరవతో పాల్‌ స్ట్రీటెన్, ఫ్రాన్సిస్‌ స్టీవార్ట్, సుధీర్‌ ఆనంద్, మేఘనాథ్‌ దేశాయ్‌ లాంటి శాస్త్రవేత్తలు, మానవాభివృద్ధి సూచికను ప్రతిపాదించారు. అమర్త్యసేన్‌ సిద్ధాంతం దీనికి ఆధారం. 1990 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
    మానవుల సామర్థ్యాన్ని పెంచే విద్య, ఆరోగ్యం, తలసరి ఆదాయాలను పరిగణనలోకి తీసుకొని మానవాభివృద్ధి సూచికను రూపొందించారు. అప్పటి నుంచి పరిపాలన అనేది ఆదాయ పెంపు కోసం కాకుండా ప్రజల శ్రేయస్సుకు కేంద్రీకృతంగా మారింది. ప్రపంచం దీన్ని జాతీయ, తలసరి ఆదాయాలకు ప్రత్యామ్నాయంగా గుర్తించింది.

Posted Date : 03-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌