• facebook
  • whatsapp
  • telegram

మానవాభివృద్ధి సూచీ

ప్రపంచంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ప్రగతికి కొలమానంగా 1990 నుంచి మానవాభివృద్ధి సూచీని ఉపయోగిస్తున్నాయి. కాలానుగుణంగా సూచిక అంశాలు, లెక్కింపు విధానంలో మార్పులు చెందుతూ ఇది నిత్య జీవన కొలమానంగా కొనసాగుతోంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూఎన్‌డీపీ 1990 నుంచి ఏటా మానవాభివృద్ధి నివేదికలో ఈ సూచికను తెలుపుతుంది. మానవ శ్రేయస్సును పెంచే అవకాశాలను విస్తృతం చేసే ప్రక్రియనే మానవాభివృద్ధి అంటారు. నిత్య జీవితంలో మనిషి తన ఎదుగుదల కోసం అనేక అంశాలను సేకరిస్తాడు. మానవాభివృద్ధికి తోడ్పడే అనేక అంశాల్లో ఆదాయం ఒకటి అని తీర్మానించారు. ఆర్థికాభివృద్ధి అంతిమంగా మానవాభివృద్ధికి తోడ్పడాలని దేశాల లక్ష్యాల్లో మార్పులు తీసుకొచ్చారు. 

మానవాభివృద్ధి సూచిక - రూపకల్పన 

పాకిస్థాన్‌కు చెందినఆర్థికవేత్త మహబూబ్‌-ఉల్‌-హక్‌ సూచన మేరకు మానవాభివృద్ధికి ప్రధానమైన మూడు అంశాలను  పరిగణనలోకి తీసుకొని 1990లో మొదటిసారి 130 దేశాల గణాంకాల సహాయంతో ర్యాంకులను ప్రకటించారు. ఇది 2018 నాటికి 189 దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం నార్వే ప్రథమ స్థానంలో ఉండగా భారత్‌ 130వ స్థానంలో ఉంది.

1)     సుదీర్ఘ ఆరోగ్య జీవనకాల సూచీ ( Life expectancy index)

2)     విద్యా సూచిక (Education index) (వయోజన అక్షరాస్యత 2/3 + స్థూల నమోదు నిష్పత్తి 1/3)

3)    GDP Per capita (ppp US $) తో కొలిచే జీవన ప్రమాణ సూచిక ( Standard of living index). 

ప్రతి అంశంలోని కనీస, గరిష్ఠ విలువల ఆధారంగా సూచిక విలువను నిర్ణయిస్తారు.

   

ఈ విలువలను కింది సూత్రంలో ఉపయోగించి సూచిక విలువను లెక్క కడతారు. 

ప్రతి అంశం విలువను 0 నుంచి 1 మధ్య తెలుపుతారు.

మానవాభివృద్ధి సూచిక =

మానవాభివృద్ధి సూచిక పైమూడు అంశాల సూచికల విలువల సాధారణ సగటు. ఈ సూచిక అనేక విమర్శలను ఎదుర్కొంది.

విమర్శలు

‣ మానవాభివృద్ధి అనేది విశాలమైన భావన. కేవలం మూడు అంశాలను పరిగణనలోకి తీసుకోవడం సంకుచిత కొలమానం అవుతుంది. వీటి గణాంకాలు వెనుకబడిన దేశాల్లో విశ్వసనీయంగా ఉండవు.

‣ విద్యా, ఆరోగ్యం, ఆదాయం మూడింటికీ సమ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఏ రెండింటిలో మార్పులకైనా ఒకే విలువను పరిగణిస్తున్నారు. దీంతో విజ్ఞానం పెరగకపోయినా ఆదాయం పెరుగుదలతో అభివృద్ధి చెందినట్లు ఈ సూచీ తెలుపుతుంది. 

‣ తలసరి ఆదాయాలు పెరిగినా అవి కొంత మంది ధనవంతులవే కావచ్చు. ఆదాయ అసమానతలను తెలియజేయలేదు. 

‣ విజ్ఞానం, ఆరోగ్యం నాణ్యత గురించి పేర్కొనలేదు. ఇవి తలసరి ఆదాయంతో పటిష్ఠ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వీటినే పరిగణనలోకి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. బహుళ విభిన్న అంశాలు ఉంటే మంచిదని కొంత మంది అభిప్రాయం.

‣  సమగ్ర మానవాభివృద్ధికి అవసరమైన శాంతి, స్వేచ్ఛ, పారదర్శకమైన పాలన, పర్యావరణ పరిరక్షణ గురించి చర్చించలేదు. దేశ ప్రగతిలో సాంకేతిక పరిజ్ఞానం పాత్రను మానవాభివృద్ధి సూచీ విస్మరించింది. ఈ విమర్శలను తగ్గించుకోవడానికి మానవాభివృద్ధి సూచిక నిర్మాతలు ఎప్పటికప్పుడు లెక్కించే అంశాలు, విధానాల్లో మార్పులు తీసుకొస్తున్నారు.

లింగ అభివృద్ధి సూచిక (GDI - 1995)

మానవాభివృద్ధి సూచికను స్త్రీలకు ప్రత్యేకంగా వర్తింపజేసి అందులోని మూడు అంశాల్లో సాధారణ అభివృద్ధితో పాటు స్త్రీ - పురుషుల మధ్య పంపిణీలో అసమానతలను గుర్తిస్తున్నారు. హెచ్‌డీఐ, జీడీఐ మధ్య తేడా స్త్రీల వెనుకబాటుతనాన్ని తెలియజేస్తుంది.  

లింగ సాధికారిక సూచిక (1995)

    ఈ సూచిక ద్వారా మూడు అంశాల ఆధారంగా స్త్రీల సాధికారతను కొలవవచ్చు. 

    1) జాతీయ పార్లమెంట్‌లో మహిళలు పొందిన సీట్లు 

    2) ఆర్థిక నిర్ణయ స్థానాల్లో మహిళల శాతం

    3) ఆదాయంలో స్త్రీల వాటా

‣ వీటిపై కూడా అనేక విమర్శలు వచ్చాయి. సాంకేతిక అంశాలు ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. సరైన గణాంకాలు అందుబాటులో లేవు. వివిధ దేశాలతో పోల్చుకోవడం సముచితంగా లేదు.

‣ అభివృద్ధి చెందిన సమాజాలకు మాత్రమే వర్తిస్తాయి. స్థానిక, గ్రామీణ స్థాయి, అసంఘటిత రంగంలోని స్త్రీల ప్రాధాన్యత,  పాత్రను గుర్తించడం లేదు.

మానవ పేదరిక సూచిక(1997)

1997లో విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదికలో సరికొత్త కొలమానంగా మానవ పేదరిక సూచికను ప్రవేశపెట్టారు. మానవ జీవన ప్రమాణాన్ని తెలపడంలో మానవాభివృద్ధి సూచికకు సహాయకారిగా ఉంటూ జీవనకాలం, విద్య, జీవన ప్రమాణాల్లో వెనుకబాటుతనాన్ని తెలియజేస్తుంది. అభివృద్ధి చెందుతున్న, చెందిన దేశాలకు వేర్వేరుగా లెక్కించి సామాజిక బహిర్గతను బయటపెడుతుంది.  

సూచికలో మార్పులు

రెండు దశాబ్దాల తర్వాత లోపాలను సవరించుకొని 2010 నుంచి కొన్ని మార్పులతో మానవాభివృద్ధి సూచికను గణిస్తున్నారు.

1) సుదీర్ఘమైన ఆరోగ్య జీవన కాలం లెక్కింపులో మార్పు చేయలేదు. 

2) విజ్ఞాన సూచిక కోసం రెండు కొత్త అంశాలను ఎంచుకున్నారు.

   i)  25 ఏళ్లు, ఆపైన వయసు గలవారు చదువుకున్న సగటు సంవత్సరాలు Years off schooling index- EYSI).

    

    గరిష్ఠంగా ఒక వ్యక్తి 15 సంవత్సరాలు నియత విద్యను పొందుతాడని అంచనా.

  ii)  పాఠశాలలో 18 ఏళ్ల లోపు పిల్లలు కొనసాగే అంచనా సంవత్సరాలు Expected Years od schooling index -EYSI)

     

     

3)     ఒక దేశానికి విదేశాల్లో ఉన్న తమ పౌరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కలుపుతూ GDP Per capita బదులు GNP Per capita ఉపయోగించారు. వాటి కనీస, గరిష్ఠ విలువల్లో మార్పులు తీసుకొచ్చారు.

    ఈ మూడింటి సాధారణ సగటు బదులు గుణాత్మక సగటును వాడుతున్నారు.


  

అసమానతల సర్దుబాటుతో హెచ్‌డీఐ

యూఎన్‌డీపీ 2010లో ఈ సూచికను ప్రవేశపెట్టింది. మానవాభివృద్ధి సూచిక దాగి ఉన్న మానవాభివృద్ధిని తెలియజేస్తుంది. అసమానతల సర్దుబాటుతో మానవాభివృద్ధి సూచిక అసమానతలు లేకుండా వాస్తవంగా సాధించిన అభివృద్ధిని తెలుపుతుంది. ఆరోగ్యం, విజ్ఞానం, ఆదాయాల్లో అసమానతల వల్ల మానవాభివృద్ధికి వాటిల్లిన నష్టాన్ని గుర్తిస్తుంది.

లింగ అసమానతల సూచిక 

లింగ అభివృద్ధి సూచిక, లింగ సాధికారిక సూచిక(1995)లోని లోపాలను సవరించి 2010లో వాటి స్థానంలో లింగ అసమానతల సూచికను ప్రవేశపెట్టారు. దీన్ని మూడు ప్రధాన అంశాల విలువల ఆధారంగా లెక్కిస్తారు.

1)   పునరుత్పాదక ఆరోగ్యం ( Reproductive health):  దీనిలో మాతా మరణాల నిష్పత్తి ( Maternal Mortality Ration), వయోజనుల సంతానోత్పత్తి రేటు ( Adolescent Fertility Rate - AFR) అనే రెండు అంశాలు ఉంటాయి. 

2)   సాధికారత (Empowerment): దీనిలో పార్లమెంట్‌ సీట్లలో వాటా, ఉన్నత విద్యలో అవకాశాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి.

3)   కార్మిక మార్కెట్‌లో భాగస్వామ్యం ( Labour market participation)

 ఈ మూడు అంశాల్లో వెనుకబాటుతనం వల్ల మానవాభివృద్ధికి జరిగిన నష్టాన్ని తెలుసుకోవచ్చు.

బహుళ అంశాల పేదరిక సూచిక 

2010లో మానవ పేదరిక సూచిక స్థానంలో బహుళ అంశాల పేదరిక సూచికను ప్రవేశపెట్టారు.పేదరికాన్ని కేవలం ఆదాయం ఆధారంగా కాకుండా ఒక వ్యక్తి ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలకు చెందిన పది అంశాల ఆధారంగా లెక్కిస్తారు. అయితే అన్ని అంశాలకు చెందిన గణాంకాలు లభ్యం కాకపోవడంతో 100 దేశాల్లో మాత్రమే బహుళ అంశాల పేదరిక సూచిక (Multidimensional Poverty Index)ను లెక్కిస్తున్నారు. అనేక మార్పులు జరుగుతున్నప్పటికీ కొన్ని అధ్యయనాలు మానవాభివృద్ధి సూచికను విమర్శిస్తూనే ఉన్నాయి. 

హెచ్‌డీఐ నివేదిక - 2020

హెచ్‌డీఐ నివేదిక - 2020 ప్రకారం మొదటి 10 స్థానాల్లో ఉన్న దేశాలు: యూఎన్‌డీపీ 2020, డిసెంబరు 15న మొత్తం 189 దేశాలతో హెచ్‌డీఆర్‌ - 2020లో  మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ)ని ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం మొదటిస్థానంలో నార్వే; చివరి స్థానంలో నైగర్‌ (189) నిలిచాయి.

దేశం ర్యాంక్‌ (స్థానం) హెచ్‌డీఐ విలువ
నార్వే మొదటి స్థానం  0.957
ఐర్లాండ్ రెండో స్థానం  0.955
స్విట్జర్లాండ్‌ రెండో స్థానం 0.955
హాంకాంగ్,  చైనా నాలుగో స్థానం 0.949
ఐస్‌లాండ్ నాలుగో స్థానం 0.949
జర్మనీ  ఆరో స్థానం 0.947
స్వీడన్ ఏడో స్థానం 0.945
ఆస్ట్రేలియా ఎనిమిదో స్థానం 0.944
నెదర్లాండ్స్ ఎనిమిదో స్థానం  0.944
డెన్మార్క్ పదో స్థానం 0.940

ఆధారం: యూఎన్‌డీపీ - హెచ్‌డీఐ నివేదిక - 2020

* హెచ్‌డీఐ నివేదిక - 2020 ప్రకారం చివరి స్థానంలో ఉన్న అయిదు దేశాలు

దేశం  ర్యాంక్ హెచ్‌డీఐ విలువ
బురుండి 185 0.433
దక్షిణ సూడాన్ 185 0.433
చాద్ 187 0.398
సెంట్రల్‌ ఆఫ్రికన్ రిపబ్లిక్ 188 0.397
 నైగర్‌ 189 0.394

ఆధారం: యూఎన్‌డీపీ - హెచ్‌డీఐ నివేదిక - 2020

హెచ్‌డీఐ నివేదిక 2020 - బ్రిక్స్‌ దేశాలతో (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) భారతదేశానికి పోలిక: 

*  యూఎన్‌డీపీ ప్రకటించిన హెచ్‌డీఆర్‌ ప్రకారం మొత్తం 189 దేశాల్లో భారత్‌ 131 స్థానంలో ఉంది.

* హెచ్‌డీఐ - 2020 బ్రిక్స్‌ దేశాల స్థాయి

దేశం ర్యాంక్ హెచ్‌డీఐ విలువ ఆయుర్దాయం

తలసరి స్థూల జాతీయ  ఆదాయం 

 బ్రెజిల్ 84 0.765 75.9 14,263
రష్యా 52 0.824 72.6  26,157
ఇండియా 131 0.645 69.7 6,681
చైనా 85 0.761 76.9 16,057
దక్షిణాఫ్రికా 114 0.709 64.1 12,129

ఆధారం: యూఎన్‌డీపీ - హెచ్‌డీఐ నివేదిక - 2020

‣ హెచ్‌డీఐ - 2020 నివేదిక ప్రకారం బ్రిక్స్‌ దేశాల్లో రష్యా (52వ స్థానం) మెరుగైన స్థానంలో, భారత్‌ (131) తక్కువ ర్యాంక్‌లో ఉన్నాయి. బ్రిక్స్‌ దేశాల్లో తక్కువ హెచ్‌డీఐ విలువ ఉన్న దేశం భారత్‌ (0.645). ఆయుర్దాయంలో చైనా (76.9 సంవత్సరాలు) మెరుగైన స్థాయిలో ఉండగా, భారత్‌లో ఇది 69.7 సంవత్సరాలుగా ఉంది.

‣ బ్రిక్స్‌ దేశాల్లో తలసరి స్థూల జాతీయాదాయం ఇండియాలో 6,681 డాలర్లుగా ఉండగా రష్యాలో 26,157 డాలర్లు ఉంది.

‣ హెచ్‌డీఐ నివేదిక - 2020 ప్రకారం భారతదేశానికి సరిహద్దు దేశాల ర్యాంకులను గమనిస్తే, శ్రీలంక(72) , చైనా (85), భూటాన్ (129), బంగ్లాదేశ్‌ (133), నేపాల్‌ (42), మయన్మార్‌( 47),  పాకిస్థాన్‌ (154), ఆఫ్గనిస్థాన్ (169) లో ఉన్నాయి. ఈ ర్యాంకులకు ఆధారం యూఎన్‌డీపీ నివేదిక - 2020

‣ ఈ నివేదిక ప్రకారం భారత్‌ సరిహద్దు దేశాలైన శ్రీలంక, చైనా, భూటాన్‌ కంటే వెనుకంజలో ఉంది

వివిధ సంవత్సరాల్లో భారతదేశ హెచ్‌డీఐ స్థాయి

సంవత్సరం మొత్తం దేశాలు భారత్  ర్యాంక్ హెచ్‌డీఐ విలువ ఆయుర్దాయం తలసరి జాతీయ ఆదాయం
2016 188 131 0.624 68.3 5,663
2018 189 130 0.640 68.8 6,353
2019 189 129 0.647 69.4 6,829
2020 189 131 0.645 69.7 6,681

ఆధారం: యూఎన్‌డీపీ - హెచ్‌డీఐ నివేదిక - 2016, 2018, 2019, 2020.

Posted Date : 03-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌