• facebook
  • whatsapp
  • telegram

న్యాయవ్యవస్థ

    'ఒక దేశ ఔన్నత్యాన్ని, నాగరికతను ఆదేశ న్యాయవ్యవస్థ పనితీరులో చూడవచ్చని' లార్డ్‌బ్రైస్ పేర్కొన్నారు. మనదేశం ఏకీకృత, సమీకృత న్యాయవ్యవస్థను అనుసరిస్తుంది. జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు, దాని కింద రాష్ట్రస్థాయిలో హైకోర్టులు, వాటి కింద స్థానిక స్థాయిలో సబార్డినేట్ కోర్టులు ఉన్నాయి. దేశంలోని న్యాయస్థానాలన్నీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తాయి.
* భారత రాజ్యాంగ నిర్మాతలు బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఏకీకృత, సమన్యాయ పాలనను; అమెరికా రాజ్యాంగం నుంచి న్యాయసమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థను గ్రహించారు.


సుప్రీంకోర్టు చరిత్ర
* ఈస్టిండియా కంపెనీ మనదేశాన్ని పాలిస్తున్న సమయంలో 1773లో రూపొందించిన రెగ్యులేషన్ చట్టం ప్రకారం 1774, మార్చి 16న కలకత్తాలోని పోర్టువిలియంలో తొలి సుప్రీంకోర్టును ఏర్పాటుచేశారు.
* దీని తొలి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజాఇంఫే.
* ఇతర న్యాయమూర్తులు సీజర్ లైమెస్టర్, జాన్‌హైడ్, రాబర్ట్ చాంబర్స్.
* కలకత్తాలోని సుప్రీంకోర్టును 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఫెడరల్ కోర్టుగా మార్చి1937లో న్యూదిల్లీలో ఏర్పాటు చేశారు.
* ఫెడరల్ కోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి సర్ మారిస్ గ్వేయర్.
* భారతదేశంలో న్యాయవ్యవస్థను ప్రవేశపెట్టిన వారు వారన్ హేస్టింగ్స్.
* భారత్‌లో న్యాయవ్యవస్థను అభివృద్ధి పరిచి, న్యాయవ్యవస్థకు పితామహుడిగా పేరొందిన వారు కారన్‌వాలీస్.
* భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 124 నుంచి 147 వరకు ఉన్న ఆర్టికల్స్‌లో సుప్రీంకోర్టు నిర్మాణం, న్యాయమూర్తుల అర్హతలు, అధికారాలు, విధుల గురించి వివరించారు.
* 1950, జనవరి 28 నుంచి భారత సుప్రీంకోర్టు న్యూదిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు భవన నిర్మాణ రూపకర్త గణేశ డియోల్కర్. సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్.జె. కానియా
సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడానికి కారణాలు
 * భారత రాజ్యాంగ ఆధిక్యతను కాపాడటం.
 * ప్రాథమిక హక్కుల సంరక్షకులుగా వ్యవహరించడం.
 * మన దేశ సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించడం.
 * భారత రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం.
 * రాజ్యాంగానికి అర్ధవివరణను ఇవ్వడం.

సుప్రీంకోర్టు నిర్మాణం
* ఆర్టికల్, 124 సుప్రీంకోర్టు నిర్మాణాన్ని తెలియజేస్తుంది. 1950లో సుప్రీంకోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులతో ప్రారంభమైంది. ఈ సంఖ్య కింది మార్పులకు గురైంది.
1950 - 1 + 7
1956 - 1 + 10
1960 - 1 + 13
1978 - 1 + 18
1985 - 1 + 25
2008 - 1 + 30
* సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంటు నిర్ణయిస్తుంది.
* సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి సంతకం, సీలు వేసిన వారెంటు ద్వారా నియమిస్తారు.
 

అర్హతలు
* భారత పౌరుడై ఉండాలి.
* 5 ఏళ్లు హైకోర్టు న్యాయమూర్తిగా (Judge) పనిచేసి ఉండాలి. లేదా 10 ఏళ్లు హైకోర్టు న్యాయవాదిగా (Lawyer)
పనిచేసి ఉండాలి.
* రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడై ఉండాలి.

* న్యాయమూర్తుల నియామకం సందర్భంగా కనీస వయసు నిర్ణయించలేదు.
* న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు.
* లా కమిషన్, రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌లు పదవీ విరమణ వయసును 67 సంవత్సరాలకు పెంచాలని సూచించాయి.
 

ప్రధాన న్యాయమూర్తి నియామకం
* సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీనియర్‌ను ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించడం ఒక సంప్రదాయం. కానీ 1973లో ఇందిరా గాంధీ ప్రభుత్వ సిఫారసుల మేరకు సీనియర్ న్యాయమూర్తులైన జె.ఎం. షేలట్, ఎ.ఎన్. గ్రోవర్, కె.ఎస్. హెగ్డేలను విస్మరించి 4వ స్థానంలో ఉన్న జూనియర్ అయిన ఎ.ఎన్. రేనును ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
* 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ సిఫారసుల మేరకు సీనియర్ న్యాయమూర్తి హెచ్.ఆర్. ఖన్నాను కాదని, జూనియర్ అయిన ఎమ్.హెచ్. బౌగ్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.

న్యాయమూర్తుల నియామకం - కొలీజియం వ్యవస్థ

ఎస్.పి. గుప్తా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1982)
* సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో రాష్ట్రపతి కొలీజియాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదని ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది.
* దీన్నే మొదటి జడ్జెస్ కేసుగా పేర్కొంటారు.
 

సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1993)
* సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియామకం చేసే సమయంలో రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI) ని కొలీజియంగా తప్పనిసరిగా సంప్రదించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
* దీన్నే సెకండ్ జడ్జెస్ కేసుగా పేర్కొంటారు.
* 1998లో అప్పటి భారత రాష్ట్రపతి ఆర్టికల్, 143 ప్రకారం కొలీజియంపై సుప్రీంకోర్టు న్యాయసలహాను కోరారు.
* 1999లో 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కొలీజియంకు సంబంధించి ఈ విధంగా వివరణను ఇచ్చింది.
a) కొలీజియం అంటే సీజేఐతోపాటు మరో నలుగురు ఇతర న్యాయమూర్తులుంటారు.
b) రాష్ట్రపతి కొలీజియం సలహాను తప్పనిసరిగా పాటించాలి.
c) రాష్ట్రపతి కొలీజియంను సంప్రదించిన తర్వాత న్యాయమూర్తులను నియమించాలి.

నేషనల్ జడ్జెస్ అపాయింట్‌మెంట్ కమిటీ (NJAC)
   మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 120వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా న్యాయమూర్తుల నియామకం కోసం జడ్జెస్ అపాయింట్‌మెంట్ కమిటీ(JAC) ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది.
* నరేంద్ర మోదీ ప్రభుత్వం 120వ సవరణ బిల్లును ఉపసంహరించి, దాన్ని 121వ సవరణ బిల్లుగా రూపొందించి నేషనల్ జడ్జెస్ అపాయింట్‌మెంట్ కమిషన్(NJAC) ను ఏర్పాటు చేసింది. దీన్ని పార్లమెంటు 2/3వ వంతు మెజార్టీతో ఆమోదించడంతో పాటు, భారత్‌లోని 15 రాష్ట్రాలు కూడా ఆమోదించిన తర్వాత, అది 99వ రాజ్యాంగ సవరణ చట్టంగా 2014, డిసెంబరు 31న రాష్ట్రపతి సంతకంతో చట్టబద్ధమైంది.
* నేషనల్ జడ్జెస్ అపాయింట్‌మెంట్ కమిషన్ (NJAC) 2015, ఏప్రిల్ 13 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ఫలితంగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతి కొలిజీయంకు బదులుగా ఎన్‌జేఏసీని సంప్రదించాల్సి ఉంటుంది.
 

ఎన్‌జేఏసీ ఏర్పాటు చెల్లదు - సుప్రీం తీర్పు
* సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎన్‌జేఏసీ ఏర్పాటు చెల్లదని, అది రాజ్యాంగ విరుద్ధమని 2015, అక్టోబరు 16న ప్రకటించింది. దీన్నే థర్డ్ జడ్జెస్ కేసుగా పేర్కొంటారు.
* ఎన్‌జేఏసీ ఏర్పాటు చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో తిరిగి సీజేఐ నేతృత్వంలోని కొలీజియం వ్యవస్థ అమల్లోకి వచ్చింది.

న్యాయమూర్తుల తొలగింపు విధానం
* అవినీతి, అసమర్థత, దుష్ప్రవర్తన అనే కారణాలపై రాష్ట్రపతిని తొలగించే పద్ధతిలోనే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను పార్లమెంటు 2/3వ వంతు మెజార్టీతో రాష్ట్రపతి తొలగిస్తారు. న్యాయమూర్తులను పదవి నుంచి తొలగించే అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
* న్యాయమూర్తులను తొలగించే అభిశంసన తీర్మాన నోటీస్‌పై లోక్‌సభలో 100 మంది, రాజ్యసభలో 50 మంది సభ్యుల సంతకాలు అవసరం.
* 14 రోజుల ముందస్తు నోటీసుతో తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడతారో సంబంధిత సభాధిపతి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు.
* కమిటీ విచారణ తర్వాత ఇచ్చే రిపోర్ట్‌పై ఆ సభ చర్చించి 2/3వ వంతు మెజార్టీతో తీర్మానాన్ని ఆమోదిస్తే, రెండో సభకు కూడా పంపి అక్కడ కూడా 2/3వ వంతు మెజార్టీతో ఆమోదిస్తే రాష్ట్రపతి వారిని తొలగిస్తారు.
* తీర్మానం ఏ సభలో ప్రవేశపెడతారో ఆ సభ తీర్మానాన్ని తిరస్కరిస్తే రెండోసభకు పంపాల్సిన అవసరం లేదు. ఒక సభ ఆమోదించిన తీర్మానాన్ని రెండో సభ తిరస్కరిస్తే తీర్మానం రద్దు అవుతుంది.
* మనదేశంలో ఇప్పటి వరకు ఈ తీర్మానం ద్వారా ఎవరినీ తొలగించలేదు.
* 1991లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. రామస్వామిపై ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ అది వీగిపోయింది. తర్వాత రామస్వామి తన పదవికి రాజీనామా చేశారు.

జీతభత్యాలు
* సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను ఆర్టికల్, 125 తెలియజేస్తుంది.
* వీరి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. వీటిని కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఆదాయపు పన్ను నుంచి మినహాంపు ఉంటుంది.
* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం నెలకు రూ.1,00,000.
* సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తుల వేతనం నెలకు రూ.90,000.
* ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో వీరివేతనాలు తగ్గించకూడదు.
* సుప్రీంకోర్టు తాత్కాలిక (అడ్‌హాక్) ప్రధాన న్యాయమూర్తిని ఆర్టికల్, 126 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు.
* ఆర్టికల్, 127 ప్రకారం సుప్రీంకోర్టులో అడ్‌హాక్ (తాత్కాలిక) న్యాయమూర్తులను రాష్ట్రపతి అనుమతితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు. ఈ విధంగా నియమించిన తాత్కాలిక న్యాయమూర్తుల పదవీ కాలం 2 సంవత్సరాలు.
* సాధారణ న్యాయమూర్తులకు కల్పించే సౌకర్యాలన్నీ తాత్కాలిక న్యాయమూర్తులకు వర్తిస్తాయి.
* ఆర్టికల్, 128 ప్రకారం సుప్రీంకోర్టులో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులను రాష్ట్రపతి అనుమతితో సుప్రీంకోర్టుకు హాజరు కావాలని ప్రధాన న్యాయమూర్తి కోరవచ్చు.
* ఆర్టికల్, 130 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన కేంద్రం న్యూ దిల్లీలో ఉంది.
* కేంద్ర కేబినెట్ సుప్రీంకోర్టు బెంచ్‌లను కలకత్తా, చెన్నై, ముంబయిలలో ఏర్పాటు చేయాలని చేసిన ప్రతిపాదనను 25 మంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2000 సంవత్సరంలో తిరస్కరించింది.

Posted Date : 03-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌