• facebook
  • whatsapp
  • telegram

మొక్క - కణజాల వర్ధనం

బయో టెక్నాలజీలో (జీవసాంకేతిక శాస్త్రం) ఉండే విభాగాల్లో కణజాల వర్ధనం ఒకటి. వీటిలో మొక్క కణజాల వర్ధనం నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని వ్యవసాయం, అడవులు, తోటల పెంపకం, పారిశ్రామిక రంగం, జీవవైవిధ్యాన్ని సంరక్షించడం లాంటి విభాగాల్లో విరివిగా వాడుతున్నారు.
మొక్క దేహ భాగలైన విత్తనాలు, పిండాలు, శాఖీయ కణాలను లేదా కణజాలాలను కృత్రిమ పోషక యానకంపై నియంత్రించిన పరిస్థితుల్లో సూక్షజీవ రహిత వాతావరణంలో పెంచడాన్ని మొక్క కణజాల వర్ధనం  అంటారు. కణజాల వర్ధనం ద్వారా అనేక మొక్కలను ఏర్పరచడంలో కింది దశలు ఉన్నాయి.


అవి:
1. పోషక యానకం తయారీ: కణజాల వర్ధనంలో పోషక యానకంపై మొక్క కణజాలం పెరిగేందుకు కావలసిన సూక్ష్మ, స్థూల మూలకాలు, విటమిన్‌లు, నీరు, హార్మోన్‌లు, కార్బోహైడ్రేట్స్‌ లాంటివి ఉంటాయి. నీటికి ఈ పదార్థాలను తగిన పాళ్లలో కలిపి పోషక యానకాన్ని తయారు చేస్తారు. యానకంలో కణజాలం మునిగిపోకుండా ఉండేందుకు పోషక యానకానికి (అగార్‌ - అగార్‌) జున్నుగడ్డిని కలిపి ఘనస్థితికి తీసుకువస్తారు.


2. పోషక యానకాన్ని సూక్ష్మజీవ రహితం చేయడం: పోషక యానకంలో సూక్ష్మజీవులు పెరిగితే అవి యానకాన్ని పాడుచేస్తాయి, మొక్క కణం సరిగా పెరగదు. దీని కోసం పోషక యానకాన్ని ఆటోక్లేవ్‌ అనే పరికరంలో ఉంచి సూక్ష్మజీవ రహితం చేస్తారు. ఈ పరికరం ప్రెషర్‌ కుక్కర్‌లా ఉంటుంది.


3. ఎక్స్‌ప్లాంట్‌ను తయారు చేయడం: జీవించి ఉన్న మొక్క నుంచి అవయవం లేదా ఒక భాగాన్ని తీసుకుని కణజాల వర్ధనంలో ఉపయోగించుకుంటే ఆ మొక్క భాగాన్ని ఎక్స్‌ప్లాంట్‌ అంటారు. బయటి వాతావరణం, మట్టిలో పెరుగుతున్న మొక్క నుంచి ఎక్స్‌ప్లాంట్‌ను తీసుకుంటే దానిపై సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిని తొలగించడానికి ఎక్స్‌ప్లాంట్‌ను నీరు, ఇతర రసాయనాలతో శుభ్రపరచడాన్ని ఎక్స్‌ప్లాంట్‌ తయారుచేయడంగా పేర్కొంటారు.


4. ఎక్స్‌ప్లాంట్‌ను అంతర్నివేశనం (Inoculation) చేయడం: సూక్ష్మజీవ రహితం చేసిన ఎక్స్‌ప్లాంట్‌ను పోషక యానకం ఉన్న పరీక్షనాళికలో లేదా గాజుపాత్రల్లో ఉంచడాన్ని ఎక్స్‌ప్లాంట్‌ను అంతర్నివేశనం చేయడం అని అంటారు. ఈ ప్రక్రియ ప్రయోగశాల గదిలో లామినార్‌ ఎయిర్‌ఫ్లో అనే పరికరం ముందు చేస్తారు. ఇది సూక్ష్మజీవ రహిత వాతావరణాన్ని ఏర్పరచడానికి సహాయపడుతుంది.


5. పెరుగుదలకు ఇన్‌క్యుబేషన్‌: ఎక్స్‌ప్లాంట్‌ ఉన్న వర్ధన పాత్రలను కాంతి, ఉష్ణోగ్రత, తేమ నియంత్రించిన గదుల్లోకి మార్చాలి. ఈ పద్ధతిని ఇన్‌క్యుబేషన్‌ అంటారు. ఇక్కడ ఎక్స్‌ప్లాంట్‌ యానకంలోని పదార్థాలను తీసుకుని పెరుగుతుంది. హార్మోన్‌ల ప్రభావం వల్ల కొద్ది వారాల్లో ఎక్స్‌ప్లాంట్‌ నుంచి అనేక మొక్కలు ఏర్పడతాయి.


6. వాతావరణానుకూలత చెందించడం, కుండీల్లోకి మార్చడం: కణజాల వర్ధనంలో పెరిగిన మొక్కలు సున్నితంగా ఉంటాయి. ఎక్కువ కాంతిని, ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. కాబట్టి వీటిని సాధారణ ఉష్ణోగ్రత వద్ద గది లేదా గ్లాస్‌హౌస్‌లో పెరగనివ్వాలి. ఇక్కడ మొక్క వాతావరణ అనుకూలత చెందుతుంది. ఈ మొక్కలను తర్వాత కుండీల్లోకి లేదా నేల పైకి మార్చవచ్చు.

ఉపయోగాలు
* ఈ పద్ధతి ద్వారా ఎక్కువ మొక్కలను తక్కువ సమయం, తక్కువ స్థలంలో ఉత్పత్తి చేయవచ్చు. అలంకరణ, ఆర్కిడ్, పండ్ల మొక్కలను ఈ విధంగా ఉత్పత్తి చేస్తున్నారు.
* అరుదైన, అంతరించిపోతున్న మొక్కలను కణజాల వర్ధనం ద్వారా ఉత్పత్తి చేసి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు.
* బొప్పాయి లాంటి వాటిలో ఆడ మొక్కలను మాత్రమే ఉత్పత్తి చేయవచ్చు.
* కాండ అగ్రభాగాలను వర్ధనం చేసి వైరస్‌రహిత మొక్కలను ఉత్పత్తి చేయవచ్చు.
* క్రయో ప్రిజర్వేషన్‌ (అతిశీతల పరిరక్షణ) పద్ధతిలో నిల్వ ఉంచిన మొక్కల భాగాలను కణజాల వర్ధనం ద్వారా పెంచి మొక్కలను సృష్టించవచ్చు.
* జన్యు పరివర్తన మొక్కలను సృష్టించడంలో కణజాల వర్ధనం ఉపయోగపడుతుంది.
* కణజాల వర్ధనం ద్వారా శాఖీయ పిండాలను (somatic embryos) సృష్టించి వీటి ద్వారా కృత్రిమ విత్తనాలను తయారు చేయవచ్చు. కృత్రిమ విత్తనాలను సులువుగా నిల్వ చేసి, రవాణా చేయవచ్చు.  వీటిని యానకంలో వృద్ధి చెందించి మొక్కలుగా మార్చవచ్చు.
* కణజాల వర్ధనం ద్వారా మొక్క వేరు, కాండం, పత్రాలు లాంటి భాగాలను పెద్ద మొత్తంలో పెంచి పారిశ్రామిక, వైద్య రంగంలో ఉపయోగపడే అనేక రసాయనాలను సంగ్రహించవచ్చు.
* కణజాల వర్ధనం ద్వారా నిర్ణీత దశ వరకు పెరిగి ఆగిపోయిన పిండాలను పోషకయానకంపై పెంచి కొత్త మొక్కలను సృష్టించవచ్చు. దీన్నే పిండ రక్షణ అంటారు.
* కణజాల వర్ధనం వల్ల మొక్కల్లో అంగాలు ఏర్పడటం, అవయ విభేదనం లాంటి వాటిని పరిశీలించవచ్చు.

సంశ్లేషిత విత్తనాలు అంటే...
* కణజాల వర్ధనం ద్వారా మొక్కలను ఉత్పత్తి చేయడం అనేది కణ టోటిపొటెన్సీ సూత్రంపై ఆధారపడి ఉంటుంది.
* మొక్క కణాన్ని కృతిమ పోషకయానకంలో పెంచినప్పుడు, కణం అంతర్గత సామర్థ్యం వల్ల విభజన చెంది, పెరిగి పూర్తి మొక్కగా మారే సామర్థ్యాన్ని టొటిపొటెన్సీ అంటారు. ఈ లక్షణం మొక్కల కణాలకు మాత్రమే ఉంటుంది. జంతుకణాలకు ఉండదు.
* కణజాల వర్ధనం ద్వారా మొక్కలను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడాన్ని సూక్ష్మ వ్యాప్తి (మైక్రో ప్రాపగేషన్‌) అంటారు.
* సోడియం ఆల్జినేట్‌ రసాయనం తొడుగు ఉన్న శాఖీయ పిండాలను కృత్రిమ విత్తనాలు అంటారు.
* కణజాల వర్ధనంలో ఎక్కువగా వాడే యానకం మురిషిగే, స్కూగ్‌.
* కృత్రిమ విత్తనాలను సంశ్లేషిత విత్తనాలు అంటారు. వీటిని వర్ధన యానకంపై పెంచి పూర్తి మొక్కలను ఏర్పరచవచ్చు.
* కణజాల వర్ధనం ద్వారా ఉత్పత్తయిన మొక్కలు కొన్నిసార్లు వైవిధ్యాన్ని చూపించి వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ వైవిధ్యాలను సోమాక్లోనల్‌ వైవిధ్యాలు అంటారు.
* కణజాల వర్ధనం ద్వారా ఉత్పత్తయిన మొక్కలను వాతావరణానుకూలత చెందించడానికి గ్లాస్‌హౌస్‌ లేదా గ్రీన్‌హౌస్‌లను వాడతారు.

Posted Date : 02-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌