• facebook
  • whatsapp
  • telegram

నిరుద్యోగం

నిరుద్యోగం ఒక సాంఘిక, ఆర్థిక సమస్య. ఒక దేశ వర్తమాన, భవిష్యత్తు జీవనాన్ని ప్రభావితం చేసే అంశాల్లో నిరుద్యోగ సమస్య ప్రధానమైంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది మరిన్ని కొత్త సమస్యలను సృష్టిస్తోంది. ‘‘నిరుద్యోగం అనేది సమస్యల సమస్య; మన యువకుల్లో కొంతమందిని ఇది తీవ్రవాదులుగా తయారు చేసింది. విద్యావంతుల్లో పెరుగుతున్న అసంతృప్తి కారణంగా వారు తీవ్రవాదులుగా మారుతున్నారు’’ అని భారత మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి అభిప్రాయపడ్డారు. 

  నిరుద్యోగుల రూపంలో అపార మానవ వనరులు నిరుపయోగంగా ఉండటం వల్ల ఆర్థికాభివృద్ధి కుంటుపడుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ‘సార్థక డిమాండ్‌ కొరత (Lack of Effective Demand)’ వల్ల నిరుద్యోగం ఏర్పడుతుంది. అంటే ఉత్పత్తి అయిన వస్తువులకు తగినంత డిమాండ్‌ ఉండదు. దీని వల్ల ఉత్పత్తికి ప్రోత్సాహం తగ్గి, శ్రామికులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అభివృద్ధి చెందుతున్న భారత్‌ లాంటి దేశాల్లో మూలధనం కొరత వల్ల నిరుద్యోగిత ఏర్పడుతుంది. 

నిరుద్యోగిత - భావనలు

ఉద్యోగి: ఒక వ్యక్తి రోజుకు 8 గంటలు లేదా సంవత్సరంలో 273 రోజులు పనిచేస్తే ప్రామాణిక సంవత్సర ఉద్యోగిగా పరిగణిస్తారు.

మనదేశంలో జాతీయ గణాంక కార్యాలయం (National Statistical Office - NSO) నిరుద్యోగిత గణాంకాలను అంచనా వేస్తోంది.

పంచవర్ష ప్రణాళికల్లో ఆరో ప్రణాళికను (1980 - 85) నిరుద్యోగిత ప్రణాళిక అని కూడా అంటారు.

ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగితను అంచనా వేయడానికి నియమించిన నిపుణుల కమిటీ కొన్ని సూచనలు చేసింది. దీని ప్రకారం ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తన 27వ రౌండ్‌లో (1972 అక్టోబరు - 1973 సెప్టెంబరు) నిరుద్యోగితకు సంబంధించి మూడు అంచనాలను పేర్కొంది. అవి:

1. నిరంతర నిరుద్యోగిత లేదా సాధారణ స్థితిగల నిరుద్యోగిత (Chronic unemployment or Usual principal status unemployment)

2. వారపరమైన స్థితిగల నిరుద్యోగిత (weekly status unemployment)

3. రోజువారీ స్థితిగల నిరుద్యోగిత (Daily status unemployment)

నిరంతర నిరుద్యోగిత:

ఒక వ్యక్తి పనిచేయడానికి ఇష్టపడి, దాని కోసం ప్రయత్నం చేసి, సంవత్సరంలో ఎక్కువ కాలం ఖాళీగా ఉండటాన్ని ఈ స్థితిగా పేర్కొంటారు. శాశ్వత ఉద్యోగ అన్వేషణలో ఉన్న విద్యావంతులు, నైపుణ్యం ఉన్నవారు ఇందులో ఉంటారు. దీన్నే ‘బహిరంగ నిరుద్యోగిత’ అని కూడా అంటారు.

వారపరమైన స్థితిగల నిరుద్యోగిత:

 దీని ప్రకారం ఒక వ్యక్తి 7 రోజుల్లో కనీసం గంట పని చేస్తే అతడు/ ఆమెను ఉద్యోగిగా పరిగణిస్తారు. అలా చేయలేని వారిని నిరుద్యోగులుగా భావిస్తారు.

రోజువారీ స్థితిగల నిరుద్యోగిత 

వ్యక్తికి ఒక రోజులో ఏ మాత్రం పని దొరక్కపోవడాన్ని రోజువారీ స్థితిగల నిరుద్యోగితగా పేర్కొంటారు.

నిరుద్యోగితకు కారణాలు:

1. ఉపాధిరహిత వృద్ధి

2. శ్రామికశక్తిలో పెరుగుదల

3. ప్రతికూల సాంకేతికత

4. ప్రతికూలమైన విద్యావ్యవస్థ

5. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు

నిరుద్యోగిత గణాంకాలు (2021)

సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (Centre For Monitoring Economy - CMIE) నివేదిక (2021, అక్టోబరు 3) ప్రకారం మన దేశంలో నిరుద్యోగిత గణాంకాలు కింది విధంగా ఉన్నాయి.

గ్రామీణ నిరుద్యోగిత రేటు : 6.04%

పట్టణ నిరుద్యోగిత రేటు : 8.38%

భారతదేశ నిరుద్యోగిత రేటు : 6.78%

2021, సెప్టెంబరు నాటికి తెలంగాణలో నిరుద్యోగిత రేటు 3.7% ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 6.3 శాతంగా ఉంది. పని చేసే వయసు (15 నుంచి 60 సంవత్సరాల మధ్య), సామర్థ్యం, కోరిక ఉన్న వ్యక్తులకు వేతనానికి తగ్గ పని లభించని స్థితిని నిరుద్యోగితగా పేర్కొంటారు.

పదిహేనేళ్ల కంటే తక్కువ, అరవై కంటే ఎక్కువ వయసు ఉండే వ్యక్తుల్లో పనిచేసే కోరిక, సామర్థ్యం ఉన్నప్పటికీ పని లభించని స్థితిని నిరుద్యోగితగా భావించరు.

15-60 ఏళ్ల మధ్య వయసు ఉండి, అంగవైకల్యం లేదా మానసిక లోపంతో బాధపడేవారిని నిరుద్యోగులుగా పరిగణించరు.

కొంతమంది ధనికుల్లో  పనిచేసే సామర్థ్యం, వయసు ఉన్నప్పటికీ  పనిచేయాలనే కోరిక లేకపోతే వారిని నిరుద్యోగులుగా పేర్కొనరు.

ప్రచ్ఛన్న నిరుద్యోగం (Disguised unemployment):

ఇది సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఏర్పడే చక్రీయ నిరుద్యోగితను కూడా దీనికి అన్వయించవచ్చు.

ఉత్పత్తి ప్రక్రియలో అవసరమైన శ్రామికుల కంటే ఎక్కువ మంది ఉంటే వారిని ‘ప్రచ్ఛన్న నిరుద్యోగులు’ అంటారు. పని చేస్తున్న ఉద్యోగుల్లో కొంతమందిని తొలగించినా ఉత్పత్తి తగ్గదు. 

దీనికి కారణం ప్రచ్ఛన్న నిరుద్యోగి ఉపాంత ఉత్పాదకత శూన్యంగా (zero) లేదా రుణాత్మకంగా (negative), నామమాత్రంగా (negligible) ఉండటమే.

మనదేశంలో ఇది వ్యవసాయ రంగంలో ఉంది.

నిరుద్యోగిత రకాలు

నిరుద్యోగితను ప్రధానంగా పది రకాలుగా విభజించారు. అవి:

వ్యవస్థాపరమైన నిరుద్యోగిత:

ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో గత 3040 ఏళ్లలో పెరిగిన శ్రామికుల సంఖ్య రేటు కంటే ఉద్యోగ అవకాశాల పెరుగుదల రేటు తక్కువగా ఉంది. ఆర్థికాభివృద్ధి రేటు మందకొడిగా ఉండటమే దీనికి కారణం. 

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా  పెరుగుదల ఎక్కువగా ఉండటం, వనరుల కొరత కారణంగా ఆర్థికాభివృద్ధి తగ్గి, ఉపాధి అవకాశాలు కుంటుపడి వ్యవస్థాపరమైన నిరుద్యోగిత ఏర్పడుతుంది. దీన్నే బహిరంగ నిరుద్యోగిత అని కూడా అంటారు.

ఈ స్థితిలో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు పెద్ద సైన్యంలా ఏర్పడతారు. జాన్‌ రాబిన్‌సన్‌ దీన్ని మార్కసియన్‌ నిరుద్యోగితగా పేర్కొన్నారు.

సంఘృష్ట నిరుద్యోగిత (Frictional unemployment):

దేశంలోని శ్రామికులు ఒక వృత్తి నుంచి మరో పనికి మారే సమయంలో ఏర్పడిన నిరుద్యోగితను సంఘృష్ట నిరుద్యోగిత అంటారు.

అనుద్యోగిత (Non-employment):

అనుద్యోగిత స్థితిలో ప్రజలు నిరుద్యోగులు కావొచ్చు లేదా సంప్రదాయ అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉండొచ్చు.

బహిరంగ నిరుద్యోగిత (Open unemployment)

ఏ పని లేకుండా జీవించే శ్రామికులంతా బహిరంగ నిరుద్యోగిత కోవలోకి వస్తారు. 

నీ చదువుకుని నిరుద్యోగులుగా ఉండటం, నైపుణ్యలేమి కారణంగా శ్రామిక నిరుద్యోగిత పెరుగుతుంది. 

నీ భారతదేశంలో పని కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వెళ్తారు. దీన్ని కూడా బహిరంగ నిరుద్యోగితకు ఉదాహరణగా చెప్పొచ్చు.

విద్యావంతుల్లో నిరుద్యోగిత:

విద్యను కలిగి లేదా తర్ఫీదు పొంది, నైపుణ్యం ఉన్న వ్యక్తికి అర్హతకు తగ్గ ఉద్యోగం లభించకపోతే, ఆ వ్యక్తిని విద్య ఉన్న నిరుద్యోగి అంటారు. 

ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది.

రుతుసంబంధిత నిరుద్యోగిత:

కొన్ని రంగాల్లో సంవత్సరం పొడవునా ఉద్యోగం ఉండక, కొంత కాలం మాత్రమే ఉపాధి లభిస్తుంది. ఆయా రంగాల్లో ఉండేవారు మిగిలిన కాలంలో నిరుద్యోగులుగా ఉంటారు. ఈ రకమైన స్థితిని రుతుసంబంధిత నిరుద్యోగిత అంటారు. 

ఇది భారతదేశంలో వ్యవసాయరంగం, దాని అనుబంధ పరిశ్రమల్లో కనిపిస్తుంది.

అల్పఉద్యోగిత (Underemployment):

ఒక వ్యక్తి తన ఉత్పాదక శక్తి కంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉత్పాదక పనుల్లో పనిచేయడాన్ని అల్పఉద్యోగిత అంటారు.

చక్రీయ నిరుద్యోగిత (Cyclical Unemployment):

అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాపార కార్యకలాపాల్లో మందకొడితనం కారణంగా ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. దీన్నే చక్రీయ నిరుద్యోగిత అంటారు.

సాంకేతికపరమైన నిరుద్యోగిత (Technical Unemployment):

ఆర్థిక వ్యవస్థలో కొత్త సాంకేతికత ప్రవేశం వల్ల శ్రామికులు ఉద్యోగాలు కోల్పోతారు. ఈ స్థితిని సాంకేతికపరమైన నిరుద్యోగిత అంటారు.

Posted Date : 03-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌