• facebook
  • whatsapp
  • telegram

16వ ఇండియా స్టేట్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్ (ISFR) 2019

    బ్రిటిష్‌ ప్రభుత్వం అధిక ప్రయోజనం పొందేలా అడవులు నరకడాన్ని నియంత్రించాలనుకుంది. అందుకే మిగిలిన అడవులను కాపాడటం కోసం 1864లో మొదటిసారి అటవీశాఖను ఏర్పాటు చేసి దానికి అడవులపై నియంత్రణ అప్పగించింది. తర్వాత 1878లో అడవులపై చట్టాలు చేసింది. 1894లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఇండియాలో మొదటి అటవీ విధానాన్ని ప్రకటించి అడవులను సంరక్షించాలని పేర్కొంది. భారత ప్రభుత్వం మన దేశంలో 1952లో మొదటి జాతీయ అటవీ విధానాన్ని ప్రకటించి తీర్మానం చేసింది. ఈ తీర్మానం ప్రకారం దేశ భౌగోళిక వైశాల్యంలో 33.3% లేదా 1/3వ వంతు అడవులు ఉండాలని పేర్కొంది. ఈ అడవులు 60% కొండ, పర్వత ప్రాంతాల్లో, 20% మైదాన ప్రాంతాల్లో, 20% ఇతర ప్రదేశాల్లో పెంపొందించాలని తెలిపింది. 


    దేశంలో మొదటిసారిగా అడవులను లెక్కించడం 1987 నుంచి ప్రారంభించారు. అడవులను ప్రతి రెండు సంవత్సరాలకోసారి లెక్కిస్తారు. వీటిని ద్వైవార్షిక నివేదికలు అంటారు. ఇవి ‘కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు’ మంత్రిత్వ శాఖ నిర్వహణలో ఉంటాయి. అడవులను ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (డెహ్రాడూన్) సర్వే చేస్తుంది. దీనికి ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (NRSC) నేచురల్‌ రిసోర్స్‌ సైన్సెస్‌ (NRC) ద్వారా అందిస్తుంది. 2017 నాటికి 15 ISFR నివేదికలను విడుదల చేశారు. 2019కి గానూ ‘16వ జాతీయ అటవీ నివేదిక లేదా ఇండియా స్టేట్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ను కేంద్ర పర్యావరణ అటవీ, వాతావరణ మార్పు శాఖా మంత్రి (MOEFCC) ప్రకాశ్‌ జావడేకర్‌ 2019 డిసెంబరు 30న న్యూదిల్లీలో విడుదల చేశారు.


ముఖ్యాంశాలు

* భారతదేశం మొత్తం భౌగోళిక వైశాల్యం 32,87,469 చ.కి.మీ.

* మొత్తం అడవుల వైశాల్యం 7,12,249 చ.కి.మీ. కలిగి దేశ భౌగోళిక వైశాల్యంలో 21.67% ఉన్నాయి. అంచనా ప్రకారం మొత్తం చెట్లు ఉన్న ప్రదేశ వైశాల్యం 95,027 చ.కి.మీ. (మొత్తం వైశాల్యంలో 2.89%). 

* మొత్తం అడవులు, చెట్ల వైశాల్యం 8,07,276 చ.కి.మీ.  (దేశ మొత్తం వైశాల్యంలో 24.56%). 

* ప్రస్తుత లెక్కల ప్రకారం 3976 చ.కి.మీ. (0.56%) అడవులు, 1212 చ.కి.మీ. (1.29%) చెట్లు మొత్తంగా 5188 చ.కి.మీ. లతో 0.65% పెరిగాయి. 

* దేశం మొత్తం 140 (16 రాష్ట్రాలు) కొండ ప్రాంత జిల్లాల్లో 2,84,006 చ.కి.మీ.కలిగి దేశ వైశాల్యంలో 40.30% ఉండి 544  చ.కి.మీ. (0.19%) ఉన్నాయి.

* దేశం మొత్తంలో 218 గిరిజన (23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు) జిల్లాల్లో 4,22,351 చ.కి.మీ. కలిగి దేశ వైశాల్యంలో 37.54% ఉన్నాయి. 741 చ.కి.మీ. అడవులు తగ్గాయి. 

* మొత్తం అడవుల్లో ఈశాన్య ప్రాంతం 1,70,541 కి.మీ.2 కలిగి దేశ వైశాల్యంలో 65.05% ఉన్నాయి. అయితే 765 చ.కి.మీ. (0.45%) తగ్గాయి. ఇందులో అసోం, త్రిపుర రాష్ట్రాలు మినహా మిగిలిన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి.

* అంచనా ప్రకారం మొత్తం స్టాక్‌ కలప వృద్ధి 5915.76 మిలియన్‌ టన్నులు, మొత్తం వెదురు వైశాల్యం 1,60,037 చ.కి.మీ. అయితే 3229 చ.కి.మీ. పెరిగింది. మొత్తం అటవీ కార్బన్‌స్టాక్‌ 7124.6 మిలియన్‌ టన్నులు అయితే 42.6 మిలియన్‌ టన్నులు పెరిగింది. వార్షిక పెరుగుదల 21.3 మిలియన్‌ టన్నులు. ఇది 78.1 మిలియన్‌ టన్నులకార్బన్‌డై ఆక్సైడ్‌కు సమానం.

* అంచనా ప్రకారం సాయిల్‌ ఆర్గానిక్‌ కార్బన్‌ 4004 మిలియన్‌ టన్నులు. ఇది మొత్తం అటవీ కార్బన్‌ స్టాక్‌లో 56%.

* దేశంలో మొత్తం 62,466 చ.కి.మీ. చిత్తడి నేలలు (Wetlands) అంటే 3.83% వైశాల్యం కలిగి ఉన్నాయి. చిత్తడి నేలలు అత్యధికంగా గుజరాత్‌లో, తర్వాత పశ్చిమ్‌ బంగలో ఉన్నాయి.

* అత్యధిక వంటచెరకు లభించే అడవులు మహారాష్ట్రలో, అత్యధిక పశుగ్రాసం, కలప, వెదురు లభించే అడవులు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి.  


వైశాల్యపరంగా...

    వైశాల్యపరంగా అత్యధిక అడవులు మధ్యప్రదేశ్‌ (77482 చ.కి.మీ.), అరుణాచల్‌ ప్రదేశ్‌ (66,688 చ.కి.మీ.),  చత్తీస్‌గఢ్‌ (55,611 చ.కి.మీ.), ఒడిశా (51,619 కి.మీ.2), మహారాష్ట్ర (50,778 చ.కి.మీ.) రాష్ట్రాలు; జమ్ముకశ్మీర్‌ (21,112 చ.కి.మీ.) అండమాన్‌ నికోబార్‌ దీవులు (6743 చ.కి.మీ.), దాద్రానగర్‌ (207 చ.కి.మీ.), లడఖ్ (2490 చ.కి.మీ.) కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి.


    అత్యల్పంగా హరియాణా (1602 చ.కి.మీ.), పంజాబ్‌ (1849 చ.కి.మీ.),  గోవా (2,237 చ.కి.మీ.), సిక్కిం (3,342 చ.కి.మీ.) రాష్ట్రాలు; డామన్‌డయ్యూ (20.49 చ.కి.మీ.), చండీగఢ్‌ (22.03 చ.కి.మీ.) కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి.


శాతం పరంగా....

    అత్యధికంగా అడవులు మిజోరాం (85.41%), అరుణాచల్‌ ప్రదేశ్‌ (79.63%), మేఘాలయ (76.33%), మణిపూర్ (75.46%), నాగాలాండ్‌ (75.31%); లక్షద్వీప్‌ (90.33%), అండమాన్‌ (81.74%), దాద్రానగర్‌ - (42.16%) లో ఉన్నాయి. అత్యల్పంగా హరియాణా (3.62%), పంజాబ్‌ (3.67%), రాజస్థాన్‌ (4.86%), ఉత్తర్‌ప్రదేశ్‌ (6.15%), గుజరాత్‌ (7.52%), లడఖ్‌ (1.47%), పుదుచ్చేరి (10.70%), దిల్లీ (13.18%) లో ఉన్నాయి.


రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అడవుల విస్తీర్ణం

75% కంటే ఎక్కువ కలిగిన రాష్ట్రాలు: అరుణాచల్‌ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షదీవులు.

33 - 75% మధ్య ఉన్న రాష్ట్రాలు: అసోం, చత్తీస్‌గఢ్, గోవా, జమ్ముకశ్మీర్, కేరళ, ఒడిశా, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, దాద్రానగర్‌.

33% కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు 20, 33% కంటే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు 17. 

*  2017తో 2019 అసెస్‌మెంట్‌ను పరిశీలిస్తే 3976 కి.మీ.2 మేర అడవుల విస్తీర్ణం పెరిగింది. (2017 -  7,08,273; 2019 -  7,12,249)

* 2014 జూన్‌లో ప్రారంభించిన నమామి గంగే కార్యక్రమం ద్వారా సమీకృత సంరక్షణ మిషన్‌లో భాగంగా 5 రాష్ట్రాల్లోని 139 జిల్లాల్లో 86,831 చ.కి.మీ. అడవులను అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం అడవుల్లో ఇది 17.37%. ఇందులో ఉత్తరాఖండ్‌ (24,189.47 చ.కి.మీ.), ఉత్తర్‌ప్రదేశ్‌ (26,851.05 చ.కి.మీ.), బిహార్‌ (13,466.91 చ.కి.మీ.), ఝార్ఖండ్‌ 3,599.79 చ.కి.మీ. (పశ్చిమ్‌ బంగ 18,724.09 చ.కి.మీ.) ఉన్నాయి.

మాంగ్రూవ్‌ అడవులు: ఇవి మొత్తం 123 దేశాల్లో 15 మిలియన్‌ హెక్టార్లు ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద మాంగ్రూవ్‌ దక్షిణాసియాలోని మన దేశంలో - 3% ఉంది. ఇవి దేశంలో 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 4,975 చ.కి.మీ. ఉన్నాయి. ఇందులో VDM 1476, MBM 1479, OM - 2020

    పశ్చిమ్‌ బంగ (42.45%), గుజరాత్‌ (23.66%),  గోవా (0.52%), ఆంధ్రప్రదేశ్‌ (8.12%), కేరళ (0.18%), మహారాష్ట్ర (6.44%), కర్ణాటక (0.20%), ఒడిశా (5.04%), తమిళనాడు (0.90%), పుదుచ్చేరి (0.03%), డామన్‌డయ్యూ (0.06%), అండమాన్‌ నికోబార్‌ (12.39%) లలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అడవులను అత్యధికంగా పెంచిన రాష్ట్రం గుజరాత్‌ (37  చ.కి.మీ.) . దేశంలో అత్యధికంగా దక్షిణ 24 పరగణాల జిల్లా 41.85% అడవులను పెంచింది.


అడవుల రకాలు - జీవ వైవిధ్యం


హిమాచల్‌ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లలో 35 రకాల కంటే ఎక్కువగా అటవీ రకాలు ఉన్నాయి.  

* దేశంలో ఆయనరేఖ శుష్క ఆకురాల్చే అడవులు 40.86%, తేమ ఆకురాల్చే అడవులు 17.65%, సమశీతోష్ణ శుష్క సతత హరిత అరణ్యాలు 0.02% ఉన్నాయి.

* దేశంలో మొత్తం 9205 మొక్క జాతులు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో 737, తమిళనాడులో 652, ఆంధ్రప్రదేశ్‌లో 364 ఉన్నాయి. చెట్ల జాతులు అత్యధికంగా కర్ణాటకలో 325, తమిళనాడులో 252 ఉన్నాయి.

* పొదల జాతులు (షెర్బ్స్)‌ అత్యధికంగా అండమాన్‌నికోబార్‌లో 535, తమిళనాడులో 313 ఉన్నాయి.

* మూలికల జాతులు (హెర్బ్స్) ‌అత్యధికంగా జమ్ముకశ్మీర్‌లో 272, అరుణాచల్‌ ప్రదేశ్‌లో 192 ఉన్నాయి.


*  దేశంలో అత్యంత తీవ్రమైన కార్చిచ్చు (Extremely Fire Prone) ప్రాంతం 21.40% ఉంది. 

*  దట్టమైన అడవులు అంటే భూభాగంలో 70%, అంతకంటే ఎక్కువ చెట్ల సాంద్రత కలిగి ఉండటం.

*  మాధ్యమిక అడవులు అంటే భూభాగంలో 40 - 70% చెట్ల సాంద్రత కలిగి ఉండటం.

*  బహిర్గత అడవి అంటే భూభాగంలో 10 - 40% చెట్ల సాంద్రత కలిగి ఉండటం.

*  చిట్టడవి అంటే మొత్తం అటవీ భూమిలో 10% కంటే తక్కువ చెట్ల సాంద్రత కలిగి ఉండటం.

*  అటవేతర భూమి అంటే పై వర్గాల్లో కేటాయించని భూమి (నీటితో కలిపి).

*  మొత్తం భౌగోళిక వైశాల్యం  32,87,469 చ.కి.మీ. (100%)

a) రిజర్వ్‌డ్‌ ఫారెస్ట్‌ (RF) 4,34,853 చ.కి.మీ. (56.5%) 

b) రక్షిత ఫారెస్ట్‌ (PF) 2,18,924 చ.కి.మీ. (28.5%)

c) వర్గీకరించని ఫారెస్ట్‌ (VF) 1,13,642 చ.కి.మీ. (15%) 

* ఫారెస్ట్‌ (RFA) రికార్డెడ్‌ మొత్తం భౌగోళిక వైశాల్యం 7,67,419 చ.కి.మీ. కలిగి 23.34% ఉంది.

రిజర్వుడ్‌ అడవులు: ప్రభుత్వం నిషేధించిన అడవులు. ప్రజలు ఈ రకమైన అడవుల్లోకి ప్రవేశించడానికి అవకాశం ఉండదు. వీటిల్లో  వన్యప్రాణి కేంద్రాలను, జాతీయ పార్కులను అభివృద్ధి చేస్తారు.

రక్షిత అడవులు: ఈ అడవులను ప్రజలు వినియోగించుకోవచ్చు. ఈ అడవుల్లో లభించే కలపను గృహ అవసరాలకు వాడుకోవచ్చు. పశువులను మేపుకోవచ్చు. సొంత అవసరాలకు అటవీ ఉత్పత్తులను సేకరించవచ్చు. ఇక్కడ కూడా పెద్ద చెట్లు నరకడంపై అనేక షరతులు ఉంటాయి.

వర్గీకరించని అడవులు: ఇవి ప్రభుత్వ అధీనంలో, కొన్ని నియమ నిబంధనలకు లోబడి వ్యక్తుల నిర్వహణలో ఉంటాయి. వీటిని అవసరానికి అనుగుణంగా ప్రభుత్వం వినియోగిస్తుంది. ఇవి దేశంలో అత్యధికంగా అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉన్నాయి.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌