• facebook
  • whatsapp
  • telegram

క్రీ.పూ.6వ శతాబ్దం పరిస్థితులు

భారతదేశ చరిత్రలో క్రీ.పూ.6వ శతాబ్దం మౌలికమైన మార్పులకు కారణమైంది. ఈ కాలంలో షోడశ మహాజనపథాలు ఆవిర్భవించి రెండో పట్టణీకరణకు దోహదం చేయగా అనేక నూతన మత ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. భారతదేశంపై పారశీక, గ్రీకు దండయాత్రలు జరిగాయి. వర్ధమాన మహావీరుడు జైనమతాన్ని, గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని అభివృద్ధి చేశారు. మలివేద కాలం చివరినాటికి (క్రీ.పూ.6వ శతాబ్దం) ఉత్తర భారతదేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో కొత్తమార్పులు సంభవించాయి. 16 మహాజనపథాలు ఆవిర్భవించి మగధ తొలి సామ్రాజ్యంగా ఏర్పడింది.

షోడశ మహాజనపథాలు

క్రీ.పూ.6వ శతాబ్దం నాటికి భారతదేశంలో 16 మహాజనపథాలు ఏర్పడ్డాయి. వీటినే షోడశ మహాజనపథాలు అంటారు. సంస్కృతంలో ‘జన’ అంటే ప్రజలు, ‘పథం’ అంటే నివాసప్రాంతం అని అర్థం. 16 జనపథాల్లో 15 జనపథాలు ఉత్తర భారతదేశంలో ఏర్పడగా ఒకే ఒక జనపథం ‘అస్మక’ దక్షిణ భారతదేశంలో ఏర్పడింది.

వీటిలో 14 జనపథాలు రాచరిక వ్యవస్థను కలిగి ఉంటే వజ్జి, మల్ల అనే రెండు జనపథాల్లో గణరాజ్య వ్యవస్థ లేదా గణపాలన ఉండేది.

భారతదేశ సమాజంలో క్రీ.పూ.6వ శతాబ్దం నాటికి రాజకీయ, ఆర్థిక, మత వ్యవస్థల్లో మౌలికమైన మార్పులు సంభవించాయి. అందుకే ఈ శతాబ్దిని ప్రత్యేకమైందిగా చరిత్రకారులు పేర్కొంటారు. నూతనంగా ఏర్పడిన జైన, బౌద్ధ మతాలు తమ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అనేక కొత్త సిద్ధాంతాలు-విలువలు, వ్యవస్థలు

ఆవిర్భవించాయి. కానీ రాజకీయ అనైక్యత, ఆధ్యాత్మిక రంగంలో అశాంతి, సమాజంలో ఆర్థిక అసమానతలు అలాగే ఉండేవి. మలివేద కాలం నాటికి సమాజంలో బ్రాహ్మణ ఆధిక్యం పెరిగింది. దీంతో ప్రజలు నూతన మతాల వైపు ఆకర్షితులయ్యారు. రాజకీయంగా కొన్ని గణ రాజ్యాల మధ్య యుద్ధాలు జరగడం వల్ల అనేక

జనపదాలు అంతరించిపోయాయి. ‘తెగలు’ ఉన్న చిన్న రాజ్యాలు, వీరు తెగలు, తెగలుగా జీవిస్తూ గణాలుగా ఏర్పడ్డారు. వీటికి తెగ పెద్దలు అధిపతులుగా ఉండేవారు. 

ఉదా: సభ, సమితి లాంటి సభలు రాజ్యనిర్వహణ చేసేవి.

రాజరిక రాజ్యాలన్నీ గంగా-మైదాన ప్రాంతంలోనే వెలిశాయి. ఇక్కడ నీరు సమృద్ధిగా లభించడం, వ్యవసాయానికి¨ భూములు అనుకూలంగా ఉండటం, పంటలు బాగా పండటం, వాణిజ్య అభివృద్ధి మొదలైనవన్నీ దీనికి ప్రధాన కారణాలు.

ఆర్యావర్తం (గంగా-యమునా మైదానప్రాంతం) క్రీ.పూ.ఆరో శతాబ్దం నాటికి తూర్పు గంగా మైదానం - బెంగాల్‌ వరకు విస్తరించింది. అధిక జనాభా, వ్యాపారం, పెరుగుతున్న సామాజిక అవసరాలు, విరివిరిగా ఇనుము లభించడం - దానిపై నియంత్రణ, పన్నులు వసూలు చేయడం మొదలైనవన్నీ  షోడశ మహాజనపదా ఆవిర్భావానికి కారణాలుగా చెప్పొచ్చు.

ఈ 16 మహాజనపదాల్లో రాజ్యాల మధ్య తరచూ యుద్ధాలు జరిగేవి. ఈ రాజ్యాలను క్షత్రియ వంశానికి చెందిన రాజులే ఎక్కువగా పాలించారు. ఇవి వింధ్య పర్వతాలకు ఉత్తరంగా, ఈశన్య సరిహద్దు నుంచి బిహార్‌ వరకు. తూర్పుగంగా మైదానం నుంచి బెంగాల్‌ వరకు విస్తరించాయి.

లక్షణాలు

షోడశ మహాజనపదాలన్నింటిలో సాధారణంగా కింది లక్షణాలు కనిపిస్తాయి.

ప్రతి మహాజనపదానికి ఒక రాజధాని నగరం ఉంటుంది. దీని చుట్టూ ఎత్తయిన కోట గోడలు నిర్మితమై ఉంటాయి.

కోటలకు, రాజ్యరక్షణకు సైన్యాన్ని నియమించేవారు.

సైన్యానికి, రాజకోటలో పనిచేసే ఉద్యోగులకు వేతనాల్ని ధన, ధాన్య, భూరూపేణా చెల్లించేవారు. రాజుకు ప్రజలు పన్నులు కట్టేవారు.

పట్టణాల నిర్వహణకు ఆర్థికవనరులు తప్పనిసరిగా ఉండేవి.

ప్రతి రాజ్యానికి సరిహద్దులు ఉండేవి. రాజ్యంలో రాజరిక వ్యవస్థ ఉండేది.

16 మహాజనపదాలు

ఒక స్థిర ప్రదేశంలో ప్రజలు నివాసాన్ని ఏర్పర్చుకుని జీవించడాన్ని జనపదాలు అంటారు. ఈ పదాన్ని సంస్కృతం, ప్రాకృతంలోనూ ఉపయోగించారు. ఈ జనపదాలే మహాజనపదాలుగా ఆవిర్భవించాయి. అవి: కాశీ, కోసల, అంగ, మగధ, వజ్జి, మల్ల, ఛేధి, వత్స, కురు, పాంచాల, మత్స్య, శూరసేన, అశ్మక (అస్మక), అవంతి,గాంధార, కాంభోజ.

‘జన’ అనే పదం రుగ్వేదంలో ఉంటుంది. దీని అర్థం ప్రజలు. రుగ్వేద కాలంలో ప్రజలు నివసిస్తున్న గ్రామాలే జనపదాలు. ఇవి రెండో పట్టణీకరణకు దారితీసాయి.

కోసల

సరయూ నది దీన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజిస్తుంది. రెండు భాగాలకు వేర్వేరు రాజధానులు ఉన్నాయి. ఉత్తర కోసల రాజధాని శ్రావస్తి. ఇది ఔద్‌ (అవధ్‌) ప్రాంతంలో ఉండేది. ప్రస్తుతం ఇది ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఉంది. దక్షిణ కోసల రాజధాని కుషావటి.

 కోసలకు పశ్చిమాన గోమతీ నది, దక్షిణాన సర్పిక నది, తూర్పున సదానిర (గండక్‌) నది, ఉత్తరాన నేపాలీ కొండలు ఉన్నాయి. 

అయోధ్య, శ్రావస్తి, సాకేతలు ముఖ్యమైన నగరాలు. 

హిరణ్యభ, మహాకోసల, ప్రసేనజిత్, శుద్ధోధన మొదలైన రాజులు కోసల రాజ్యన్ని పాలించారు. 

ప్రసేనజిత్‌ కాశీని స్వతంత్ర రాజ్యంగా చేశాడు. ఇతడు తన సోదరి కోసల మహాదేవిని మగధ రాజు బింబిసారుడికి ఇచ్చి వివాహం చేసి, కాశీని వరకట్నంగా ఇచ్చాడు. మహాదేవి మరణించాక, ప్రసేనజిత్‌ కాశీని తిరిగి ఇవ్వాల్సిందిగా బింబిసారుడ్ని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య శత్రుత్వం ఏర్పడింది.

బింబిసారుడి కుమారుడైన అజాతశత్రువుతో ప్రసేనజిత్‌ అనేక పోరాటాలు చేశాడు. చివరకు తన కుమార్తె అయిన ‘వజీరా’ను అజాతశత్రువుకు ఇచ్చి వివాహం చేశాడు. 

సారవంతమైన గంగా-యమునా మైదానం కోసం కోసల, మగధ రాజ్యాల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. చివరకు కోసల రాజ్యం మగధలో విలీనమైంది.

మగధ

దీని మొదటి రాజధాని గిరివ్రజపురం. తర్వాత ఇది రాజగృహానికి మారింది. చివరగా పాటలీపుత్రం దీని రాజధానిగా స్థిరపడింది.

ప్రస్తుత దక్షిణ బిహార్‌ ప్రాంతం ఒకప్పటి మగధ. పట్నా, గయ జిల్లాలు అప్పటి పాటలీపుత్రం. ఇది చాలా బలమైన మహాజనపదం. 

అంగ, వత్స రాజ్యాల మధ్య గిరివ్రజపురం ఉండగా, గంగా-సోన్‌ నదుల మధ్య రాజగృహం ఉండేది. చంప, వింధ్య పర్వతాల మధ్య పాటలీపుత్రం ఉంది. 

చివరకు అన్ని జనపదాలు మగధలో కలిసి, ఒక మహాసామ్రాజ్యంగా అవతరించింది. హర్యాంక వంశపాలకులైన బింబిసారుడు, అజాతశత్రువు మగధ రాజులే.

వజ్జి

దీని రాజధాని ‘వైశాలి’. ప్రస్తుత ఉత్తర బిహార్‌ ప్రాంతమే ఒకప్పటి వజ్జీ.

ఇది 9 తెగలు కలిసి ఏర్పడిన గణరాజ్య సమ్మేళనం. వీటిలో విదేహ, లిచ్చవి, జ్ఞాతిక, వజ్జి తెగలు ముఖ్యమైనవి.

వీరికి మగధ రాజ్యంతో శత్రుత్వం ఉండేది. వజ్జి రాజు చేటకుడు లిచ్చవి తెగకు చెందినవాడు. ఇతడు తన కుమార్తె అయిన ‘చల్లన’ను మగధ రాజు బింబిసారుడికి ఇచ్చి వివాహం చేశాడు. బింబిసారుడు మరణించాక అతడి కొడుకు అజాతశత్రువు లిచ్చవులతో యుద్ధాలు చేశాడు.

9 మల్లరాజ్యాలు, 18 చిన్న గణరాజ్యాలతో లిచ్చవులు మగధకు వ్యతిరేకంగా ఒక సమాఖ్యను ఏర్పాటు చేశారు. కాశీ, కోసల కూడా ఈ సమాఖ్యలో ఉండేవి.

16 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అజాతశత్రువు వజ్జిరాజ్యాన్ని ఆక్రమించాడు.

కురు

ఇది ప్రస్తుత దిల్లీ-మీరట్‌ ప్రాంతం. దీని రాజధాని ఇంద్రప్రస్థం. కురును పూర్వం స్థానేశ్వర్‌ అని పిలిచేవారు. హస్తినాపురం (యూపీలోని మీరట్‌ ప్రాంతం) కూడా దీనికి రాజధానిగా ఉండేది.

ఉత్తరాధ్యయన సూత్ర అనే జైనగ్రంథంలో ఈ రాజ్యాన్ని ‘ఇసుకార’ అనే రాజు పాలించినట్లు పేర్కొన్నారు.

బుద్ధుడి కాలంలో ‘కొరవ్య’ అనే రాజు దీనికి పాలకుడిగా ఉన్నాడు.

పాంచాల 

దీని రాజధాని ‘అహిచ్ఛత్రం’. దీన్ని గంగా నది ఉత్తర-దక్షిణాలుగా విభజిస్తుంది. దక్షిణ ప్రాంతానికి కాంపిల్య రాజధానిగా ఉండేది. 

ఈ రాజ్యం మొదట రాజరికంలో ఉండి, తర్వాత గణరాజ్యంగా మారింది. 

ప్రస్తుత ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బదాన్, ఫరూకాబాద్‌ ప్రాంతాలే అప్పటి పాంచాల. 

రామాయణం, మహాఉమ్మగజాతక, ఉత్తరాధ్యయన సూత్ర, స్వప్న వాసవదత్త మొదలైన గ్రంథాల ప్రకారం ఈ రాజ్యాన్ని చూళని బ్రహ్మదత్తుడు, దుర్ముఖ తదితరులు పరిపాలించారు.

మల్ల

ఇది ప్రస్తుత ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌. దీని రాజధాని కుశినగరం. ఈ రాజ్యంలో 9 తెగలు ఉండేవి.

ఈ రాజ్యంలో మొదట రాజరిక వ్యవస్థ ఉండగా, తర్వాత గణరాజ్యంగా మారింది. 

అనేకమంది మల్లులు బౌద్ధమతాన్ని స్వీకరించారు. బుద్ధుడు కుశినగరంలోనే మరణించాడు.

వత్స

ఇది ప్రస్తుత ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అలహాబాద్‌ ప్రాంతం. దీని రాజధాని ‘కౌశాంబి’. ఇది యమునా నది తీరాన ఉంది.

దీన్ని ఉదయనుడు పాలించాడు. ఇతడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు.

అవంతి రాజు ప్రద్యోత (ప్రద్యోధనుడు) తన కుమార్తె వాసవదత్తను ఉదయనుడికిచ్చి వివాహం చేశాడు. దీన్ని బాసుడు ‘స్వప్న వాసవదత్త’ అనే నాటకంలో పేర్కొన్నాడు.

ఉదయనుడు కౌశాంబిలో పెద్ద బౌద్ధ విహారాన్ని నిర్మించాడు.

ఆ కాలంలో కౌశాంబి ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉండేది.

కాశీ

దీని రాజధాని వారణాసి. ఇది వరుణ-అశి నదుల మధ్య ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఇది ప్రాచీన విద్యాకేంద్రంగా, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లింది. 

అంగ, మగధ, కోసల రాజ్యాలతో కాశీకి విరోధం ఉండేది. కోసల రాజ్యం కాశీని ఆక్రమించింది. అజాతశత్రువు దీన్ని మగధ రాజ్యంలో కలిపాడు. ఇప్పుడు ఇది ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందింది.

ప్రస్తుతం దీన్ని ‘బెనారస్‌’ ప్రాంతంగా పిలుస్తున్నారు. ఇది ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఉంది.

అంగ

దీని రాజధాని చంప. ప్రస్తుతం ఉన్న తూర్పు బిహార్‌ ప్రాంతమే అప్పటి అంగ. ఇది గంగా-చంపా నదుల కూడలిలో ఉంది. ఇది గొప్ప వరక్త కేంద్రంగా ఉండేది. 

బిహార్‌లోని మాంగీర్, భగల్‌పూర్‌ ప్రాంతాలే ఒకప్పటి చంపానగరం. ప్రాచీన కాలంలో దీన్ని మాలిని నగరంగా పిలిచేవారు. బుద్ధుడి కాలంనాటి 6 ప్రముఖ నగరాల్లో ఇది ముఖ్య పట్టణంగా ఉండేది. వ్యాపారస్థులు దీన్ని సువర్ణ భూమిగా పిలిచేవారు.

బింబిసారుడి కాలంలో అంగ రాజ్యం మగధలో కలిసిపోయింది. మహాభారతంలో దుర్యోధనుడు కర్ణుడికి దానంగా ఇచ్చింది అంగరాజ్యాన్నే.

ఛేది

ఇది నేటి మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతం. దీని రాజధాని శుక్తిమతి.

ఈ రాజ్యంలో సహాజతి, త్రిపురి అనే ప్రముఖ నగరాలు ఉండేవి.

మహాభారత కాలంలో ఛేది రాజ్యాన్ని శిశుపాలుడు పాలించేవాడు.

మత్య్స 

ప్రస్తుత రాజస్థాన్‌లోని జైపూర్‌ ప్రాంతంలో ఉన్న బైరట్‌ నగరమే అప్పటి మత్స్య. దీని రాజధాని విరాటనగరం. ఆల్వార్, భరత్‌పూర్‌ ప్రాంతాల వరకు ఈ రాజ్యం విస్తరించింది. దీని రాజధానిని విరాట రాజు నిర్మించాడు.

రుగ్వేదంలో మత్స్య నగరం గురించిన ప్రస్తావన ఉంది. పాండవుల అజ్ఞాతవాసం ఈ నగరంలోనే ముగిసింది. 

మత్స్యను బ్రహ్మర్షిదేశం అని కూడా అంటారు. 

బైరాట్‌ నగరంలో అశోకుడి శాసనాలు లభించాయి. 

మత్స్య రాజ్యం మొదట ఛేధి రాజ్యంలో ఉండేది. చివరకు మగధ సామ్రాజ్యంలో కలిసిపోయింది

గణాలు క్రీ.పూ.ఆరో శతాబ్దానికి జనపదాలుగా ఏర్పడాయి. ప్రజలు నివసించే ప్రాంతాలను జనపదాలు అంటారు. ఇవి అభివృద్ధి చెందుతూ మహాజనపదాలుగా అవతరించాయి. వీటినే ‘షోడశ ్బ16్శ మహాజనపదాలు’ అంటారు.

జైనగ్రంథం ‘భగవతి సూత్రం’, బౌద్ధగ్రంథం ‘అంగుత్తరనికాయ’లో 16 మహాజనపదాల గురించి ప్రస్తావన ఉంది. వీటిలో కొన్ని రాజరిక రాజ్యాలు కాగా, మరికొన్ని గణరాజ్యాలు.

గణరాజ్యాలు సంప్రదాయాల్ని పాటిస్తూ అభివృద్ధి చెందగా, రాజరిక రాజ్యాల్లో రాజు సర్వాధికారిగా ఉంటూ అభివృద్ధి జరిగింది. 

తెగ సంస్కృతి తగ్గిపోవడం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావడం వల్ల బలమైన పాలకుడి అవసరం ఏర్పడింది. ఇది రాజరిక వ్యవస్థకు దారితీసింది.

తొలి సామ్రాజ్యం

భారతదేశంలో మగధ తొలి సామ్రాజ్యంగా ఆవిర్భవించింది. షోడశ మహాజనపథాల్లో ఒకటైన మగధ మిగిలిన జనపథాలను జయించి విశాల సామ్రాజ్యంగా విస్తరించింది. దీని రాజధానులు రాజగృహం (గిరివ్రజం), వైశాలి, పాటలీపుత్ర. మగధను హర్యంక, నందవంశం లాంటి పటిష్ఠమైన రాజవంశాలు; బింబిసారుడు, అజాతశత్రువు, మహాపద్మనందుడు, ధననందుడు వంటి బలమైన రాజులు పరిపాలించారు. విస్తారమైన ఇనుపగనులు మగధ దక్షిణ భాగంలో ఉండటం, సారవంతమైన గంగ, సోన్, గండక్‌ నదులు ప్రవహించడం; అటవీసంపద, ఏనుగులను వినియోగించుకోవడం; నిత్యం విదేశీ దండయాత్రలు జరిగే ఈశాన్య భారతదేశానికి దూరంగా ఉండటం వల్ల ఇది బలమైన సామ్రాజ్యంగా ఏర్పడింది.

పురాణకాలంలో మగధను రిపుంజయుడు అనే రాజు పరిపాలించేవాడు. హర్యంక వంశానికి చెందిన బింబిసారుడు అతడిని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు. బింబిసారుడి కుమారుడైన అజాతశత్రువు వైవాహిక సంబంధాలు, యుద్ధ విజయాల ద్వారా మిగిలిన మహాజనపథాలను మగధలో విలీనం చేశాడు. బింబిసారుడి ఆస్థాన వైద్యుడు జీవకుడు. గంగా - సోన్‌ నదుల మధ్య పాటలీపుత్ర దుర్గాన్ని అజాతశత్రువు నిర్మించాడు. మొదటి బౌద్ధ సంగీతిని పాటలీపుత్రంలో మహాకస్యపుడి అధ్యక్షతన నిర్వహించాడు. తన మంత్రి వసకార సహాయంతో లిచ్ఛవుల రాజ్యాన్ని ఆక్రమించాడు.
అజాతశత్రువు తర్వాత ఉదయనుడు రాజ్యానికి వచ్చాడు. హర్యంక వంశస్థులు పితృహంతకులుగా పేరొందారు. ఈ వంశం అనంతరం మగధను శైశునాగ వంశస్థులు పరిపాలించారు. శిశునాగుడు, అతడి కుమారుడు కాలాశోకుడు మగధను పాలించారు. కాలాశోకుడి కాలంలోనే రెండో బౌద్ధ సంగీతిని సబకామి అధ్యక్షతన వైశాలి నగరంలో నిర్వహించారు. 

మహాపద్మనందుడు మగధలో శైశునాగ వంశాన్ని నిర్మూలించి నందవంశపాలనను ప్రారంభించాడు. ఇతడి బిరుదులు ఉగ్రసేన, ఏకరాట్‌. చివరి నందవంశ పాలకుడైన ధననందుడిని ఓడించి మగధను ఆక్రమించి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య రాజ్యాన్ని స్థాపించాడు.

సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితులు 

షోడశ మహాజనపథాల కాలాన్ని భారతదేశ చరిత్రలో రెండో పట్టణీకరణగా పేర్కొంటారు. (భారతదేశంలో తొలి నగరీకరణ సింధు నాగరికత కాలం). ఈ కాలంలో అయోధ్య, కౌశాంబి, తక్షశిల, కాశీ పట్టణాలు అభివృద్ధి చెందాయి. వైశాలి, బరుకచ్చం, తక్షశిల, ఉజ్జయిని లాంటి రేవు పట్టణాలు విదేశీ వ్యాపారంలో కీలకపాత్రను పోషించాయి. దీంతో అనేక నూతన వ్యాపార రహదారులు ఏర్పడ్డాయి. భారతదేశంలో తొలిసారిగా నాణేల చలామణీ అమల్లోకి వచ్చింది. నాటి నాణేలను విద్దాంక నాణేలు అనేవారు. వేదకాలంలో నాణేలు వాడినట్లు సాహిత్యంలో పేర్కొన్నప్పటికీ తగిన ఆధారాలు లభించలేదు. సమాజంలో రాజు, సైనికులు, వ్యవసాయదారులు, వృత్తిపనివారు, బానిసలు లాంటి అనేక వర్గాలు ఉండేవి. కుటుంబ పెద్దను/వ్యవసాయ అధిపతిని ‘గాహపతి’ (గృహపతి), వ్యవసాయ కూలీలను ‘భర్తుకా’ అనేవారు. వృత్తిపనివారు ఏడాదిలో ఒకరోజు రాజు పొలంలో ఉచితంగా పనిచేయడం ద్వారా పన్ను చెల్లించేవారు.
బానిసలు, స్త్రీలు, పిల్లలకు రాజకీయ సభలు, సమావేశాల్లో ప్రవేశం ఉండేది కాదు. ప్రజలు ప్రకృతి శక్తులు, స్త్రీ దేవతలను, వేదకాలం నాటి దేవతలను ఆరాధించేవారు. నేటి హిందూ సమాజంలో అనుసరిస్తున్న కర్మ, పునర్జన్మ సిద్ధాంతాలు, సాంఘిక దురాచారాలు ఆ కాలంలోనే ఉన్నాయి. సమాజంలో ధనవంతులకు గ్రామ పెద్దగా ఉండే అవకాశాన్ని కల్పించేవారు.వ్యవసాయ ఉత్పత్తులు అధికమవడం, చేతివృత్తులు అభివృద్ధి చెందడం; విదేశీ, దేశీయ వాణిజ్యాలు పెరగడం వల్ల నాటి సమాజం ఆర్థికంగా మంచిస్థితిలో ఉండేది.

విదేశీ దండయాత్రలు (పారశీక, గ్రీకు) 

భారతదేశంపై దండెత్తిన తొలి విదేశీయులుగా ఆర్యులను పేర్కొంటారు. వీరు మధ్య ఆసియా నుంచి వచ్చి సింధు నాగరికత పతనానికి కారణమయ్యారని అధ్యయనం చేశాం కానీ భారతదేశంపైకి దండెత్తిన తొలి విదేశీ పాలకుడు/రాజుగా సైరస్‌ ది గ్రేట్‌ను పేర్కొంటారు (ఆర్యులు సమూహంగా వచ్చారు, వారి నాయకుడు ఎవరో తెలియదు). పారశీక (పర్షియన్‌/ఇరాన్) చక్రవర్తి అయిన సైరస్‌ ది గ్రేట్‌ క్రీ.పూ.553లో, అతడి వారసుడైన మొదటి డేరియస్‌ క్రీ.పూ.516లో భారతదేశంపై దండెత్తారు. వీటినే పారశీక దండయాత్రలుగా పేర్కొంటారు. ఈ దండయాత్రల వల్ల భారతదేశం, ఇరాన్‌ మధ్య వ్యాపార సంబంధాలు ఏర్పడ్డాయి. పారశీకుల నమూనా నాణేలను భారతీయులు వాడుకలోకి తెచ్చారు.

అలెగ్జాండర్‌ దండయాత్ర 

భారతదేశ చరిత్రలో కాల నిర్ణయానికి తోడ్పడింది అలెగ్జాండర్‌ దండయాత్ర. అరెల్‌స్టైన్‌ అనే చరిత్రకారుడి ప్రకారం క్రీ.పూ.327 - 324 మధ్య అలెగ్జాండర్‌ భారతదేశంపైకి దండెత్తాడు. ఈయన గ్రీకు దేశంలోని మాసిడోనియా రాజ్యానికి చెందిన ఫిలిప్‌ కుమారుడు. తండ్రి మరణానంతరం చిన్న వయసులోనే చక్రవర్తి అయిన అలెగ్జాండర్‌ ప్రపంచ విజేత కావాలనే ఆశయంతో విదేశీ దండయాత్రలు చేశాడు. మొదట పారశీకులపైకి దండెత్తి, అర్భేలా యుద్ధంలో పారశీక చక్రవర్తి అయిన మూడో డేరియస్‌ను ఓడించాడు. తర్వాత భారతదేశానికి వచ్చాడు. జీలం, చీనాబ్‌ నదుల మధ్య గల విశాల సామ్రాజ్యానికి రాజైన పురుషోత్తముడిని (పోరస్) ఓడించలేక తక్షశిల రాజైన అంబి భారతదేశ దండయాత్రకు అలెగ్జాండర్‌ను ఆహ్వానించి తొలి దేశ ద్రోహిగా పేరొందాడు. అయితే అలెగ్జాండర్‌ మొదట అంబినే ఓడించి అతడి సహాయంతో భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలపై దండెత్తాడు.

అలెగ్జాండర్‌ దండయాత్రలో అతి ప్రధానమైంది జీలం నది యుద్ధం లేదా హైడాస్ఫస్‌ యుద్ధం. గ్రీకులు తమ గ్రంథాల్లో జీలం నదిని హైడాస్ఫస్‌ నదిగా, పురుషోత్తముడిని పోరస్‌గా పేర్కొన్నారు. క్రీ.పూ.326లో పురుషోత్తముడు, అలెగ్జాండర్‌ మధ్య హైడాస్ఫస్‌ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పోరస్‌ ఓడిపోయినప్పటికీ అలెగ్జాండర్‌ అతడి ధైర్య సాహసాలకు మెచ్చి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశాడు. అనంతరం నాటి మగధ రాజ్యంపై దండెత్తడానికి సమాయత్తమయ్యాడు. కానీ తన సైనికుల అనాసక్తి వల్ల ధననందుడిపై దండెత్తకుండానే వెనుదిరిగాడని చరిత్రకారులు పేర్కొంటారు. భారతదేశంలో తాను జయించిన ప్రాంతాలకు సెల్యూకస్‌ నికేటర్‌ను ప్రతినిధిగా నియమించిన అలెగ్జాండర్‌ తిరుగు ప్రయాణంలో క్రీ.పూ.323లో బాబిలోనియాలో మరణించాడు.

క్రీ.పూ.6వ శతాబ్దం నాటి పరిస్థితులు

క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి మలివేద కాలం పూర్తయి మహా జనపద రాజ్యాలు వెలిశాయి. మతపరంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన జైన, బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి. ఇదే కాలంలో భారతదేశంపైకి పారశీకులు, గ్రీకులు దండెత్తివచ్చారు.

* భారతదేశంలో సింధు నాగరికత కాలాన్ని తొలి పట్టణీకరణగా పేర్కొంటే క్రీ.పూ.6వ శతాబ్దాన్ని లేదా షోడశ మహాజనపదాల కాలాన్ని రెండో పట్టణీకరణ అంటారు.

* ఈ కాలంలో 16 మహాజనపదాలు ఆవిర్భవించాయి. వాటినే షోడశ మహాజనపదాలు అంటారు.

* ఉత్తర భారతదేశంలోని హిమాలయ పర్వత సానువుల వెంట 15 మహాజనపదాలు,  దక్షిణ భారతదేశంలో ఏకైక జనపదంగా అస్మక ఏర్పడ్డాయి. 

* భారతదేశంలో ఏర్పడిన తొలి సామ్రాజ్యంగా ‘మగధ’ను పేర్కొంటారు.

* మగధ రాజధానులుగా రాజగృహం, వైశాలి, పాటలీపుత్రం ఉండేవి.

* మగధ తొలి రాజధాని రాజగృహం. దాన్నే గిరివ్రజం అని పిలిచేవారు.

* పురాణకాలంలో మగధను రిపుంజయుడు (బార్హద్రద వంశం) పాలించేవాడు.

* రిపుంజయుడిని ఓడించి బింబిసారుడు హర్యంక వంశాన్ని స్థాపించాడు.

* బింబిసారుడి బిరుదు ‘సేనీయ’.

* బింబిసారుడు తన ఆస్థానంలో ‘జీవకుడు’ అనే వైద్యుడిని పోషించాడు.

* బింబిసారుడిని వధించి అతడి కుమారుడు అజాతశత్రువు రాజ్యానికి వచ్చాడు.

* గంగా - శోణ్‌ నదుల మధ్య అజాతశత్రువు పాటలీపుత్రాన్ని నిర్మించాడు.

* మొదటి బౌద్ధ సంగీతిని అజాతశత్రువు రాజగృహంలో నిర్వహించాడు.

* అజాతశత్రువు కోసల రాజ్యాన్ని ఆక్రమించి తన రాజ్యంలో విలీనం చేయడంతో మగధ బలమైన రాజ్యంగా రూపొందింది.

* అజాతశత్రువు లిచ్ఛవులను ఓడించేందుకు తన మంత్రి వసకారను వినియోగించాడు.

* హర్యంక వంశస్థులను ‘పితృహంతకులు’  అంటారు.

* బుద్ధుడికి సమకాలీనుడైన మగధ రాజు బింబిసారుడు.

* మగధ రాజైన అజాతశత్రువు బుద్ధుడి శిష్యుడు.

* హర్యంక వంశం అనంతరం మగధను శైశునాగ వంశం పరిపాలించింది.

*  శైశునాగ వంశ పాలనను శిశునాగుడు ప్రారంభించాడు.

* శైశునాగ వంశానికి చెందిన కాలాశోకుడి కాలంలో వైశాలిలో రెండో బౌద్ధ సంగీతి జరిగింది. (కాలాశోకుడిని కకవరిన్‌ అని కూడా పేర్కొన్నారు.)

* కాలాశోకుడు మగధ రాజధానిని రాజగృహం నుంచి పాటలీపుత్రానికి మార్చాడు.

* మహాపద్మనందుడు శైశునాగ వంశాన్ని నిర్మూలించి, నంద వంశపాలనకు నాంది పలికాడు.

* మహాపద్మనందుడు ఏకరాట్, ఉగ్రసేన లాంటి బిరుదులతో రాజ్యాన్ని పరిపాలించాడు.

* చివరి నంద వంశ రాజు ధననందుడు.

* క్రీ.పూ.321లో చంద్రగుప్త మౌర్యుడు ధననందుడిని ఓడించి, మగధను ఆక్రమించాడు.

* వజ్జి, మల్ల రాజ్యాలు గణతంత్రాలు - అంటే ఎన్నుకున్న పాలకులు గల రాజ్యాలు.

* సంస్కృతంలో జన అంటే తెగలు లేదా ప్రజలు, పదం అంటే స్థిరపడిన ప్రాంతం.

* తెగలు లేదా ప్రజలు స్థిరపడిన ప్రాంతమే జనపదం.

*  షోడశ మహాజనపదాల కాలంలో ఢిల్లీ, ఆత్రంజిఖేర, కౌశాంబి, పాట్నా, అయోధ్య, రాజ్‌గిర్‌ లాంటి పట్టణాలు అభివృద్ధి చెందాయి.

* ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగనికాయ, మజ్జనికాయ లాంటి గ్రంథాలను మహాజనపదాల కాలంలో రచించారు.

* వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి/గాహపతి అనేవారు.

* యుద్ధాల్లో బందీలై బానిసలుగా అమ్మకానికి పెట్టినవారిని దాసులు (దస్యులు) అనేవారు.

* కూలీలను భర్తుకా అని పిలిచేవారు.

* గృహపతులు (వ్యవసాయదారులు) రాజుకు పంటలో 1/6 వంతు పన్నును చెల్లించేవారు. దీన్ని ‘భాగ’ అనేవారు.

* వృత్తి పనివారు రాజుగారి పొలంలో ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా పన్ను చెల్లించేవారు.

* మహిళలు, బానిసలు, సేవకులకు గణరాజ్య సమావేశాల్లో పాల్గొనే హక్కు లేదు.

* మగధ రాజ్యం దక్షిణ ప్రాంతంలో ఇనుప గనులు అధికంగా ఉండేవి.

* వజ్జ్జి గణరాజ్యం మగధ రాజ్యానికి ఉత్తర దిక్కులో ఉండేది

 * నాణేలను ముద్రించడం, ఉపయోగించడం అనేది షోడశ మహాజనపదాల కాలంలోనే ప్రారంభమైంది. (గమనిక: వేదకాలంలో నిష్క, శతమాన, కర్షాపణ లాంటి నాణేలు ఉండేవి.)
* అలెగ్జాండర్‌ దండయాత్ర వల్ల భారతీయులకు గ్రీకు నాణేల ముద్రణ పద్ధతులు, ఖగోళశాస్త్రం పరిచయమయ్యాయి.

Posted Date : 14-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌