• facebook
  • whatsapp
  • telegram

శాతవాహనుల పరిపాలన

నిరంకుశత్వం లేని సర్వాధికారి!


  చరిత్ర పూర్వయుగంలో దక్షిణాపథాన్ని పాలించిన గొప్ప పాలకుల్లో శాతవాహనులకు విశిష్ట స్థానం ఉంది. మౌర్య సామ్రాజ్య విచ్ఛిన్నం అనంతరం దక్షిణ భారతదేశంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించినవారు పరిపాలనలో తొలుత మౌర్యులనే అనుసరించారు. సుపరిపాలన, శాంతియుత స్వభావం, పాలనలో వికేంద్రీకరణ, సాంస్కృతిక వైభవం, విదేశీ వాణిజ్యం, పరమత సమాదరణతో తమదైన ప్రత్యేకతను చూపి గొప్ప పాలకులుగా చరిత్రలో నిలిచిపోయారు. సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన శాతవాహనుల పరిపాలన విశేషాలపై పోటీ పరీక్షార్థులు అవగాహన కలిగి ఉండాలి. 


  శాతవాహనులు మౌర్యుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు. మను ధర్మశాస్త్రం, కౌటిల్యుడి అర్థశాస్త్రం వీరికి మార్గదర్శకాలు. రాజ్యాధికారం వంశపారంపర్యం. రాజు సర్వాధికారి కానీ నిరంకుశుడు, నిరపేక్షుడు కాదు. రాజనీతి శాస్త్రం, ధర్మశాస్త్రం ఆధారంగా రాజ్య పరిపాలన జరిగేది. అందులో రాజుకు అనేకమంది సహాయపడేవారు.


* విశ్వ అమాత్యులు - రాజుకి ఆంతరంగిక సలహాదారు


* రాజా అమాత్యులు - రాజాజ్ఞలను అమలుపరిచేవారు


* మహా అమాత్యులు - ఆర్థిక మంత్రి


* అమాత్యులు - ఆహారాలకు (రాష్ట్రాలు) అధిపతులు


* భాండాగారికుడు - వస్తు సంచయనాన్ని భద్రపరిచే అధికారి.


* హిరణికుడు - ద్రవ్య ఆదాయం భద్రపరిచే అధికారి.


* మహాసేనాపతి - సైనిక వ్యవహారాలు చూసేవాడు.


* లేఖకుడు - రాజ పత్రాలు, రాజ శాసనాలు రచించేవారు, ఆంతరంగిక కార్యదర్శి.


* నిబంధకారులు - రాజ వ్యవహారాలను పత్రాలలో రాసి భద్రపరిచేవారు. వీరిని అక్షిపటలకులు అని కూడా అంటారు.


శాతవాహనులు రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. వాటిని ‘ఆహారాలు’ లేదా ‘విషయాలు’ అంటారు. ఒక్కో ఆహారంలో ఒక ప్రధాన నగరం ఉండేది.

ఉదా: గోవర్ధనాహారం, సోపారాహారం, మామలాహారం


* ఆహారం అధికారి అమాత్యులు (వీరి అధికారం వంశపారంపర్యం కాదు)


* పరిపాలనలో అతి చిన్న విభాగం - గ్రామం


* గ్రామ పాలనాధికారి - గ్రామిణి. ఇతడి అధికారంలో 5 - 10 గ్రామాలుండేవి.


గ్రామంలో అధికారులు: గుమిక - గ్రామ పాలకుడు, మహాతరిక - గ్రామ రక్షకుడు, మహా ఆర్యక - మత వ్యవహారాలు, భాండాగారిక - గ్రామస్థాయిలో గిడ్డంగుల పరిరక్షకుడు, రజ్జగాహక - భూమి సర్వే అధికారి.


* రాజ్యంలోని పట్టణాలను నిగమాలు అంటారు. పట్టణ వ్యవహారాలు చూసే సభలను నిగమ సభలని అంటారు. నిగమ సభ సభ్యులను గహపతులు అని పిలిచేవారు. నిగమ సభల గురించి భట్టిప్రోలు శాసనంలో, మెగస్తనీస్‌ ‘ఇండికా’లో పేర్కొన్నారు.


సైనిక వ్యవస్థ: రథ, గజ, తురగ, పదాతి దళాలు ఉండేవి. శాతవాహనుల సైనిక వ్యవస్థ గురించి వివరించే శాసనం ఖారవేలుడు చెక్కించిన హాథిగుంఫా శాసనం. వీరి యుద్ధ తంత్రం గురించి తెలుసుకోవడానికి అమరావతి శిల్పం ఉపయోగపడుతుంది. ముందు భాగంలో పదాతి దళం, పక్క భాగంలో అశ్వ దళం, గజ దళం, వెనుక భాగంలో థానుష్క దళం ఉండేవి. సర్వసైన్యాధ్యక్షుడిగా మహాసేనాపతి ఉండేవాడు. వీరికాలంలో కటకం అంటే సైన్యాగారం. స్కంధావారం అంటే తాత్కాలిక సైనిక శిబిరం.


ఆర్థిక పరిస్థితులు: ప్రజల జీవనాధారం వ్యవసాయం. రాజుకి సొంత భూములుండేవి. దాన్ని రాజకంఖేట అంటారు. వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించేవారు. రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు. పంటలో రాజు భాగాన్ని (1/6) రాజభాగం/దీయమేయం అని పిలిచేవారు. భూమిని సర్వే చేసి శిస్తు నిర్ణయించే అధికారిని రజ్జగాహకుడు అంటారు. పంటలు పండే క్షేత్రాలను సీత క్షేత్రాలుగా వ్యవహరించేవారు. వ్యవసాయ పర్యవేక్షణాధికారి సీతాధ్యక్ష. ప్రధాన వాణిజ్య పంట కొబ్బరి. వ్యవసాయంతో పాటు పశుపోషణ ఉండేది.


* శాతవాహనుల కాలంలో 18 రకాల వృత్తి పనివారు ఉండేవారు. వృత్తి సంఘాలను శ్రేణులు అంటారు. శ్రేణికి అధ్యక్షుడు శ్రేష్టి. శ్రేణి కట్టుబాట్లను ‘శ్రేణిధర్మ’గా పిలిచేవారు. వృత్తి పనివారు ‘కురుకర’ అనే వృత్తి పన్ను చెల్లించేవారు. ఈ వృత్తి సంఘాలే తర్వాతి కాలంలో కులాలుగా మారాయి.


* స్వదేశీ, విదేశీ వ్యాపారం జరిగేది. పశ్చిమ తీరంలో ఫైఠాన్, తగర, నాసిక్, గోవర్ధన మొదలైనవి ప్రధాన వ్యాపార కేంద్రాలు. తూర్పు తీరంలో విజయపురి, గూడూరు, ధాన్యకటకం, వినుకొండ ప్రధాన వ్యాపార కేంద్రాలు.


* గూడూరు సన్న వస్త్రాలకు, వినుకొండ లోహ పరిశ్రమకు, పల్నాడు వజ్రాల గనులకు, గుంటుపల్లి రాగి, ఇనుము పరిశ్రమకు, ప్రతిష్టానపురం తగరం, జౌళి పరిశ్రమలకు ప్రసిద్ధి.


* విదేశాలతో వ్యాపారం చేసేవారిని సార్ధవాహులు అనేవారు. వీరు శ్రేణులుగా ఏర్పడి శ్రేష్టి నాయకత్వంలో వ్యాపారం చేసేవారు. వీరి విదేశీ వ్యాపారం గురించి తెలిపే గ్రంథాలు పెరిప్లస్‌ ఆఫ్‌ ది ఎరిత్రియన్‌ సీ, ది గైడ్‌ టు జాగ్రఫీ. శాతవాహనులు తూర్పు ద్వీపాలతో, రోమ్‌తో వ్యాపారం చేశారు. రోమన్‌ చక్రవర్తుల బంగారు, వెండి నాణేలు లభించిన ప్రాంతాలు - శ్రీకాకుళం జిల్లాలోని సాలిహుండం, గుంటూరు జిల్లాలోని వినుకొండ, నాగార్జునకొండ; కడప జిల్లాలోని అత్తిరాల; విజయవాడ, నెల్లూరు.


ప్రధాన ఎగుమతులు: సుగంధద్రవ్యాలు, రత్నాలు, ముత్యాలు, పట్టువస్త్రాలు. 


ప్రధాన రేవు పట్టణాలు: తూర్పు తీరంలో కోడూరు, మైసోలియా, ఘంటశాల, కోరంగి, పాండిచ్చేరి; పశ్చిమ తీరంలో బారుకచ్చా, సోపారా, కల్యాణి.


నాణేలు: వర్తకంలో అధికభాగం వస్తుమార్పిడి ద్వారానే జరిగేది. సీసం, పొటిన్, రాగి, వెండి, బంగారు నాణేలు ముద్రించారు. వెండి నాణేన్ని కర్ష పణం, బంగారు నాణేన్ని సువర్ణ అనేవారు. ఒక బంగారు నాణెం 35 కర్షపణాలకు సమానం.


సాంఘిక పరిస్థితులు: వర్ణాశ్రమ ధర్మాలు పాటించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులతో పాటు వృత్తులను బట్టి అనేక ఉపకులాలు ఉండేవి. పితృస్వామిక కుటుంబ వ్యవస్థను అవలంబించారు. సంఘంలో మహిళలకు గౌరవం ఉండేది. స్త్రీలకు ఆరు విధాలైన స్త్రీ ధనం ఉండేది. భర్తల ఉద్యోగాలను అనుసరించి భార్యలు సేనాపత్ని, భోజకి, మహాభోజకి వంటి బిరుదులు పొందేవారు.


మత పరిస్థితులు:  అధికారికంగా వీరిది వైదిక మతం. వైదిక మతోద్ధరణకు కృషి చేశారు. వైదిక మత క్రతువులు నిర్వహించారు. నాసిక్, నానాఘాట్‌ శాసనాలు వైదిక మతం గురించి వివరిస్తాయి. హాలుడి గాథా సప్తశతి శివస్తోత్రంతో ప్రారంభమవుతుంది. ఈ గ్రంథంలో గౌరి, పశుపతి, రుద్ర, పార్వతి, లక్ష్మీనారాయణుల ప్రస్తావన ఉంది.


శైవం: పాశుపతాన్ని లకులీశ్వరుడు ప్రారంభించారు. ప్రధాన ఆరాధకుడు పశుపతి. నాటి ప్రాచీన శివాలయం గుడిమల్లం.


వైష్ణవం: వాసుదేవుడు ప్రధాన దైవంగా ఉన్న మతం. వీరి శాసనాలలో వాసుదేవ, కేశవ, వర్ధన, కృష్ణ, గోపాల అనే పేర్లున్నాయి. హాలుడి గ్రంథంలో కృష్ణలీలలు, రాధాకృష్ణుల ప్రణయగాథలు, లక్ష్మీనారాయణుల ప్రస్తావన ఉంది. బ్రాహ్మణులకు గోదానాలు, భూదానాలు విరివిగా చేశారు.


జైన మతం: శ్రీముఖుడు జైన మతాన్ని ఆదరించాడు. కరీంనగర్‌ జిల్లాలోని మునుల గుట్ట, ఏలూరు సమీపంలోని గుంటుపల్లి గుహలు జైన స్థావరాలుగా వెలుగొందాయి. ప్రముఖ జైనాచార్యుడు పద్మనంది భట్టారకుడు గుంతకల్లు సమీపంలో నివసించేవాడు. ఇతడిని కొండ కుందాచార్యులు అని కూడా అంటారు.


బౌద్ధ మతం:  శాతవాహనులు వైదిక మతస్థులైనప్పటికీ బౌద్ధ మతాన్ని ఆదరించారు. వీరి కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన మతం బౌద్ధమే. వర్తకులు, స్త్రీలు, వృత్తి పనివారు ఈ మతాన్ని ఆదరించారు. ఆంధ్రాలో తొలి గొప్ప బౌద్ధ భిక్షువు మహాదేవ భిక్షువు. వీరి కాలంలో చైత్యకవాదం అభివృద్ధి చెందింది. చైత్యాన్ని పూజించడం ప్రధాన ఆచారం. ఆంధ్రాలో ప్రచారంలో ఉన్న బౌద్ధ మత శాఖ- మహాయానం/మహాసాంఘికం. దీని ప్రధాన కేంద్రం ధాన్యకటకం. మహాయాన బౌద్ధమతాన్ని విస్తరించినవారు ఆచార్య నాగార్జునుడు.

* రెండో శాతవాహన రాజైన కృష్ణుడు బౌద్ధభిక్షువుల అవసరాలను చూసేందుకు నాసిక్‌లో ఒక మహామంత్రిని నియమించారు. హాలుడి గాథాసప్తశతిలో బుద్ధుని పాదారాధన ఉంది.

* గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి బాలశ్రీ భయదనిభ తెగకు చెందిన భిక్షువులకు ఒక విహారం నిర్మించారు. భూదానాలు చేశారు. రెండో పులోమావి మహాసాంఘిక బౌద్ధ భిక్షువుల పోషణార్థం ఒక గ్రామం దానం చేశారు. బౌద్ధమత నిర్మాణాలైన చైత్యాలు, స్తూపాలు, ఆరామాలు, విహారాలు నిర్మించారు.


చైత్యాలు: ఇవి బౌద్ధమత దేవాలయాలు. చందవరం, గుంటుపల్లి, నాగార్జునకొండ, రామతీర్థం, కార్లే, కవ్హేరి, భజ, నాసిక్‌లో ఉన్నాయి.


స్తూపాలు: ఇవి మూడు రకాలుగా ఉండేవి.


1) ధాతు గర్భితాలు: బుద్ధుడి అవశేషాలపై నిర్మించినవి. ఉదా: అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు.


2) పారిభోజకాలు: బౌద్ధభిక్షువుల అస్థికలపై నిర్మించినవి.


3) ఉద్దేశిక స్తూపాలు: బుద్ధుడి ధాతువు లేకుండా నిర్మించినవి.

* విహారం అంటే విశ్రాంతి మందిరం. ఆరామం అంటే విద్యాలయం.


ఆచార్య నాగార్జునుడు: ఈయన బిరుదులు - ఇండియన్‌ ఐన్‌స్టీన్, ఇండియన్‌ మార్టిన్‌ లూథర్, రెండో బుద్ధుడు, మాధ్యమిక వాద ప్రవక్త, గతితార్కికవాద ప్రవక్త.


గ్రంథాలు: సుహృల్లేఖ, మాధ్యమిక శాస్త్రం, ఉపదేశం, ద్వాదశముఖ శాస్త్రం, రత్నావళి, మహాయాన భవబేధశాస్త్రం.

* శ్రీపర్వతం (నాగార్జునకొండ) వద్ద నివసించేవారు. నాలుగో బౌద్ధ సంగీతికి హాజరయ్యారు. ఇతడి శూన్యవాదం జగత్‌గురువు ఆదిశంకరాచార్య మాయావాదానికి మూలం.


సాహిత్యం: ప్రాకృత సాహిత్యం ఉండేది. హాలుడి కాలం సాహిత్యానికి స్వర్ణయుగం. శాసనాలు ఎక్కువగా ప్రాకృత భాషలోనే ఉండేవి.


ప్రాకృత కవులు, కవయిత్రిలు: చుల్లవా, అమరరాజ, మకరందసేన, శ్రీరాజ, రేవ, మాధవి, ఆంధ్రలక్ష్మి.


ప్రాకృత గ్రంథాలు: గుణాఢ్యుడు - బృహత్కథ, సోమదేవసూరి - కథాసరిత్సాగరం, క్షేమేంద్రుడు - బృహత్కథామంజరి, బుద్ధస్వామి - బృహత్కధాశ్లోక సంగ్రహం, ఉద్యోధనుడు - కువలయమాల.


సంస్కృత సాహిత్యం: సంస్కృతం రెండో అధికార భాష. మహాయాన బౌద్ధమత కాలంలో సంస్కృతం ఆదరణ పొందింది. శకరాజు రుద్రదాముడు మొదటి సంస్కృత శాసనం వేయించారు.


ప్రముఖ సంస్కృత గ్రంథాలు: శర్వవర్మ- కాతంత్ర వ్యాకరణం, వాత్సాయనుడు- కామసూత్రాలు.


ప్రధాన భాషలు: తెలుగు, కన్నడం, సంస్కృతం.


* అజంతాలోని 9, 10 గుహాలయాల్లోని వర్ణచిత్రాలు శాతవాహనుల కాలం నాటివి.


మాదిరి ప్రశ్నలు


1. శాతవాహనుల కాలం నాటి నిగమసభను ప్రస్తావించిన శాసనం?

1) నానాఘాట్‌ శాసనం 2) ఎర్రగుడి శాసనం 3) భట్టిప్రోలు శాసనం 4) అమరావతి శాసనం


2. శాతవాహనుల కాలం నాటి మ్యాకదోని శాసనం ప్రకారం గుమిక/గుల్మిక అంటే?

1) గ్రామపెద్ద 2) బానిస 3) వాణిజ్య సుంకం 4) భూస్వామ్య వ్యవస్థ


3. శాతవాహనుల సామాజిక, ఆర్థిక విధానాల్లో సరికానిది

1) శాతవాహనులు హిందూ, బౌద్ధ మతాలను ఆదరించారు.

2) చాతుర్వర్ణ వ్యవస్థ అమలులో ఉండేది.

3) స్త్రీలు తక్కువ స్థానం పొందారు.

4) నౌకా వాణిజ్యం అభివృద్ధి చేశారు.


4. శాతవాహనుల కాలంలో నిగమ సభలు ఏ పరిపాలన నిర్వహించేవి?

1) గ్రామాలు  2) నగరాలు  3) ప్రాదేశికాలు  4) మత విషయాలు


5. శాతవాహనుల కాలంలో అమాత్య అంటే?

1) మంత్రి  2) సైనికాధికారి 3) జిల్లా అధికారి 4) గ్రామ పెద్ద


6. శాతవాహనుల రాజమతం

1) జైనం  2) బౌద్ధం  3) వైదికం 4) వైష్ణవం


7. శాతవాహనుల కాలంలో ద్రవ్య ఆదాయం భద్రపరిచే వ్యక్తిని ఏమంటారు?

1) భాండాగారికుడు  2) హిరణికుడు  3) లేఖికుడు  4) నిబంధకారులు

సమాధానాలు: 1-3, 2-1, 3-3, 4-2, 5-3, 6-3, 7-2.

రచయిత: గద్దె నరసింహారావు

Posted Date : 21-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌