• facebook
  • whatsapp
  • telegram

 కాకతీయుల పరిపాలన 

వర్ధిల్లిన సేద్యం.. విలసిల్లిన శైవం! 

తెలుగు జాతినంతటినీ ఏకచ్ఛత్రాధిపత్యం కిందకు చేర్చి, జనరంజకంగా పాలించిన రాజవంశీయులుగా కాకతీయుల పేరు చరిత్రలో నిలిచిపోయింది. అనునిత్యం ప్రజాక్షేమానికి పాటుపడిన ఉదార పాలకులుగా వీరి కీర్తి శాశ్వతం. హైందవ సంస్కృతి పరిరక్షణకు, తెలుగు భాష, సాహిత్య అభివృద్ధికి పెద్దపీట వేశారు. వ్యవసాయం, కళలు, కట్టడాల పరంగా శిఖర స్థాయి కీర్తి గడించారు. వీరి పరిపాలనా విధానంలోని నూతన ఒరవడులను, నాటి మత, సాంఘిక పరిస్థితులను చారిత్రక ఆధారాల ప్రకారం అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. రాజ్యంలోని పరిపాలనా విభాగాలు, వాటి అధిపతులు, సాగు వృద్ధికి జరిగిన కృషి, పన్నుల వ్యవస్థ, వర్తక వాణిజ్యాలు, సైనిక వ్యవస్థ నిర్మాణం, ప్రసిద్ధ నిర్మాణాలతో పాటు అప్పటి దురాచారాలు, జరిగిన దురాగతాల గురించీ అవగాహన పెంచుకోవాలి.

కాకతీయుల పరిపాలనా వ్యవస్థ గురించి రుద్రదేవుడు, బద్దెన, శివదేవయ్య, మడిక సింగనలు రాసిన గ్రంథాలు వివరిస్తాయి. కాకతీయులు సప్తాంగ సమన్వితమైన సాంప్రదాయిక రాచరికాన్ని అనుసరించినప్పటికీ, భారతీయ రాజ వంశాల్లో స్త్రీని సింహాసనం అధిష్టింపజేసిన ఘనత వీరిదే. దత్తత ద్వారా కిరీటం లభించే పద్ధతి కూడా వీరి కాలంలోనే జరిగింది. రాజ్యపాలన చేస్తున్న రాజు చివరి రోజుల్లో యువరాజుతో కలసి పాలన చేయడం ఈ వంశంలోనే కనిపిస్తుంది.


ప్రభుత్వ యంత్రాంగానికి రాజు సర్వాధికారి, సిద్ధాంతరీత్యా అధికారమంతా ఆయనదే. ఆచరణలో రాజ్యాధికారానికి కొన్ని పరిమితులు ఉండేవి. ధర్మశాస్త్ర బద్ధులై సంప్రదాయాన్ని రక్షించడం రాజుల ప్రధాన విధి. వారి శాసనాల్లో ‘చాతుర్వర్ణ సముద్ధరణ’ అనే బిరుదు తరచుగా కనిపించేది. రాజుకు రాజనీతి శాస్త్రం, కళలు, సాహిత్యంలో మంచి ప్రవేశం ఉండేది. అతడు ప్రజలను కన్నబిడ్డలుగా భావించేవాడు. ‘రాజు ప్రజలకు ఎల్లప్పుడూ దర్శనం ఇవ్వాలి’ అనే తెలిపే గ్రంథం- రుద్రదేవుడి ‘నీతిసారం’. రాజుకు పరిపాలనలో సాయపడటానికి మంత్రిమండలి ఉండేది. మంత్రులతో రాజ్య వ్యవహారాలు చర్చించడం రాజు దినచర్యలో భాగం.


రాజుకి సహాయపడే మంత్రివర్గంలో అతి ప్రధానమైన వ్యక్తి ప్రధానమంత్రి. ‘మంత్రి లేని రాజు తొండం లేని ఏనుగు లాంటి వాడు’ అని రాజనీతి శాస్త్రవేత్తల అభిప్రాయం. విజ్ఞత లేనివాడిని మంత్రిగా నియమించకూడదు అని బద్దెన ‘నీతిశాస్త్ర ముక్తావళి’ గ్రంథంలో వివరించాడు. మనసు నిలకడలేనివాడు మంత్రి పదవికి అనర్హుడు. ఏ మంత్రికి సర్వాధికారాలు ఇవ్వకూడదు. వేదం, రాజనీతి శాస్త్రం తెలిసిన పండితులనే మంత్రులుగా నియమించాలి అనే నియమాన్ని కాకతీయులు పాటించలేదు. కాకతీయుల కాలంలో అన్ని కులాల వారు మంత్రులుగా ఉండేవారు. వీరు కులాలను బట్టి కాకుండా అర్హతలను బట్టి పదవులు ఇచ్చారు. మంత్రులకు పల్లకి, శ్వేతచ్ఛత్రం, ప్రత్యేక దుస్తులు, జీవనభృతి, ఆభరణాలు, ఖరీదైన సుగంధ ద్రవ్యాలు ఇచ్చేవారు.


కాకతీయుల శాసనాల్లో మహాప్రధాని, ప్రధాని, ప్రెగ్గడ, అమాత్య, మంత్రి లాంటి ఉద్యోగుల పేర్లు కనిపిస్తాయి. ప్రధానుల గురించి మడిక సింగన ‘సకలనీతి సమ్మతం’ పేర్కొంటుంది. ఉదాహరణకు గణపతి దేవుడికి మల్యాల హేమాద్రి రెడ్డి ప్రధాని, ప్రతాపరుద్రుడికి ముప్పడి నాయకుడు ప్రధాని. రాజ ఉద్యోగులను నియోగులుగా విభజించేవారు. అన్ని శాఖలను పర్యవేక్షించే అధికారిని బాహత్తర నియోగాధిపతి అనేవారు. 72 నియోగ శాఖలు ఉండేవి.


నాయంకర విధానం: కాకతీయుల కాలంలో నిర్ణీత సంఖ్యలో దళాలు నిర్వహించేవారిని నాయకులు అంటారు. సైనిక పోషణకు వీరికి ఇచ్చే గ్రామాలను నాయంకరులు అని అంటారు. ఈ నాయకులను ఆ గ్రామంలో శాశ్వతంగా ఉంచేవారు కాదు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మార్చేవారు. రాజ విశ్వాసం ఉన్నంతకాలం నాయకుడు నాయకుడిగా కొనసాగేవాడు. రెండో ప్రతాపరుద్రుడి కాలంలో 72 మంది నాయకులు ఉండేవారు.


గ్రామ పాలన: కాకతీయుల రాజ్యాన్ని రాజ్యం - నాడులు - స్థలం - గ్రామాలుగా విభజించారు. గ్రామ పాలనను అయగార్లు నిర్వహించేవారు. గ్రామసేవకు, రాజ్యసేవకు పన్ను లేకుండా భూమిని పొందినవారు అయగార్లు. ‘ఆయం అంటే పొలం వైశాల్యం’. అయగార్లు మొత్తం 12 మంది. వీరిలో ముగ్గురిని (కరణం, రెడ్డి, తలారి) ప్రభుత్వం నియమించేది. భూ సంబంధ రికార్డులను భద్రపరిచే అధికారిగా, పన్నులు వసూలు చేసేవారుగా కరణం, గ్రామపెద్దగా రెడ్డి, గ్రామ పోలీసుగా తలారి వ్యవహరించేవారు.


వ్యవసాయం, నీటిపారుదల సౌకర్యాలు: ప్రజలకు, ప్రభుత్వానికి ముఖ్య ఆదాయం వ్యవసాయం. కాకతీయులు నీటిపారుదల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. కాలువలు, చెరువుల ద్వారా నీటిపారుదల సౌకర్యాలను కల్పించారు. తెలంగాణ ప్రాంతంలో కాకతీయులే కాకుండా వారి సామంతులు, ఇతర ఉద్యోగులు, మతాచార్యులు, సంపన్నులు చెరువులను తవ్వించారు. వీరి కాలం నాటి ప్రముఖ చెరువులు కేసరి సముద్రం, పాకాల చెరువు, రామప్ప చెరువు, బయ్యారం చెరువు మొదలైనవి. రెండో ప్రతాపరుద్రుడు నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో అడవులను నరికించి వ్యవసాయ భూములు, గ్రామాలుగా మార్చాడు.


పన్నులు: భూమిశిస్తు ప్రధాన ఆదాయ మార్గం. వర్తకం, పరిశ్రమలు, వృత్తిపన్నులు రెండో ఆదాయ మార్గం. పశుగ్రాసం, అడవులపై విధించే పన్ను మూడో ఆదాయ మార్గం. ఇంటిపన్ను - ఇల్లరి, గొర్రెల మందలపై విధించే పన్ను - అడ్డపట్టు, అటవీ ఉత్పత్తులపై పన్ను - పుల్లరి, రాజును దర్శించుకున్నందుకు చెల్లించే పన్ను - దరిశనం, అకారణంగా చెల్లించే పన్ను - అప్పనం, రాజు లేదా అతడి అధికారులు మేలు చేసినందుకు చెల్లించే పన్ను - ఉపకృతి. భూమిశిస్తు 1/6వ వంతు చెల్లించేందుకు పన్నులను వసూలుచేసేవారు సుంకాధికారులు. భూమిని కొలిచే సాధనం - కేసరిపాటిగడ.


ప్రతి గ్రామంలో రాజుకి కొంత పొలం ఉండేది. దానిని ‘రాచపొలం’ అని అంటారు. ఈ పొలం చేసేవారిని ‘అర్ధశిరి’ అని పిలిచేవారు. ‘వెలిపొలం’ - నీటి వసతి ఉన్న పొలం, ‘తోటపొలం’ - పండ్ల తోటల పొలం, ‘నదీమాత్రుక’ - నది కింద ఉన్న పొలం, ‘దేవమాత్రుక’ వర్షాధారమైన పొలం. భూమిశిస్తును ‘అరి’ అని, శిస్తు చెల్లించేవారిని అరిగాపులు అని అనేవారు. ఏటా రెండు సార్లు పన్ను కట్టాలి. వెలిపొలంపై పన్ను ‘పుట్టిహండి’ అని, నదీమాత్రుకపై పన్నును కోరు అని అంటారు. బ్రాహ్మణులపై నామమాత్రపు పన్ను ఉండేది.


మోటుపల్లి, కృష్ణపట్నం, హంసల దీవి, మచిలీపట్నం కాకతీయుల కాలం నాటి ప్రముఖ ఓడరేవులు. వీరి కాలం నాటి విదేశీ వర్తకం గురించి వివరించిన విదేశీ యాత్రికులు మార్కోపోలో, అమీర్‌ఖుస్రూ. ఎగుమతి, దిగుమతులపై పన్నును ‘సుంకం’ అనేవారు. సంతలపై విధించే పన్ను - ‘సుగుమ’. అమ్మిన వస్తువులపై పన్ను అమ్మబడి, ఎద్దుల బండ్లపై పన్ను ‘పెరెకె ఎడ్ల సుంకం’.


న్యాయపాలన: గ్రామంలో శాంతిభద్రతలు కాపాడే వ్యక్తిని తలారి అంటారు. సంప్రదాయ పద్ధతులు అనుసరించి న్యాయనిర్ణయం చేసేవారు. శిక్షలు కఠినంగా ఉండేవి. అంతిమ న్యాయనిర్ణయం రాజుదే. అంతిమ న్యాయస్థానం రాజస్థానం. ప్రాడ్వివాకులు అనే ప్రత్యేక న్యాయాధికారులు ఉండేవారు. ప్రత్యేక వివాదాల పరిష్కారానికి ధర్మాసనాలు ఏర్పాటు చేశారు. ధర్మాసనాల తీర్పులను ‘జయపత్రాలు’ అనే పేరుతో రాజముద్రిక చేసి ఇచ్చేవారు. ఈ ముద్రలు వేయడానికి రాజుల దగ్గర ముద్రవర్తులు అనే ప్రత్యేక ఉద్యోగులు ఉండేవారు. ప్రతాపరుద్రుడి వద్ద ఇందులూరి రుద్రయ ముద్రకర్త. ‘ముద్రిత సభలు’ ఉండేవి.


సైనిక వ్యవస్థ: తూర్పు చాళుక్యుల కాలం నాటి సైనిక వ్యవస్థ, యుద్ధతంత్రం కాకతీయుల కాలంలో ఉండేవి. వీరి కాలంలో 9 లక్షల ధనుర్దరాధీశ్వరులు, 100 ఏనుగులు, 20 వేల గుర్రాలు ఉండేవి. కాకతీయ సైన్యంలో చక్రవర్తి సైన్యం, నాయంకర సైన్యం అని రెండు భాగాలు ఉండేవి. చక్రవర్తి సైన్యం నడపడానికి దండనాయకులు, మహాదండనాయకులు, సేనాధిపతులు, సైన్యాధ్యక్షులు ఉండేవారు. ప్రధానంగా చక్రవర్తి సైన్యానికి అధ్యక్షత వహించేవాడు. సైనిక పోషణ కోసం రాజులు అధిక ధనం ఖర్చు చేసేవారు. రాజ్య రక్షణ కోట సముదాయంపై ఆధారపడి ఉంటుందని ‘నీతిసారం’ గ్రంథంలో ఉంది. స్థల, జల, వన, గిరి అనే నాలుగు రకాల కోటలుండేవి. వీరి కాలం నాటి ప్రధాన కోటలు ఓరుగల్లు, రాయచూరు, గోల్కొండ, భువనగిరి, రాచకొండ. రాజును రక్షించడానికి ‘లెంకలు’ అని అంగరక్షకులు ఉండేవారు. వీరిని రాజు ప్రియమిత్రులు అనేవారు. లెంకల ధర్మాలను తెలిపే లెంకావళి ఉండేది. సైనికులకు సమరూప దుస్తులు ఉండేవి.

మత, సాంఘిక పరిస్థితులు: వీరికాలం నాటి ప్రధాన మతం శైవం. శైవంతో పాటు వీరశైవం, జైనం, బౌద్ధమతాలు వర్ధిల్లాయి. వేదాల్లోని రుద్రశివుడినే తర్వాత కాలంలో పశుపతిగా, శివుడిగా ఆరాధించేవారు. ‘శివుడే తన శిష్యులకు పాశుపత మంత్రం బోధించాడు’ అని శైవుల విశ్వాసం. శివుడి అవతారాలైన 28 మంది యోగాచార్యుల గురించి శివపురాణం, కూర్మపురాణం తెలియజేస్తున్నాయి. ఈ యోగాచార్యుల్లో శ్వేతాచార్యులు మొదటి గురువు, లకుదీశుడు చివరి గురువు.


శైవంలో పాశుపతం, కాలాముఖం, కాపాలిక అనే 3 శాఖలు ఉండేవి. రాజాదరణ, ప్రజాద]రణ పొందిన శాఖ పాశుపతం. రెండో బేతిరాజు శైవమత దీక్ష పొందాడు. ఇతడు రామేశ్వర పండితుడికి హనుమకొండ సమీపంలోని శివపురం అనే గ్రామాన్ని దానం చేశాడు. మహాదేవుడు ధ్రువేశ్వర పండితుడి వద్ద శివదీక్ష పొందాడు. కాకతీయుల కాలంలో పాశుపత శైవం ఉచ్ఛస్థితిలో ఉండేది. గణపతి దేవుడికి శివదీక్ష ఇచ్చిన గురువు విశ్వేశ్వర శివాచార్యుడు. ఇతడు నర్మదా నదీ తీరంలోని గోళిక మఠానికి చెందినవాడు. రుద్రమదేవి విశ్వేశ్వరచార్యుడికి ‘మందడం’ అనే గ్రామాన్ని దానం చేసింది. ఇతడు అక్కడే ఒక శివాలయాన్ని, శుద్ధ శైవ మఠాన్ని నిర్మించాడు.


ఆంధ్ర దేశంలోని శైవమత శాఖల్లో ‘ఆరాధ్య శైవం’ మరొకటి. ఇది ప్రాచీన కాలం నుంచి ప్రచారంలో ఉంది. ఈ మతం గురువులు మొత్తం 12 మంది. వీరికాలం నాటి శైవ మతాన్ని తెలిపే గ్రంథం పండితారాధ్య చరిత్ర. దీన్ని పాల్కురికి సోమనాథుడు రచించాడు. వీరశైవులను లింగాయతులు అని కూడా అంటారు.


కాకతీయుల కాలంలో జైన మతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. జైనులను నానారకాలుగా హింసించారు. వారి గుళ్లను నేలకూల్చారు. దీనికి ఆధారం పాల్కురికి సోమనాథుడి బసవపురాణం, పండితారాధ్య చరిత్ర. రెండో ప్రతాపరుద్రుడి కాలంలో ఓరుగల్లుకు చెందిన జైన అప్పయచార్య జీవేంద్ర కల్యాణాభ్యుదయం అనే గ్రంథాన్ని రచించాడు.


కాకతీయుల కాలంలో వైష్ణవం కూడా ప్రజాదరణ పొందింది. రుద్రదేవుడి మంత్రి గంగాధరుడు హనుమకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు. పల్నాటిసీమలో బ్రహ్మనాయుడు చెన్నకేశవ ఆలయాన్ని నిర్మించారు. మద్వాచార్య ద్వైత సంప్రదాయాన్ని ప్రతిపాదించారు. కాకతీయుల కాలంలో గ్రామదేవత ఆరాధన, వీరపూజా వ్రతాలు, నోములు లాంటివి చేసేవారు.


సాంఘిక పరిస్థితులు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలు ప్రధానంగా ఉండేవి. బ్రాహ్మణుల్లో వృత్తిని బట్టి వైదికులు, నియోగులు అనే భేదం ఉండేది. ప్రాంతాలను బట్టి వెలనాటి వారు, వేగనాటి వారు, కమ్మ నాటివారు, పాకనాటి వారు అనే భేదాలు ఉండేవి. రెడ్లు, కాపుల్లోనూ ఈ భేదాలు కనిపించేవి. ప్రాంతీయ భేదాలు అధికంగా ఉండేవి. ప్రాంతం, వృత్తులను బట్టి 4 వర్గాల్లో అనేక భేదాలు ఉండేవి. వీటి గురించి ప్రతాపరుద్ర చరిత్ర, క్రీడాభిరామం అనే గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అనులోమ, ప్రతిలోమ వివాహాలు జరిగేవి. ఆ రోజుల్లో కుల సంఘాలు కూడా ఉండేవి. వాటిని సమయాలు అని పిలుస్తారు. బ్రాహ్మణ సమయానికి ‘మహాజనులు’, వైద్య సంఘానికి ‘వైశ్య నకరం’ అనే పేర్లు ఉండేవి. కుల కట్టుబాట్లు ఉండేవి. సమాజంలో బాల్యవివాహాలు, వరకట్నం, కన్యాశుల్కం, నిర్బంధ వైధవ్యం లాంటి దురాచారాలు ఉండేవి. మద్యపానం, జూదం, కోడిపందేలు జరిగేవి. అక్షరాస్యత లేదు. వేశ్యలకు గౌరవప్రదమైన స్థానం ఉండేది.


సాహిత్యం: కాకతీయుల రాజ భాష సంస్కృతం. శాసనాల్లో చాలా భాగం సంస్కృతంలోనే ఉన్నాయి. హనుమకొండ, పాలంపేట, పాకాల వర్ధమాన పురం శాసనాలు మొదలైనవి. వీరి కాలంలో సంస్కృతం విద్యాభాషగా, బోధనభాషగా ఉండేది. అనేక సంస్కృత గ్రంథాలను వీరి కాలంలోనే రాశారు. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం రచించాడు. విద్యానాథుడి అసలు పేరు అగస్త్యుడు. ఇతడు రాసిన మరికొన్ని గ్రంథాలు.. ‘బాల భారతం’, ‘నలకీర్తి కౌముది’, ‘కృష్ణ చరితం’. రుద్రమదేవి సేనాపతి కొలనిరుద్రుడు ‘శ్లోకవార్తికం’ అనే వ్యాకరణ గ్రంథానికి ‘రాజ రుద్రీయం’ అనే వ్యాఖ్యానం రాశాడు. జాయప సేనాని.. ‘గీతారత్నావళి’, ‘నృత్తరత్నావళి’, ‘వాయిద్య రత్నావళి’ అనే గ్రంథాలు రాశాడు. రాయపాటి త్రిపురాంతక కవి ‘ప్రేమాభిరామమ్‌’ అనే వీధి నాటకం రాశాడు.


వీరికాలంలో తెలుగు భాషను ఎంతగానో ప్రోత్సహించారు. తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’, ‘ఆంధ్ర మహాభారతం’లో అధిక భాగం రచించారు. ఇతడికి ‘కవిబ్రహ్మ’, ‘ఉభయకవి మిత్రుడు’ అనే బిరుదులున్నాయి. కేతన ‘దశకుమార చరిత్ర’, ‘ఆంధ్రాభాషాభూషణం’, ‘విజ్ఞానేశ్వరీయం’ అనే రచనలు చేశాడు. ఇతడికి ‘అభినవ దిండి’ అనే బిరుదు కూడా ఉంది. మారన ‘మార్కండేయ పురాణం’, మంచెన ‘కేయూర బాహుచరిత్ర’, బద్దెన ‘నీతిశాస్త్ర ముక్తావళి’, ‘సుమతీ శతకం’ రచించారు. శివదేవయ్య ‘పురుషార్థసారం’ అనే గ్రంథాన్ని, గోన బుద్ధారెడ్డి ‘రంగనాథ రామాయణం’ను రాశారు.


నిర్మాణ శైలి: వీరిది త్రికూట నిర్మాణ శైలి. వేయి స్తంభాల గుడిని రుద్రదేవుడు నిర్మించాడు. దీనిని రుద్రేశ్వర ఆలయం అంటారు. ఈ ఆలయంలో డోలరైట్‌ శిలతో చేసిన నంది ప్రత్యేక ఆకర్షణ. రామప్ప ఆలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఈ గుడిలో యక్షిణి, నాగిని శిల్పాలు ప్రత్యేక ఆకర్షణ. పానగల్లు పంచేశ్వరాలయంలో శివుడు, వినాయక విగ్రహాలు అత్యంత ఆకర్షణీయమైనవి. ఓరుగల్లు కోటను ఏకశిల చుట్టూ నిర్మించారు. అందుకే దీనిని ‘ఏకశిల నగరం’ అంటారు. ఇక్కడున్న మరో ప్రముఖ ఆలయం స్వయంభూ శివాలయం.


రచయిత: గద్దె నరసింహారావు


 

Posted Date : 30-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌