• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయం - ప్రధాన పంటలు

* భారతదేశానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది. దేశ  జనాభాలో 54.6% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ రంగం జీడీపీలో 17%, దేశ ఎగుమతుల్లో 12% వాటాను కలిగి ఉంది. వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో పంటల విభాగం, పశుగణాభివృద్ధి, మత్స్య సంపద, కలప-అటవీ సంపద అనే నాలుగు రకాలు ఉన్నాయి. 

* 1905లో బ్రిటిష్‌ పాలనా కాలంలో లార్డ్‌ కర్జన్‌ ఆధ్వర్యంలో బిహార్‌లోని ‘పూస’ వద్ద వ్యవసాయ కళాశాల, పరిశోధనా సంస్థను స్థాపించారు. దీన్ని 1936లో న్యూదిల్లీకి తరలించారు. 

* 1929 జులై 16న బ్రిటిష్‌ వారు న్యూదిల్లీ కేంద్రంగా ‘ఇంపీరియల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సంస్థ’ను స్థాపించారు. దీన్ని స్వాతంత్య్రానంతరం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసర్చి (ICAR)గా మార్చారు. 2017 నాటికి 6 డీమ్డ్‌ యూనివర్సిటీలు, 64 ఐకార్‌ సంస్థలు, 16 నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్లు, 6 నేషనల్‌ బ్యూరో కేంద్రాలు ఉన్నాయి. 

* 1950 మార్చి 15న కేంద్ర మంత్రిమండలి ఉత్తర్వుల  ద్వారా ప్రణాళికా సంఘాన్ని స్థాపించారు. దీన్ని 2015 జనవరి 1 నుంచి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా (NITI)గా మార్చారు. 

* 1952 అక్టోబరు 1న దేశంలో మొదటిసారి సమాజాభి వృద్ధి కార్యక్రమాన్ని (CDP) ప్రారంభించి మొదటి ప్రణాళికలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. స్మాల్‌ ఫార్‌మర్స్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (SFDA), మార్జినల్‌ ఫార్మ్‌ర్స్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (MFDA), రూరల్‌ లాండ్‌లెస్‌ ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారెంటీ ప్రోగ్రామ్‌ (RLEGP), డిస్ట్రిక్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (DRDA) లాంటి పథకాలను ప్రారంభించారు. ఆ తర్వాత 2005 పార్లమెంట్‌ చట్టం ద్వారా 2006 ఫిబ్రవరి 2 నుంచి ళిలినిబిశి పథకం  ఆధారంగా ‘మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ (MGNREGA)ను దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. 

* 1950 తర్వాత భారతదేశంలో జనాభా అవసరాలకు  అనుగుణంగా 1960 దశాబ్దంలో అధిక దిగుబడి, సంకరజాతి విత్తనాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక రకాల వ్యవసాయ విప్లవాలు ప్రారంభించింది.  


పంట కాలాలు 

ఖరీఫ్‌ కాలం: ఈ కాలంలోని పంటలకు అధిక ఉష్ణ వాతావరణం, ఎక్కువ వర్షం అవసరం. ఈ పంట కాలం జూన్‌ నుంచి అక్టోబరు వరకు ఉంటుంది. దీనికి నైరుతి రుతుపవన కాలం ప్రధానమైన వనరు. ఈ కాలాన్ని స్థానికంగా ఆంధ్రప్రదేశ్‌లో సాల్వ పంట, తెలంగాణలో పూనస పంట అంటారు. ఈ కాలంలో ప్రధానంగా వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, జనుము, సజ్జ, చెరకు, పప్పుధాన్యాలు, ఆకు కూరగాయలు, మిర్చి లాంటి పంటలు పండిస్తారు.

రబీ కాలం: ఈ కాలంలో పంటలకు చల్లని శీతోష్ణస్థితి, శీతాకాల తేమతో కూడిన వాతావరణం అనుకూలమైంది. ఈ పంట కాలం నవంబరు నుంచి మార్చి వరకు ఉంటుంది. ఈ కాలాన్ని స్థానికంగా ఆంధ్రప్రదేశ్‌లో దాల్వ, తెలంగాణలో యాసంగి పంట అంటారు. ఈ కాలంలో ప్రధానంగా గోధుమ, బార్లీ, బఠానీలు, పొగాకు, ఆవాలు, ధనియాలు, నూనె గింజలు లాంటివి పండిస్తారు.

జైద్‌ కాలం: ఈ కాలం రబీకి, ఖరీఫ్‌కు మధ్య స్వల్పకాలికంగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ నీటిపారుదల వసతి ఉన్న ప్రాంతంలో పంటలు పండిస్తారు. ఈ పంట కాలం మార్చి నుంచి జూన్‌ వరకు ఉంటుంది. దీన్ని స్థానికంగా ఆంధ్రప్రదేశ్‌లో వేసవి పంట, తెలంగాణలో కత్తెర పంట అంటారు. ఈ కాలంలో ప్రధానంగా దోసకాయలు, పుచ్చకాయలు, కర్బూజ, కూరగాయలను పండిస్తారు. దీంతోపాటు పశువుల మేతను కూడా పెంచుతారు. 

* మన దేశంలోని పంటలను నాలుగు ప్రధాన వర్గాలుగా విభజించవచ్చు. 

ఎ)  ఆహార పంటలు (Food Crops): వరి, గోధుమ,  మొక్కజొన్న, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు. 

బి)  నగదు పంటలు (Cash Crops): పత్తి, జనుము,  చెరకు, పొగాకు, వేరుశనగ, నూనె గింజలు.  

సి)  మొక్క పంటలు (Plantation Crops): తేయాకు,  కాఫీ, సుగంధాలు, కొబ్బరి, రబ్బరు, కొకొవా.  

డి)  ఉద్యాన పంటలు (Horticulture Crops): పండ్లు, కూరగాయలు, పూలు, ఆపిల్స్, మామిడి, అరటి, నిమ్మ లాంటి జాతులు.

    భారతదేశంలో 2017-18 ప్రకారం పరిశీలిస్తే సుమారు 65% ఆహార పంటలు, 35% ఆహారేతర పంటలు సాగయ్యాయి. 275 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయినట్లు అంచనా. 

    మొత్తం వ్యవసాయ సాగు వైశాల్యంలో ప్రధాన పంటల వాటా వరి 23%, పప్పు ధాన్యాలు 16%, గోధుమ 15% పోషక ధాన్యాలు 13%, నూనెగింజలు 13%, పత్తి 6%, చెరకు 2%, ఇతర పంటలు 12%. ప్రపంచ వ్యాప్తంగా మన దేశం వ్యవసాయ సాగు భూమిలో మొదటి స్థానం, పంటల దిగుబడిలో మూడో స్థానంలో ఉంది (చైనా, అమెరికా వరుసగా మొదటి, రెండో స్థానాల్లో ఉన్నాయి). 

    వరి, గోధుమలను పండించడంలో రెండో స్థానం; పప్పు ధాన్యాలు, నూనె గింజల్లో మొదటి స్థానం; టీ, చెరకు, పత్తి, పొగాకులో రెండో స్థానం; ఉద్యాన పంటలు, కూరగాయలు, పండ్లలో రెండో స్థానం (చైనా మొదటి స్థానం), జనుము ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌