• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ - ఉనికి విస్తరణ

వైశాల్యంలో ఏడు... జనాభాలో పది!

  నాటి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా  ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. తదనంతర పరిణామాలతో తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. మళ్లీ ఆరు దశాబ్దాల ఉద్యమాల ఫలితంగా తెలంగాణ విడిపోవడంతో మిగిలిన జిల్లాలతో ప్రస్తుత నవ్యాంధ్ర, ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవించింది. దాదాపు అయిదు కోట్ల జనాభాతో దేశంలో పదోస్థానంలో, వైశాల్యంలో ఏడో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌  భూగోళశాస్త్రం అధ్యయనంలో భాగంగా పోటీ పరీక్షార్థులు సరికొత్త ఆంధ్రప్రదేశ్‌ ఉనికి, విస్తరణ గురించి సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. 

  ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ భారతదేశంలో భాగంగా తూర్పు, ఆగ్నేయ దిశలో ఉష్ణమండలంలో ఉంది. అక్షాంశాల పరంగా ఉత్తరార్ధ గోళంలో విస్తరించి, 12o 37' నుంచి 19o 07' ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. రాష్ట్రానికి ఉత్తరంగా కర్కటరేఖ, దక్షిణంగా భూమధ్యరేఖ ఉన్నాయి. ఏపీ రేఖాంశ పరంగా తూర్పు అర్ధ గోళంలో 77o నుంచి 84o 40' తూర్పు రేఖాంశాల మధ్యలో ఉంది. భారతదేశ ప్రామాణిక రేఖాంశమైన 82 1/2o తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ నగరం మీదుగా వెళుతుంది.

రాష్ట్ర ఏర్పాటు, చరిత్ర

 ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ 1953, అక్టోబరు 1కి ముందు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. తెలుగు ప్రజలకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని అనేక ఉద్యమాలు జరిగాయి. చివరికి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా 1953, అక్టోబరు 1న మద్రాసు రాష్ట్రంలోని తెలుగు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నాటి రాజధాని కర్నూలు కాగా హైకోర్టు గుంటూరులో ఉండేది.

* రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 1956 ప్రకారం అప్పటివరకు ఉన్న హైదరాబాద్‌ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం కలిసి 1956, నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డాయి. హైదరాబాదులోనే రాజధానిని, హైకోర్టునూ ఏర్పాటు చేశారు.

* ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం 2014, జూన్‌ 2న ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం తెలంగాణ మినహా మిగిలిన 13 జిల్లాలతో ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌ 2014, జూన్‌ 2 నుంచి ప్రత్యేక రాష్ట్రంగా మారింది. 2022లో జరిగిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రకారం రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటుచేశారు. 2022, ఏప్రిల్‌ 4 నుంచి అవి అమల్లోకి వచ్చాయి.

* నవ్యాంధ్రప్రదేశ్‌ ఏర్పాటయ్యాక తొలిసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ఎంపిక చేసింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అవి 1) శాసన రాజధాని - అమరావతి 2) పరిపాలనా రాజధాని - విశాఖపట్నం 3) న్యాయ రాజధాని - కర్నూలు

సరిహద్దులు: ఆంధ్రప్రదేశ్‌కు అయిదు పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది.

దిక్కు - రాష్ట్రాలు: * ఉత్తరం - ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌   * వాయవ్యం, పడమర - తెలంగాణ   * పడమర, నైరుతి - కర్ణాటక   * దక్షిణం - తమిళనాడు   * తూర్పు - బంగాళాఖాతం

పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న జిల్లాలు

ఒడిశా (3): శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు.

ఛత్తీస్‌గఢ్‌ (1): అల్లూరి సీతారామరాజు జిల్లా.

తెలంగాణ (7): అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్‌.టి.ఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాలు.

కర్ణాటక (5): కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు.

తమిళనాడు (2): తిరుపతి, చిత్తూరు జిల్లాలు.

* పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో వచ్చిన మార్పులు.

1) ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దు పొందింది.

2) తెలంగాణ, ఒడిశాతో సరిహద్దు కోల్పోయింది.

భూపరివేష్టిత జిల్లాలు

* తీరరేఖ గాని, ఇతర రాష్ట్రాలతో భూసరిహద్దుగానీ లేని జిల్లాలను ‘భూ పరివేష్టిత జిల్లాలు’ అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం భూపరివేష్టిత జిల్లాలు: వై.ఎస్‌.ఆర్‌., అల్లూరి సీతారామ‌రాజు, గుంటూరు, తూర్పుగోదావరి.

* అతి పెద్ద భూపరివేష్టిత జిల్లా - వై.ఎస్‌.ఆర్‌.

ఎక్కువ జిల్లాలు సరిహద్దుగా ఉన్న జిల్లాలు

వై.ఎస్‌.ఆర్‌. (6): నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య

అల్లూరి సీతారామ‌రాజు (6): ఏలూరు, తూర్పుగోదావ‌రి, కాకినాడ‌, అన‌కాప‌ల్లి, విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం మ‌న్యం

త‌క్కువ జిల్లాలు సరిహద్దుగా ఉన్న జిల్లాలు

శ్రీకాకుళం (2): విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం మ‌న్యం

విశాఖ‌ప‌ట్నం (2): విజ‌య‌న‌గ‌రం, అన‌కాప‌ల్లి

చిత్తూరు (2): తిరుప‌తి, అన్న‌మ‌య్య‌

క‌ర్నూలు (2): అనంత‌పురం, నంద్యాల‌


తీరరేఖ:  దేశంలో అత్యంత పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం గుజరాత్‌ కాగా, ఆంధ్రప్రదేశ్‌ది రెండో స్థానం. రాష్ట్రంలో మొత్తం తీర రేఖ పొడవు 974 కి.మీ. ఇక్కడి తీరరేఖను సర్కార్‌ తీరంగా పిలుస్తారు.

* రాష్ట్రంలో తీరరేఖ ఉన్న జిల్లాల సంఖ్య 12. అవి: (ఉత్తరం నుంచి దక్షిణ దిశకు) 1) శ్రీకాకుళం 2) విజయనగరం 3) విశాఖపట్నం 4) అనకాపల్లి 5) కాకినాడ 6) అంబేడ్కర్‌ కోనసీమ 7) పశ్చిమ గోదావరి 8) కృష్ణా 9) బాపట్ల 10) ప్రకాశం 11) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు  12) తిరుపతి.

* జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా తీరరేఖ కోల్పోయిన జిల్లాలు - గుంటూరు, తూర్పుగోదావరి.

* కొత్తగా తీర రేఖ పొందిన ఏకైక రాయలసీమ జిల్లా - తిరుపతి

* అత్యధిక తీర రేఖ ఉన్న జిల్లా - శ్రీకాకుళం

* అత్యల్ప తీర రేఖ ఉన్న జిల్లా - పశ్చిమ గోదావరి

రాష్ట్ర చిహ్నాలు

* రాష్ట్ర చిహ్నం - పూర్ణఘటం

* రాష్ట్ర గేయం - మా తెలుగు తల్లికి

* రాష్ట్ర పుష్పం - మల్లెపువ్వు

* రాష్ట్ర వృక్షం - వేపచెట్టు  

* రాష్ట్ర ఫలం - మామిడి పండు

* అధికార భాష - తెలుగు

* రాష్ట్ర జంతువు - కృష్ణ జింక (బ్లాక్‌ బక్‌)

* రాష్ట్ర జలచరం - డాల్ఫిన్‌

* రాష్ట్ర నృత్యం - కూచిపూడి 

* రాష్ట్ర క్రీడ - కబడ్డీ

వైశాల్యం

 ఆంధ్రప్రదేశ్‌ విస్తీర్ణ పరంగా 4.96 శాతంతో దేశంలో 7వ స్థానంలో ఉంది. విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ కంటే పెద్ద రాష్ట్రాలు వరుసగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక.

* పోలవరం ముంపునకు గురయ్యే తెలంగాణకు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయకముందు రాష్ట్ర వైశాల్యం - 1,60,205 చ.కి.మీ.

* పోలవరం ముంపునకు గురయ్యే తెలంగాణకు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన తర్వాత రాష్ట్ర వైశాల్యం - 1,62,970 చ.కి.మీ.

* తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు (ప్రస్తుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) చెందిన 7 మండలాల్లోని 327 గ్రామాలను ఏపీలో 2014, జులై 17న విలీనం చేశారు. అందులో పూర్తిగా విలీనం చేసిన మండలాలు (5) వేలేరుపాడు, వరరామ రామచంద్రాపురం, కూనవరం, కుకునూరు, చింతూరు. పాక్షికంగా కలిపిన మండలాలు (2) భద్రాచలం, బూర్గంపాడు.

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ

పరిపాలనా వికేంద్రీకరణకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టింది. ప్రతి లోక్‌సభ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటించాలని భావించి మొదట 25 జిల్లాలను ప్రకటించింది. షెడ్యూల్‌ తెగలకు కేటాయించి, విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్న అరకు లోక్‌సభ నియోజక వర్గాన్ని రెండు జిల్లాలు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరింది.

* ఆంధ్రప్రదేశ్‌ జిల్లాల ఏర్పాటు చట్టం - 1974 ప్రకారం 2022లో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ జరిగింది

* ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014లోని పార్ట్‌-2, సెక్షన్‌-11 ప్రకారం కూడా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది.

ముఖ్యాంశాలు

* కొత్తగా ఏర్పాటైన జిల్లాలు 13, మొత్తం జిల్లాలు 26.

* కొత్త జిల్లాల ఏర్పాటు కోసం తుది గెజిట్‌ విడుదలైన తేదీ - ఏప్రిల్‌ 2, 2022

* కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చిన తేది - ఏప్రిల్‌ 4, 2022

* కోస్తాంధ్రాలో జిల్లాల సంఖ్య 9 నుంచి 18కి చేరింది. 

* రాయలసీమలో జిల్లాల సంఖ్య 4 నుంచి 8కి చేరింది.

* గ్రామీణ ప్రాంతమే లేని జిల్లా - విశాఖపట్నం.

* ఏకైక అర్బన్‌ జిల్లా - విశాఖపట్నం 

* గిరిజన జిల్లాల సంఖ్య 2. అవి:  పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు.

* అత్యధిక వైశాల్యమున్న జిల్లాలు వరుసగా ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, వై.ఎస్‌.ఆర్‌., శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం.

* ఆంధ్రప్రదేశ్‌లో అత్యల్ప వైశాల్యం ఉన్న జిల్లాలు వరుసగా విశాఖపట్నం, అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, గుంటూరు, తూర్పు గోదావరి.

* రాష్ట్రంలో వైశాల్యం పరంగా అతిపెద్ద జిల్లా ప్రకాశం, చిన్న జిల్లా విశాఖపట్నం.

జనాభా

* 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీ జనాభా 4,95,77,103.

* దేశ జనాభాలో 4.1% వాటాతో ఆంధ్రప్రదేశ్‌ 10వ స్థానంలో నిలిచింది. జనాభా పరంగా ఏపీ కంటే పెద్ద రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్‌.

* ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక జనాభా ఉన్న జిల్లాలు వరుసగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, ఎన్‌.టి.ఆర్‌.

* అత్యల్ప జనాభా ఉన్న జిల్లాలు వరుసగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, అన్నమయ్య, అంబేడ్కర్‌ కోనసీమ.

* జనాభా పరంగా అతిపెద్ద జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అతిచిన్న జిల్లా పార్వతీపురం మన్యం.

రాష్ట్రంలో ఎక్కువ మండలాలున్న జిల్లాలు:  ప్రకాశం - 38, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు - 38, వైఎస్‌ఆర్‌ - 36, తిరుపతి - 34, శ్రీ సత్యసాయి - 32

తక్కువ మండలాలున్న జిల్లాలు:  విశాఖపట్నం - 11, పార్వతీపురం మన్యం - 15, గుంటూరు - 18, తూర్పు గోదావరి - 19, పశ్చిమ గోదావరి - 19

* రాష్ట్రంలో అత్యధికంగా 8 చొప్పున శాసనసభా నియోజక వర్గాలున్న జిల్లాలు: శ్రీకాకుళం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, అనంతపురం.

* కేవలం 3 శాసనసభా నియోజకవర్గాలున్న జిల్లా: అల్లూరి సీతారామరాజు.

* వ్యక్తుల పేర్లతో ఉన్న మొత్తం జిల్లాల సంఖ్య 8. అవి: ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వై.ఎస్‌.ఆర్‌., అంబేడ్కర్‌ కోనసీమ, ఎన్‌.టి.ఆర్‌. , శ్రీ సత్యసాయి, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు. 

జిల్లా, జిల్లా కేంద్రం వేర్వేరు పేర్లతో ఉన్నవి

* అల్లూరి సీతారామరాజు  -  పాడేరు

* పార్వతీపురం మన్యం  -  పార్వతీపురం

* అంబేడ్కర్‌ కోనసీమ  -  అమలాపురం

* తూర్పు గోదావరి - రాజమహేంద్రవరం

* పశ్చిమ గోదావరి - భీమవరం

* కృష్ణా - మచిలీపట్నం

* ఎన్‌.టి.ఆర్‌. - విజయవాడ

* పల్నాడు - నరసరావుపేట

* ప్రకాశం - ఒంగోలు

* శ్రీ సత్యసాయి - పుట్టపర్తి

* వై.ఎస్‌.ఆర్‌. - కడప

* అన్నమయ్య - రాయచోటి

మాదిరి ప్రశ్నలు

1. ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలు

1) ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌

2) ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు

3) ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు

4) ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక

2. ఆంధ్రప్రదేశ్‌ నూతన జిల్లాలు (26 జిల్లాలు) అమల్లోకి వచ్చిన తేదీ

1) 2022, ఏప్రిల్‌ 22   2) 2002, ఏప్రిల్‌ 24 

3) 2022, ఏప్రిల్‌ 4  4) 2022, ఏప్రిల్‌ 14

3. కిందివాటిలో తీర రేఖ లేని జిల్లా?

1) పశ్చిమ గోదావరి 2) తిరుపతి  3) అంబేడ్కర్‌ కోనసీమ  4) గుంటూరు

4. కిందివాటిలో సరికానిది?

1) రాష్ట్రంలో ఏకైక అర్బన్‌ జిల్లా విశాఖపట్నం

2) రాష్ట్రంలో ఏకైక భూపరివేష్టిత జిల్లా తూర్పు గోదావరి

3) అధిక జనాభా ఉన్న జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

4) అత్యల్ప మండలాలున్న జిల్లా విశాఖపట్నం

5. కిందివాటిలో సరికాని జత ఏది?

1) రాష్ట్ర పక్షి - పాలపిట్ట   2) రాష్ట్ర చిహ్నం - పూర్ణఘటం

3) రాష్ట్ర జంతువు - కృష్ణజింక  4) రాష్ట్ర పుష్పం - మల్లెపువ్వు

6. పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రం?

1) భీమవరం  2) నర్సాపురం   3) ఏలూరు   4) తణుకు

7. రాష్ట్రంలో అత్యల్ప శాసనసభా నియోజక వర్గాలున్న జిల్లా?

1) పార్వతీపురం మన్యం   2) అంబేడ్కర్‌ కోనసీమ  

3) పల్నాడు            4) అల్లూరి సీతారామరాజు

8. గతంలో తీర రేఖ ఉండి జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో తీరరేఖ కోల్పోయిన జిల్లాలు?

1) పశ్చిమ గోదావరి, గుంటూరు   2) తూర్పు గోదావరి, గుంటూరు

3) తూర్పు గోదావరి, కృష్ణా    4) గుంటూరు, కృష్ణా

9. భారతదేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం?

1) గుజ‌రాత్‌    2) తమిళనాడు 

3) ఆంధ్రప్రదేశ్‌    4) తెలంగాణ

10. కిందివాటిలో తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు పంచుకోని జిల్లా ఏది?

1) కర్నూలు   2) నంద్యాల   3) ఎన్‌.టి.ఆర్‌.   4) కృష్ణా

సమాధానాలు

1-2, 2-3, 3-4, 4-2, 5-1, 6-1, 7-4, 8-2, 9-3, 10-4.

రచయిత: దంపూరు శ్రీనివాసులు

Posted Date : 02-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌