• facebook
  • whatsapp
  • telegram

మానవ భూగోళ శాస్త్రం (అధ్యయనం విధానాలు)

పరిసరాలతో సహజీవనంపై ప్రత్యేక దృష్టి!

మానవుడికి, పర్యావరణానికి ఉండే పరస్పర సంబంధాలను విస్తృతంగా చర్చించే విభాగంగా మానవ భూగోళ శాస్త్రం అభివృద్ధి చెందింది. ఇందులో అన్నిరకాల సాంఘిక శాస్త్రాలు మిళితమై ఉంటాయి. భూమిపై ఉన్న రకరకాల సమాజాలను, మానవ కార్యకలాపాలను అధ్యయనం చేసి సమాజ సమస్యలకు పరిష్కారం సూచించే విస్తృత పరిధి ఉన్న శాస్త్రంగా స్థిరపడింది. మానవీయ, రాజకీయ, సాంస్కృతిక, ప్రగతిశీల అంశాలన్నీ ఇందులో ఇమిడి ఉంటాయి. దీని అధ్యయన విధానాలు, వాటి వల్ల ప్రయోజనాలను పోటీ పరీక్షార్థులు వివరంగా తెలుసుకోవాలి.


మానవ భూగోళ శాస్త్రం ప్రధానంగా మానవుడు - పర్యావరణ సంబంధాల మీద దృష్టి కేంద్రీకరిస్తుంది. అయితే ఇదే సంబంధాన్ని వివిధ పరంపరలకు చెందిన మానవ భూగోళ శాస్త్రవేత్తలు పలు కోణాల నుంచి చూశారు. ఇది మానవ భూగోళ శాస్త్రం అధ్యయనంలో విభిన్న పద్ధతులకు దారితీసింది.


ముఖ్యమైన విధానాలు:  

1) నిర్ధారణీయతా విధానం 

2) సంభావ్యతా వాదం 

3) నూతన నిర్ధారణీయతా విధానం 

4) ప్రవర్తనా విధానం 

5) మానవీయ విధానం 

6) సంక్షేమ విధానం


నిర్ధారణీయతా విధానం: ‘సామాజిక సమూహం లేదా సమాజం లేదా దేశం చరిత్ర, సంస్కృతి, జీవన విధానం, అభివృద్ధి దశను పర్యావరణ భౌతిక కారకాలు (భూమి, వాతావరణం, పరీవాహం, వృక్ష, జంతుజాలం) ప్రత్యేకంగా లేదా ఎక్కువగా నియంత్రిస్తాయి’ అనేది నిర్ధారణీయతా విధానం భావన. చార్లెస్‌ డార్విన్‌ రచన ‘ఆరిజిన్‌ ఆఫ్‌ స్పిసీస్‌’ (1859) ఈ విధానానికి ప్రేరణగా చెప్పవచ్చు. ఎలెన్‌ సెంపెల్, హంటిగ్టన్, డేవిస్, డౌమాన్, గెన్, హెచ్‌.టేలర్‌ ఈ పరంపరలోని ఇతర ముఖ్య భూగోళ శాస్త్రవేత్తలు.


సంభావ్యతా వాదం:  ‘సహజ పర్యావరణం అవకాశాలు కల్పిస్తుంది కానీ, సాంస్కృతిక సమూహానికి చెందిన విజ్ఞానం, సాంకేతికత అభివృద్ధిపైన ఆధారపడి ఈ అవకాశాల సంఖ్య పెరుగుతుంది’ అని సంభావ్యతా వాదం (పద్ధతి) చెబుతోంది. ఈ విధానానికి ఫెబౌరే సంభావ్యతా వాదంగా పేరు పెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇది చాలా ప్రసిద్ధి పొందింది. విడాల్‌-డి-లా-బ్లాష్‌ సంభావ్యతా వాదానికి అత్యంత ముఖ్యమైన అనుకూలవాది. జీన్‌ బ్రూన్స్, బరో, సూపర్‌ లాంటివారు కూడా ఈ విధానాన్ని సమర్థించారు.


నూతన నిర్ధారణీయతా విధానం:  1920లో గ్రిఫిత్‌ టేలర్‌ ఈ విధానాన్ని సమర్థించారు. ఇతడి ప్రకారం ‘ఒక దేశం ఉత్తమ ఆర్థిక కార్యక్రమం కొనసాగడం అనేది ప్రకృతి ద్వారానే ఎక్కువగా నియంత్రితమవుతుంది. ఈ కార్యక్రమాన్ని వివరించడం భూగోళ శాస్త్రవేత్తల కర్తవ్యం. దేశం అభివృద్ధిని వేగవంతం చేయడం, నెమ్మదిగా లేదా నిలిపివేసే సామర్థ్యాన్ని మనిషి కలిగి ఉంటాడు. పర్యావరణం విధించిన విస్తృత పరిధుల్లో మానవుడు తన వివేకంతో, అవకాశమున్న, ఉత్తమమైన కార్యక్రమాన్ని ఎంపిక చేసుకుని ఆచరించాలి.


ప్రవర్తనా విధానం:  ‘మానవుడు - పర్యావరణం’ సంబంధాన్ని విశ్లేషించడానికి మానసిక నిపుణులు, తత్త్వవేత్తలు ‘ప్రవర్తనా విధానం’ అనే పద్ధతిని అవలంబించారు. దీనిని 1960 దశకంలో భూగోళ శాస్త్రంలో పరిచయం చేశారు. ఇది సంభావ్యతా వాదానికి ప్రతిస్పందనగా ఉద్భవించింది. ప్రవర్తనా విధానం సారాంశం ఏమిటంటే 

1) ప్రజలు జీవిస్తున్న వాతావరణం పట్ల వారి అవగాహన ద్వారా వారు ప్రవర్తించే మార్గాన్ని సవరించుకుంటారు లేదా వాతావరణమే వారిని ప్రతిఘటిస్తుంది. 

2) మానవుడు పర్యావరణాన్ని రూపుదిద్దుతాడు. అదే సమయంలో పర్యావరణ పరిస్థితులకు స్పందిస్తాడు. అందుకే మానవ- పర్యావరణ పరస్పర సంబంధం క్రియాశీలకమైంది. 

3) మానవుడు చైతన్యవంతుడైన సంఘజీవిగా ప్రాదేశిక పర్యావరణం పట్ల అతడికి ఉండే జ్ఞానశక్తి ద్వారా తన నిర్ణయాలు, చర్యలను సరిదిద్దుకుంటాడు. వోల్ఫెర్ట్, కిర్క్, బౌల్డింగ్, పోర్టియస్‌ అనే శాస్త్రవేత్తలు ఈ పరంపరలో ముఖ్యులు.


మానవీయ విధానం:  భూగోళ శాస్త్రంలో సంభావ్యత, పరిమాణ విప్లవానికి వ్యతిరేకంగా ఈ విధానం అభివృద్ధి చేశారు. టి-ఫు-టువాన్‌ ఈ సిద్ధాంతాన్ని గట్టిగా బలపరిచారు. ఇతడు 1976లో మొదటసారి మానవీయ భూగోళ శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించారు. కిర్క్‌ (1951) ఈ విధానం మార్గదర్శకుల్లో ఒకరు. మానవ జాగృతి, మానవ కారకం, మానవ స్పృహ, మానవ కార్యకలాపం లాంటి అంశాల్లో మనిషి ముఖ్యమైన, చురుకైన పాత్రపై ఈ విధానం దృష్టి సారిస్తుంది.


సంక్షేమ విధానం:  పెట్టుబడిదారీ ప్రభావం కింద ఉన్న సామాజిక సమూహాలు, ప్రాంతాలు, దేశాల అభివృద్ధిలో పెరుగుతున్న అంతరాలు సంక్షేమ విధానానికి దారితీశాయి. దారిద్య్రం, అభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలు, మురికివాడలు, పేదరికం లాంటి సమస్యలపైన భౌగోళిక అధ్యయనాలు దృష్టి కేంద్రీకరిస్తాయి. ‘మార్కిస్ట్, రాడికల్‌ భూగోళ శాస్త్రాలు’ అనేవి ఈ విధాన ఇతర వైవిధ్యాలు. డి.ఎమ్‌.స్మిత్, డేవిడ్‌ హార్వే ఈ విధానానికి ముఖ్య మద్దతుదారులు.

సారాంశం


మానవ భూగోళ శాస్త్ర లక్ష్యమైన మానవ దృగ్విషయ నమూనా వివరణ నుంచి ఈ నమూనాల వెనక పనిచేసే ప్రక్రియల అవగాహనకు సంబంధించి మానవ భూగోళ శాస్త్రంలో కొత్త విధానాలు ఆవిర్భవించాయి. ప్రపంచాన్ని ప్రస్తుతం ఉన్నది ఉన్నట్లుగా, భవిష్యత్తులో ఏవిధమైన మార్పులకు గురవుతుంది అనే అంశాలను మానవ భూగోళ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అది ముఖ్యంగా  ప్రజలు ఎక్కడ ఉన్నారు, దేనిని ఇష్టపడతారు, ప్రదేశం, కాలంతో ఏవిధంగా ప్రభావితమవుతున్నారు, ఏ రకమైన భూభాగాలను ప్రజలు ఉపయోగిస్తున్నారు, ఆక్రమించిన సహజ భూభాగాల మీద ఎలాంటి వాటిని నిర్మిస్తున్నారు అనే అంశాలపై దృష్టిసారిస్తుంది. మానచిత్ర లేఖన శాస్త్రం మాదిరిగా భౌతిక పర్యావరణంతో ప్రత్యక్ష సంబంధం లేని అన్ని భూగోళశాస్త్ర అంశాలను, ఆసక్తులను వివరిస్తుంది. 


మానవ భూగోళ శాస్త్రం అన్ని సాంఘిక శాస్త్రాలను ఏకం చేస్తుంది. ఎందుకంటే వీటికి అవసరమైన ప్రాదేశిక, కాల వ్యవస్థల దృక్కోణాన్ని అందిస్తుంది. ఈ దృక్పథాలు సాంఘిక శాస్త్రాల్లో లేవు. అదే సమయంలో మానవ భూగోళ శాస్త్రం మానవుల ప్రవర్తన, రాజకీయ, ఆర్థిక లేదా సామాజిక భూగోళ శాస్త్రాల విశ్లేషణకు ఇతర సాంఘిక శాస్త్రాల నుంచి విషయాలను గ్రహిస్తుంది. మనుషులు నివసిస్తున్న ప్రపంచంతో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రజలు, దేశాలను ప్రభావితం చేసే పరిస్థితులను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. వివిధ సమాజాలు, సంస్కృతుల మధ్య ఉండే వ్యత్యాసాలను, భూమిపైన వివిధ ప్రాంతాల్లో అవి సృష్టించిన మానవ భూదృశ్యాల్లోని విభిన్నతలను వివరిస్తుంది. మానవ భూగోళ శాస్త్రం సామాజిక సమూహాలు, వాటి సహజ పర్యావరణం మధ్య ఉండే సహజీవన సంబంధాన్ని అవగాహన చేసుకోవడానికి సహాయపడటం వల్ల భూమధ్య రేఖ, ఉష్ణ ఎడారులు, టండ్రాల లాంటి విలక్షణమైన భౌగోళిక ప్రాంతాల్లోని భౌతిక వాతావరణానికి మనిషి సర్దుబాటు కావడానికి మానవ భూగోళ శాస్త్రానికి మంచి సంబంధం ఉంది. అందరూ వ్యక్తిగతంగా, సమష్టిగా నివసిస్తున్న, నిర్వహిస్తున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి మానవ భూగోళ శాస్త్ర ప్రాదేశిక ప్రతిస్పందన వివరణలు, నమూనాలు ఉపకరిస్తాయి. పెరిగిపోతున్న సమస్యాత్మక పోటీలో ప్రపంచంలోని వాస్తవాలు, అవకాశాల గురించి తెలియజేస్తుంది.


మానవ భూగోళ శాస్త్ర అధ్యయనం సమాజాలు, దేశాలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను అర్థం చేసుకోవడానికి, వాటి పరిష్కారానికి మరింత సమర్థంగా సన్నద్ధం కావడానికి దోహదం చేస్తుంది.


రచయిత: జయకర్‌ సక్కరి

Posted Date : 24-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌