• facebook
  • whatsapp
  • telegram

చాల్కోలిథిక్‌ (తామ్ర శిలాయుగం) సంస్కృతి

* నియోలిథిక్‌ చివర్లో ఉపయోగించిన మొదటి లోహం రాగి. ఆ దశలో ప్రధాన వృత్తులు వేట, చేపలు పట్టడం, వ్యవసాయం.

* ఎక్కువ మంది ప్రజలు కొండలు, నదుల సమీపంలో గ్రామాలను ఏర్పాటు చేసుకుని జీవించేవారు.

* ఈ కాలంలో మనదేశంలో వివిధ సంస్కృతులు అభివృద్ధి చెందాయి. అవి: కయథా (మధ్యప్రదేశ్‌), అహర్‌ - బనాస్‌ (రాజస్థాన్‌), మాల్వా (పంజాబ్‌), జోర్వే (మహారాష్ట్ర), సావల్ద (మహారాష్ట్ర) సంస్కృతులు. వీటితో పాటు కుల్లీ, సోతి  సంస్కృతులు కూడా చాల్కోలిథిక్‌ కాలానికి చెందినవే.

* చాల్కోలిథిక్‌ అనే పదం ‘ఖల్కోస్‌ ్ఘ లిథోస్‌’ అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. ఖల్కోస్‌ అంటే రాగి, లిథోస్‌ అంటే రాయి అని అర్థం. దీన్నే ఎనియోలిథిక్‌ (Eneolithic) అని కూడా అంటారు.

* కొందరు చరిత్రకారులు చాల్కోలిథిక్‌ను నియోలిథిక్‌లో భాగంగా పేర్కొంటారు. అయితే చాలా మంది దీన్ని నియోలిథిక్, కాంస్య యుగాల మధ్య పరివర్తన దశగా నిర్వచించారు.

చాల్కోలిథిక్‌ యుగం లక్షణాలు

ఆయుధాలు - సాధనాలు:

* రాతితో చేసిన పనిముట్ల వాడకం తగ్గి, రాగితో చేసిన పరికరాలను ఉపయోగించారు. రాయితో చేసిన బ్లేడు లాంటి పరికరాలు, చేతి గొడ్డళ్లను వాడారు.

* రాగి లోహంతో కత్తులు, ఫిషింగ్‌ హుక్స్, ఉలి, పిన్నులు, రాడ్‌లను తయారు చేశారు.

* నలుపు, ఎరుపు రంగులో మట్టి పాత్రలను ఎక్కువగా ఉపయోగించారు. వీటిపై వివిధ రకాల బొమ్మలు చెక్కారు. కమ్మరి చక్రంపై చేసిన కుండలపై నగీషీలు ఉన్నాయి. 

వ్యవసాయం - జంతువులు:

* వీరు వేటాడటం, చేపలు పట్టడం, వ్యవసాయం చేయడం మొదలైన వృత్తులు చేపట్టేవారు.

* గోధుమ, వరి ప్రధాన ఆహార పంటలు. కాయగూరలు, మినుములు, పెసలు, సజ్జలు, బఠానీ మొదలైన వాటిని కూడా పండించేవారు. తూర్పు భారతదేశంలోని ప్రజలు వరి, చేపలు ఎక్కువగా తినేవారు. పశ్చిమ భారతదేశంలో బార్లీని ఎక్కువగా పండించేవారు.

* వీరు కేవలం ఆహారం కోసమే కొన్ని రకాల జంతువులను మచ్చిక చేసుకున్నారు. అవి: గొర్రెలు, గేదెలు, మేకలు, ఒంటెలు, పందులు.

సామాజిక - ఆర్థిక వ్యవస్థ:

* గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉండేది. నూలు వడకటం, అల్లికలు లాంటివి చేసేవారు. 

* ఈ యుగంలోని వారికి ఇటుకల వాడకం తెలియదు. తాటాకులు, ఇతర ఆకులతో కప్పిన ఇళ్లలో నివసించేవారు. 

* మతవిశ్వాసాలు, సామాజిక అసమానతలు ఉండేవి. అమ్మతల్లి దేవతను, ఎద్దును పూజించేవారు. 

* మరణించిన వారిని పూడ్చిపెట్టే ఆచారం ఉండేది. శవాలను ఖననం చేసే దిశలు ప్రాంతాలను బట్టి మారుతుండేవి. మహారాష్ట్రలో ఉత్తర, దక్షిణ దిక్కుల్లో పూర్తిగా పూడ్చి ఖననం చేస్తే, దక్షిణ భారతదేశంలోని ప్రజలు తూర్పు - పడమరలుగా, పాక్షికంగా పూడ్చేవారు. సమాధుల్లో రాగి వస్తువులను, కుండలను ఉంచేవారు.

* వీరికి కంచు తెలియదు. నగరాలు అభివృద్ధి చెందలేదు.

* అంటువ్యాధులు ఎక్కువగా ఉండటం, పోషకాహారం గురించి తెలియకపోవడంతో జీవితకాలం తక్కువగా ఉండేది.

* అగేట్, జాస్పర్, చాల్సెడోనీ, కార్నెలియన్‌ లాంటి పూసల గురించి తెలుసు. వీటిని అలంకరణకు ఉపయోగించారు.

* ఇనామ్‌గావ్‌లో వృత్తాకార పిట్‌హౌస్‌లను కనుక్కున్నారు. మట్టి ఇళ్లు కూడా ఉండేవి.

* హరప్పాలోని చాల్కోలిథిక్‌ ప్రజల కాలంలో ఇటుకల వాడకం విస్తృతంగా ఉండేది. కానీ కాల్చిన ఇటుకల జాడలు లేవు. 

* తామ్రశిలా యుగం మొదటి దశలో ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించడం, చిరుధాన్యాలు పండించడం, చక్రం సాయంతో చేతితో కుండలు తయారు చేయడం, రాతిని పాలిష్‌ చేయడం లాంటివి నిర్వహించారు. రెండో దశలో చెక్కతో చేసిన వృత్తాకార ఇళ్లలో నివసించారు.

ముఖ్యమైన చాల్కోలిథిక్‌ ప్రదేశాలు

1. సింధు ప్రాంతం: మొహెంజొదారో, హరప్పా, రోపర్, సూరత్‌గఢ్, హనుమాన్‌ఘర్, చన్హుదారో, ఝూకర్, అమ్రి, ఝంగర్‌

2. గంగా ప్రాంతం: కౌశాంబి, అలంగీర్‌పుర్‌

3. బ్రహ్మపుత్ర ప్రాంతం  

4. మహానది ప్రాంతం

5. చంబల్‌ ప్రాంతం: ప్సేవా, నాగ్డా, పరమర్‌ ఖేరీ, తుంగిని, మెత్వా, తకరోడ, భిల్సూరి, మావోరీ, ఘంటా బిలాద్, బెట్వా, బిలావతి, అష్ట

6. సౌరాష్ట్ర ప్రాంతం: రంగాపూర్, అహర్, ప్రశాస్‌ పటాన్, లఖాబావల్, లోథాల్, పితాడియా, రోజ్డి, అడ్కోట్‌

7. నర్మదా ప్రాంతం: నవ్దటోలి, మహేశ్వర్, భగత్రావ్, టెలోడ్, మెహగామ్, హసన్‌పూర్‌

8. తాపీ ప్రాంతం: ప్రకాష్, బహల్‌

9. గోదావరి - ప్రవాహ ప్రాంతం: జ్వేర్, నాసిక్, కోపర్‌గావ్, నివాస, దైమాబాద్‌

10. భీమా ప్రాంతం: కొరేగావ్, చందోలి, ఉంబ్రాజ్, చనేగావ్, అనాక్జి, హింగ్ని, నాగర్‌హళ్లి

11. కర్ణాటక ప్రాంతం: బ్రహ్మగిరి, పిక్లిహాల్, మస్కి

చాల్కోలిథిక్‌ దశ ప్రాముఖ్యత

* ఒండ్రు ప్రాంతం, దట్టమైన అడవులు మినహా దేశమంతా చాల్కోలిథిక్‌ సంస్కృతి విస్తరించింది.

* ప్రజలు ఎక్కువగా కొండలు, నదుల దగ్గర నివసించేవారు.

* వీరికి రాగిని కరిగించడం తెలుసు.

* వీరు రకరకాల కుండలు తయారుచేశారు.

* నాటి ప్రజలు వలసవాదులు. రాయడం తెలియదు.

చాల్కోలిథిక్‌ సంస్కృతి విలసిల్లిన ముఖ్య ప్రదేశాలు

అహర్‌ - బనాస్‌ సంస్కృతి 

* ఇది భారతదేశంలోని ఆగ్నేయ రాజస్థాన్‌లో ఉన్న అహర్‌ నది ఒడ్డున విలసిల్లింది. ఇది ఈ ప్రాంతంలో క్రీ.శ.3000 నుంచి క్రీ.శ 1500 వరకు కొనసాగింది.

* ఇది సింధూలోయ నాగరికతకు దగ్గరి పోలికను కలిగి ఉంది. 

* అహర్‌-బనాస్‌ ప్రజలు బనాస్, బెరాచ్, అహర్‌ నదీ తీరాల్లో నివసించారు. వీరు ఆరావళి శ్రేణిలో లభించే రాగి ఖనిజాన్ని సేకరించి, దాంతో గొడ్డళ్లు, ఇతర పనిముట్లను తయారు చేశారు. 

* ఈ ప్రాంతంలో మెటలర్జికల్‌ గ్రోత్‌ ప్రక్రియ మూలాలు ఉన్నట్లు చరిత్రకారులు విశ్లేషించారు.

* రాతి పునాదులపై మట్టితో ఇళ్లను నిర్మించారు. పై కప్పులు ఉండేవి, ఇళ్లకు వెదురు తెరలను వాడారు.

* వీరు గోధుమ, బార్లీతో సహా అనేక పంటలు పండించారు.

* అహర్‌-బనాస్‌ సంస్కృతిలో బలాతాల్, గిలుండ్‌ ముఖ్యమైన ప్రదేశాలు.

బలాతాల్‌: ఇది రాజస్థాన్‌లో ఉదయపూర్‌ జిల్లాలోని వల్లభనగర్‌ తహశీల్‌లో ఉన్న ఒక పురావస్తు ప్రదేశం. బనాస్‌ నది, దాని ఉపనదుల బేసిన్లలో ఇది ఉంది. ఇక్కడ జరిపిన పరిశోధనల్లో పెద్ద మట్టి ఇళ్ల నిర్మాణ సముదాయాలు, రాయితో చేసిన దీర్ఘచతురస్రాకార యూనిట్లు, రాతిపై ఆధారపడిన పునాదులను కనుక్కున్నారు. వంటశాలలు, కుమ్మరి బట్టీలు సైతం లభించాయి. మలాతాల్‌ రకానికి చెందిన కుండలు ఇక్కడ దొరికాయి. వీటిలో కొన్ని సన్నగా, ఎరుపు రంగులో ఉంటే, మరికొన్ని మందంగా, నలుపు రంగులో ఉన్నాయి.

గిలుండ్‌: రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌ జిల్లాలో ఉన్న ఒక గ్రామం. అహర్‌-బనాస్‌ కాంప్లెక్స్‌లో తవ్విన అయిదు పురాతన ప్రదేశల్లో ఇది ఒకటి. గిలుండ్‌ను స్థానికంగా మోడియా మగారి అని పిలుస్తారు. దీని అర్థం ‘బట్టతల నివాస దిబ్బ’.

కయథా సంస్కృతి

ఈ సంస్కృతిని 1964లో వి.ఎస్‌. వాకంకర్‌ కనుక్కున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయని జిల్లాలో ప్రవహిస్తున్న చంబల్‌ నదీ తీరంలో కయథ సంస్కృతి విలసిల్లింది. వీరు చేతితో తయారుచేసిన కుండలను ఉపయోగించారు. మట్టితో నిర్మించిన ఇళ్లలో నివసించారు.  ఇక్కడ జరిపిన తవ్వకాల్లో క్రీ.పూ. 4000 ఏళ్ల నాటి టెర్రాకోటా (కాల్చిన మట్టితో చేసిన బొమ్మలు) బొమ్మలు లభ్యమయ్యాయి. బార్లీ పంట ఆనవాళ్లు లభించాయి.

మాల్వా సంస్కృతి

ఇది మధ్య భారతదేశంలోని మాల్వా, దక్కన్‌ ద్వీపకల్పం, మహారాష్ట్ర ప్రాంతాల్లో విలసిల్లింది. ప్రజలు పశుపోషణ, వేటను సమూహాలుగా చేసేవారు. గోధుమ, బార్లీ, చిక్కుడు పంటను పండించారు. పెద్ద నివాసాలు, గుండ్రటి ఇళ్లు ఉండేవి. అక్కడక్కడా దీర్ఘచతురస్రాకారంలో ఉన్న గృహాల ఆనవాళ్లు లభించాయి. కుండలు ఎరుపు, నారింజ రంగుల్లో ఉండేవి. సముద్ర గవ్వలతో వస్తువులు తయారు చేసి వాటితో గుజరాత్‌లోని భరూచ్‌ తీరప్రాంతంలో వ్యాపారం చేసేవారు. చెట్లు, పాము, ఎద్దు విగ్రహాలను పూజించారు. బలులు ఇచ్చే సంప్రదాయం ఉండేది.

సావల్ద సంస్కృతి 

ఇది ప్రస్తుత మహారాష్ట్రలోని దులియా జిల్లా పరిసర ప్రాంతాల నుంచి ప్రవరావ్యాలీ వరకు విస్తరించి ఉండేది. ఇక్కడ నిర్వహించిన తవ్వకాల్లో అనేక సూక్ష్మ పరికరాలు, రాగి గాజులు, ఎముకలతో చేసిన పనిముట్లు లభించాయి. ఈ సంస్కృతిలో పూజారి నివసించేందుకు ప్రత్యేక ఇళ్లు ఉడేవి.

Posted Date : 14-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌