• facebook
  • whatsapp
  • telegram

చోళులు -పరిపాలనా విధానం

రాజు 

* చోళులు రాచరిక విధానాన్ని అనుసరించారు. రాజు కేంద్ర ప్రభుత్వానికి అధిపతి, సర్వాధికారి. ఇతడ్ని ‘దేవరాజు’గా పిలిచేవారు. 


రాజును దైవాంశ సంభూతుడిగా భావించే వారు. వారి పేర్లతో దేవాలయాలు నిర్మించిన సందర్భాలూ ఉన్నాయి. ఉదాహరణకు తొండమనాడు వద్ద ఉన్న అదిత్వేశ్వర, రాజేశ్వర దేవాలయాల్లో రాజులతోపాటు రాణుల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. 


రాచరికం వంశపారంపర్యంగా ఉండేది. యువరాజులు పాలనలో సాయం చేసేవారు. రాజుకు సలహాలు ఇచ్చేందుకు మంత్రి పరిషత్‌ ఉండేది. ‘రాజుగారు’ అనే పురోహితుడు; ‘అదిగరైగళ’ అనే ఉద్యోగుల సభ; పెరుండరమ్, సిరున్‌ తరమ్‌ అనే ఉద్యోగవర్గాలు రాజుకు సాయం చేసేవి. 


మంత్రి పరిషత్‌: మంత్రి పరిషత్‌లో ఓళయనాయకన్‌ (కార్యదర్శి), ఉన్నత ఉద్యోగులు (పెరుండరమ్‌), చిన్న ఉద్యోగులు (సిరున్‌ తరమ్‌), వివిధ తరగతుల ఉద్యోగులు (కోరుమిగల్‌ లేదా పనితుక్కల్‌) రాజుకు పాలనలో సాయం చేసేవారు. దీని గురించి తిరుముక్కడల్‌లోని వీరరాజేంద్ర శాసనంలో ఉంది. మంత్రులు, ఉన్నతోద్యోగులకు భూములను ఇనామ్‌గా ఇచ్చేవారు.


ఆదాయ-వ్యయాలు


భూమిశిస్తు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం. చోళులు నీటిపారుదల సౌకర్యం కల్పించి, వ్యవసాయాన్ని ప్రోత్సహించారు.


* రాజరాజ కాలంలో పంటపై 1/3వంతు పన్ను ఉండగా, తర్వాతి రాజులు 1/6 వంతు వసూలు చేశారు. వివిధ రకాల వృత్తి పన్నులు ఉండేవి. 


తరైయిరై (మగ్గం పన్ను), సెక్కెరై (తైలిక వారిపై పన్ను), తట్టార్‌ పొట్టం (స్వర్ణకారులపై పన్ను) లాంటివి వృత్తి పన్నులు. వళక్కునీర్‌ పట్టం (నీటి వనరులు), అంగాడిపట్టం (సంతలు), శెట్టిరామ్‌ (వర్తక సుంకాలు), ఉప్పాయం (ఉప్పు), పొడికావలి (రక్షకభట పన్ను) లాంటి పన్నులు వసూలు చేశారు. భూమి శిస్తు వివరాలను ‘వరిన్‌ - పొట్టగమ్‌’ అనే రికార్డులో పొందుపరిచేవారు. పన్నులు ఎక్కువగా ఉండేవి. కులోత్తుంగ చోళుడు తన హయాంలో కొన్ని పన్నులు రద్దు చేశాడు. 


ఆదాయంలో ఎక్కువ భాగం సైన్య పోషణకు, ఉద్యోగుల జీతాలకు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టేవారు.


న్యాయపాలన


రాజే సర్వోన్నత న్యాయాధికారి. గ్రామాల్లో ‘న్యాయత్తార్‌’ అనే గ్రామసభ తగాదాలను పరిష్కరించి, తీర్పులు ఇచ్చేది. శిక్షలు కఠినంగా ఉండేవి.


రాజ్యపాలనా విభాగాలు


పాలనా సౌలభ్యం కోసం చోళులు రాజ్యాన్ని మండలాలు (రాష్ట్రాలు), వలనాడులు (జిల్లా), నాడులు (సమితి), గ్రామాలు (కుర్రమ్‌ లేదా కొట్టమ్‌)గా విభజించారు. 


రాజరాజ చోళుడి కాలంలో 8 మండలాలు ఉండేవి. వీటికి ‘రాజప్రతినిధి’ ఉండేవాడు. వలనాడుల అధికారులను ‘నాడు ఉదయన్‌’, ‘నాడు కిలవన్‌’, ‘నలవన్‌’ అనేవారు. 


‘నట్టార్‌’ అనే స్వపరిపాలనా సభ ఉండేది. పెద్ద పట్టణాలకు ‘నగరత్తాల్‌’ అనే నగర సభ ఉండేది. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు వివిధ అధికారులు రాజుకు పాలనలో తోడ్పడేవారు.


చోళుల స్థానిక స్వపరిపాలన


దీన్నే ‘గ్రామపాలన’ అని కూడా అంటారు. పరాంతక చోళుడి ‘ఉత్తర మేరూర్‌’ శాసనంలో ఈ విషయాలు ఉన్నాయి. ఇతడు ఈ శాసనాన్ని కాంచీపురంలోని ఉత్తర మేరూర్‌ - వైకుంఠ పెరుమాళ్‌ ఆలయంలో వేయించాడు. ఇతడు ఆలయం బయటి గోడలపై వివిధ శాసనాలు చెక్కించాడు. కులోత్తుంగుడి శాసనాల్లోనూ దీని గురించిన వివరాలు ఉన్నాయి. 


చోళుల కాలంలో గ్రామాలు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉండేవి. ప్రతి గ్రామానికి ‘గ్రామసభ’ ఉండేది. ఇందులో ప్రజలంతా సభ్యులుగా ఉండేవారు. 


అప్పటి గ్రామాల్లో ఉన్న సభను ‘పెరుంగూర్‌’ అని అందులో సభ్యులను ‘పెరమక్కల్‌’ అని పిలిచేవారు. 


చోళుల శాసనాల్లో మూడు రకాల సభల గురించి వివరించారు. అవి:


1. ఉర్‌: బ్రాహ్మణేతర రైతు ప్రతినిధులు ఇందులో సభ్యులు.


2. సభ: బ్రాహ్మణులు సభ్యులుగా ఉంటారు. ఇవి బ్రాహ్మణులు నివసించే అగ్రహారాల్లో ఉంటాయి.


3. నగరం: వర్తక సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.


పరిపాలనా సౌలభ్యం, సక్రమ గ్రామపాలన కోసం  చోళులు ప్రతి గ్రామాన్ని 30 వార్డులుగా విభజించారు. వీటిని ‘కుడుంబులు’ అంటారు. ప్రతి కుడుంబు నుంచి ఒక సభ్యుడ్ని గ్రామసభకు ఎన్నుకునేవారు. సభ్యుడిగా ఎన్నికయ్యే వ్యక్తికి కొన్ని అర్హతలు, అనర్హతలు నిర్దేశించారు. అవి:


ఎన్నిక విధానం: అర్హులైన సభ్యులందరినీ గుర్తించి ‘మహాసభ’ (ప్రజల) సమక్షంలో ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నిక విధానాన్ని ‘కుడువోలై’ అంటారు. ప్రతి గ్రామానికి 30 మంది సభ్యులను ఎన్నుకుంటారు. లాటరీ పద్ధతిలో ఎన్నిక ఉంటుంది. వార్డులకు పోటీచేసే వ్యక్తుల పేర్లు చీటీల్లో రాసి ఒక కుండలో వేసి బాలుడు/ బాలికతో వాటిని తీయించి అందరి సమక్షంలో ఆ పేర్లను చదువుతారు. వారు గ్రామసభకు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.


ఉపసంఘాలు, ఎన్నుకునే సభ్యుల సంఖ్య గ్రామాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎన్నికైన అభ్యర్థుల్లో 12 మంది జ్ఞాన వృద్ధులు సంవత్సర వారియం (వార్షిక కమిటీ)లో సభ్యులుగా ఉండేవారు. మిగిలిన వారిలో అనుభవం ఉన్న 12 మందిని ఉద్యాన కమిటీలో, మిగిలిన 8 మంది సభ్యులను చెరువుల కమిటీలో నియమించేవారు.


చోళుల గ్రామపాలనలో 6 సంఘాలు ఉండేవి. అవి: 


1. గ్రామ వ్యవహారాలు 


2. చెరువుల అజమాయిషి (పరివారియం) 


3. ఉద్యానవనాల పెంపకం (తోటవారియం) 


4. దేవాలయ నిధుల నిర్వహణ 


5. నీటిపారుదల సౌకర్యాలు సమకూర్చడం 


6. న్యాయవిచారణ సంఘం. 


ప్రతి కమిటీలో అయిదుగురు సభ్యులు ఉంటారు. వీరి పదవీ కాలం ఏడాది.


ఈ సంఘాలు గ్రామస్థాయిలో పన్నులు విధించడం - వసూలు చేయడం, వ్యవసాయ, భూతగాదాలు తీర్చడం, ఇంకా అన్ని రకాల గ్రామ వ్యవహారాలను నిర్వహించేవి. 


గ్రామరక్షణకు ‘పాడికావలికూలి’ అనే పన్నును రాజుకు చెల్లించేవారు. ఈవిధంగా గ్రామాలు పూర్తిగా రాజు ఆధ్వర్యంలో స్వతంత్రపాలన సాగించేవి. గ్రామసభ సార్వభౌమాధికారం అనుభవించేది.


అర్హతలు:


* 1/4 వంతు ‘వెలి’ అనే భూమిని కలిగి ఉండాలి. అంటే 1.5 ఎకరాల భూమి.


* సొంత ఇల్లు ఉండాలి.


* 35-70 ఏళ్ల వయసు ఉండాలి.


అనర్హతలు:


* గత మూడేళ్లలో సభ్యులుగా ఎన్నికైనవారు తిరిగి పోటీచేయకూడదు.


* ఒకసారి సభ్యుడిగా ఉండి లెక్కలను సరిగ్గా సమర్పించని వ్యక్తి, అతడి బంధువులు సభ్యులుగా ఎన్నికల్లో పోటీచేయకూడదు.


* అక్రమంగా, అన్యాయంగా ఆస్తులు సంపాదించినవారు అనర్హులు.


* పంచమహాపాపాలు చేసినవారు, వారి బంధువులు కూడా అనర్హులు.


* మానసిక రుగ్మతలు ఉండి, నిషిద్ధ ఆహారం స్వీకరించేవారు అనర్హులు. 


* చెడు వ్యసనాలు ఉండేవారు అనర్హులు.


సైనిక పాలన


చోళుల సైన్యంలో అశ్వ, గజ, పదాతి, నౌకా దళాలు ఉండేవి. వీరి సైన్యాన్ని ‘మున్రుస్తకాయ్‌’, ‘మహాసేనాయ్‌’ అని పిలిచేవారు. నౌకాదళానికి సైన్యంలో అత్యంత ప్రాధాన్యం ఉండేది. సైనికులు ఉండే స్థానాన్ని ‘కడగం’ అని, రాజు అంగరక్షక దళాన్ని ‘వెలైకార్‌’ అని అంటారు. సైనిక స్థావరాలు సుమారు 70 వరకు ఉండేవి. సైనిక పాలనను కైక్నొలుర్‌ అనేవారు. సైన్యం మొత్తానికి ‘కైక్కొలన్‌’ లేదా ‘శ్కెంకుండర్‌’ అధిపతి. చోళుల కాలంలో 60 వేల గజబలం, 1,50,000 వేల కాల్బలం ఉండేవి. అరేబియా నుంచి మేలుజాతి అశ్వాలను దిగుమతి చేసుకునేవారు. సైన్యంలో ‘నాయక’, ‘సేనాపతి’ లేదా ‘మహాదండనాయక’ అనే హోదాలు ఉండేవి. యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించేవారికి ‘క్షత్రియ శిఖామణి’ అనే బిరుదు ఇచ్చేవారు.


‘‘భారతదేశంలో మొట్టమొదట సముద్ర విధానాన్న్బి(Oceanic policy) అనుసరించింది చోళులు’’ - కె.ఎం.ఫణిక్కర్‌


 

Posted Date : 08-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌