• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ శీతోష్ణస్థితి - 3

శీతోష్ణస్థితి అధ్యయనానికి ఉపయోగపడే భావనలు

1. సూర్యుడి గమనం: భారత్‌లో ఉష్ణోగ్రతల తగ్గుదల నవంబరు నుంచి ప్రారంభమవుతుంది. అవి  జనవరి నాటికి అత్యల్పానికి చేరుకుంటాయి. సెప్టెంబరు నుంచి సూర్యుడు భారత భూభాగానికి దూరంగా అంటే భూమధ్యరేఖ వైపుగా ప్రయాణించి డిసెంబరు 22 నాటికి మకరరేఖ పైకి చేరడంతో ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి..

* మకరరేఖ ఆస్ట్రేలియా మధ్యగా వెళుతుంది. దీంతో నవంబరు, డిసెంబరు, జనవరి నెలల్లో అక్కడ వేసవి కాలం ఉంటుంది.

* ఆస్ట్రేలియాలో వేసవి కాలంలో క్రిస్‌మస్‌ వేడుకలు నిర్వహిస్తారు. 

సూర్యుడు తిరిగి మార్చి 21న భూమధ్యరేఖపై ప్రకాశించి అక్కడి నుంచి ఉత్తరంగా ప్రయాణించి జూన్‌ 21కి కర్కటరేఖ పైకి చేరతాడు. ఈ రేఖ భారతదేశం మధ్యగా వెళుతుంది.

* మనదేశంలో మార్చి నుంచి మే వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.


2. కొరియాలిస్‌ ఎఫెక్ట్‌: కొరియాలిస్‌ ఎఫెక్ట్‌కు కారణం భూభ్రమణం. వీటి బలాలు పవనం దిశలో మార్పును కలుగజేస్తాయి.

స్వభావికంగా కదిలే పవనాలు, సముద్ర ప్రవాహాలు ఉత్తరార్ధ గోళంలో కుడివైపునకు, దక్షిణార్ధ గోళంలో ఎడమవైపునకు వంగి ప్రయాణం చేస్తాయి. దీన్నే కొరియాలిస్‌ ఎఫెక్ట్‌ అంటారు. ఈ కారణంగా ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్యరేఖను దాటగానే కుడివైపునకు వంగి నైరుతి రుతుపవనాలుగా భారత్‌పైకి వీచి అధిక వర్షాన్నిస్తాయి.


3. అంతర ఆయనరేఖా అభిసరణ ప్రాంతం:   ఈశాన్య వ్యాపార పవనాలు, ఆగ్నేయ వ్యాపార పవనాలు కలుసుకునే అల్పపీడన ప్రాంతాన్ని అంతర ఆయనరేఖ అభిసరణ ప్రాంతం అంటారు. ఇది ఎల్లప్పుడూ సూర్యుడి గమనాన్ని అనుసరిస్తూ, కదులుతూ ఉంటుంది. అంటే మార్చి 21న భూమధ్యరేఖ వద్ద, జూన్‌ 21న కర్కటరేఖ వద్ద, డిసెంబరు 22న మకరరేఖ వద్ద కేంద్రీకృతం అవుతుంది. 


4. పీడనం: వాతావరణ అంశాల్లో అత్యంత అస్థిరమైన అంశం పీడనం.

* ఏదైనా ఒక ప్రదేశం పైభాగంలో ఉన్న వాయువుల బరువును ఆ ప్రదేశానికి సంబంధించిన వాతావరణ పీడనం అంటారు.

* దీన్ని భారమితితో కొలుస్తారు. కాబట్టి భారమితి పీడనం అని కూడా అంటారు.

భారమితిలో పాదరస మట్టం 760 మిల్లీమీటర్లు ఉన్నప్పుడు అది కలిగించే ఒత్తిడిని ‘‘ప్రామాణిక వాతావరణ పీడనం’’ అంటారు. ఇది 1013.2 మిల్లీబార్లకు సమానం.

* వాతావరణ పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు - ఉష్ణోగ్రత, ఎత్తు, నీటిఆవిరి. ఇవి పీడనంతో విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి.

* సముద్రమట్టం నుంచి ప్రతి 10 మీటర్ల ఎత్తుకు వాతావరణ పీడనం 1 మిల్లీబార్‌ చొప్పున తగ్గుతుంది. కానీ వాతావరణ పైపొరల్లోని పీడనంలో మార్పు కనిపించదు.

* సరాసరి సముద్రమట్టం వద్ద వాతావరణ పీడనం 900 మిల్లీబార్ల నుంచి 1030 మిల్లీబార్ల వరకు ఉంటుంది.

* ప్రపంచంలో అత్యధిక వాతావరణ పీడనం 1963, డిసెంబర్‌ 31న సైబీరియాలోని అగాటా వద్ద 1083.3 మిల్లీబార్లుగా నమోదైంది.

* ప్రపంచంలో అత్యల్ప వాతావరణ పీడనం 1979, అక్టోబరు 12న మరియానా ద్వీపంలోని ‘‘టిప్‌’’ అనే సముద్ర చక్రవాత కేంద్రంలో 870 మిల్లీబార్లుగా నమోదైంది.


భూగోళం వేడెక్కడం, శీతోష్ణస్థితిలో మార్పులు: మండుతున్న బంతి నుంచి భూగోళం ఏర్పడే క్రమంలో అనేక వాయువులు వెలువడ్డాయి. భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ వాయువులు రోదసిలోకి తప్పించుకోలేదు.

భూమ్యాకర్షణ శక్తి ఈ వాయువులను ఇంకా పట్టి ఉంచుతోంది. ఫలితంగా భూమి చుట్టూ వాయువుల పొర ఒకటి ఏర్పడింది.  దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు:

1) ప్రాణవాయువు (ఆక్సిజన్‌) లభించడం.

2) సూర్యుని అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై ఉన్న ప్రాణులను కాపాడే ఓజోన్‌ పొర ఏర్పడటం.

3) మనకు అవసరమైన మాంసకృత్తులు తయారు చేయడానికి మొక్కలు వినియోగించుకునే నత్రజని లభించడం.


హరిత గృహ ప్రభావం (Green House Effect) :

 భూమిని చేరుకునే సౌరశక్తి అంతా తిరిగి రోదసిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుంది. దీన్నే ‘‘హరితగృహ ప్రభావం’’ అంటారు.

* 19వ శతాబ్దం నుంచి భూగోళం వేగంగా వేడెక్కుతోంది.

*పారిశ్రామిక విప్లవం తర్వాత మానవ చర్యలే భూమి వేడెక్కడానికి కారణం. దీన్నే ఆంత్రోపోజెనిక్‌ గ్లోబల్‌ వార్మింగ్‌ (AGW) అంటారు.

* ఇటీవలి కాలంలో శాస్త్రజ్ఞులు ఉత్తర అక్షాంశాల వద్ద గడ్డకట్టిన టండ్రాల (మంచు పలకలు) కింద పెద్ద మొత్తంలో మీథేన్‌ వాయువు ఉందని కనుక్కున్నారు.

* భూగోళ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నకొద్దీ టండ్రాల్లో గడ్డకట్టిన మంచు మరింతగా కరుగుతుంది. ఫలితంగా మంచు కింద ఉన్న మీథేన్‌ వాతావరణంలోకి విడుదలవుతుంది.

హరితగృహ వాయువుగా కార్బన్‌డైఆక్సైడ్‌ కంటే మీథేన్‌ మరింత శక్తిమంతంగా పని చేస్తుంది.

* మానవ జనిత కారణాల వల్ల భూగోళం వేడెక్కడంతో భూమిపై వాతావరణ, శీతోష్ణస్థితుల సరళిలో మార్పులు వస్తాయి.


ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమెట్‌ ఛేంజ్‌  (IPCC):

* ఐపీసీసీ అనేది మానవ ప్రేరిత వాతావరణ మార్పులపై జ్ఞానాన్ని పెంపొందించే ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్‌ ప్రభుత్వ సంస్థ.

* దీన్ని 1988లో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో), యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌ఈపీ)లు స్థాపించాయి.

* ఐపీసీసీ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది.


రుతుపవనాల ఆవిర్భావం 

* Monsoon అనే ఆంగ్లపదం ‘‘మౌసమ్‌’’ అనే అరబిక్‌ పదం నుంచి ఉద్భవించింది.

* మాన్‌సూన్‌ అనే పదాన్ని మొదటిసారిగా అరబ్‌ వర్తకులు వాడారు. మాన్‌సూన్‌ అంటే కాలానుగుణంగా వీచే పవనాలు అని అర్థం.


సంప్రదాయ భారతీయ కాలాలు

భారతదేశ సంప్రదాయం ప్రకారం రెండేసి నెలలు ఉండే ఆరు రుతువులను సంవత్సరంగా విభజిస్తారు.

* ఉత్తర, మధ్య భారతదేశ ప్రజలు అనుభవించే సాధారణ శీతోష్ణస్థితుల ఆధారంగా ఈ రుతువుల విభజన జరిగింది.


     రుతువు పేరు
చంద్రమాన సంవత్సరం (తెలుగు నెలలు) సూర్యమాన సంవత్సరం   (ఇంగ్లిష్‌ నెలలు)
 వసంతం(Spring)  చైత్రం - వైశాఖం  మార్చి - ఏప్రిల్‌
గ్రీష్మం (Summer)  జేష్ఠం - ఆషాఢం  మే - జూన్‌
 వర్ష(Monsoon)  శ్రావణం - భాద్రపదం  జులై - ఆగస్టు
 శరత్‌ (Autumn) ఆశ్వయుజం - కార్తీకం సెప్టెంబరు - అక్టోబరు
 హేమంతం
(Pre winter)
మార్గశిర - పుష్యం నవంబరు - డిసెంబరు
 శిశిరం(Winter) మాఘం - ఫాల్గుణం జనవరి - ఫిబ్రవరి

రుతుపవనాల పుట్టుకను వివరించే సిద్ధాంతాలు

1. తాప సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని ఇంగ్లండ్‌ దేశానికి చెందిన ఎడ్మండ్‌ హేలీ ప్రతిపాదించాడు.

* భూమి, నీరు విభిన్నంగా వేడెక్కి చల్లారడంతో భూపవనాలు, జలపవనాలు పెద్దఎత్తున సంభవించి రుతుపవనాలు ఏర్పడతాయని హేలీ పేర్కొన్నాడు.

2. చలన సిద్ధాంతం: ఈ సిద్ధాంతాన్ని జర్మనీ దేశానికి చెందిన హెర్మాన్‌ ఫ్లోన్‌ ప్రతిపాదించాడు.

* ప్రపంచ శీతోష్ణస్థితి శాస్త్రవేత్తల్లో గొప్పవాడిగా గుర్తింపు పొందిన ఫ్లోన్‌ అంతర ఆయనరేఖా అభిసరణ స్థానం (ఐటీసీజెడ్‌), కొరియాలిస్‌ ప్రభావం ఆధారంగా రుతుపవనాల విధానాన్ని విశదీకరించాడు.

* ఈశాన్య వ్యాపార పవనాలు, ఆగ్నేయ వ్యాపార పవనాలు కలుసుకునే భూమధ్య రేఖా ప్రాంత అల్పపీడన ప్రాంతాన్ని ‘‘అంతర ఆయనరేఖా అభిసరణ ప్రాంతం’’ అంటారు.

ఐటీసీజెడ్‌ ఉనికి సూర్యుడి గమనం మీద ఆధారపడుతుంది. కిరణాలు నిట్టనిలువుగా పడేచోట ఐటీసీజెడ్‌  కేంద్రీకృతం అవుతుంది.

3. వాయు సంబంధ సిద్ధాంతం: దీన్ని షేర్‌హగ్‌ ప్రతిపాదించాడు. ఈయన సిద్ధాంతం ప్రకారం వాతావరణంలోని అన్ని దశల్లోని పవనాల దిశలో మార్పునకు, గాలిలోని ఉష్ణోగ్రతల మార్పునకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది.


రుతుపవనాల క్రియాశీలతను ప్రభావితం చేసే అంశాలు

1. ఎల్‌నినో: ఎల్‌నినో అంటే దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా వేడెక్కడం. దీన్ని మొదటగా పెరూ దేశ మత్స్యకారులు గుర్తించారు.

* స్పానిష్‌ భాషలో ఎల్‌నినో అంటే చిన్నబాలుడు లేదా క్రైస్తవ బాలుడు/క్రీస్తు జననం అని అర్థం.

* దీన్ని ప్రతి 5 లేదా 7 సంవత్సరాలకు ఒకసారి గమనించవచ్చు.

*  దీని  కారణంగా భారత్, ఆగ్నేయాసియా దేశాల్లో రుతుపవన వ్యవస్థ బలహీనపడి వర్షపాత పరిమాణం తగ్గి, దుర్బిక్ష పరిస్థితులు ఏర్పడతాయి.

లానినో: ఇది ఎల్‌నినోకు వ్యతిరేకమైంది.

* స్పానిష్‌ భాషలో లానినో అంటే ఆడశిశువు అని అర్థం

ఇది పెరూ తీర ప్రాంతం వెంబడి సాధారణంగా కదిలే శీతల ప్రవాహం.

* పెరూ తీరంలో ఈ పరిస్థితులున్నపుడు భారతదేశంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి.

2. హిందూ మహాసముద్ర ద్విధృవస్థితి :

దీన్ని హిందూ మహాసముద్రపు ఎల్‌నినో అంటారు.

హిందూ మహాసముద్రంలో పశ్చిమ భాగాన ఆఫ్రికా తూర్పు తీరాన్ని పశ్చిమ ధృవంగా, ఆస్ట్రేలియా ఖండపు పశ్చిమ భాగాన్ని తూర్పు ధృవంగా పరిగణిస్తారు.

* హిందూ మహాసముద్ర పశ్చిమ ధృవంలో ఉష్ణోగ్రతలు పెరిగే స్థితిని ‘ధనాత్మక స్థితి’ అంటారు. ఈస్థితి ఉన్నపుడు ఆఫ్రికా తూర్పు తీరంలో, భారత భూభాగంలో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి.

* హిందూ మహాసముద్ర తూర్పు ధృవంలో ఉష్ణోగ్రతలు పెరిగే స్థితిని ‘రుణాత్మక స్థితి’ అంటారు. ఈ స్థితిలో వ్యాపార పవనాలు ఆస్ట్రేలియా పశ్చిమ భాగం, ఇండోనేసియాల వైపు ఆకర్షితమై అధిక వర్షాలు పడతాయి. ఈ స్థితిలో భారత్‌లో వర్షాలు తగ్గుతాయి.

 3. నేషనల్‌ మాన్‌సూన్‌ మిషన్‌ :

దీన్ని 2012లో మినిస్ట్రీ ఆఫ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ ప్రారంభించింది.

* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీరోలజీ,(IITM)  పుణె దీని అమలు బాధ్యతను చూస్తోంది.

దీనిలో భాగంగా రుతుపవనాలను ముందుగానే గుర్తించి, వాటి వర్షపు తీరును తెలుసుకుంటారు.

Posted Date : 22-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌