• facebook
  • whatsapp
  • telegram

మృత్తికలు - రకాలు

విభజన


మృత్తికల ఆవిర్భావం, రంగు, నిర్మాణం, ఉనికి ఆధారంగా ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ (ఐకార్‌) మన దేశంలోని మృత్తికలను 8 రకాలుగా విభజించింది. అవి:


1. ఒండ్రు మృత్తికలు (Alluvial Soils)


2. నల్లరేగడి మృత్తికలు (Black Soils)


3. ఎర్ర మృత్తికలు (Red Soils)


4. లేటరైట్‌ మృత్తికలు (Laterite Soils)


5. ఎడారి/ ఇసుక మృత్తికలు (Arid Soils)


6. ఆమ్ల/ క్షార మృత్తికలు (Saline and Alkaline Soils)


7. పీటీ/ సేంద్రీయ మృత్తికలు (Peaty Soils)


8. పర్వత ప్రాంత మృత్తికలు (Mountain type of Soils)


ఒండ్రు మృత్తికలు 


నదులు మెత్తటి రేణుయుత అవక్షేపాలను నిక్షేపించడం వల్ల ఇవి ఏర్పడతాయి. దేశ భూభాగంలో ఈ మృత్తికలు సుమారు 43.36 శాతంగా విస్తరించి ఉన్నాయి.


* ఈ మృత్తికల్లో సున్నపురాయి, పొటాషియం, ఫాస్ఫారిక్‌ ఆమ్లం సమృద్ధిగా; నత్రజని, హ్యూమస్‌ తక్కువగా ఉంటాయి.


విస్తరణ: గంగా, సింధూ, బ్రహ్మపుత్ర మైదానాల్లో; తూర్పుతీర డెల్టా ప్రాంతాలు; తీర మైదానాల్లో ఒండ్రు మృత్తికలు ఉన్నాయి.


* భారతదేశంలో అత్యధిక వ్యవసాయ దిగుబడులు ఈ మృత్తికల నుంచే వస్తున్నాయి.


* ఈ మృత్తికలను ‘భారతదేశ ధాన్యాగారాలు’గా పేర్కొంటారు.


రకాలు: 

ఎ) భంగర్‌: ప్రాచీన కాలంలో ఏర్పడినవి.


బి) ఖాదర్‌: నూతనంగా ఏర్పడినవి.


నల్లరేగడి మృత్తికలు


అర్ధశుష్క పరిస్థితులు ఉండే దక్కన్‌ పీఠభూమిలో లావా, నీస్, గ్రానైట్‌ శిలలపై ఈ మృత్తికలు ఏర్పడ్డాయి.


* దక్కన్‌ నాపరాళ్ల శైథిల్యం వల్ల నల్లరేగడి మృత్తికలు ఏర్పడతాయి.


* ఈ మృత్తికలు మహారాష్ట్రలో అత్యధికంగా విస్తరించి ఉన్నాయి.


* దేశ భూభాగంలో 15 శాతంగా ఉన్నాయి.


* ఈ మృత్తికల్లో మెత్తటి ఇనుప పదార్థం ఉంటుంది. అందుకే ఇవి నల్లగా కనిపిస్తాయి.


* ఇవి ఎక్కువ బంకమన్నును కలిగి, తేమను నిల్వ చేసుకునే సామర్థ్యంతో ఉంటాయి.


* వేసవికాలంలో ఈ మృత్తికల్లో లోతైన నెర్రలు ఏర్పడతాయి. ఈ లోపలి పొరల్లోకి వాయుప్రసరణ జరిగి, వాతావరణంలోని నత్రజనిని స్వీకరించడానికి వీలవుతుంది. వర్షం పడినప్పుడు పైన ఉన్న మట్ట్టి పొర (నెర్రలు)లోకి చేరుతుంది. ఇలా స్వయంగా మట్టిమార్పిడి చేసుకోవడం వల్ల వీటిని ‘తమను తాము దున్నుకునే నేలలు’ (Self    Ploughing Soils) అంటారు.


* ఈ మృత్తికల్లో ఇనుము, మెగ్నీషియం, అల్యూమినియం, లైమ్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఫాస్ఫరస్, సేంద్రీయ పదార్థాలు, నత్రజని లోపించి ఉంటాయి.


* ఈ మృత్తికలు పత్తి పంటకు అత్యంత అనుకూలం. కాబట్టి వీటిని ‘Black cotton Soils’గా పిలుస్తారు.


* వీటిని తెలుగు రాష్ట్రాల్లో ‘రేగర్‌’ లేదా ‘రేగడి భూములు’ అంటారు.


* తక్కువ సారవంతంగా ఉండే నల్లరేగడి భూములను మహారాష్ట్రలో ‘చోపాన్‌’ అంటారు.


* ఈ భూములను అంతర్జాతీయంగా ‘ట్రాపికల్‌ చెర్నోజోమ్స్‌’ అని పిలుస్తారు.


ఎర్ర మృత్తికలు 


తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో స్పటికాకార రూపాంతర శిలలు శైథిల్యం చెంది ఎర్ర మృత్తికలు ఏర్పడతాయి.


*  తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి పసుపు రంగులోకి మారతాయి.


*  ద్వీపకల్ప పీఠభూమికి తూర్పు, దక్షిణ భాగాల్లో ఈ మృత్తికలు ఉన్నాయి.


* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆరావళి పర్వతభాగం, భాగేల్‌ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఎర్ర మృత్తికలు ఉన్నాయి.


* దేశ భూభాగంలో ఇవి 18.50 శాతంగా ఉన్నాయి.


*  ఒండ్రు మృత్తికలు, నల్లరేగడి మృత్తికలతో పోలిస్తే ఎర్ర మృత్తికలు తక్కువ సారవంతమైనవి.


*  ఈ మృత్తికల్లో నైట్రోజన్, హ్యూమస్‌ లోపించి ఉంటాయి.


* ఇవి గాలి పారేలా ఉంటాయి.


*  ఈ మృత్తికల్లో పంట సాగు చేసినప్పుడు ఎక్కువ ఎరువులు వాడితే అధిక దిగుబడి పొందొచ్చు.


లేటరైట్‌/ జేగురు మృత్తికలు 


లేటరైట్‌ అనేది లాటిన్‌ పదం. దీని అర్థం ఇటుక.


*   ఈ మృత్తికలు ఇటుక ఎరుపు వర్ణంలో ఉంటాయి.


*   అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం ఒకదాని తర్వాత మరొకటి సంభవించే ప్రాంతాల్లో ఈ మృత్తికలు ఏర్పడతాయి.


*   పశ్చిమ కనుమలకు దక్షిణ భాగాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడులో 1000 నుంచి 1500 మీటర్ల ఎత్తులో; ఆరావళి పర్వతాల దక్షిణ భాగంలో; ఝార్ఖండ్‌లోని రాజ్‌మహల్‌ కొండలు; ఒడిశా, ఉత్తరాంధ్రలోని తూర్పు కనుమలు; అసోంలోని కచార్‌ కొండలు; మేఘాలయాలోని షిల్లాంగ్‌ పీఠభూమిలో ఈ మృత్తికలు ఉన్నాయి.


*   ఈ మృత్తికలు తక్కువ సారవంతమైనవి. దేశ భూభాగంలో 3.70% విస్తరించి ఉన్నాయి.


*   కాఫీ, తేయాకు, జీడిమామిడి, పోకచెక్క, రబ్బరు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాలు లాంటి పంటలకు ఈ నేలలు అనుకూలం.


ఎడారి, ఇసుక మృత్తికలు 


శుష్క శీతోష్ణస్థితి ఉన్న ప్రాంతాల్లో యాంత్రిక శిలాశైథిల్యం వల్ల ఎడారి మృత్తికలు ఏర్పడతాయి.


*   ఇవి గాలివాలును బట్టి విస్తరిస్తూ ఉంటాయి.


*   మన దేశంలో ఈ మృత్తికలు గుజరాత్‌ ఉత్తర ప్రాంతం, హరియాణా; వాయవ్య ప్రాంతాల్లో ఉన్నాయి.


*   దేశ భూభాగంలో 4.42 శాతం విస్తరించి ఉన్నాయి. 


*   నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు - సజ్జ, జొన్న, పప్పుధాన్యాలను ఈ మృత్తికల్లో ప్రధానంగా సాగు చేస్తారు.


ఆమ్ల/ క్షార మృత్తికలు


అధిక లవణాల గాఢత వల్ల ఏర్పడే మృత్తికలు.


*   ఈ మృత్తికల్లో పొటాషియం, సోడియం, మెగ్నీషియం మొదలైనవి అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి వ్యవసాయానికి పనికిరావు. వీటిని రే/ కల్లార్‌/ ఊసర మృత్తికలు అంటారు.


*   ఇవి గంగామైదాన వాయవ్య ప్రాంతంలో, గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి.

పీటీ లేదా సేంద్రీయ మృత్తికలు 


వీటిని ఊబి నేలలు అని కూడా అంటారు.


*   జీవసంబంధ పదార్థం ఎక్కువగా సంచయనం కావడంవల్ల ఈ మృత్తికలు ఏర్పడతాయి.


*   వీటిలో తేమ, బురద ఎక్కువగా ఉంటుంది. ఇవి వరి సాగుకు మాత్రమే అనుకూలం.


*   ఈ మృత్తికలు బిహార్‌ ఉత్తర ప్రాంతం, పశ్చిమ్‌ బంగా, ఉత్తరాఖండ్‌లోని అల్మోర జిల్లా, తమిళనాడు తీర ప్రాంతాలు, కేరళలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.


*   కేరళలో వీటిని స్థానికంగా కరి మృత్తికలు అంటారు.


పర్వత ప్రాంత మృత్తికలు 


దేశ భూభాగంలో 7.25 శాతం విస్తరించి ఉన్నాయి.


*   అధిక వర్షపాతం పొందే పర్వత ప్రాంత వాలుల్లో ఇవి ఏర్పడతాయి.


*   ఈ మృత్తికల్లో హ్యూమస్‌ పుష్కలంగా ఉంటుంది.


*   తక్కువ పరిణతి చెందిన మృత్తికలు.


*   ఎప్పటికప్పుడు క్రమక్షయం వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రదేశానికి రవాణా అవుతూ ఉంటాయి.


*   తోట పంటలు, సుగంధద్రవ్యాల పెంపకానికి ఇవి అనుకూలం.


 

Posted Date : 27-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌