• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో పట్టణ స్థానిక స్వపరిపాలన అభివృద్ధి క్రమం

పౌరుల పాలనలో నగరాలు!


పట్టణాలు, నగరాల పాలనలోనూ పౌరులకు ప్రాతినిథ్యం కల్పించి, సమ్మిళిత వృద్ధిని సాధించే లక్ష్యంతో ప్రత్యేక స్థానిక స్వపరిపాలన సంస్థలను ఏర్పాటు చేశారు. నీరు, పారిశుద్ధ్యం, పట్టణీకరణ తదితర మౌలిక సేవలను సత్వరం అందించడమే వాటి ప్రధాన ధ్యేయంగా నిర్దేశించారు.  మన దేశంలో ప్రాచీనకాలం నుంచే అభివృద్ధి చెందిన పట్టణ పాలనా వ్యవస్థ క్రమంగా పలు మార్పులకు గురవుతూ వచ్చింది. బ్రిటిష్‌ పాలనలో నిర్దిష్ట రూపాన్ని పొంది, స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ హోదాతో పరిపూర్ణత్వాన్ని సంతరించుకుంది. ఈ పరిణామాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.

పట్టణ, నగర పాలక సంస్థలను ‘మున్సిపల్‌ సంస్థలు’గా పేర్కొంటారు. ‘మున్సిపాలిటీ’ అనే పదం ‘మున్సిపియం’ అనే రోమన్‌ పదం నుంచి వచ్చింది. మున్సిపియం అంటే సంఘటితత్వం అని అర్థం. పట్టణ ప్రాంతంలో నివసించే ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా తమను తాము పరిపాలించుకునే వ్యవస్థనే ‘పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ’ అంటారు. ఇవి పట్టణ, నగర ప్రాంతాల్లోని పౌరులకు సేవలందిస్తాయి.


చారిత్రక నేపథ్యం: భారతదేశంలో ప్రాచీనకాలం నుంచి పట్టణ, నగర పాలన కొనసాగుతోంది. మన దేశంలో తొలి పట్టణ నాగరికత సింధు నాగరికత. ఇది అత్యున్నత పట్టణ నాగరికతగా పేరుపొందింది. సింధు ప్రజలు నిర్ణీత కొలతల ప్రకారం భవనాలు నిర్మించారు. వీరి కాలంలో ప్రణాళికాబద్ధమైన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఉండేది. వీరు ప్రధాన రహదారులను ఉత్తర, దక్షిణాలుగా; ఉపరహదారులను తూర్పు, పడమర దిశలను కలిపేవిగా నిర్మించుకున్నారు.


మౌర్యుల పాలనా కాలంలో పట్టణ నాగరికత:  భారతదేశంలో పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలను అభివృద్ధి చేసిన రాజులు మౌర్యులు. వారి రాజధాని పాటలీపుత్ర నగర పాలనను ఆరు బృందాలు నిర్వహించేవి. ఒక్కో బృందంలో అయిదుగురు ఉండేవారు. ఆ విధంగా మొత్తం 30 మంది బృందం పాటలీపుత్ర నగర పౌరులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, ఇతర సేవలు అందించేదని చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలోని గ్రీకు రాయబారి మెగస్తనీస్‌ తన గ్రంథమైన ‘ఇండికా’లో విశదీకరించాడు.

* చంద్రగుప్త మౌర్యుడి ప్రధాని కౌటిల్యుడు రచించిన  ‘అర్థశాస్త్రం’ గ్రంథంలో మౌర్యుల పాలనాకాలంలోని పట్టణ, నగర పరిపాలనను వివరించారు. నగర పాలకుడిని ‘నాగరికుడు’గా పేర్కొన్నారు. నాగరికుడికి పరిపాలనలో సహకరించేందుకు ‘గోప’, ‘స్థానిక’ అనే అధికారులు ఉండేవారు.


మహాజన పదాలు:  క్రీ.పూ.5వ శతాబ్దిలో ‘షోడష మహాజనపదాలు’ పేరుతో భారతదేశంలో 16 నగర రాజ్యాలు వర్ధిల్లినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. వీటి ఆవిర్భావాన్ని పట్టణ నాగరికత చరిత్రలో ప్రధాన మలుపుగా పేర్కొంటారు.

మొగలుల కాలంలో పట్టణ పరిపాలన:  అక్బర్‌ కాలంలో ‘వజీరు’గా పనిచేసిన అబుల్‌ ఫజుల్‌ తన గ్రంథమైన ‘అయిన్‌-ఇ-అక్బరీ’లో మొగలుల పాలనలో పట్టణ పాలనను వివరించారు. పట్టణ ప్రాంతంలో శాంతిభద్రతల అధికారిగా ‘కొత్వాల్‌’, పట్టణ పరిపాలనకు కొందరు మున్సిపల్‌ అధికారులు ఉండేవారు.

ఆధునిక యుగంలో పట్టణ పరిపాలన: ఆంగ్లేయులు తమ పాలనాకాలంలో భారతదేశంలో పట్టణ పరిపాలనకు ఒక నిర్దిష్ట రూపాన్నిచ్చే ప్రయత్నం చేశారు. మన దేశంలో మొదటిసారిగా 1687లో మద్రాస్‌లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ (నగరపాలక సంస్థ)ను ఏర్పాటు చేశారు.

* 1720లో ప్రెసిడెన్సీ పట్టణాలైన మద్రాస్, బొంబాయి, కలకత్తాల్లో మేయర్‌ కోర్టులు ఏర్పాటయ్యాయి.

* 1726లో బొంబాయి, కలకత్తాల్లో మున్సిపల్‌ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు.

* 1793 నాటి చార్టర్‌ చట్టం ద్వారా ఆంగ్లేయులు మన దేశంలోని పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలకు చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేశారు.

* 1850లో ఆంగ్లేయులు పట్టణ ప్రాంతాల పరిధిలో స్థానిక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

* 1870లో లార్డ్‌ మేయో మన దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక వికేంద్రీకరణలో భాగంగా స్థానిక పట్టణ ప్రభుత్వాలను బలోపేతం చేశారు. ఇందులో భాగంగా పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థల్లో భారతీయుల భాగస్వామ్యాన్ని పెంపొందించారు.

* 1882లో లార్డ్‌ రిప్పన్‌ రూపొందించిన స్థానిక ప్రభుత్వాల తీర్మానం ద్వారా పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలకు ఆర్థిక అధికారాలు కల్పిస్తామని, వాటి పరిపాలనా నిర్వహణలో అధికారుల సంఖ్యను మూడో వంతుకు తగ్గిస్తామని ప్రకటించారు.


రాయల్‌ కమిషన్‌ సిఫార్సులు:  1907లో చార్లెస్‌ హాబ్‌హౌస్‌ నాయకత్వంలోని రాయల్‌ కమిషన్‌ స్థానిక స్వపరిపాలనపై అధ్యయనం చేసి, అధికారాల వికేంద్రీకరణ కోసం కొన్ని సిఫార్సులు చేసింది. అవి-

* పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థల నిర్మాణం, నిర్వహణలో ప్రభుత్వ అధికారుల సంఖ్యను తగ్గించాలి.

* వయోజన ఓటుహక్కుపై పరిమితిని తొలగించి, విస్తృతపరచాలి.

* స్థానిక ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచి, పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలను పటిష్ఠపరచాలి.

* పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు అవసరమైన ఆర్థిక వనరులను కేటాయించాలి.

మాంటేగ్‌ - చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం-1919: ఈ చట్టం ద్వారా మొదటిసారిగా రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. కేంద్ర జాబితాలోని ‘స్థానిక స్వపరిపాలనను’ రాష్ట్ర జాబితాలోకి బదిలీ చేశారు. పట్టణ పరిపాలనకు సంబంధించిన పాలనాంశాలను ‘పట్టణ స్థానిక ప్రభుత్వాలు’ అనే అంశంలో చేర్చారు.

* రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ పాలనాకాలంలో మన దేశంలో 1985లో ‘పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ’ ఏర్పాటైంది.

రాజ్యాంగ హోదా ప్రయత్నాలు:  ఎల్‌.ఎం.సింఘ్వీ కమిటీ సిఫార్సుల మేరకు రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించేందుకు 65వ రాజ్యాంగ సవరణ బిల్లును 1989, ఆగస్ట్‌లో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిపై చర్చిస్తున్న సమయంలోనే లోక్‌సభ రద్దు కావడంతో బిల్లు కూడా రద్దయింది.

* విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ ప్రభుత్వ కాలంలో 1990, సెప్టెంబర్‌లో పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించేందుకు కృషి జరిగినప్పటికీ అది విఫలమైంది.


పి.వి.నరసింహారావు ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ హోదా:  పి.వి.నరసింహారావు ప్రభుత్వం పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలని సంకల్పించింది. దీనికోసం 74వ రాజ్యాంగ సవరణ బిల్లును 1991, సెప్టెంబరు 16న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును పార్లమెంటు 1992, డిసెంబర్‌ 22న ఆమోదించింది. 1993, ఏప్రిల్‌ 20న అప్పటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ ఆమోదముద్ర వేయడంతో 74వ రాజ్యాంగ సవరణ చట్టం(1992)గా 1993, జూన్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది.

74వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 - రాజ్యాంగంలో జరిగిన మార్పులు: ఈ చట్టం ద్వారా రాజ్యాంగానికి రెండు ప్రధాన మార్పులు జరిగాయి.

1) పట్టణ ప్రభుత్వ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పిస్తూ, రాజ్యాంగానికి IX(A) అనే నూతన భాగాన్ని చేర్చారు. ఈ భాగంలో ఆర్టికల్‌ 243(P) నుంచి ఆర్టికల్‌  243 (ZG)  వరకు 18 ఆర్టికల్స్‌లో పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థల విధివిధానాలను పేర్కొన్నారు.

2) రాజ్యాంగానికి 12వ షెడ్యూల్‌ను చేర్చి దానిలో పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధులను పేర్కొన్నారు.

* మన దేశంలో పట్టణ స్థానిక స్వపరిపాలనను మూడు రకాల మంత్రిత్వ శాఖలు పర్యవేక్షిస్తున్నాయి.

1) సాధారణ పట్టణ స్థానిక పాలన - కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.

2) కంటోన్మెంట్‌ బోర్డుల పాలన - కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ.

3) కేంద్రపాలిత ప్రాంతాల్లో పట్టణ పాలన - కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.

రెండో పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సులు: వీరప్ప మొయిలీ నేతృత్వంలోని రెండో పరిపాలనా సంస్కరణల సంఘం పట్టణ, నగరపాలక సంస్థలకు సంబంధించిన పలు కీలక సిఫార్సులు చేసింది. అవి-

* రాష్ట్ర శాసనసభలో స్థానిక స్వపరిపాలనా సంస్థల అంశాలను పరిశీలించేందుకు స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలి.

* మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మేయర్‌ను, మున్సిపాలిటీలో ఛైర్మన్‌ను ఓటర్లు ప్రత్యక్షంగా, రహస్య ఓటింగ్‌ ద్వారా ఎన్నుకోవాలి.

* నగరాల్లో ‘మెట్రోపాలిటన్‌ పోలీస్‌ అథారిటీ’ని ఏర్పాటు చేయాలి.

* పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘షరతులు’ లేని ‘గ్రాంట్లు’ మంజూరు చేయాలి.

* స్థానిక సంస్థల్లో శాసన సభ్యులకు (ఎమ్మెల్యే), పార్లమెంటు సభ్యులకు (ఎంపీ) ప్రాతినిధ్యం కల్పించకూడదు.

* దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్తు/శాసన మండలిని ఏర్పాటుచేసి, అందులో స్థానిక సంస్థల ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలి.

* పరిపాలనా పారదర్శకతకు జిల్లా స్థాయిలో నిఘా కమిటీని ఏర్పాటు చేయాలి.

* స్థానిక స్వపరిపాలనా సంస్థలు తీసుకున్న నిర్ణయాలను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండకూడదు. 

తెలుగు రాష్ట్రాల్లో పట్టణ స్థానిక స్వపరిపాలన అభివృద్ధి క్రమం: తెలుగు రాష్ట్రాల్లో మొదటి మున్సిపాలిటీ భీమునిపట్నం. దీన్ని 1861లో ఏర్పాటు చేశారు. ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది. హైదరాబాద్‌ స్వదేశీ సంస్థానంలో మున్సిపల్‌ వ్యవస్థలకు సంబంధించి ‘హైదరాబాద్‌ జిల్లాల మున్సిపాలిటీల చట్టం, 1956’ అమలులో ఉండేది. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు అనంతరం 1965లో ‘ఆంధ్రప్రదేశ్‌ పురపాలక సంఘాల చట్టం’ రూపొందింది. ఈ చట్టం 1965, ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి వచ్చింది.


* మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించి 1955 నాటి హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం, 1994గా అమలవుతోంది. ప్రస్తుతం ఇది నూతన ఆంధ్రప్రదేశ్‌లో అమలులో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ మున్సిపాలిటీల చట్టం, 2019  అమల్లోకి వచ్చింది.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 04-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌