• facebook
  • whatsapp
  • telegram

జిల్లా కలెక్టర్‌

నేపథ్యం


* ఈస్టిండియా కంపెనీ 1772లో మొదటిసారి ‘కలెక్టర్‌’ పదవిని మనదేశంలో ప్రవేశపెట్టింది. ఆ సమయంలో వారన్‌ హేస్టింగ్స్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నారు.


* ప్రారంభంలో ఈ పదవిని ‘భూమిశిస్తు’ వసూలు చేసే లక్ష్యంతో ఏర్పాటు చేశారు.


* 1786లో ‘కలెక్టర్‌’ పదవిని ‘జిల్లా కలెక్టర్‌’గా మార్చారు.


* 1787లో జిల్లా కలెక్టర్‌కు రెవెన్యూతో పాటు మెజిస్ట్రేట్‌ అధికారాలనూ బదిలీ చేశారు. దీని ఫలితంగా వీరికి సివిల్, క్రిమినల్‌ కేసుల్లో తీర్పులు వెలువరించే అధికారం లభించింది.


* 1857 వరకు జిల్లా కలెక్టర్‌ ఈస్టిండియా కంపెనీ ప్రతినిధిగా వ్యవహరిస్తూ, పాలనా సేవలు అందిస్తూ స్థానిక సంస్థల పాలనలో కీలక పాత్ర పోషించారు. 


* 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858లో ‘భారత ప్రభుత్వ చట్టం’ రూపొందింది. దీని ప్రకారం, ఈస్టిండియా కంపెనీ పాలన భారతదేశంలో రద్దయ్యి, దేశ పాలన బ్రిటిష్‌ రాణి చేతుల్లోకి వెళ్లింది. 


* 1858 నుంచి 1909 మధ్య కాలంలో ‘జిల్లా కలెక్టర్‌’ పదవిని ‘మకుటం లేని మహారాజు’గా పరిగణించారు. వీరి చేతిలో విస్తృతమైన అధికారాలు కేంద్రీకృతమై ఉండేవి. అందుకే ఆ సమయంలో జిల్లా కలెక్టర్‌ను ‘లిటిల్‌ నెపోలియన్‌’గా అభివర్ణించారు.


* మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919 ద్వారా మనదేశంలో బాధ్యతాయుతమైన పాలనకు ఆంగ్లేయులు శ్రీకారం చుట్టారు. దీంతో ‘జిల్లా కలెక్టర్‌’ విస్తృత అధికారాలను పరిమితం చేశారు.

స్వాతంత్య్రానంతరం..


* 1950, జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో ‘జిల్లా కలెక్టర్‌’ పాత్రలో మార్పులు, చేర్పులు జరిగాయి. 


* ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్‌ 50 ప్రకారం ‘కార్యనిర్వాహక శాఖ’ నుంచి న్యాయశాఖను వేరు చేశారు. ఇది కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో జరిగినప్పటికీ ‘జిల్లా కలెక్టర్‌’ విషయంలో జరగలేదు. కలెక్టర్‌కు కార్యనిర్వహణాధికారాలు, న్యాయాధికారాలు ఉండేవి. 


* 1973లో ్డది౯i్ఝi-్చః శి౯్న‘’్ట్య౯’ ‘్న్ట’ ్బది౯శిద్శిృ  ని సవరించారు. న్యాయాధికారాలను జిల్లా కలెక్టర్‌ నుంచి వేరు చేసి ‘జిల్లా జడ్జి’కి బదిలీ చేశారు. 


‘ ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌ కార్యనిర్వాహక మేజిస్ట్రేట్‌గా మాత్రమే కొనసాగుతున్నారు. వీరు జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కాదు.


‘ జిల్లా కలెక్టర్‌ రాష్ట్ర ప్రభుత్వంలోని సాధారణ పరిపాలనా విభాగానికి చెందినవారు. వీరికి ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ ్బఖితిళ్శీ హోదా ఉంటుంది.


‘ వీరిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ‘జిల్లా కలెక్టర్‌’గా; ఉత్తర్‌ ప్రదేశ్, పశ్చిమ్‌ బంగాలో ‘జిల్లా మేజిస్ట్రేట్‌’ అని; పంజాబ్, కర్ణాటక, అసోం, హరియాణాలో ‘డిస్ట్రిక్ట్‌ కమిషనర్‌’గా వ్యవహరిస్తారు.


‘ జిల్లా ప్రజల రోజువారీ జీవనంపై జిల్లా కలెక్టర్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాస్థాయిలో ప్రజల జీవన విధానం, పురోభివృద్ధిలో వీరి పాత్ర ఉంటుంది.

అధికారాలు - విధులు

జిల్లాకు పరిపాలనా అధిపతిగా వ్యవహరించే కలెక్టర్‌కు విశేష అధికారాలు, విస్తృతమైన విధులు ఉన్నాయి. అవి:


రెవెన్యూ విధులు: వీరు జిల్లాస్థాయిలో ప్రధాన రెవెన్యూ అధికారిగా వ్యవహరిస్తారు. ఈ హోదాలో కలెక్టర్‌ జిల్లాలోని రైతులకు మార్గదర్శిగా ఉంటారు.


* జిల్లాలోని గ్రామాల్లో భూమిశిస్తు, జమాబందీ గణాంకాలకు నేతృత్వం వహిస్తారు. 


* భూమిశిస్తు వసూళ్లు, రైతులకు రుణాలు మంజూరు చేయడం, ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు పంట నష్టపరిహారం చెల్లించడం, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల అధికార బృందాలకు నష్టపరిహార అంచనా సేకరణ, నివేదిక తయారీలో సహకరించడం మొదలైన విధులు నిర్వహిస్తారు.


* జిల్లాలోని ప్రభుత్వ కోశాగారాల పనితీరును సమీక్షిస్తారు. 


* ప్రభుత్వ భూముల రికార్డులను నిర్వహిస్తారు. 


* భూసంస్కరణల అమలు, ప్రభుత్వ ఎస్టేట్ల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తారు.

మెజిస్ట్రేట్‌ విధులు: జిల్లా కలెక్టర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌గా వ్యవహరిస్తారు. జిల్లాలో పనిచేసే పోలీస్‌ సిబ్బంది వ్యవహారాలపై వీరికి పర్యవేక్షణ అధికారం ఉంటుంది. 


*  జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్, ఇతర అధికారులు కలెక్టర్‌ ఆదేశాలను అమలు చేయాలి. 


*  జిల్లాలో ఏవైనా అల్లర్లు చెలరేగితే, శాంతిభద్రతలు సాధారణ స్థాయిలో కొనసాగే విధంగా ఖిశిది సెక్షన్‌ 144ను విధించే అధికారం కలెక్టర్‌కు ఉంది.


*  వీరు జిల్లాలోని పోలీస్‌ స్టేషన్లు, కారాగారాలను తనిఖీ చేయొచ్చు. ఖైదీలకు కల్పించే సౌకర్యాలను సమీక్షించొచ్చు.


*  సబార్డినేట్‌ కోర్టులపై పర్యవేక్షణ, కార్మిక సమస్యల పరిష్కారం, పేలుడు పదార్థాల తయారీ - వాటి రవాణాకు అనుమతులు మంజూరు చేయడం మొదలైన అధికార, విధులను కలిగి ఉంటారు. 


*  పెరోల్‌పై ఖైదీలను విడుదల చేయడం; ఫైరింగ్‌ ఆదేశాలను జారీ చేయడం; పెట్రోల్‌ బంక్, హోటల్స్‌ ఏర్పాటుకు అనుమతులు మంజూరు లాంటివి చేస్తారు. 


*  జిల్లాస్థాయిలో శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు విఫలమైతే సైన్యాన్ని రంగంలోకి దింపేందుకు అవసరమైన నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తారు.

ఎన్నికల విధులు: కలెక్టర్‌ సంబంధిత జిల్లా ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. 


* కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున జిల్లాలోని వివిధ ప్రాతినిధ్య సంస్థల ప్రతినిధుల ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లు చేసి, పర్యవేక్షిస్తారు. 


* ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేవిధంగా చూస్తారు. 


* ఓటర్ల జాబితా తయారీ, ఓటర్ల జాబితాలో సవరణలు, ఓటర్ల జాబితాలపై ఫిర్యాదుల 


* పరిశీలన, నూతన ఓటర్ల నమోదు, రిటర్నింగ్‌ అధికారుల నియామకం మొదలైన అధికార, విధులను కలిగి ఉంటారు.


* ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వారంతా ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళిని’ పాటించేలా చూస్తారు.


* పాఠశాలల నిర్వహణ కమిటీలు, నీటి వినియోగదారుల కమిటీలు, సహకార బ్యాంకులు మొదలైన వాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తారు.


జనాభా గణాంకాల విధులు: జిల్లాలో జనాభా గణాంకాల సేకరణకు కలెక్టర్‌ ముఖ్య అధికారిగా వ్యవహరిస్తారు. 


* ప్రభుత్వం ప్రతి పదేళ్లకు జనాభా గణాంకాల సేకరణ కోసం పంపించే మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా జనాభా గణాంకాల సేకరణకు అవసరమైన చర్యలు చేపడతారు. 


* జిల్లాలో పాడిపశువులు, ఫలసాయాన్నిచ్చే వృక్షాలు, పెంపుడు జంతువులకు సంబంధించిన గణాంకాల సేకరణలో కీలక పాత్ర పోషిస్తారు. 


* కుటుంబ సంక్షేమం, మహిళా సాధికారత లాంటి అంశాలకు సంబంధించిన సమాచార సేకరణకు తగిన సహకారాన్ని అందిస్తారు.

సమన్వయ విధులు: జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు జిల్లా కలెక్టర్‌ కృషి చేస్తారు. 


* విద్య, వైద్యం, వ్యవసాయం, నీటిపారుదల, పరిశ్రమలు, విద్యుత్‌ మొదలైన శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తారు. 


* ప్రభుత్వ పథకాల అమలులో వారికి తగిన ఆదేశాలను, సూచలను ఇస్తారు. 


* వివిధ శాఖల అధికారులు జిల్లా అభివృద్ధికి వేర్వేరుగా ప్రణాళికలు రూపొందించి, అమలు చేసినప్పటికీ అంతిమంగా వారంతా జిల్లా కలెక్టర్‌కు జవాబుదారీగా ఉంటూ, కలెక్టర్‌ సూచనల మేరకు పనిచేస్తారు.

అభివృద్ధికి సంబంధించిన విధులు: జిల్లా ప్రగతిలో కలెక్టర్‌ పాత్ర అత్యంత కీలకమైంది. 


* వీరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థకి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. MPLADS పనులకు నిధులు విడుదల చేస్తారు. 


* మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) పర్యవేక్షిస్తారు. మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తారు.

శాశ్వత ఆహ్వానితులు: జిల్లాలోని స్థానిక స్వపరిపాలనా సంస్థల సమావేశాలకు జిల్లా కలెక్టర్‌ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.

* జిల్లా, మండల పరిషత్‌ల సాధారణ లేదా అత్యవసర సమావేశాలకు హాజరై ప్రజా ప్రతినిధులకు, అధికారులకు వివిధ అంశాలపై సూచనలు, సలహాలు ఇస్తారు. 

* జిల్లాలోని స్థానిక సంస్థల వ్యవహారాలు, పనితీరు గురించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలను సమర్పిస్తారు.

* జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌పై సభ్యులు అవిశ్వాసం ప్రకటించినప్పుడు కలెక్టర్‌ జిల్లా పరిషత్‌ సమావేశాన్ని ఏర్పాటుచేసి, తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించి, ఫలితాన్ని ప్రకటిస్తారు. 

* జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొత్తగా స్థానిక సంస్థల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపుతారు.

* స్థానిక సంస్థల ఆస్తులు, సిబ్బంది, భవనాలు, కార్యక్రమాలపై పర్యవేక్షణాధికారాన్ని కలిగి ఉంటారు.

* స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులపై వచ్చే ఆరోపణలపై దర్యాప్తు జరిపిస్తారు. 

* రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు స్థానిక సంస్థలకు ‘ప్రత్యేక అధికారి’ (Special Officer) గా వ్యవహరిస్తారు.

ఇతర అధికారాలు విధులు: జిల్లా కలెక్టర్‌ జిల్లాలో నివసించే సాధారణ ప్రజానీకానికి స్నేహితుడిగా, తాత్వికుడిగా, మార్గదర్శకుడిగా ఉంటారు.

* జిల్లాలోని స్థానిక ప్రభుత్వాలకు, ప్రజలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు. 

* జిల్లా స్థాయిలో వివిధ కమిటీల సమావేశాలకు అధ్యక్షత వహించటంతో పాటు, వాటిలో తీసుకున్న నిర్ణయాల అమలుకు కృషి చేస్తారు. 

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న వివిధ పథకాలు ప్రజలకు చేరడంలో కీలకపాత్ర పోషిస్తారు. అవి:

* ఆమ్‌ ఆద్మీ బీమా యోజన (AABY)

* భూమిలేని గ్రామీణులకు ఉపాధి పథకం (Rural Landless Employment Guarantee Programme - RLEGP)

* వాల్మీకి అంబేడ్కర్‌ ఆవాస్‌ యోజన (VAMBAY)

* జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ (National Rural Health Mission - NRHM) 

* జననీ సురక్ష యోజన (JSY)

అభిప్రాయాలు..

* ‘‘సామాన్య భారతీయులు వివిధ రకాలైన పార్లమెంటరీ, అధ్యక్ష, ఏక కేంద్ర, సమాఖ్య ప్రభుత్వ విధానాల ఎంపికలో భిన్నాభిప్రాయాలు తెలిపినప్పటికీ, వారంతా జిల్లా కలెక్టర్‌ పదవి పట్ల అకుంఠితమైన ఆరాధన, అంకిత భావాలను ప్రదర్శించారు.’’ - సైమన్‌ కమిషన్‌

* ‘‘జిల్లా కలెక్టర్‌ పదవి కారణంగా భారతీయులు బ్రిటిష్‌ పాలకులను ఎల్లప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటారు.’’ - గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ వేవెల్‌


* కొంతమంది మేధావులు మనదేశంలోని ‘జిల్లా కలెక్టర్‌’ పదవిని ఫ్రాన్స్‌ దేశంలోని ప్రిఫెక్ట్‌ (Perfect) పదవితో పోల్చారు.

రచయిత

బంగారు సత్యనారాయణ

విషయ నిపుణులు 

Posted Date : 14-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌