• facebook
  • whatsapp
  • telegram

 సముద్ర భూతల విభజన

సాగరంలో మరో భూమండలం!

  భూగోళం అంతటా విస్తరించిన సముద్రాలు పైకి సమతలంగా, శాంతంగా కనిపిస్తాయి. కానీ  లోపలికెళ్లి చూస్తే ఎన్నో వింతలు, విశేషాలతో నిండి ఉంటాయి. భూమి ఉపరితలంపై మాదిరిగా సాగర గర్భంలోనూ పర్వతాలు, పీఠభూములు, నదీ లోయలు, మైదానాలు ఉంటాయి. ఎవరెస్ట్‌ పర్వతాన్ని కూడా మింగేయగలిగిన లోతున్న అగాధాలు ఎన్నో ఉన్నాయి. సముద్రశాస్త్రం (ఓషనోగ్రఫీ) అధ్యయనంలో భాగంగా ఆ మహాసముద్రాల అంతర్గత స్వరూప, స్వభావాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

  

మహాసముద్రాలు, భూ ఖండాలను ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని ఖండ తీరం అంటారు. ఇది సముద్రంలోకి చొచ్చుకొని ఉంటుంది. అయితే సముద్ర భూతలం ఖండ తీర అంచు నుంచి ప్రారంభమై, పోనుపోను సముద్రపు లోతుతో పాటు పెరిగి అగాధ ప్రాంతాల వరకు విస్తరించి ఉంటుంది.

* సముద్ర ఉపరితల జలభాగం నుంచి కిందకు ఉండే లోతు ఆధారంగా సముద్ర భూతలాన్ని 5 భాగాలుగా విభజించవచ్చు. అవి:

1) ఖండ తీరపు అంచు (Continental Shelf)

2) ఖండ తీరపు వాలు (Continental Slope)

3) అగాధ సముద్ర మైదానం (Deep see plain) or (Abyssal plain)

4) అగాధ సముద్ర ప్రాంతం (Ocean deeps)

5) సముద్రాంతర్గత కెనయాన్‌ (Submarine Canyon)

ఖండ తీరపు అంచు: 

* ఖండ తీరాన్ని ఆనుకుని ఉన్న మహాసముద్ర భూభాగాన్ని ఖండ తీరపు అంచు అంటారు. నిజానికి ఇది కాలక్రమంలో సముద్రంలో కుంగిపోయిన భూభాగం.

* ఇది సముద్ర ఉపరితలంలో 7.6 శాతాన్ని ఆక్రమించి ఉంటుంది. ఇక్క‌డ‌ సముద్రం లోతు 180 మీటర్లు ఉంటుంది.

* ఖండ తీరపు అంచు వెడల్పు ఒక్కో సముద్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. అట్లాంటిక్‌ మహాసముద్ర వెడల్పు అధికంగా (13.3 శాతం); పసిఫిక్‌ (5.7 శాతం), హిందూ మహాసముద్రాల్లో (4.2 శాతం) తక్కువగా ఉంది.

* ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఖండతీరపు అంచు ఎక్కువ విశాలంగా ఉంది.

* ప్రపంచంలోనే అతి వెడల్పైన ఖండ తీరపు అంచులు అట్లాంటిక్‌ మహాసముద్రంలో న్యూ ఫౌండ్‌ ల్యాండ్‌ దగ్గర ఉన్న గ్రాండ్‌ బ్యాంక్స్, బ్రిటిష్‌ దీవుల వద్ద ఉన్న డాగర్‌ బ్యాంక్స్‌. ఇవి రెండూ మత్స్య సంపదకు ప్రసిద్ధి.

* ఈ ప్రాంతంలో చేపల వంటి జలచర జీవులు, పెట్రోలియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి.

ఖండ తీరపు వాలు: 

* ఖండతీరపు అంచు నుంచి సముద్ర మైదానం వరకు నిట్రవాలుగా వ్యాపించి ఉండే ప్రదేశాన్ని ఖండ తీరపు వాలు అంటారు.

* ఖండ తీరపు వాలు సముద్రంలో 200 నుంచి 2000 మీటర్ల లోతులో విస్తరించి ఉంటుంది. వాలు పెరిగే కొద్ది లోతు పెరుగుతుంది. దీని సరాసరి వాలు 2o నుంచి 35o  వరకు ఉంటుంది.

* మొత్తం సముద్ర విస్తీర్ణంలో ఖండ తీరపు వాలు 8.5 శాతాన్ని ఆక్రమించింది.

* సముద్రాంతర్గత కెనయాన్‌లు అనే భూస్వరూపాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.

అగాధ సముద్ర మైదానం:  

* దీన్నే అగాధ మండల మైదానం (Abyssal plain) అని అంటారు. ఇది ఖండ తీరపు వాలు నుంచి కొంత ఎత్తు పల్లాలతో కూడిన విశాల మైదాన ప్రాంతం.

* సముద్ర భూతలంలోని 2000 నుంచి 6000 మీటర్ల లోతులో విస్తరించి ఉంటుంది.

* మొత్తం సముద్ర భూభాగంలో అగాధ సముద్ర మైదానం 82.7 శాతం వరకు ఆక్రమించి ఉంది.

* అగ్నిపర్వతాలకు చెందిన ఎర్రమట్టి, సముద్ర జీవరాశులకు చెందిన నిక్షేపాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి.

* పసిఫిక్‌ మహాసముద్ర భూతలంలో ఇది ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. (90.6 శాతం)

* వంకర టింకరగా ఉన్న రిడ్జ్‌లు, పీఠభూములు, సముద్రాంతర్గత అగ్నిపర్వత శిఖరాలు లాంటివి ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి.

మహాసముద్ర అగాధం:

* ఇది విరూపకారక కారణాల వల్ల ఉద్భవించిన లోతైన, ఇరుకైన ప్రాంతం.

* సముద్ర భూగర్భంలో అగ్నిపర్వతాలు, భూకంపాలు వచ్చే సమీప ప్రాంతాల్లో ఉంటుంది.

ట్రెంచ్‌/ కందకాలు/ అగాధాలు:  

* సముద్ర భూతలంలో అత్యంత లోతైన ప్రాంతంగా పేర్కొనే సముద్రపు ద్రోణిలో ఉండే చాలా లోతైన, ఇరుకైన ప్రాంతాలను అగాధాలు లేదా సముద్రాంతర్గత కందకాలు (Ocean Trenches) అంటారు. ఇవి ఆర్క్‌ రూపంగా ఉన్న ద్వీపాలకు సమాంతరంగా ఏర్పడతాయి. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద అగాధం ఫిలిప్ఫీన్స్‌ దీవుల్లోని మిండనావో ద్వీపం వద్ద ఉన్న మరియానా ట్రెంచ్‌. దీని లోతు 10,815 మీటర్లు.

* అగాధాలు మొత్తం సముద్ర భూతలంలో 1.2 శాతం మాత్రమే ఆక్రమించి ఉంటాయి. వీటి సరాసరి లోతు 5,500 మీటర్లు.

* అగాధాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం పసిఫిక్‌ మహాసముద్రం.

సముద్ర జలాంతర్గత నిమ్నోన్నతాలు: ప్రపంచంలోని మహాసముద్రాల అడుగు భాగం అనేక నిమ్నోన్నతాలతో ఉంటుంది. భూ ఉపరితలంపై మనకు కనిపించే కొన్ని ప్రధాన భూస్వరూపాలైన పర్వతాలు, పీఠభూములు, తీరమైదానాలు, నదీ లోయలు లాంటివి సముద్ర భూతలంలో కూడా ఉన్నట్లు శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో వెల్లడైంది.

సముద్ర భూతల నిమ్నోన్నతాల్లో ముఖ్యమైనవి: 1) రిడ్జ్‌లు  2) ట్రెంచేస్‌  3) సీమౌంట్స్‌ 4) గయోట్స్‌

రిడ్జ్‌లు: సముద్ర భూతలంపై ఉండే ఎత్తయిన, పొడవైన, లోతు తక్కువైన పర్వత నిర్మాణాలను రిడ్జ్‌లు అంటారు. ఇవి ఎక్కువగా అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఉన్నాయి. 

సీమౌంట్స్, గయోట్స్‌:  సముద్రం లోపల 1000 మీటర్ల ఎత్తుకు పైగా ఉండే పర్వతాలను సీ మౌంట్‌ అని అంటారు. వీటి శిఖర ప్రాంతం చదునుగా ఉంటే గయోట్లు అంటారు. ఎ.హెచ్‌.గయోట్‌ అనే స్విస్‌ శాస్త్రవేత్త మరియానా ట్రెంచ్‌ వద్ద వీటిని మొదటిసారిగా కనుక్కున్నారు. అతడి పేరు మీదుగా సముద్ర భూతలంపై ఉన్న ఎత్తయిన బల్లపరుపు కొండలను గయోట్లు అని పిలుస్తారు.

మాదిరి ప్రశ్నలు

1. ఇప్పటివరకు ప్రపంచంలో గుర్తించిన అగాధాల సంఖ్య?

1) 5006   2) 1009   3) 49     4) 57

2. అగాధాలకు ప్రసిద్ధి చెందిన మహాసముద్రం?

1) హిందూ  2) అట్లాంటిక్‌   3) పసిఫిక్‌   4) ఆర్కిటిక్‌ 

3. పసిఫిక్‌ మహాసముద్రానికి ఆ పేరు పెట్టినవారు? 

1) బార్తోలో మ్యూ డియాజ్‌     2) మగెల్లా   3) వాస్కోడిగామా    4) కొలంబస్‌ 

4. సముద్ర విజ్ఞాన పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?

1) ముంబయి   2) దిల్లీ   3) కోల్‌కతా    4) గోవా

5. డాగర్‌ మత్స్య బ్యాంకు ఎక్కడ ఉంది?

1) అమెరికా   2) ఇంగ్లాండ్‌   3) ఆస్ట్రేలియా   4) కెనడా 

6. సముద్రంలో సోడియం క్లోరైడ్‌తో పాటు ఇంకా ఏ పదార్థం వ్యాపార సరళిలో దొరుకుతుంది? 

1) రేడియం   2) అయోడిన్‌   3) థోరియం   4) మాంగనీస్‌

7. ఖండతీరపు అంచు ఏ మహాసముద్రంలో అధికంగా ఉంటుంది?

1) అట్లాంటిక్‌   2) హిందూ   3) పసిఫిక్‌    4) ఆర్కిటిక్‌

8. మొత్తం సముద్ర భాగంలో అధిక శాతం ఆక్రమించుకునే ‘సముద్ర భాగం’ ఏది?

1) ఖండ తీరపు అంచు    2) ఖండ తీరపు వాలు   3) అగాధ సముద్ర మైదానం   4) మహా సముద్రపు రిడ్జ్‌లు

9. రొమాంచే అగాధం, అగులాస్‌ బేసిన్‌ ఏ మహాసముద్రంలో ఉన్నాయి? 

1) హిందూ   2) పసిఫిక్‌   3) ఆర్కిటిక్‌    4) అట్లాంటిక్‌ 

10. సోకోట్ర - చాగోస్‌ రిడ్జ్‌లు ఏ మహాసముద్రంలో ఉన్నాయి? 

1) హిందూ   2) అట్లాంటిక్‌   3) పసిఫిక్‌    4) ఏదీకాదు 

11. ‘టెలిగ్రాఫ్‌ పీఠభూమి’ అని పిలిచే ఎత్తయిన భూభాగం ఉన్న మహాసముద్రం? 

1) హిందూ   2) పసిఫిక్‌    3) ఆర్కిటిక్‌    4) అట్లాంటిక్‌

12. చేపల లాంటి జలచర జీవులు, పెట్రోలియం నిల్వలు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటాయి? 

1) ఖండతీరపు అంచు  2) ఖండతీరపు వాలు   3) అగాధ సముద్ర మైదానం   4) అగాధ సముద్ర ప్రాంతం

13. 1 పాథోమ్‌ = 

1) 1 మీటరు    2) 1.8 మీటర్లు    3) 5 మీటర్లు    4) 10 మీటర్లు 

14. సముద్రాంతర్గత కాన్యాన్స్‌ అనే భూ స్వరూపాలు ఏ ప్రాంతంలో ఉంటాయి?

1) ఖండతీరపు వాలు   2) ఖండతీరపు అంచు   3) అగాధ సముద్ర మైదానం   4) అగాధ సముద్ర ప్రాంతం

15. వంకర టింకరగా ఉన్న రిడ్జ్‌లు, పీఠభూములు, సముద్రాంతర్గత అగ్నిపర్వత శిఖరాలు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి?

1) సముద్ర ద్రోణి   2) మహాసముద్ర అగాధం    3) అగాధ సముద్ర మైదానం  4) పైవ‌న్నీ

సమాధానాలు

1-4; 2-3; 3-2; 4-1; 5-2; 6-2; 7-1; 8-3; 9-2; 10-1; 11-4; 12-1; 13-2; 14-1; 15-3. 

రచయిత: జయకర్‌ సక్కరి


 

Posted Date : 15-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌