• facebook
  • whatsapp
  • telegram

ఈ-గ‌వ‌ర్నెన్స్‌  

   ప్రపంచంలోని అనేక దేశాలు అభిలషణీయ, సమర్థవంతమైన పరిపాలనను జరిపేందుకు ‘ఈ-గవర్నెన్స్‌’ను  అనుసరిస్తున్నాయి. పరిపాలనలో శాస్త్రసాంకేతిక విజ్ఞానాన్ని, శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా మెరుగైన సేవలను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

నిర్వచనం

ఈ - గవర్నెన్స్‌లో ‘ఈ’ అనే అక్షరాన్ని నాలుగు ప్రత్యేక అంశాల్లో పేర్కొనవచ్చు.

1 - ఈ - ఎఫీషియన్సీ (సామర్థ్యం)

2 - ఈ - ఎఫెక్టివ్‌నెస్‌ (ప్రభావశీలత)

3 - ఈ - ఎంపవర్‌మెంట్‌ (సాధికారత)

4 - ఈ - ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ (సామాజిక ఆర్థికాభివృద్ధి)

* పాలనా నిర్వహణలో పౌరుల సాధికారతను పెంపొందించి, అనేక రకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి, పాలనలో పారదర్శకతను మెరుగుపరచడానికి, ప్రభుత్వ సామర్థ్యాన్ని పటిష్టపరచడానికి ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘ఎలక్ట్రానిక్‌ పాలన’ (ఈ-గవర్నెన్స్‌) అంటారు.
* 2001లో ప్రపంచ బ్యాంకు ‘ఈ-గవర్నెన్స్‌’ అనే భావనకు విస్తృత అర్థాన్ని ఇచ్చింది.

యూఎన్‌డీపీ ప్రకారం..

* 2005లో ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగమైన యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌డీపీ) ఇచ్చిన వివరణ ప్రకారం సమాచార, సేవల నిర్వహణ, నిర్ణయీకరణ ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వాన్ని మరింత బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, ప్రభావశీలంగా నిర్వహించడం లాంటి ప్రక్రియలనే ‘ఈ-గవర్నెన్స్‌’ (ఎలక్ట్రానిక్‌ పాలన)గా పేర్కొంది.

భారత సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ వివరణలో.. 

* ఈ-గవర్నెన్స్‌ అంటే ప్రభుత్వ పాలనా ప్రక్రియ కార్యకలాపాల్లో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి  సరళమైన (సింపుల్‌), నైతికమైన (మోరల్‌), జవాబుదారీతనంతో (అకౌంటబిలిటీ), బాధ్యతాయుతంగా ప్రతిస్పందించి (రెస్పాన్సిబుల్‌), పారదర్శకమైన (ట్రాన్స్‌పరెంట్‌) పాలనను అందించడం.
దీన్నే స్మార్ట్‌ అని పిలుస్తున్నారు.
* భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టాన్ని, 2003లో జాతీయ ఎలక్ట్రానిక్‌ పాలనా విధానాన్ని రూపొందించింది.

ఆశయాలు

* పరిపాలనను సమర్థవంతంగా, సులభతరంగా నిర్వహించడం.
* మెరుగైన శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించి సామాజిక, ఆర్థిక మార్పును సాధించడం.
* ప్రజలకు అందించే సేవలను కచ్చితత్వంతో, వేగంగా, సమర్థవంతంగా అందించడం.
* విద్య, వైద్య రంగాల్లో మెరుగైన జీవన నైపుణ్యాలను పెంచడం. 

* కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల పాలనలో పారదర్శకతను పెంపొందించడం.
* శాస్త్రీయ విధానాల అమలు ద్వారా గరిష్ట ఫలితాలను సాధించడం.

సాధనాలు

-   కొన్ని సాధనాల ద్వారా పాలనాప్రక్రియలను సాధారణీకరించడంతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ‘ఈ - గవర్నెన్స్‌’ కృషిచేస్తోంది. 
-   ఈ - మెయిల్‌ 
-  ఇంటర్నెట్‌
-  ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ 
-  షార్ట్‌ మెసేజింగ్‌ సర్వీస్‌
-  వెబ్‌సైట్ల ప్రచురణ 

-  వైర్‌లెస్‌ అప్లికేషన్‌ ప్రోటోకాల్‌
-  ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ

ప్రభుత్వ పాలనలో ఐసీటీ

* ప్రభుత్వ పాలనలో ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీని (ఐసీటీ) పలు సందర్భాల్లో వినియోగిస్తున్నారు.
1.  ప్రభుత్వం - పౌరులు: దీని ద్వారా ఉన్నత, నాణ్యమైన ప్రభుత్వ సేవలను, సమాచారాన్ని పౌరులు పొందేందుకు ప్రభుత్వం ఏకీకృత కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది.

2. ప్రభుత్వం - ప్రభుత్వం:  ప్రభుత్వ అంతర్గత నిర్వహణకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రోజువారీ కార్యకలాపాల నిర్వహణను సమర్థవంతంగా రూపొందిస్తుంది.
3. అంతర్‌ ప్రభుత్వ వ్యవహారాలు:  పాలనా నాణ్యతను పెంచడంతో పాటు నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించేందుకు తోడ్పడుతుంది.
4. ప్రభుత్వం - వ్యాపారం: దీని ద్వారా ప్రభుత్వ వ్యాపార, వాణిజ్య లావాదేవీల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించవచ్చు.

నేషనల్‌ ఈ - గవర్నెన్స్‌ ప్లాన్‌

* భారత ప్రభుత్వం 2006, మే 18న జాతీయ ఈ-గవర్నెన్స్‌ ప్లాన్‌ను ప్రకటించింది.
* దీని ద్వారా పాలనకు అవసరమైన అన్నిరకాల రికార్డులను డిజిటలైజ్‌చేసి, వాటిని పౌరసేవలకు వినియోగిస్తుంది.
* పాలనా సామర్థ్యాన్ని పెంపొందించి, ప్రతి సాధారణ పౌరుడికి అత్యంత సమర్థవంతంగా సేవలందించడం  ‘జాతీయ ఈ - గవర్నెన్స్‌ ప్లాన్‌’ ముఖ్య ఉద్దేశం. దీని టాగ్‌లైన్‌ ‘పబ్లిక్‌ సర్వీసెస్‌ క్లోజర్‌ హోమ్‌’.

నేషనల్‌ ఈ - గవర్నెన్స్‌ ప్లాన్‌లోని మౌలిక అంశాలు
* స్టేట్‌ వైడ్‌ ఏరియా నెట్‌వర్క్‌
* సర్వీసెస్‌ డెలివరీ గేట్‌వే

* స్టేట్‌ డేటా సెంటర్‌
* కామన్‌ సర్వీస్‌ సెంటర్లు

కంప్యూటరైజ్డ్‌ రూరల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ప్రాజెక్టు (సీఆర్‌ఐఎస్‌పీ)

* పేదరిక నిర్మూలనా కార్యక్రమాలను కంప్యూటర్‌ ఆధారిత సమాచార వ్యవస్థ ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ (డీఆర్‌డీఏ) నిరంతరం పర్యవేక్షించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ సమాచార కార్యకలాపాల కోసం ‘రూరల్‌ సాఫ్ట్‌ 2000’ అనే ప్రాజెక్టును చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర సంస్థల ఆన్‌లైన్‌ పర్యవేక్షణతోపాటు సామాన్యప్రజలకు సమాచారాన్ని బ్రౌజర్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చే సాఫ్ట్‌వేర్‌ ఇది.

కార్యాచరణ ప్రణాళిక, 2003

* భారతప్రభుత్వం 2003లో ‘జాతీయ ఈ - గవర్నెన్స్‌ కార్యాచరణ ప్రణాళిక’ను రూపొందించింది. దీనిలో నిర్దేశించిన మౌలికాంశాలు.
1. సమూలదృష్టి, వ్యూహ ప్రణాళిక
2. ఈ - పరిపాలన సాంకేతిక పరిజ్ఞాన రూపకల్పన, మార్గదర్శకాలు
3. మానవ వనరుల వ్యూహం
4. సేవా కేంద్రాలు, కియోస్క్‌ సమీకృత సేవాకేంద్రాల విధానం

5. డిపార్ట్‌మెంట్‌ అంతర్గత ఆటోమేషన్‌

మేఘ్‌రాజ్‌

* భారతప్రభుత్వం 2014, ఫిబ్రవరి 4 నుంచి జాతీయ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవల కార్యక్రమాన్ని ‘మేఘ్‌రాజ్‌’ పేరుతో ప్రారంభించింది.
* దీని ద్వారా ‘క్లౌడ్‌ కంప్యూటింగ్‌’ను ఉపయోగించి సెకనుకు వందల ట్రిలియన్ల గణాంకాలను సమర్థవంతంగా చేయవచ్చు.

అందిస్తున్న సేవలు

* ఆదాయపన్ను రిటర్న్‌లు సమర్పించడం 
* పాస్‌పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డు, వీసా కోసం దరఖాస్తుల సమర్పణ 

* భూమి సంబంధిత పత్రాల రిజిస్ట్రేషన్‌
* రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించిన డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్‌లు
* జనన మరణ ధ్రువపత్రాలు; మున్సిపల్‌ సేవలపై పౌరుల ఫిర్యాదులు
* టెలిమెడిసిన్, టెలిఎడ్యుకేషన్‌ మొదలైన సేవలు
* న్యాయస్థానాల్లోని కేసుల వివరాలను, న్యాయస్థానం ఇచ్చే తీర్పులు 

* కంపెనీ వ్యవహారాల గురించి సమాచారం ఇచ్చే డైరెక్టరీ ఏర్పాటు
*  గ్రామీణ ప్రాంతాల్లోని చేతివృత్తుల వారి ఉత్పత్తుల వివరాలు, అమ్మకాలను ఆన్‌లైన్‌లో నిర్వహించడం.

* ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛ్సేంజీల్లో నిరుద్యోగుల వివరాల నమోదు 
* రోజువారీగా దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలను సమీక్షించడం
* సేవా పన్నులు, కేంద్ర ఎక్సైజ్‌ సుంకాల చెల్లింపుదార్ల పేర్లు నమోదు
* వివిధ రకాల పెన్షన్‌ చెల్లింపులకు సంబంధించిన వివరాల నమోదు

Posted Date : 04-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌