• facebook
  • whatsapp
  • telegram

భూ అంతర్భాగం 

* శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా ఆర్కిటిక్‌ ప్రాంతంలోని ‘కోల’ వద్ద 12 కి.మీ.ల మేరకు తవ్వకాలు జరిపారు. డీప్‌ ఓషన్‌ డ్రిల్లింగ్‌ ప్రాజెక్ట్, ఇంటిగ్రేటెడ్‌ ఓషన్‌ డ్రిల్లింగ్‌ ప్రాజెక్ట్‌ ద్వారా దీన్ని నిర్వహించారు. 


* ఖనిజ వనరుల వెలికితీతకు మానవుడు భూమి లోపలికి వెళ్లడం ప్రారంభించాడు. అయితే గనుల లోపలికి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల 12 కి.మీ. లోతుకు మించి తవ్వకాలు చేయలేకపోయారు.


* ప్రపంచంలో అక్కడక్కడా కనిపించే వేడినీటి బుగ్గల (Geysers) లోని నీరు చాలా వేడిగా ఉంటుంది. వీటిని హాట్‌స్ప్రింగ్స్‌ అని కూడా అంటారు. అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందినప్పుడు వెలువడే ‘లావా’ ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది.


* భూమి ఉపరితలం నుంచి లోపలికి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత పెరగడం, భూమి లోపల మాగ్మా అనే శిలాద్రవం అధిక ఉష్ణోగ్రతను  (6000ాది) కలిగి ఉండటం ఈ రెండు కారణాల వల్ల మానవులు భూమి లోపలికి వెళ్లి భూ పొరలను పరిశీలించలేకపోతున్నారు.


 అధ్యయనం


* భూమి అంతర్భాగ అధ్యయనంలో భూమి లోపల ఉండే ఉష్ణోగ్రత, సాంద్రత, పీడనాలు ప్రముఖపాత్ర పోషిస్తాయి.


ఉష్ణోగ్రత  


* భూ ఉపరితలం నుంచి లోపలికి వెళ్లేకొద్దీ సగటున ప్రతి 32 మీ. లోతుకు 10C చొప్పున ఉష్ణోగ్రత అధికమవుతుంది. అయితే ఈ పెరుగుదల ఒక క్రమపద్ధతిలో ఉండదు. భూమిపై ఉండే వాతావరణం, సముద్రాలు, రాళ్లు, కొండలు, బండలు మొదలైన వాటి బరువు దీనికి కారణాలు.


* భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత 130 Cఉంటే, భూకేంద్రం వద్ద ఉష్ణోగ్రత 60000C గా ఉంటుంది.

* భూమి ఉపరితలం నుంచి 100 కి.మీ. లోతు వరకు ఉన్న భాగంలో కిలోమీటర్‌కు 120C చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది.


* భూమి లోపల 100 కి.మీ. నుంచి 300 కి.మీ. వరకు ఉన్న భాగంలో కిలోమీటర్‌కు 20C చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతుంది.


* భూమి లోపల 300 కి.మీ. నుంచి 6400 కి.మీ. వరకు ఉన్న భాగంలో కిలోమీటర్‌కు 10C చొప్పున ఉష్ణోగ్రత అధికమవుతుంది. భూకేంద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దాదాపు 20000C - 60000C ఉంటుందని శాస్త్రవేత్తల అభిప్రాయం.


సాంద్రత 


* ప్రమాణ ఘనపరిమాణంలో ఉన్న ద్రవ్యరాశిని సాంద్రత అంటారు. న్యూజిలాండ్‌కి చెందిన జియోఫిజిసిస్ట్‌ ‘కీత్‌ ఎడ్వర్డ్‌ బుల్లెన్‌’ భూ అంతర్భాగంలోని సాంద్రతపై పరిశోధనలు చేశారు. వీటిని ప్రపంచ భూగోళ శాస్త్రవేత్తలంతా అంగీకరించారు.


* భూ ఉపరితలం నుంచి లోపలికి వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతతో పాటు సాంద్రత కూడా పెరుగుతుంది. అయితే ఇది ఏకరీతిగా ఒక క్రమపద్ధతిలో పెరగదు.


* భూమి ఉపరితలం నుంచి 500 కి.మీ. లోతు వరకు 3.5గా సాంద్రత ఉంటే 1000 కి.మీ. లోతులో ఇది 5.5 వరకు ఉంటుంది.


* 1000 - 2900 కి.మీ. వరకు సాంద్రత ఒక క్రమపద్ధతిలో పెరుగుతుంది. 2900 కి.మీ. దాటాక ఎక్కువగా పెరగడం ప్రారంభించి, దాదాపు 10.2 వరకు చేరుతుంది.


* భూమి కేంద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఇనుము, నికెల్‌ ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి సాంద్రతలు చాలా ఎక్కువ. కాబట్టి భూ కేంద్రం వద్ద సాంద్రత 17 వరకూ ఉండొచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం.


* శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం భూ అంతర్భాగంలో సాంద్రతలు కింది విధంగా ఉన్నాయి.


1. భూపటలం వద్ద  2.5 - 2.9 వరకు 


2. భూ ప్రావారం వద్ద 2.9 - 4.7 వరకు


3. బాహ్య కేంద్రం వద్ద 11 - 12 వరకు


4. భూ కేంద్రంలో సాంద్రత 17 


5. భూగోళం సగటు సాంద్రత 5.5 g/ cm3 


* సాంద్రతను క్యూబిక్‌ సెంటీమీటర్‌కి గ్రాముల్లో కొలుస్తారు. దీన్ని g/ cm3   తో సూచిస్తారు.

పీడనం


* భూమిపైకి ప్రవహించే లావా, గీజర్లు మొదలైన వాటి ఆధారంగా భూమి లోపల ఉండే ఉష్ణోగ్రతను అంచనా వేశారు. ఉష్ణోగ్రత ఆధారంగా సాంద్రతను అంచనా వేస్తారు. సాంద్రత ఆధారంగా భూమి లోపల ఉండే పీడనాన్ని కొలుస్తారు. భూ ఉపరితలంపై వాతావరణ బరువు, సముద్రాల బరువు, కొండలు, రాళ్లు, మట్టి, ఇసుక మొదలైన వాటి బరువు కారణంగా భూ అంతర్భాగంలో భారం పెరుగుతుంది. ఈ భారం ఒత్తిడిని కలిగిస్తుంది. దీన్నే పీడనం అంటారు.


* భూ ఉపరితలంపై నుంచి లోపలికి వెళ్లే కొద్దీ ఈ బరువు (భారం) పెరగడంతో పీడనం కూడా అధికమవుతుంది. పీడనంతో పాటు సాంద్రత కూడా పెరుగుతుంది.


* అధిక పీడనం అనేది ఎక్కువ సాంద్రతకు కారణమవుతుంది.


* భూమి లోపల ఉండే పీడనాన్ని ‘వాతావరణ యూనిట్లు’ అనే ప్రత్యేక యూనిట్లతో కొలుస్తారు.


* ఒక వాతావరణ యూనిట్‌ 14.7 ibs/ చ.సెం.మీ.లకు సమానం.


* భూమి లోపల దాదాపు 2400 కి.మీ. ప్రాంతంలో ఒక మిలియన్‌ వాతావరణ యూనిట్ల పీడనం ఉంటే, 6400 కి.మీ ప్రాంతంలో ఉన్న భూకేంద్ర పరిసరాల్లో 31/2 మిలియన్ల వాతావరణ యూనిట్ల పీడనం ఉండొచ్చని పరిశోధకుల అభిప్రాయం.

DEPTHS - Deep Phreatic Thermal Explore


* నాసా, మరికొందరు శాస్త్రవేత్తలు కలిసి తయారు చేశారు.


* ఇది ఒక రోబోట్‌.  

* 8 అడుగుల వ్యాసంతో  మీటర్ల ఎత్తు ఉంటుంది. దీన్ని పాతాళ వీరుడిగా పేర్కొంటారు.


* మనుషుల ఆదేశాలతో సంబంధం లేకుండా తానుగా భూమి లోపలికి వెళ్లి అక్కడి పొరలను, పరిసర ప్రాంతాలను ఇది ఫొటోలు తీస్తుంది.


* భూగోళం మండుతున్న సూర్యగోళం నుంచి ఆవిర్భవించింది. సూర్యుడి బాహ్యపొరపై ఉష్ణోగ్రత, భూమి కేంద్రం వద్ద ఉష్ణోగ్రత సమానం (60000C).


* సూర్యుడి నుంచి వేరైన తర్వాత భూమి ఉపరితలం నెమ్మదిగా చల్లారి, ఘనీభవించి, పెంకులా గట్టిపడి మానవ నివాసానికి అనుకూలంగా మారింది. భూమి లోపల భాగం మాత్రం ఇంకా చల్లారలేదు. అక్కడి వేడికి శిలలు సైతం కరిగి, ద్రవంగా మారతాయి. దీన్నే ‘మాగ్మా’ అంటారు.


భూ అంతర్భాగం - విభజన


* ప్రొఫెసర్‌ ఎడ్వర్డ్‌ సూస్‌ రచించిన The Face of the Earth: (Das Antlitz Der Erde) గ్రంథంలో భూ అంతర్భాగాన్ని మూడు జోన్లుగా విభజించారు. అవి:


1. భూపటలం (Crust)     

2. భూప్రావారం (Mantle)


3. భూకేంద్ర మండలం (Core)

భూపటలం 


* మనం నివసిస్తున్న భూమి బయటి పొరను భూపటలం అంటారు. ఈ పొర భూ ఉపరితలం నుంచి 30 - 100 కి.మీ. వరకు విస్తరించి ఉంటుంది.


భూపటలంలో అత్యధికంగా ఉండే మూలకం ఆక్సిజన్‌.


* భూపటలంలో ఉండే మూలకాలు - ఆక్సిజన్‌ (49%), సిలికాన్‌ (26.03%), అల్యూమినియం (7.28%), ఐరన్‌ (4.12%)


* భూపటలం మందం పర్వతాల్లో ఎక్కువగా, సముద్ర ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది.


* భూపటలంలో అత్యధికంగా ఉండే లోహ మూలకం అల్యూమినియం.


* భూపటలం ఉపరితల పొర నుంచి సమస్త జీవులకు కావాల్సిన పోషక పదార్థాలు లభిస్తాయి. దీని సాంద్రత 2.27 గ్రా./ఘ.సెం.మీ.


భూప్రావారం 


* ఈ పొర భూమి లోపల 100 కి.మీ. - 2900 కి.మీ. వరకు ఉంటుంది. దీని పైభాగం మెత్తగా, పైపొర తేలుతూ ఉంటుంది.


* దీని సాంద్రత 3.2 గ్రా./ ఘ.సెం.మీ. భూప్రావారం కొల్లాయిడ్‌ రూపంలో ఉంటుంది. (ద్రవ, ఘన రూపంలో ఉండని స్థితి).


* ఈ పొరలో సిలికా (Si),మెగ్నీషియం(Mg)అనే మూలకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీని రసాయన సాంకేతిక నామం ‘సిమా’ (Sima)


* భూకంపాలు భూప్రావారం వరకు మాత్రమే పరిమితమై ఉంటాయి.


భూకేంద్ర మండలం 


* ఇది 2900 కి.మీ. - 6376 కి.మీ. వరకు ఉంటుంది.


ఈ పొరలో ప్రధానంగా నికెల్‌(Ni) , ఫెర్రస్‌ (ఇనుము)(Fe) లాంటి భారఘన పదార్థాలు ఉంటాయి. రసాయన సాంకేతిక నామం ‘నిఫే'(Nife)


* భూకేంద్ర మండలాన్ని రెండు ఉప పొరలుగా విభజించారు. అవి: 


ఎ) బయటి కేంద్ర భాగం 

బి) లోపలి కేంద్ర భాగం.


బయటి కేంద్ర భాగం 2900 కి.మీ. - 5100 


కి.మీ. వరకు ఉంటుంది. ఈ పొరలో ఇనుము, నికెల్‌ లాంటి లోహాలు ద్రవరూపంలో ఉంటాయి.


* లోపలి కేంద్రభాగం 5100 కి.మీ. - 6376 కి.మీ. వరకు ఘనరూపంలో విస్తరించి ఉంటుంది. ఈ పొరలో ఇనుము, లోహ మిశ్రమాలు, బంగారం లాంటి భార పదార్థాలు ఉంటాయి.


* భూమి ఘనపరిమాణంలో భూ పటలం 1%, భూప్రావారం 16%, భూకేంద్ర మండలం 83% ఉంటాయి.


* భూకేంద్ర మండలం సాంద్రత 12 గ్రా./ఘ.సెం.మీ.


భూమి నాభి దాదాపు 6378 కి.మీ. దిగువ లోతులో ఉంటుంది. సముద్రంలో అత్యంత లోతైన ప్రదేశం ఛాలెంజర్‌ అఖాతం లేదా మెరియానా అఖాతం. దీని లోతు 11034 మీ. (11 కి.మీ.) ఇది పసిఫిక్‌ మహా సముద్రంలో ఉంది. మొదటిసారి మానవుడు 1960లో ఇక్కడికి  వెళ్లాడు. భూమిపై ఎత్తయిన ప్రదేశం ఎవరెస్ట్‌ శిఖరం. దీని ఎత్తు 8848 మీ. (9 కి.మీ.) దీన్ని కూడా మనిషి అధిరోహించాడు. మానవుడు చంద్రుడిపైకి వెళ్లి వచ్చాడు కానీ భూమి లోపలికి 12 కి.మీ. లోతు దాటి వెళ్లలేకపోయాడు.


 

Posted Date : 08-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌