• facebook
  • whatsapp
  • telegram

 తూర్పు చాళుక్యులు

సామంతులే.. సార్వభౌములై!


 కుట్రలు, కుతంత్రాలు, దాడులు, దండయాత్రలు, విజయాలు, వీరస్వర్గాలతో సుమారు అయిదు వందల సంవత్సరాలపాటు ఆంధ్ర ప్రాంతంలో అత్యంత ఆసక్తికరమైన తూర్పు చాళుక్యుల రాచరిక పాలన సాగింది. వీరు సామంతులుగా మొదలై సార్వభౌములుగా అవతరించారు. దాయాదుల పోరుతో సతమతమైనప్పటికీ సామ్రాజ్యాన్ని విస్తరించి, సమర్థ పరిపాలన అందించారు. ఆంధ్రమహాభారతం వంటి రచనలు చేయించి చిరస్థాయి కీర్తిని గడించారు. చాళుక్య, చోళ రాజ్యాలను ఏకం చేసి దక్షిణ భారతదేశ చరిత్రలో విశిష్ట స్థానాన్ని సొంతం చేసుకున్నారు. వారి రాజకీయ వంశ క్రమాన్ని, పాలనాకాలాలను, బిరుదులు, శాసనాలు సహా ఇతర విశేషాలను పోటీ పరీక్షల అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. 


 బాదామి చాళుక్యుల నుంచి తూర్పు చాళుక్య వంశం ఆవిర్భవించింది.మూలపురుషుడు కుబ్జ విష్ణువర్ధనుడు. మొత్తం 30 మంది రాజులు దాదాపుగా 500 సంవత్సరాలు పరిపాలించారు. రాజధాని పశ్చిమ గోదావరి జిల్లాలోని ‘పెదవేగి’ కావడంతో వీరిని వేంగి చాళుక్యులని కూడా అంటారు. ఉత్తరాన మహేంద్రగిరి, దక్షిణాన శ్రీకాళహస్తి, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన శ్రీశైలం మధ్య ప్రాంతాలను పరిపాలించారు. విలియం ప్లేట్‌ అనే చరిత్రకారుడు పరిశోధనలు చేసి తూర్పు చాళుక్యుల కాలాన్ని నిర్ణయించాడు. వీరి రాజచిహ్నం ‘వరాహం’.


శాసనాలు: చీపురుపల్లి శాసనం - కుబ్జ విష్ణువర్ధనుడు, సతారా శాసనం - రెండో పులకేశి, నాగార్జునకొండ శాసనం - చెలికె రెమ్మనకుడు వేయించారు.


కుబ్జ విష్ణువర్ధనుడు (క్రీ.శ.624-642): మొదట్లో రెండో పులకేశికి ప్రతినిధిగా రాజ్యపాలన చేశాడు. తర్వాత స్వతంత్రుడయ్యాడు. బిరుదులు విషమ సిద్ధి, మకరధ్వజుడు, పరమ భాగవతుడు. ఈ కాలంలో వేసిన తిమ్మాపురం శాసనం ఇతడిని మహారాజుగా పేర్కొంటోంది, విష్ణుభక్తుడని, దుర్గాదేవిని, కార్తికేయుడిని పూజించాడని చెబుతోంది. భార్య అయ్యణ మహాదేవి. ఈమె జైన సన్యాసుల కోసం విజయవాడలో ‘నడుంబి వసతి’ అనే ఆలయాన్ని నిర్మించింది. నిర్వహణకు ముషినికొండ గ్రామాన్ని దానం చేసింది. విష్ణువర్ధనుడు పిఠాపురంలో కుంతీ మాధవ ఆలయాన్ని నిర్మించాడు. పరిపాలన చివరి కాలంలో చైనా యాత్రికుడైన హుయాన్‌త్సాంగ్‌ ఇతడి రాజ్యాన్ని సందర్శించాడు.


మొదటి జయసింహ వల్లభుడు (క్రీ.శ.642-673): కుబ్జ విష్ణువర్ధనుడి పెద్ద కుమారుడు. సర్వలోకాశ్రయ, సర్వసిద్ధి అనే బిరుదులున్నాయి. ఇతడు వేయించిన విప్పర్ల శాసనం (గుంటూరు జిల్లా) పూర్తి తొలి తెలుగు శాసనం. రాజధానిని పిఠాపురం నుంచి వేంగికి మార్చాడు. ఘటికాస్థానాలు అనే సంస్కృత విద్యాలయాలను నెలకొల్పాడు.


ఇంద్రభట్టారకుడు (క్రీ.శ.673): జయసింహ వల్లభుడి సోదరుడు. కేవలం ఏడు రోజులు మాత్రమే రాజ్యపాలన చేశాడు. కొండనాగురు శాసనాన్ని వేయించాడు. త్యాగధేను, మకరధ్వజ అనే బిరుదులు పొందాడు.


రెండో విష్ణువర్ధనుడు (క్రీ.శ.673-681): ఇంద్రభట్టారకుడి కుమారుడు. ఇతడికి సర్వలోకాశ్రయ, సమస్త భువనాశ్రయ, విజయసిద్ధి అనే బిరుదులున్నాయి. కొల్లేరు చెరువుకు ఆనకట్ట నిర్మించాడు. రేయూరు శాసనం వేయించాడు.


మంగి యువరాజు (క్రీ.శ.681-705): రెండో విష్ణువర్ధనుడి కుమారుడు. బిరుదులు సకల లోకాశ్రయ, సమస్త భువనాశ్రయ, విజయసిద్ధి. రాజ్యాన్ని విశాఖపట్నం నుంచి ఒంగోలు వరకూ విస్తరించాడు. కుమారులు కొక్కిలి విక్రమాదిత్యుడు, రెండో జయసింహ వల్లభుడు, మూడో విష్ణువర్ధనుడు, కుమార్తె పృథ్వీపారి.


రెండో జయసింహవల్లభుడు (క్రీ.శ.705-718): మంగి యువరాజు తర్వాత రాజ్యానికి వచ్చాడు. ఇతడి బిరుదులు సకల లోకాశ్రయ, సర్వసిద్ధి.


కొక్కిలి విక్రమాదిత్యుడు (క్రీ.శ.718): రెండో జయసింహ వల్లభుడి సోదరుడు. ఆరు నెలలు రాజ్యపాలన చేశాడు. ఇతడిని సోదరుడైన మూడో విష్ణువర్ధనుడు ఓడించి తరిమేశాడు. పారిపోయిన కొక్కిలి మధ్య కళింగలో స్థిరపడి ‘యలమంచిలి’ రాజధానిగా చిన్న రాజ్యాన్ని స్థాపించాడు.


మూడో విష్ణువర్ధనుడు (క్రీ.శ.718-753): బిరుదులు సమస్త భువనాశ్రయ, త్రిభువనశంకు, పరమ భట్టారకుడు. ఇతడి కాలంలో పల్లవులతో ఘర్షణ మొదలైంది. సమకాలీన పల్లవరాజు రెండో నందివర్మ. పల్లవుల దండనాథుడైన ఉదయచంద్రుడు చాళుక్య రాజ్యంలోని బోయకొట్టాల (నెల్లూరు)పై దండెత్తి, ఆక్రమించాడు.


మొదటి విజయాదిత్యుడు (క్రీ.శ.753-770): పరాక్రమవంతుడు, త్రిభువనాంకుశ, మహారాజాధిరాజ, పరమేశ్వర, పరమభట్టారక అనే బిరుదులున్నాయి. ఇతడి కాలంలో బాదామి చాళుక్య రాజ్యాన్ని రాష్ట్రకూటులు ఆక్రమించారు. రెండో కీర్తివర్మను తొలగించి దంతిదుర్గుడు రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని స్థాపించాడు.


నాలుగో విష్ణువర్ధనుడు (క్రీ.శ.771-806): మొదటి విజయాదిత్యుడి కుమారుడు. రాష్ట్రకూట రాజ్యంలో జరిగిన అంతర్యుద్ధంలో తలదూర్చాడు. చివరికి మొదటి కృష్ణుడి కుమారుడైన ధ్రువుడికి తన కుమార్తె శీలమహాదేవిని ఇచ్చి వివాహం చేశాడు. వేంగి రాజ్యం రాష్ట్రకూటులకు సామంత రాజ్యమైంది.


రెండో విజయాదిత్యుడు (క్రీ.శ.806-846): నాలుగో విష్ణువర్ధనుడి పెద్ద కుమారుడు. బిరుదులు చాళుక్యరామ, విక్రమధవళ, నరేంద్ర మృగరాజు. ఇతడి సోదరుడు భీమసలకుడు రాష్ట్రకూటుల సాయంతో తానే రాజుగా ప్రకటించుకున్నాడు. సోదరుల మధ్య పన్నెండేళ్లు అంతర్యుద్ధం జరిగింది. ఈ పన్నెండేళ్లలో 108 యుద్ధాల్లో శత్రుసంహారం చేసి చివరకు విజయాదిత్యుడు విజయం సాధించాడు. రాష్ట్రకూట అమోఘవర్షుడు తన సోదరిని, విజయాదిత్యుడి కుమారుడు కలివిష్ణువర్ధనుడికి ఇచ్చి వివాహం చేశాడు. విజయాదిత్యుడు మహేశ్వరుడి భక్తుడు. 108 యుద్ధాల్లో తను చేసిన జీవహింసకు పాపపరిహారంగా 108 శివాలయాలను నిర్మించాడు. వీటిని నరేంద్రేశ్వర ఆలయాలు అంటారు.


కలి విష్ణువర్ధనుడు/అయిదో విష్ణువర్ధనుడు (క్రీ.శ.846-848): రెండో విజయాదిత్యుడి తర్వాత రాజు అయ్యాడు. స్వల్పకాలం పరిపాలన చేశాడు.


గుణగ విజయాదిత్యుడు/మూడో విజయాదిత్యుడు (క్రీ.శ.848-892): బిరుదులు గుణగ, పరచక్రరామ, త్రిపుర మర్త్య, మహేశ్వర, వల్లభి. ఇతడి పరిపాలన కాలంలో తూర్పు చాళుక్యుల అధికారం అత్యున్నత స్థితికి చేరింది. రాజైన మొదటి సంవత్సరంలోనే తన సేనాధిపతి పాండురంగడిని దక్షిణ దిగ్విజయ యాత్రలకు పంపాడు. గతంలో పల్లవులు ఆక్రమించిన నెల్లూరు మండలంలోని 12 కొట్టాలు, బోయ రాష్ట్రాన్ని తిరిగి పొందాడు. ఆ ప్రాంతాలకు కందుకూరుని కేంద్రంగా చేశాడు. నెల్లూరు ప్రాంతాన్ని తగలబెట్టాడు. పులికాట్‌ వరకు రాజ్యాన్ని విస్తరించాడు. పులికాట్‌ వద్ద పాండురంగ మహేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. విజయాదిత్యుడు రాష్ట్రకూటులతో ఘర్షణకు దిగి మొదటి అమోఘవర్షుడి చేతిలో ఓడిపోయాడు. ఫలితంగా అతడి సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు. అమోఘవర్షుడి మరణం తర్వాత రాజైన రెండో కృష్ణుడిపై మూడో విజయాదిత్యుడు యుద్ధం ప్రకటించాడు. ఈ యుద్ధ విజయం గురించి సాతులూరు శాసనంలో ఉంది. విజయాదిత్యుడి దండయాత్రలో ప్రసిద్ధమైంది ‘దాహళదేశ దండయాత్ర’. నర్మదా-గంగా నదుల మధ్య ఉన్న ప్రదేశానికి దాహళ దేశం అని పేరు. ఈ దండయాత్రను సేనాధిపతి పాండురంగడు నడిపించాడు. గాంగులను, వేములవాడ చాళుక్యులను జయించాడు. బస్తరులోని చక్రకూట దుర్గాన్ని ఆక్రమించాడు. వేముల చాళుక్య రాజు, రాష్ట్రకూట సామంతుడు, దక్షిణ కోసల దేశపాలకుడైన సోలదగండ బద్దెగుడిని ఓడించాడు. చివరకు దాహళదేశ రాజధాని కిరణపురాన్ని ముట్టడించాడు. వరాటదేశంలో ప్రవేశించి అచలపురాన్ని తగలబెట్టాడు. ఈ విజయాల తర్వాత రాష్ట్రకూట చక్రవర్తుల బిరుదులైన పృథ్వీ వల్లభ, దక్షిణాపతి బిరుదులను స్వీకరించాడు. సూర్యచంద్ర గంగా యమున పాళిధ్వజాది సామ్రాజ్య చిహ్నాలను స్వీకరించి దక్షిణాధిపతిగా ప్రకటించుకున్నాడు.  విజయాదిత్యుడి సార్వభౌమత్వాన్ని అంగీకరించి అతడి రాజ్యాన్ని రెండో కృష్ణుడు తిరిగి ఇచ్చేశాడు.  గుణగ విజయాదిత్యుడి విజయాలు పాండురంగడి అద్దంకి శాసనంలో ఉన్నాయి. ఇది తెలుగులో తొలి పద్య శాసనం.


మొదటి చాళుక్య భీముడు (క్రీ.శ.892-922): ఇతడిని ఆరో విష్ణువర్ధనుడు అని కూడా అంటారు. గుణగ విజయాదిత్యుడికి కుమారులు లేరు. దాంతో పెద్ద సోదరుడి కుమారుడు చాళుక్య భీముడు సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడి కాలంలో రాష్ట్రకూట రాజు రెండో కృష్ణుడు రెండు సార్లు దండెత్తి వచ్చాడు. ఆ రెండు దండయాత్రలు మొదటి చాళుక్య భీముడి కుమారుడైన ‘ఇరిమర్త గండని’ శౌర్యం వల్ల విఫలమయ్యాయి. కానీ ఇరిమర్త గండ యుద్ధభూమిలో మరణించాడు. కుమారుడి జ్ఞాపకార్థం తూర్పుగోదావరి జిల్లాలో చాళుక్య భీమవరం పట్టణాన్ని నిర్మించారు. అక్కడ ‘కుమారారామం’ అనే పేరుతో శివాలయాన్ని నిర్మించాడు. దీన్ని నేడు కొమరారామం అంటున్నారు.


నాలుగో విజయాదిత్యుడు (క్రీ.శ.922): బిరుదు కొల్లభిగండ. ఆరు నెలలు రాజ్యపాలన చేశాడు. కళింగ రాజు మొదటి వజ్రహస్తుడిని విరజాపురి వద్ద ఓడించాడు. ఇతడు రాష్ట్ర కూటులతో యుద్ధం చేస్తూ మరణించాడు.


మొదటి అమ్మ రాజు (క్రీ.శ.922-928): బిరుదులు విష్ణువర్ధన, రాజమహేంద్ర. చేకుర్రు తామ్ర శాసనం వేయించాడు. ఈ కాలంలో దాయాదుల మధ్య పోరు ప్రారంభమైంది. ఇతడు రాజమహేంద్రవరాన్ని నిర్మించాడని కొందరు చరిత్రకారులు చెబుతారు..


బేత విజయాదిత్య/కంఠిక విజయాదిత్య (క్రీ.శ.928): కేవలం 15 రోజులు పరిపాలించాడు.


రెండో విక్రమాదిత్యుడు (క్రీ.శ.928-929): కంఠిక విజయాదిత్యుడిని తొలగించి ఇతడు రాజు అయ్యాడు. ఏడాది పాటు పాలించాడు. ఈ కాలంలో వేంగి రాజ్యంలో త్రికళింగ  చేరింది.


భీముడు (క్రీ.శ.929-930): రెండో విక్రమాదిత్యుడిని వధించి రాజు అయ్యాడు. ఎనిమిది నెలల పాటు పరిపాలించాడు. ఇతడి కాలంలో రాజ్యం అల్లకల్లోలమైంది.


రెండో యుద్ధమల్లుడు (క్రీ.శ.930-934): భీముడిని చంపి రాజయ్యాడు. ఇతడికి సహాయం చేసింది రాష్ట్ర కూట రాజు నాలుగో గోవిందుడు. రాజధాని చేబ్రోలు. బెజవాడ పట్టణంలో కార్తికేయుడి ఆలయాన్ని నిర్మించాడు. బెజవాడ వద్ద శాసనం వేయించాడు.


రెండో చాళుక్య భీముడు (క్రీ.శ.935-945): యుద్ధమల్లుడిని పారద్రోలి రాజ్యానికి వచ్చాడు. బిరుదులు రాజమహేంద్ర, గండ మార్తాండ. ఇతడికి ఇమ్మడి చాళుక్య భీముడు అనే పేరు కూడా ఉంది. ఇద్దరు భార్యలు. ఒకరు అంకిదేవి. కళింగ వంశస్థురాలైన కుమారుడు దానార్ణవుడు. మరో భార్య లోకాంబిక తెలుగు చోళ రాజ పుత్రిక. ఈమె పుత్రుడు రెండో అమ్మరాజు విజయాదిత్యుడు.


రెండో అమ్మరాజు (క్రీ.శ.945-970): రెండో చాళుక్య భీముడి చిన్న కుమారుడు. రెండో అమ్మరాజు అభిషేక నామం విజయాదిత్యుడు. ఈయన కాలంలో దాయాదుల పోరు జరిగింది. దానార్ణవుడు రాష్ట్రకూట రాజు మూడో కృష్ణుడి సాయంతో ఇతడిని తరిమేసి రాజ్యాన్ని ఆక్రమించాడు. దాంతో కళింగœ దేశంలో అమ్మరాజు తలదాచుకున్నాడు. ఇతడు మళ్లీ వేంగిపై దాడి చేశాడు. కానీ రణరంగంలో దానార్ణవుడి చేతిలో హతమయ్యాడు. రెండో అమ్మరాజు మంచి పరిపాలకుడు. అన్ని మతాలను ఆదరించాడు. సాహిత్యాన్ని ప్రోత్సహించాడు. కవిగాయక కల్పతరువు అనే బిరుదు ఉంది. బమ్మెర పోతన ఇతడి సమకాలీకుడు.


దానార్ణవుడు (క్రీ.శ.970-973): రెండో చాళుక్య భీముడి పెద్ద కొడుకు, తన సోదరుడైన రెండో అమ్మరాజును చంపి ఇతడు రాజయ్యాడు. పెదకల్లు పరిపాలకుడు జటాచోడ భీముడు (రెండో అమ్మరాజు బావమరిది) దండెత్తి వేంగిని ఆక్రమించాడు. ఆ సమయంలో దానార్ణవుడి ఇద్దరు కుమారులు చోళ రాజ్యానికి పారిపోయారు. రాజరాజ చోళుడు వారికి ఆశ్రయం ఇచ్చాడు. తన కుమార్తె కుందవ్వని దానార్ణవుడి కుమారుల్లో ఒకడైన విమలాదిత్యుడికి ఇచ్చి వివాహం చేశాడు.


జటాచోడ భీముడు (క్రీ.శ.973-998): ఇతడు తెలుగు చోడ వంశానికి చెందినవాడు. మహేంద్రగిరి నుంచి కంచి, బంగాళాఖాతం నుంచి కర్ణాటక సరిహద్దు వరకు సువిశాల రాజ్యాన్ని స్థాపించాడు. రాజధాని పెదకల్లు. ‘చోడ[త్రినేత్ర’ బిరుదాంకితుడు. రాజరాజ చోళుడు ఇచ్చి పంపిన సైన్యంతో దానార్ణవుడి మరో కుమారుడైన మొదటి శక్తివర్మ వేంగిపై దాడి చేసి జటాచోడ భీముడిని వధించాడు.


మొదటి శక్తివర్మ (క్రీ.శ.999-1011): తూర్పు చాళుక్యుల పరిపాలనను పునరుద్ధరించాడు. కానీ వేంగి రాజ్యం స్వాతంత్య్రాన్ని కోల్పోయింది. 1006లో కల్యాణి చాళుక్య పాలకుడైన సత్యాశ్రయుడు బయ్యాలనంబిని వేంగి పైకి దండయాత్రకు పంపాడు. చోళరాజుల సహాయంతో ఈ దండయాత్రను శక్తివర్మ తిప్పికొట్టాడు. ఇతడికి చాళుక్య చంద్ర అనే బిరుదు ఉంది.


విమలాదిత్యుడు (క్రీ.శ.1011-1018): మొదటి శక్తి వర్మకు సోదరుడు. రాజమార్తాండ, ముమ్మడి భీమ అనే బిరుదులున్నాయి. ఇతడి ఇద్దరు భార్యలు కుందవ్వ (రాజరాజ చోళుడి కుమార్తె), మేళమ (జటాచోడ భీముడి కుమార్తె). కుందవ్వ కుమారుడు రాజరాజ నరేంద్రుడు, మేళమ కుమారుడు విజయాదిత్యుడు. రాజరాజ నరేంద్రుడికి పట్టాభిషేకం చేశారు. విమలాదిత్యుడు జైన మతం స్వీకరించినట్లు రామతీర్థం శాసనం తెలియజేస్తోంది. ఇతడి జైన గురువు ‘త్రికాల యోగి సిద్ధాంత దేవుడు’. ఆయన కోసం విమలాదిత్యుడు విశాఖపట్నం జిల్లాలోని రామతీర్ధంలో ‘రామకొండ గుహాలయం’ నిర్మించాడు.


రాజరాజ నరేంద్రుడు (క్రీ.శ.1019-1061): ఇతడు తన సోదరుడైన విజయాదిత్యుడి ప్రతిఘటన వల్ల నాలుగేళ్లు పట్టాభిషేకం చేసుకోలేదు. ఆ సమయంలో విజయాదిత్యుడికి కల్యాణి చాళుక్యులు సాయం చేస్తే, రాజరాజ నరేంద్రుడికి చోళులు అండగా ఉన్నారు. రాజేంద్రచోళుడు తన కుమార్తె అమ్మంగ దేవిని రాజరాజ నరేంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇతడు 42 సంవత్సరాలు సుదీర్ఘ పాలన సాగించాడు. కల్యాణి చాళుక్య రాజు ఆహావమల్ల సోమేశ్వరుడితో సంధి చేసుకున్నాడు. ఈ సోమేశ్వరుడే నారాయణ భట్టును రాజరాజ నరేంద్రుడి ఆస్థానానికి పంపాడు. ఆస్థాన కవి అయిన నన్నయకు నారాయణ భట్టు సహాధ్యాయి. అతడు ఆంధ్ర మహాభారతం రచనలో నన్నయకు సాయపడ్డాడు. భట్టుకు నందపూడి గ్రామాన్ని రాజరాజ నరేంద్రుడు అగ్రహారంగా ఇచ్చాడు.


రెండో శక్తివర్మ (క్రీ.శ.1061-1062): రాజరాజనరేంద్రుడి మరణం తర్వాత వేంగి రాజ్యంలో సింహాసనం కోసం మరోసారి దాయాదుల పోరు జరిగింది. రాజరాజ నరేంద్రుడి  సవతి సోదరుడు ఏడో విజయాదిత్యుడు రాజయ్యాడు. ఇతడికి కల్యాణి చాళుక్యులు సాయపడ్డారు. కానీ, తర్వాత కల్యాణి చాళుక్య రాజు ఆహావమల్ల సోమేశ్వరుడు తన కుమారుడైన రెండో శక్తి వర్మను వేంగి ప్రాంతానికి రాజుగా ప్రకటించాడు.


రాజేంద్రుడు (క్రీ.శ.1068-1070): రాజరాజ నరేంద్రుడి కుమారుడైన ఇతడిని ఏడో విజయాదిత్యుడు తరిమేశాడు. రాజేంద్రుడు తమిళ దేశం పారిపోయి కుళోత్తుంగ చోళ పేరుతో చోళ సామ్రాజ్యానికి వారసుడయ్యాడు. వీర రాజేంద్రుడు తన కుమార్తె మధురాంతకను ఇతడికి ఇచ్చి వివాహం చేశాడు. అనంతర కాలంలో కుళోత్తుంగుడు చోళ, చాళుక్య రాజ్యాలను కలిపి పరిపాలించాడు.తన పేరు మీదుగా కుళోత్తుంగ చోళపురాన్ని (విశాఖపట్నం) నిర్మించాడు.

రచయిత: గద్దె నరసింహారావు

Posted Date : 05-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌