• facebook
  • whatsapp
  • telegram

ఎన్నికల సంస్కరణలు

 ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఎన్నికలు సమర్థంగా పారదర్శకంగా జరగాలి. మన ఎన్నికల సంఘం దీని కోసం ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టింది. 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి 2019లో జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల వరకు నిర్వహణ ప్రక్రియ, అభ్యర్థుల ఎంపికలో అనేక మార్పులు చేసింది. 

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఈవీఎం)

ఈవీఎంను మనదేశంలో 1980లో ఎం.బి.హనీఫ్‌ రూపొందించారు. వీటిని భారత్‌ ఎలక్ట్రానిక్‌ లిమిటెడ్‌ (బెల్‌), బెంగళూరు; ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌), హైదరాబాద్‌లో తయారుచేస్తున్నారు. ఈవీఎంలోని ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌లో ఎన్నికల్లో పోటీచేసే 16 మంది అభ్యర్థుల వివరాలను మాత్రమే నమోదు చేయవచ్చు. ప్రతి ఈవీఎంలో ఇలాంటి బ్యాలెట్‌ యూనిట్లను గరిష్ఠంగా నాలుగింటిని మాత్రమే అనుసంధానం చేసే వీలుండటం వల్ల 64 మంది అభ్యర్థుల వివరాలను మాత్రమే నమోదు చేయవచ్చు. ఒక నియోజకవర్గం నుంచి 64 మంది కంటే ఎక్కువ అభ్యర్థులు పోటీ చేస్తే ఈవీఎంకు బదులు బ్యాలెట్‌ పేపరు పద్ధతిని ఉపయోగించాలి.      

ఈవీఎంలను మన దేశంలో తొలిసారిగా 1981లో కేరళలోని నార్త్‌ పారవర్‌ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో 50 పోలింగ్‌ కేంద్రాల్లో వినియోగించారు. ఒక్కో ఈవీఎంలో గరిష్ఠంగా 3840 ఓట్లను నమోదు చేయవచ్చు. వీటిని ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించుకోవడానికి వీలుగా 1951 నాటి భారత ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని 1989లో సవరించగా ఆ ఏడాది మార్చి 15 నుంచి అమల్లోకి వచ్చింది. 1998 నవంబరులో మధ్యప్రదేశ్‌ (5), రాజస్థాన్‌ (5), దిల్లీ (6) శాసనసభలకు జరిగిన 16 పోలింగ్‌ కేంద్రాల్లో ఉపయోగించారు. 1999లో గోవా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను పూర్తిస్థాయిలో వినియోగించారు.

ఓటర్‌ వెరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌

ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పారదర్శకత, ఈవీఎంలలో నిక్షిప్తమైన సాఫ్ట్‌వేర్‌పై అనేకమంది సందేహాలు వెల్లడించారు. దీంతో ఓటరు తాను అనుకున్న అభ్యర్థికి ఓటు వేశాడా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఓటువేసిన తర్వాత దాని ప్రింట్‌ను చూసుకోవడానికి వీలుగా వీవీప్యాట్‌ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా అక్రమ ఓటింగ్, ఈవీఎంల ట్యాంపరింగ్‌ను నివారించి ఓటర్ల ప్రయోజనాలను పరిరక్షించవచ్చు. వీటిని తొలిసారిగా 2013 సెప్టెంబరులో నాగాలాండ్‌లోని నోక్సస్‌ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో ఉపయోగించారు.  

ఓటర్ల ప్రాథమిక హక్కు

అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రసీ రిఫార్మ్స్‌ సంస్థ కేసులో 2002, మే 2న సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నేరచరిత్ర, వారి ఆస్తులు, అప్పులు, విద్యార్హతల సమాచారం తెలుసుకోవడం ఓటర్ల ప్రాథమిక హక్కు అని పేర్కొంది. దీని ప్రకారం ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రంతోపాటు వ్యక్తిగత వివరాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలి. 

ఎన్నికల వ్యయం

ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. లేకపోతే 1951 నాటి భారత ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం మూడేళ్లు ఎన్నికల్లో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధిస్తుంది. 

ఎన్నికల నిబంధనలు

1996 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకులను నియమిస్తుంది. 1997 నుంచి ఒక అభ్యర్థి రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీచేయరాదని నిర్దేశించింది. 1999లో చేర్చిన నిబంధన ప్రకారం ఎన్నికల విధుల్లో పాల్గొనే వ్యక్తులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా  ఓటువేసే వెసులుబాటు, 2003 నుంచి సైన్యంలో పనిచేసేవారికి ప్రాక్సీ ఓటింగ్‌ (వారి తరఫున ఇతరులు ఓటువేయడం) అవకాశాన్ని కల్పించింది. 

1962 నుంచి ఏకసభ్య నియోజకవర్గాలను ఏర్పాటుచేశారు. అంతకుముందు ద్విసభ్య నియోజకవర్గాలుండేవి. 1997 నుంచి రెండేళ్లు అంతకంటే ఎక్కువ కాలం క్రిమినల్‌ నేరంపై జైలు శిక్షకు గురైన వ్యక్తులను ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులుగా నిర్ణయించారు. అలాగే నామినేషన్లు ఉపసంహరించుకున్న తర్వాత ఎన్నికల ప్రచార సమయాన్ని 21 నుంచి 14 రోజులకు తగ్గించారు. 

నోటా

పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (PUCL) VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఎ) ప్రకారం ప్రతి వ్యక్తికి మాట్లాడే హక్కు, విమర్శించే హక్కు, విభేదించే హక్కు ఉంది. ప్రజలు భిన్నాభిప్రాయాలు, విభిన్న సిద్ధాంతాలు కలిగి ఉండవచ్చు. ఓటు వేసేటప్పుడు ఓటర్లకు తిరస్కార హక్కును కల్పించకపోవడమంటే  భావప్రకటన స్వేచ్ఛను హరించినట్లేనని, ఈవీఎంలలో నోటా (None of the above -  పై ఎవరూ కాదు) అనే అంశాన్ని చేర్చాలని జస్టిస్‌ పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 2013, సెప్టెంబరు 27న తీర్పునిచ్చింది. 

*  ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నచ్చకపోయినా, సరైన అభ్యర్థి లేరని భావించినా ఓటర్లు ఈవీఎంలోని నోటా బటన్‌ను వినియోగించుకోవచ్చు. 

*   మన దేశంలో నోటాను తొలిసారిగా 2013లో దిల్లీ, మిజోరం, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. నోటాను ప్రవేశపెట్టిన 14వ దేశం భారత్‌.

*  2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల్లో పోలైన నోటా ఓట్లు 59,97,504. 

*  2014 లోక్‌సభ ఎన్నికల్లో తెలుపు రంగు, శాసనసభ ఎన్నికల్లో గులాబీ రంగులో నోటాను ఈవీఎంలపై ముద్రించారు. 

*  నోటా ఓట్లు ఎక్కువగా పోలైనప్పటికీ వాటితో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే విజేతలుగా ప్రకటిస్తారు.

Posted Date : 04-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌