• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమిక హక్కులు - వర్గీకరణ

పీడన నిరోధపు హక్కు (నిబంధనలు 23-24) 

వ్యక్తి హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, దోపిడీకి గురికాకుండా కాపాడటమే ఈ హక్కు ఉద్దేశం.

నిబంధన 23(1)

ఈ నిబంధన ప్రకారం చట్టానికి వ్యతిరేకంగా మనుషుల క్రయ, విక్రయాలు జరపడం, వెట్టిచాకిరి, నిర్బంధంగా పని చేయించడాన్ని నిషేధించారు. దీని ప్రకారం వ్యభిచారం, దేవదాసి లేదా జోగిని పద్ధతులను నిషేధించారు (వీటిని అమలు చేయడానికి పార్లమెంటు 1956 లో అశ్లీల, అసభ్య వ్యాపార నిరోధక చట్టాన్ని రూపొందించింది. దీన్ని 2006 లో సవరించారు).

* వెట్టిచాకిరీ నిరోధక చట్టం 1976

* కనీస వేతనాల చట్టం 1948, 1976

* అనైతిక కార్యకలాపాల నిషేధ చట్టం 1978

* సమాన పనికి సమాన వేతన చట్టం 1976

* 23 (2) ప్రకారం ప్రజా ప్రయోజనం కోసం నిర్బంధంగా పౌరులు, ఉద్యోగులతో రుసుము చెల్లించి లేదా చెల్లించకుండా సేవ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఇందులో మతం, జాతి, కులం, వర్గం మొదలైన వివక్షలను చూపకూడదు. నిర్బంధ మిలిటరీ సేవ, నిర్బంధ సామాజిక సేవ బలవంతపు వెట్టిచాకిరీ కిందికి రావు.

నిబంధన 24

దీని ప్రకారం 14 సంవత్సరాల్లోపు పిల్లలతో కర్మాగారాలు, గనులు, ఇతర ప్రమాదకరమైన ఉత్పత్తులకు సంబంధించిన పనులు చేయించకూడదు.ఉదాహరణకు భవన నిర్మాణం, రైల్వేలు మొదలైనవి. అయితే, ఈ నిబంధన హానికరంకాని పనుల్లో నియమించుకోవడాన్ని నిషేధించలేదు. ఈ నిబంధన అమలుకు రాజ్యాంగం అమల్లోకి రాకముందు కొన్ని చట్టాలున్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పార్లమెంటు అనేక చట్టాలు చేసింది. అవి:

1. బాలల ఉపాధి చట్టం - 1938

2. ఫ్యాక్టరీల చట్టం - 1948

3. ప్లాంటేషన్ కార్మిక చట్టం - 1951

4. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కార్మికుల చట్టం - 1951

5. గనుల చట్టం - 1952

6. మనుషుల అక్రమ వ్యాపార నిషేధ చట్టం - 1956

7. మర్చంట్ షిప్పింగ్ చట్టం - 1958

8. ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ చట్టం - 1958

9. అప్రెంటిస్ చట్టం - 1961

10. బీడీ, సిగరెట్ కార్మికుల చట్టం - 1966

11. బాలకార్మిక (నిషేధ, నియంత్రణ) చట్టం - 1986

12. బాలకార్మిక హక్కుల చట్టం - 2005

13. 2006 లో ప్రభుత్వం 14 సంవత్సరాల్లోపు పిల్లలతో గృహ సంబంధ పనులు, వ్యాపార సంస్థల్లో (ఉదాహరణకు హోటళ్లు, దాబాలు, దుకాణాలు, టీ దుకాణాలు మొదలైనవి) పనులకు నియమించుకోవడాన్ని నిషేధించింది.

మత స్వాతంత్య్రపు హక్కు (నిబంధనలు 25-28) 

భారతదేశంలో ప్రభుత్వ వ్యవహారాల్లో మత ప్రమేయం ఉండదు. అయితే 'లౌకిక' అనే పదాన్ని రాజ్యాంగంలో (ప్రవేశిక) 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 లో చేర్చారు.

* నిబంధన 25(1) ప్రకారం ప్రజా సంక్షేమం, నైతికత, ఆరోగ్యం మొదలైన అంశాలకు లోబడి, ప్రజలు తమ అంతరాత్మను, తమకు ఇష్టమైన మత విశ్వాసాలను అనుసరించడానికి, స్వీకరించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది. అయితే, ఇతర మతాలవారిని బలవంతంగా తమ మతంలోకి చేర్చుకునే హక్కు లేదు.

* 25(2)(a) ప్రకారం మత సంబంధ కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఆర్థిక, రాజకీయ లేదా ఇతర సంక్షేమ కార్యకలాపాలకు పరిమితం చేయడం లేదా నియంత్రణ చేయడం కోసం ప్రభుత్వం చట్టాలను రూపొందించవచ్చు.

* 25(2)(b) సామాజిక సంక్షేమం, సాంఘిక సంస్కరణల్లో భాగంగా హిందూ దేవాలయాల్లోకి, హిందూ మత సంబంధ వర్గాల ప్రవేశానికి ప్రభుత్వం చట్టాలను రూపొందించవచ్చు (సిక్కులు కృపాణాలను లేదా ఖడ్గాలను ధరించడం, తీసుకువెళ్లడం సిక్కు మత సంప్రదాయంలో భాగంగానే పరిగణించాలి).

* 25(2)(b) ప్రకారం సిక్కులు, జైనులు, బౌద్ధులను కూడా హిందువులుగానే పరిగణిస్తారు.

నిబంధన 26 

ఇది మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛకు సంబంధించిన నిబంధన. ప్రజాశాంతి, నైతికత, ఆరోగ్యానికి లోబడి వ్యక్తులు కింది హక్కులను కలిగి ఉంటారు.
     (a) మత, ధార్మిక సంస్థలను స్థాపించవచ్చు.
     (b) తమ మత వ్యవహారాలను తామే నిర్వహించుకోవచ్చు.
     (c) స్థిర, చర ఆస్తులను మత సంస్థలు సమకూర్చుకోవచ్చు.
     (d) చట్ట ప్రకారం స్థిర, చరాస్తులను నిర్వహించుకునే హక్కు ఉంటుంది.

నిబంధన 27 

ఈ నిబంధన మతం పేరుతో పన్నులు వసూలు చేయడాన్ని నిషేధిస్తుంది.
* మత వ్యాప్తి లేదా పోషణ కోసం ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడాన్ని నిషేధించారు. కానీ, మత ప్రాతిపదికపై ప్రత్యేక సేవలను అందించినందుకు ప్రభుత్వం ప్రజల నుంచి చార్జీ వసూలు చేయవచ్చు. ఉదా: దేవాలయంలో ప్రత్యేక దర్శనాలు, సేవల కోసం ప్రత్యేక ఫీజు వసూలు చేయడం రాజ్యాంగానికి విరుద్ధం కాదు.

నిబంధన 28 

ఈ నిబంధన విద్యాలయాల్లో మత బోధన గురించి తెలియజేస్తుంది.
* 28 (1) ప్రకారం ప్రభుత్వ నిధులతో నిర్వహించే విద్యాసంస్థల్లో మత బోధనను నిషేధించారు.
* 28 (2) ప్రకారం ఏదైనా ధార్మిక సంస్థ లేదా ధర్మకర్తల మండలి స్థాపించి, పాలనాపరంగా ప్రభుత్వమే నిర్వహించే కొన్ని విద్యాలయాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మత బోధన చేయవచ్చు.
* 28 (3) ప్రకారం ప్రభుత్వం గుర్తించిన లేదా ప్రభుత్వ సహాయం పొందే (ఎయిడెడ్) విద్యా సంస్థల్లో మతపరమైన ప్రార్థనలు, కార్యకలాపాలు ఉన్నప్పటికీ, విద్యార్థులు వాటిలో పాల్గొనవచ్చు లేదా పాల్గొనకుండా ఉండవచ్చు. మైనర్లు అయిన విద్యార్థులు సంరక్షకుల అభీష్టం మేరకు నడుచుకునే అవకాశం ఉంది. వారిని మత ప్రార్థనల్లో, కార్యకలాపాల్లో తప్పనిసరిగా పాల్గొనమని బలవంతం చేయకూడదు.

సాంస్కృతిక, విద్యా విషయక హక్కు (నిబంధనలు 29-30)   

భాష, మతపరమైన అల్ప సంఖ్యాకులు తమ మతాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి ప్రత్యేకంగా ఈ హక్కును కల్పించినప్పటికీ, అధిక సంఖ్యాకులు కూడా ఈ హక్కులను కలిగి ఉంటారు.
* 29(1) ప్రకారం భారత ప్రజలకు (ఏ వర్గం వారైనా) తమ భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉంటుంది.
* 29(2) ప్రకారం ప్రభుత్వం నిర్వహిస్తున్న/ ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న విద్యా సంస్థల్లో మతం, జాతి, కులం, భాష కారణాల వల్ల ప్రవేశాన్ని నిరాకరించరాదు.
* 30(1) ప్రకారం మతం లేదా భాషా ప్రాతిపదికపై అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన ప్రజలు ప్రత్యేక విద్యాసంస్థలను స్థాపించి, నిర్వహించుకోవచ్చు.
* 30(1)(A) ప్రకారం మైనారిటీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను, వాటి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునప్పుడు వారికి ప్రత్యేక నష్టపరిహారాన్ని చెల్లించాలి.
* 30(2) ప్రకారం ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేసే విషయంలో విద్యాసంస్థలను అల్పసంఖ్యాక వర్గాలునిర్వహించే విద్యాసంస్థలు, అధిక సంఖ్యాక వర్గాలు నిర్వహించే విద్యాసంస్థలు అనే తేడా చూపకూడదు.

ఆస్తి హక్కు (నిబంధన 31): ఈ హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.

రాజ్యాంగ పరిరక్షణ హక్కు (నిబంధన 32) 

ప్రాథమిక హక్కులను పొందడంలో రాజ్యం లేదా సంస్థ లేదా వ్యక్తులు ఆటంకం కల్పిస్తే నిబంధన 32 ద్వారా సుప్రీం కోర్టు, నిబంధన 226 ద్వారా హైకోర్టులు రక్షణ కల్పిస్తాయి. అందుకే డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ పరిరక్షణ హక్కును రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం అని వర్ణించారు.
* 32(1) ప్రకారం వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు రక్షణ కల్పించమని సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు.
* 32(2) ప్రకారం ప్రాథమిక హక్కుల రక్షణకు సుప్రీం కోర్టు 5 రకాల రిట్లను జారీ చేయగలదు. అవి... హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, కో-వారెంటో.
* 32(3) ప్రకారం సుప్రీం కోర్టు తన అధికారాలకు భంగం కలగకుండా, ఇతర న్యాయస్థానాలకు (జిల్లా కోర్టులు, స్థానిక కోర్టులు) కూడా రిట్లను జారీచేసే అధికారాన్ని కల్పిస్తూ పార్లమెంటు చట్టం చేయవచ్చు. (రిట్ అంటే తప్పనిసరిగా పాటించాల్సిన కోర్టు ఆదేశం లేదా ఉత్తర్వు).
* 32(4) ప్రకారం రాజ్యాంగంలో సూచించిన విధంగా తప్ప, ఏ ఇతర పద్ధతుల్లోనూ ప్రాథమిక హక్కుల పరిరక్షణ హక్కును (లేదా) రాజ్యాంగ పరిరక్షణ హక్కును తొలగించరాదు. అయితే, అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో మార్షల్ లా లేదా సైనిక శాసనం అమల్లో ఉన్నప్పుడు ఈ నిబంధన అమలును తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
* పైన తెలిపిన ప్రాథమిక హక్కుల రక్షణకు ప్రజలు నేరుగా సుప్రీం కోర్టు, హైకోర్టులను ఆశ్రయించవచ్చు.

రిట్లు

హెబియస్ కార్పస్:  హెబియస్ కార్పస్ అనేది లాటిన్ భాషా పదం.ఇది అతి పురాతనమైన రిట్. హెబియస్ కార్పస్ అంటే To have the body (భౌతికంగా కనిపించడం). ఈ రిట్ ద్వారా స్వేచ్ఛా హక్కును (19 నుంచి 22 వరకు ఉన్న నిబంధనలు) కాపాడుకోవచ్చు.
* ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు ఆ నిర్బంధానికి ఉన్న కారణాలు చట్ట సమ్మతమా, కాదా అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. చట్ట సమ్మతం అయితే 24 గంటల లోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సిందిగా లేదా చట్ట సమ్మతం కాకపోతే వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆదేశిస్తారు.
* ఈ రిట్‌ను ప్రభుత్వ అధికారులకు, సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు జారీ చేయవచ్చు. కానీ, రాష్ట్రపతి, గవర్నర్లు, విదేశీయులకు జారీ చేయకూడదు.

మాండమస్: మాండమస్ అంటే ఆదేశించడం (Command). ప్రభుత్వ అధికారి లేదా సంస్థ తమ విధి నిర్వహణలో తీవ్రమైన జాప్యం లేదా పని చేయడానికి నిరాకరిస్తే లేదా నిర్వహించనప్పుడు ఆ విధిని నిర్వర్తించమని న్యాయస్థానం ఇచ్చే ఆదేశమే మాండమస్.

* మాండమస్‌ను కేవలం ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వ అధికారులపై మాత్రమే జారీ చేస్తారు. దీన్ని రాష్ట్రపతి, గవర్నర్లపై జారీ చేయకూడదు.

ప్రొహిబిషన్: ప్రొహిబిషన్ అంటే నిషేధం. దీన్ని కేవలం న్యాయస్థానాలకు మాత్రమే జారీ చేస్తారు. కింది న్యాయస్థానాలు (సుప్రీం కోర్టు, హైకోర్టులు కాకుండా) విచారణ జరుపుతున్న కేసును నిలిపివేయాల్సిందిగా సుప్రీం కోర్టు లేదా హైకోర్టులు ఈ రిట్‌ను జారీ చేస్తాయి. అలాగే విచారణ జరుపుతున్న న్యాయమూర్తికి ఆ కేసుతో సంబంధం ఉన్నప్పుడు కూడా ఈ రిట్‌ను జారీ చేస్తారు.

సెర్షియోరరీ: సెర్షియోరరీ అంటే సుపీరియర్. కింది కోర్టులు లేదా ట్రైబ్యునళ్లు తమ అధికార పరిధిని అతిక్రమించి ఒక కేసును విచారించి అంతిమ తీర్పును ఇచ్చినప్పటికీ, దాన్ని రద్దుచేసి సుప్రీం కోర్టు లేదా హైకోర్టులు తమ పరిధిలోకి తీసుకోవడానికి సెర్షియోరరీ అవకాశం కల్పిస్తుంది. దీన్ని ప్రైవేట్ సంస్థలు, శాసనసభలకు వ్యతిరేకంగా జారీ చేయకూడదు.
* ప్రొహిబిషన్, సెర్షియోరరీ రిట్లను జ్యుడీషియల్ రిట్లు అని కూడా అంటారు.

కోవారెంటో:  కో-వారెంటో అంటే 'ఏ అధికారంతో?' అని అర్థం. దీని ద్వారా కోర్టు, ఒక వ్యక్తి ఏ అధికారంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాడో పరిశీలిస్తుంది. ఈ రిట్‌ను ప్రభుత్వ పదవుల్లోకి అక్రమంగా ప్రవేశించినవారిని, తొలగించడానికి ఉద్దేశించి రూపొందించారు.

* పైన తెలియజేసిన విధంగా సుప్రీం కోర్టు, హైకోర్టులు రిట్లను జారీ చేయడం ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తాయి. అయితే అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు వీటిని జారీ చేయలేవు.
* డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ పరిహారపు హక్కును రాజ్యాంగ ఆత్మ, హృదయంగా వర్ణించారు.
* భారత రాజ్యాంగంలో న్యాయసమీక్ష అనే పదాన్ని వాడకపోయినా, అంతర్గతంగా న్యాయసమీక్షాధికారాన్ని కల్పించింది - నిబంధన 13.
* విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా తెలిపేది - నిబంధన - 21(A).
* నిబంధన 15 ప్రకారం రాజ్యాంగం 5 రకాల వివక్షలను నిషేధించింది.

ప్రాథమిక హక్కులు - రాజ్యాంగ సవరణ చట్టాలు

భారతదేశంలో వివిధ వర్గాల వారికి సంక్షేమ ఫలాలను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశికసూత్రాలను అమలు చేస్తున్నాయి. దీనికోసం ప్రభుత్వం ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించడం, వీటిని న్యాయస్థానాలు రద్దు చేయడం సర్వసాధారణమైంది. కోర్టుల తీర్పులను అధిగమించేందుకు కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌ ద్వారా రాజ్యాంగ సవరణ చట్టాలను రూపొందించింది. వాటిలో కీలకమైనవి..

1వ రాజ్యాంగ సవరణ చట్టం, 1951

కామేశ్వరిసింగ్‌  vs స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించేందుకు 1951లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1951, జూన్‌ 18 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు...
* సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఆర్టికల్‌ 15కు క్లాజు (4) ను చేర్చింది. దీనివల్ల కొన్ని ప్రత్యేక అధికారాలను ప్రభుత్వం పొందింది.
* ఆర్టికల్‌ 19ని సవరించి ఆర్టికల్‌ 19(6)కి వివరణ ఇస్తూ, రాజ్యపర వాణిజ్యం, జాతీయీకరణపై ప్రభుత్వానికి ఉన్న హక్కును ధ్రువీకరించింది.
* ఆర్టికల్‌ 31ని సవరించి, ఆర్టికల్స్  31(A), 31(B)లను కొత్తగా చేర్చి, వాటిని IXవ షెడ్యూల్‌లో పొందుపరచి, భూసంస్కరణలు, జమీందారీ విధానం రద్దుకు నిర్దిష్ట రూపాన్ని ఇచ్చారు. IXవ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలపై న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష అధికారం లేకుండా చేశారు.

4వ రాజ్యాంగ సవరణ చట్టం, 1955

* బేలాబెనర్జీ కేసులో ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను జాతీయం చేసినప్పుడు ప్రభుత్వం వారికి చెల్లించే నష్టపరిహారం న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని అధిగమించేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1955లో 4వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1955, ఏప్రిల్‌ 27 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 31ని సవరించి ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను జాతీయం చేసినప్పుడు, అందుకు ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారం గురించి న్యాయస్థానంలో సవాలు చేయకూడదు అని నిర్దేశించింది. అంటే ఈ చట్టాలకు న్యాయసమీక్ష నుంచి రక్షణ లభిస్తుంది.

16వ రాజ్యాంగ సవరణ చట్టం, 1963

* 1963లో అప్పటి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 16వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1963, అక్టోబరు 5 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19ని సవరించి, భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతల సంరక్షణ కోసం భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి కల్పించారు.
* భారతదేశ పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికయ్యే వ్యక్తులు దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతామనే మాటలతో చేయాల్సిన ప్రమాణపత్రాన్ని పొందుపరిచారు.


17వ రాజ్యాంగ సవరణ చట్టం, 1964

* జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం 1964లో 17వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1964, జూన్‌ 20 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు..
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌  31(A)ని సవరించి ప్రజాశ్రేయస్సు కోసం రైతుల నుంచి వ్యవసాయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే మార్కెట్‌ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని నిర్దేశించారు.

24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971

* గోలక్‌నాథ్‌ vs స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసులో (1967) సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని పేర్కొంది. ఈ తీర్పును అధిగమించేందుకు 1971లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 24వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1971, నవంబరు 5 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 13, 368లను సవరించారు. ఆర్టికల్‌ 13కి క్లాజు (4)ని చేర్చారు. ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంట్‌కు కల్పించారు. రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని నిర్దేశించారు.

25వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971

* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971లో 25వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 1972, ఏప్రిల్‌ 20 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 31ని సవరించి ఈ చట్టాన్ని రాజ్యాంగానికి చేర్చారు.
* ప్రజాప్రయోజనాల రీత్యా ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నపుడు  తగినంత ‘నష్ట పరిహారం’ ఇవ్వలేదనే కారణంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీల్లేదు.
* ఆదేశిక సూత్రాల అమలు కోసం పార్లమెంట్‌ రూపొందించే శాసనాలను న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు.
* ప్రైవేట్‌ వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు ‘నష్టపరిహారం’ నిర్ణయంపై చట్టాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభలకు కల్పించారు. అయితే వాటిని రాష్ట్రపతి ఆమోదించాలి.
* అల్పసంఖ్యాక వర్గాలు నిర్వహించే విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటే వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలని నిర్దేశించారు.

42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976

* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని ‘మినీ రాజ్యాంగం’గా పేర్కొంటారు. ఇందులోని అనేక అంశాలు 1977, జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. దీనిలోని ముఖ్యాంశాలు...
* ప్రాథమిక హక్కులకు సంబంధించి ఆర్టికల్స్‌ 31, 31(C) లను సవరించారు.
* ఆర్టికల్స్‌ 31(D), 32(A)లను ప్రాథమిక హక్కులకు చేర్చారు.
* ఆదేశిక సూత్రాలను అమలుచేస్తున్న సందర్భంలో అవి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే ఆదేశిక సూత్రాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని నిర్దేశించారు. దీని ద్వారా ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాలకు ఆధిపత్యాన్ని కల్పించారు. న్యాయస్థానాలకు ఉన్న ‘న్యాయసమీక్ష’ అధికారాన్ని తొలగించారు.

43వ రాజ్యాంగ సవరణ చట్టం, 1977

* 1977లో అప్పటి మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 43వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 1978, ఏప్రిల్‌ 13 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిలోని ముఖ్యాంశాలు...
* ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్‌ 31(D), 32(A) లను రాజ్యాంగం నుంచి తొలగించారు.
* న్యాయస్థానాలకు ‘న్యాయసమీక్ష’ అధికారాన్ని పునరుద్ధరించారు.

44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978

* మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇందులోని అనేక అంశాలు 1979, జూన్‌ 20 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు...
* ఆర్టికల్,  19(1)(f) ను స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు నుంచి తొలగించారు.
* ఆస్తిహక్కును వివరించే ఆర్టికల్‌ 31ని తొలగించారు.
* ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి, దీన్ని ఆర్టికల్‌  300(A) లో సాధారణ చట్టబద్ధమైన హక్కుగా పేర్కొన్నారు.
* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22ను సవరించి, నివారక నిర్బంధానికి సంబంధించి కొన్ని రక్షణలు కల్పించారు. అవి:
1. సలహాసంఘం అనుమతి లేకుండా నివారక నిర్బంధంలో ఉంచిన వ్యక్తి అత్యధిక నిర్బంధ కాలాన్ని 3 నెలల నుంచి 2 నెలలకు తగ్గించారు. 
2. సలహాసంఘంలో ఒక అధ్యక్షుడు, ఇద్దరు సభ్యులు ఉండాలి. హైకోర్టు న్యాయమూర్తిని మాత్రమే అధ్యక్ష పదవిలో నియమించాలి. సభ్యులుగా పదవిలో ఉన్న లేదా పదవీవిరమణ చేసిన జడ్జిలు ఉండొచ్చు.
3. పార్లమెంట్‌ రూపొందించిన చట్టంలో పేర్కొన్న కాలం కంటే, ఏ వ్యక్తినీ ఎక్కువ రోజులు నిర్బంధించకూడదు. ఎవరైనా వ్యక్తిని 2 నెలలకు మించి నివారక నిర్బంధ చట్టం ప్రకారం అరెస్టు చేయాలనుకుంటే సలహాసంఘం అనుమతి తప్పనిసరి.

77వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995

* పి.వి.నరసింహారావు ప్రభుత్వం 1995లో 77వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 1995, జూన్‌ 17 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 16ను సవరించి, ఆర్టికల్‌ 16(4)  ను రాజ్యాంగానికి చేర్చి ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించారు.

86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002

* 2002లో అప్పటి అటల్‌బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 2002 డిసెంబరు 12 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 21ని సవరించి, 21(A) చేర్చారు. దీని ద్వారా 6 - 14 సంవత్సరాల మధ్య వయసున్న బాలబాలికలందరికీ ‘ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు’ను నిర్దేశించారు.

93వ రాజ్యాంగ సవరణ చట్టం, 2005

* డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 2005లో 93వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఇది 2006 జనవరి 20 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ప్రకారం ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 15ని సవరించి, ఆర్టికల్‌ 15(5)ను కొత్తగా చేర్చారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) అన్ని విద్యాసంస్థల ప్రవేశాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించారు.

97వ రాజ్యాంగ సవరణ చట్టం, 2011

* డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం 2011లో 97వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం 2012 జనవరి 12 నుంచి అమల్లోకి వచ్చింది.
* ఈ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లోని ఆర్టికల్‌ 19ని సవరించి, ఆర్టికల్‌ 19(1)(C) లో “Co-operative societies”  అనే పదాన్ని చేర్చి, సహకార సంఘాలకు రాజ్యాంగబద్ధతను కల్పించారు.

Posted Date : 19-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌